Jump to content

భార్గవరావు (కవి)

వికీపీడియా నుండి
(సిరిప్రెగడ భార్గవరావు నుండి దారిమార్పు చెందింది)

సిరిప్రెగడ భార్గవరావు కవి, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు. పోలీసు చర్యకు ముందు తెలంగాణంలో నైజాం పాలనలో స్వాతంత్ర్యోద్యమంలో, సత్యాగ్రహోద్యమంలో పాల్గొని ఒక సంవత్సరం కఠిన కారాగార వాస శిక్షను అనుభవించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతడు చండూరు మండలం గుండ్రేపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, వెంకటమ్మ దంపతులకు 1923లో జన్మించాడు. 1934లో చండూరులో స్థాపించిన ‘సాహితీ మేఖల’ సంస్థ వ్యవస్థాపకులు అంబటిపూడి వెంకటరత్నం గారి వద్ద సంస్కృతాంధ్ర కావ్యాలను అభ్యసించాడు. గురువుగారి సేవా కార్యక్రమాలలో ముందుండి పనిచేస్తూ ఆయన అభిమానాన్ని పొందాడు. పద్య విద్యను సాధించి సుధామధురములైన రసవత్కావ్య ఖండికలను రచించాడు. ఈ రచనలు ఆయన బ్రతికుండగా గ్రంథ రూపంలో రాలేదు. అతని మరణానంతరం "భర్గవానందలహరి" పేర సాహితీ మేఖల ప్రచురించింది. పోలీసు యాక్షన్‌కు ముందు తెలంగాణలో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు నైజాం పోలీసులు అతనిని ఒక సంవత్సరం జైలులో వేయడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. చివరికి అనారోగ్యంతో 1963లో అస్తమించాడు. ఆయన మరణానంతరం చిత్తుకాగితాల్లో వున్న రచనల్ని ఏరికూర్చి శిష్యునిపై వున్న వాత్సల్యానికి ప్రతీకగా అంబటిపూడి వెంకటరత్నం "భర్గవానందలహరి" పేర కావ్యాన్ని 1967లో అచ్చువేయించాడు. కవితా హృదయం ఏ కొంచెం వున్నా పులకింపచేసే కావ్యం ఇది. అచ్చమైన హృదయం నుండి వెలువడిన స్వచ్ఛమైన కావ్యమిది. జీవితంలో బాగా దెబ్బలు తిన్నవాడు భార్గవరావు. ఆ బాధలో కవిత్వం రాసుకొని దుఃఖంతో ఆనందించేవాడు. పన్నీటితో ప్రారంభమై కన్నీరుగా జాలువారి మున్నీరైంది భార్గవుడి కవిత. ఆలిండియా తెలుగు రైటర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ హైదరాబాదు వారు 1968లో ప్రచురించిన సావనీర్ భార్గవరావుకే అంకితమైంది.

ఈ అజ్ఞాత కవి కావ్యాన్ని అజ్ఞాతంగానే పోనీయకుండా బయటికి లాగి లోకానికి చూపిన అంబటిపూడి ధన్యజీవి.

మూలాలు

[మార్చు]