సి.ఆర్.ఎం.పట్నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిక్కోలు కాటన్ సి.ఆర్.ఎం.పట్నాయక్

సి.ఆర్.ఎం.పట్నాయక్ సాంకేతిక నిపుణులు. ఆయన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తూ 2.50లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందిస్తున్న వంశధార ప్రాజెక్టు పితామహుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన నరసన్నపేట మండలం చిక్కాలవలస గ్రామానికి చెందినవారు. 1954లో హిరమండలం మండలం లోని గొట్ట గ్రామం దగ్గర రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టినట్లయితే 32వేల ఎకరాల వ్యవసాయ భూమి, 30గ్రామాలు పూర్తిగా, 32 గ్రామాలు పాక్షికంగా ముంపుకు గురయ్యే విధంగా అప్పటి ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. అయితే తుంగతంపర శాస్త్రి తన 400 ఎకరాల భూమి మునిగిపోతుందనే తలంపుతో రాష్ట్రపతి వి.వి.గిరి అండదండల తో రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు వేశారు. ఈ నేపథ్యంలో 1964-65లో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేస్తున్న పట్నాయక్ ను బదిలీపై తెచ్చి వంశధార ప్రాజెక్టుకు నమూనాలు తయారుచేయాలని ప్రభుత్వం సూచించింది. గొట్టపై రిజర్వాయర్‌ నిర్మాణానికి రాజకీయంగానూ, సాంకేతికంగానూ అడ్డంకులు ఉండేవి. వీటిని అధిగమించే విధంగా సరికొత్తగా, ప్రస్తుత వంశధార రిజర్వాయర్‌ నమూనాను ఆయన ప్రతిపాదించారు. తొలి ప్రతిపాదనలతో అయితే కేవలం 16టీఎంసీల నీటి నిల్వతో పాటు 32వేల ఎకరాల భూమి ముంపుకు గురయ్యే అవకాశముండేది. పట్నాయక్‌ మాత్రం 18టీఎంసీల నీటిని నిల్వ చేయడమే కాకుండా కేవలం 10వేల ఎకరాలు మాత్రమే ముంపుకు గురయ్యే విధంగా ప్రణాళిక రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నది పక్కన రిజర్వాయర్‌ నిర్మాణానికి నాంది పలికారు.

1977లో గొట్టాబ్యారేజీ నిర్మాణం జరుగుతున్న సమయంలో ఆయనే దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. 1980లో వచ్చిన భారీ వరదలకు ఆయన వరద పరిస్థితి సమగ్రంగా పరిశీలించేందుకు గొట్టాబ్యారేజీ వద్దకు వచ్చారు. అక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు దారిలేక పక్కనే ఉన్న కొండలపై నుంచి కాలిననడక రెండు రోజులు ప్రయాణం చేసి నరసన్నపేట చేరుకున్నారు. అప్పట్లో ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఈ సంఘటన ఆయన కార్యదీక్షకు అద్దం పడుతుంది. [1]

1968 లో వంశధార మొదటి దశ ప్రాజెక్ట్ కు డిజైన్‌ చేసి 1970 లో పూర్తిచేయడంతో ఆయన ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందినది. వంశధార రెండోదశ ప్రాజెక్టు నిర్మాణానికి నేరడి వద్ద బ్యారేజి నిర్మాణానికి ఈయనే డిజైన్‌ చేసారు. ఒడిషా ప్రభుత్వం అడుగడుగునా అభ్యంతరం చెబుతుండడం తో నేరడికి సమీపంలో సైడ్ వ్యూయర్ కట్టి ప్రాజెక్టు పూర్తిచేయవచ్చునని మరో డిజైన్‌ రూపొందించడంతో వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినది. దీనిపై కూడా ఒడిషా ప్రభుత్వము సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిండంతో పనులు ప్రారంభం కాలేదు. వంశధార మూడో దశ నిర్మాణము రాస్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లు ససేమిరా అనడంతో మరోసారి పట్నాయక్ నే ఆశ్రయించారు.

ఆయన నీటిపారుదల విభాగంలో అనేక ప్రాజెక్టుల ను సమగ్రంగా పరిశీలించి, వాటి లోపాలను సరిదిద్దేందుకు అనేక సాంకేతిక అంశాలపై పుస్తకాలు రచించారు. ఆయన కుమారుడు కూడా ఒడిశా ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు.

అస్తమయం

[మార్చు]

శ్రీకాకుళం నగరంలోని న్యూకాలనీలోగల ఆయన నివాసంలో మే 11 2017న తుదిశ్వాస విడిచారు.[2]

మూలాలు

[మార్చు]
  1. సాంకేతిక పరిజ్ఞానం.. మానవాళికి వరం..![permanent dead link]
  2. "'వంశధార' రూపశిల్పి పట్నాయక్‌కు అంతిమ వీడ్కోలు". Archived from the original on 2017-05-15. Retrieved 2017-05-15.