సి.చంద్రకాంతరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.చంద్రకాంతరావు
సి.చంద్రకాంతరావు చిత్రం
జననం
సి.చంద్రకాంతరావు

రంగారెడ్డి జిల్లా, తాండూరు
ఇతర పేర్లుసి.చంద్రకాంతరావు
విద్యఎం.ఎ., ఎం.ఫిల్, బి.యిడి, బి.ఎల్.ఐ.ఎస్.సి
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
ఉద్యోగంఆడిట్ శాఖలో సీనియర్ ఆడిటరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి, రచయిత,

సి.చంద్రకాంతరావు జిల్లా ఆడిట్ అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు భాషాభిమాని[1].

జీవిత విశేషాలు

వారి తండ్రిగారు మండల విద్యాధికారిగా పనిచేసారు.వారు కోడంగల్ వాస్తవ్యులే కాని ఉద్యోగరీత్యా తాండూరులో ఉండటంతో వారు తాండూరులో స్థిరపడాల్సి వచ్చింది. చంద్రకాంతరావు డిగ్రీ వరకు తాండూరులో చదివారు.ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ., ఎం.ఫిల్, బి.యిడి, బి.ఎల్.ఐ.ఎస్.సి లను పూర్తి చేసారు. 1995 లో బషీరాబాదు మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు.నాలుగు నెలలలోనే గ్రూప్-2ఎకు ఎంపికై రాష్ట్ర ఆడిట్ శాఖలో సీనియర్ ఆడిటరుగా ఉద్యోగాన్ని సాధించారు. మహబూబ్‌నగర్‌లోనే 2009 వరకు పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు రంగారెడ్డి జిల్లా (హైదరాబాదు)లో పనిచేసి మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చారు. ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తెలుగు భాషపై మమకారంతో భాషామాధుర్యాన్ని చాటుతూ తెలుగు భాష గొప్పతనాన్ని చాటేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతర్జాలంలో ప్రత్యేకంగా తెలుగు బ్లాగును ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.

భాషాభివృద్ధికి కృషి

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ చెర్లకోల లక్ష్మారెడ్డి (జడ్చర్ల శాసనసభ్యుడు),
పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు), దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డి గార్లచే
తేది 22-04-2015 నాడు మహబూబ్‌నగర్ జడ్పీ గ్రౌండ్‌లో చంద్రకాంతరావు రచించిన "పాలమూరు జిల్లా క్విజ్" పుస్తకం ఆవిష్కరణ దృశ్యం.

ఆయన ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే 24 అక్షరాలతో ఒక క్రొత్త లిపిని సృష్టించారు. ఆయన సిసికెరావ్ 2000 బ్లాగ్‌స్పాట్.ఇన్[2] అనే పేరిట అంతర్జాలంలో వర్తమాన విషయాలపై ప్రశ్నలు వాటి సమాధానాలతో రూపొందిస్తున్నారు. ఈ బ్లాగు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది.ఆయన రూపొందించిన ఈ విశేషమైన,విద్యార్థులకు ఉపయోగకరమైన బ్లాగును అప్పటి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరు గిరిజాశంకర్ ఆవిష్కరించారు.అప్పటి జిల్లా ఎస్.పి నాగేంద్రకుమార్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేసారు.[3] ఆయన తెలుగు వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వంలో సి.చంద్రకాంతరావు పేరిట వందల సంఖ్యలో వ్యాసాలను వ్రాసారు[4].ఆయన తెలుగు వికీపీడియా నిర్వాహకులలో పాలమూరు జిల్లానుండి ఒకే ఒక నిర్వాహకునిగా పేరొందారు.

లక్షల ప్రశ్నల నిథి

ఇప్పటివరకూ ఎక్కడా లేనటువంటి లక్ష ప్రశ్నల నిథిని తెలుగులో తయారుచేయడానికి ఆయన కృషిచేస్తున్నారు.రాజకీయాలు, ఆర్థిక,భౌతిక,రసాయన,జీవ,జంతు శాస్త్రాలు,క్రీడలు సాంకేతిక రంగాలతో పాటు వర్తమాన అంశాలపై ఆయన తయారుచేసి విద్యార్థులకు పోటీపరీక్షలను వ్రాసేందుకు తోడ్పడుతున్నారు.[1]

రచయితగా

ఆయన నాలుగు తరాల తన వంశవృక్షం ఆధారంగా "మా యింటి ముచ్చట్లు" పేరుతో ఒక పుస్తకాన్ని రూపొందించారు.దీనిని 2013 సంవత్సరం దసరా పండగ నాడు విడుదల చేసారు.[1]

తెలుగు వికీపీడియాలో సేవలు

తెలుగు వికీపీడియా నిర్వాహకులలో ఒకరైన చంద్రకాంతరావు వర్తమాన ఘటనలులో రోజూవారీ వార్తలను చేర్చడం, అన్ని కొత్త వ్యాసాలను పరిశీలించి ముఖ్యమైన విషయాలను నమోదుచేసుకొని, ప్రతి ఆదివారం తప్పనిసరిగా "మీకు తెలుసా" శీర్షికను తాజాకరించడం, ఆర్థికశాస్త్ర వ్యాసాలు, ప్రముఖ వ్యక్తుల వ్యాసాలు, క్రీడారంగ వ్యాసాలు, నియోజకవర్గ వ్యాసాలు వృద్ధిచేయడం, మూసలు తయారుచేయడం, వ్యాసాలు, వర్గాలకు వర్గీకరణ చేయడం లాంటి పనులు చేశారు. సద్విమర్శ చేయడంలో వీరు ఘటికులు. వీరు తెవికీలో క్రీడలు, క్రీడాకారుల వ్యాసాలు, ఆర్థికవేత్తల వ్యాసాలు, ఆర్థికశాస్త్రం వ్యాసాలు, ప్రముఖ వ్యక్తులు, ఇతర వ్యాసాలు, మూసలు తయారు చేయడమే కాకుండా 100 కంటే అధికమైన సమగ్రమైన వ్యాసాలు రాసారు. తెలుగు వికీపీడియా నిర్వాహకులు. ఆర్థికశాస్త్ర వ్యాసాలను వ్రాసినందుకు, తెలుగు వికీ అభివృద్ధికి పాటుబడినందుకు తెలుగు వికీపీడియా అధికారి అయిన వైజాసత్యగారి నుండి గుర్తింపు పతకాలను అందుకున్నారు. తెవికి అభివృద్ధికి నిర్వాహకులు దేవాగారి నుండి, నిర్వహణకు నిర్వాహకులు కాసుబాబుగారి నుండి తెలుగు మెడలు అందుకున్నారు. నిర్వహణకు నిర్వాహకులు కాసుబాబుగారి నుండి గండపెండేరం అందుకున్నారు. 2010 వ్యాసాలలో అధిక మార్పులు చేసిన 2011,2012లలో వ్యాస వ్యాసేతర అధిక మార్పులు చేసిన పదిమంది సభ్యులలో ఒకరుగా గుర్తింపు పతకం పొందారు. రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణానికి చెందిన ఈ సభ్యుడు ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో స్థిరపడ్డారు.

అతను తన వ్యక్తిగత కారణాల వల్ల 2020 జూలై 28న స్వచ్ఛందంగా నిర్వాహకత్వ భాద్యతల నుండి తప్పుకున్నారు.[5]

వికీపీడియాలో నిషేధం

తెలుగు వికీపీడియాలో పనిచేస్తున్న కొందరు వాడుకరులను నిర్హేతుకంగా నిందిస్తూ, వేధిస్తున్నందుకు గాను, చంద్రకాంతరావును 2021 జూన్‌లో వికీపీడియా నుండి నిరవధికంగా నిషేధించారు. [6]

పాలమూరు జిల్లా క్విజ్ పుస్తకం

ఆయన పాలమూరు జిల్లాకు చెందిన భౌగోళిక,రాజకీయ,ఆర్థిక,సామాజిక చారిత్రక సంఘటనలు,ముఖ్య విషయాలను, జిల్లా ప్రముఖులు సంస్థానాలు-కోటలు,నదులు,ప్రాజెక్టులు తదితరాలను తెలియజేస్తూ ప్రాచీన, వర్తమాన గ్రంథాలను శోధించి, పరిశీలించి వ్రాసిన క్విజ్ ప్రశ్నలు దాని కనుబంధంగా జిల్లా కాలరేఖ, జిల్లా ప్రత్యేకతలు వంటి అంశాలతో "పాలమూరు జిల్లా క్విజ్" అనే పుస్తకాన్ని వ్రాసారు. దీనిని ఏప్రిల్ 22 2015 న తెలంగాణ రాష్ట్రమంత్రి సి.లక్ష్మారెడ్డి,పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస గౌడ్ సమక్షంలో ఆవిష్కరించబడింది.[7]

ప్రశంశలు

  • ఆయన పాలమూరు జిల్లా బ్లాగు ప్రారంభోత్సవ సందర్భంగా జిల్లా ఎస్.పి. నాగేంద్ర ప్రసాద్ నుండి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
  • 2014 గణతంత్ర దినోత్సవం రోజున ఉత్తమ ఉద్యోగిగా అధికారులతో ప్రశంసలు పొందారు.
  • ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలో డిసెంబరు 2013 న నిర్వహించిన కవిసమ్మేళనంలో పాలమూరు జిల్లాపై సుదీర్ఘ కవితను వినిపించారు. ఈ కవితను కలెక్టరు కార్యాలయం ముద్రించింది. పాలమూరు కవితా సుధ (పుస్తకం) పుస్తకంలో దీనిని ప్రచురించారు.

మూలాలు

  1. 1.0 1.1 1.2 ఈనాడు దినపత్రిక, జనవరి 26,2015, మహాబూబ్ నగర్ జిల్లా స్పెషల్ సెంటర్ పేజీ
  2. వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి
  3. "పాలమూరు చంద్ర కిరణం" పేరుతో ఈనాడు వార్తా పత్రికలోని కథనం యొక్క చిత్రము
  4. ఆయన ప్రారంభించిన రచనలు
  5. "Steward requests/Permissions - Meta". meta.wikimedia.org (in ఇంగ్లీష్). Retrieved 2021-07-05.
  6. చంద్రకాంతరావు గారి వ్యక్తిగత దాడులు, వేధింపులు
  7. పాలమూరు జిల్లా క్విజ్ పుస్తక ఆవిష్కరణ

ఇతర లింకులు