సి.వి.కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.వి.కృష్ణారావు
జననంసి.వి.కృష్ణారావు
(1926-07-03)1926 జూలై 3
Indiaరేవూరు,మేళ్లచెరువు, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
ప్రసిద్ధికవి
మతంహిందూ

సి.వి.కృష్ణారావు అభ్యుదయ కవి. ఇతడు 1926, జూలై 3వ తేదీన నల్గొండ జిల్లా రేవూరు గ్రామంలో జన్మించాడు. ఇతడు జగ్గయ్యపేట, గుంటూరు, హైదరాబాద్‌, బొంబాయిల్లో విద్యనభ్యసించాడు. బి.కామ్‌ డిగ్రీతోపాటు ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా పూర్తిచేశాడు. కొన్నాళ్లు బ్యాంకు గుమాస్తాగా పనిచేసి ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల్ని చైతన్యపరిచాడు. తర్వాత సాంఘిక సంక్షేమశాఖలో వెనుకబడిన తరగతుల సంక్షేమ విభాగం సంచాలకునిగా కొన్నేళ్లు పనిచేసి, అందులోనే పదవీ విరమణ చేశాడు. 'నెలనెలా వెన్నెల' పేరుతో ప్రతినెలా చివరి ఆదివారం సాహితీమిత్రుల్ని సమావేశపరిచి కవితల్ని, కవితోక్తుల్ని, ఆత్మీయతల్ని మరచిపోకుండా కాపాడుకొంటూ ముందుకు సాగుతున్నాడు. జంటనగరాల్లో కుందుర్తి తర్వాత మరో కుందుర్తిలా వచనకవితా వికాసానికి కృషిచేశాడు. ఉబుసుపోకకు కవితలు రాయడం, రాయించడం కాక ప్రతినెలా ఏదో ఒక ప్రసంగమో, చర్చో, పుస్తకావిష్కరణమో జరుపుతూ, యువ కలాల పదును ఏమేరకో కవితాగానాలు నిర్వహించాడు. కవితా సంకలనాలు ప్రచురించాడు. ఒక కవిత మంచి కవిత ఎందుకైందో విశ్లేషకుల చేత వివరింపజేయడం గమనార్హం[1].

ఇతడి తొలి కవితా సంకలనం వైతరణి. తర్వాత మాదీ మీ వూరే, అవిశ్రాంతం కవితా సంకలనాలు వచ్చాయి. లాటూరు కిల్లారి భూకంపానికి స్పందిస్తూ కిల్లారి అనే కవితల సంపుటి ప్రచురించాడు. దీన్ని ఢిల్లీకి చెందిన డా. వి.వి.బి.రామారావు ఆంగ్లంలోకి అనువదించాడు. సి.వి.కృష్ణారావు కొన్ని కథలు కూడా వ్రాశాడు. తోడేలు జగతి, నోటీసు, భిక్షువులు, విద్యాబోధ, సత్రంలో సంసారం వంటి కథలను తెలుగు స్వతంత్ర, ప్రజాసాహితి,ప్రజాతంత్ర, సుజాత,సృజన మొదలైన పత్రికలలో ప్రకటించాడు.

మూలాలు[మార్చు]

  1. చీకోలు సుందరయ్య. "కవితా వైతరిణి సి.వి.కృష్ణారావు". సాహితీ సంపద. Archived from the original on 19 ఫిబ్రవరి 2016. Retrieved 29 March 2015.