సుకన్య రామగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుకన్య రామగోపాల్
వ్యక్తిగత సమాచారం
జననం (1957-06-13) 1957 జూన్ 13 (వయసు 67)
మయిలదుతురై, తమిళనాడు రాష్ట్రం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిసంగీత వాద్య కళాకారిణి
వాయిద్యాలుఘటం

సుకన్య రామగోపాల్ కర్ణాటక శాస్త్రీయ సంగీత సంప్రదాయంలో మొట్టమొదటి మహిళా ఘటవాద్య కళాకారిణి.[1]

విశేషాలు

[మార్చు]

ఈమె 1957 జూన్ 13వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని మయిలదుతురై గ్రామంలో జన్మించింది[2]. ఈమె తన సోదరితో పాటు కర్ణాటక గాత్ర సంగీతాన్ని నేర్చుకుంది. తరువాత టి.హెచ్.గురుమూర్తి వద్ద వయోలిన్‌ నేర్చుకుంది. టి.ఆర్.హరిహరశర్మ వద్ద మృదంగం నేర్చుకుంది. తరువాత తేతకూడి హరిహర వినాయకరం వద్ద ఘటవాద్యాన్ని నేర్చుకుంది. ఈమెకు కొన్నక్కోల్‌లో కూడా ప్రవేశం ఉంది.

ఈమె ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ గ్రేడు కళాకారిణిగా సేవలందించింది. ఈమె భారతీయ సాంస్కృతిక సంబంధాల కౌన్సిల్ (I.C.C.R.) జాబితాలో నమోదైన కళాకారిణి. ఈమె భారతదేశంలోను, విదేశాలలోను ఎన్నో సంగీత ఉత్సవాలలో పాల్గొనింది. సోలో కళాకారిణిగా, పక్కవాద్య కళాకారిణిగా ఈమె ఘట వాద్యంలో విలక్షణమైన శైలిని ప్రవేశపెట్టింది. సంప్రదాయ పద్దతులు కాక ఘటవాయిద్యంలో అనేక కొత్త ప్రయోగాలు చేసింది. 1994లో ఈమె "ఘట తరంగ్" అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో ఆరు లేదా ఏడు ఘటాలను వాడి వివిధ శృతులతో విస్తృతమైన స్వరమాధుర్యాన్ని పలికించింది. 1995లో అందరూ మహిళా వాద్య కళాకారులతో "స్త్రీ తాళ్ తరంగ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈమె "శ్రీ విక్కూ వినాయక్రం స్కూల్ ఆఫ్ ఘటం" అనే సంస్థను స్థాపించింది. ఈ ఘటవాద్య గురువుగా అనేక విద్యాసంస్థలలో విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళింది. 2000లో ఈమె గురించి సి.ఎస్.లక్ష్మి "సింగర్ అండ్ సాంగ్" అనే పుస్తకాన్ని ప్రచురించింది. 2014లో బెంగళూరు దూరదర్శన్ ఈమెపై ఒక డాక్యుమెంటరీని తయారు చేసింది. ఈమె దేశ విదేశాలలో ఘటవాద్యంపై అనేక వర్క్‌షాపులను నిర్వహించింది. ఈమె "సునాదం ట్రస్టు"ను స్థాపించి దాని ద్వారా ఘటవాద్యానికి విసృత ప్రచారం కల్పిస్తున్నది. ఈమె "సునాదం, ది విక్కూ బాణి ఆఫ్ ఘటం ప్లేయింగ్" అనే పుస్తకాన్ని రచించింది[1].

అవార్డులు

[మార్చు]

ఈమెకు అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి[2].

  • 1999లో నాదజ్యోతి శ్రీ త్యాగరాజ స్వామి భజన సభ, బెంగళూరు వారిచే "నాదజ్యోతి పురస్కారం".
  • 2001లో పెర్కుసివ్ ఆర్ట్స్ సెంటర్ బెంగళూరు వారిచే "లయకళా ప్రతిభామణి" బిరుదం.
  • 2014లో రాగమాలిక, అబూదాబి వారిచే "ఘట కళారత్న" బిరుదు.
  • 2014లో బెంగళూరు గాయన సమాజ వారిచే "స్వర భూషణి" బిరుదు.
  • 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Bageshree S (30 December 2017). "Sukanya Ramgopal's lone battle to play the ghatam". The Hindu. Retrieved 8 March 2021.
  2. 2.0 2.1 web master. "Sukanya Ramgopal". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 8 March 2021.