Jump to content

భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం

వికీపీడియా నుండి
(సునామీ హెచ్చరికల కేంద్రం నుండి దారిమార్పు చెందింది)

భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (ఇన్‌కోయిస్) హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. క్రమబద్ధమైన కేంద్రీకృత పరిశోధనల ద్వారా నిరంతర సముద్ర పరిశీలనల ద్వారా సమాజం, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, శాస్త్రీయ సమాజానికి సాధ్యమైనంత ఉత్తమమైన సముద్ర సమాచారం సలహా సేవలను అందించడానికి ESSO- ఇన్‌కోయిస్ నెలకొల్పారు. సునామి ముందస్తు హెచ్చరికలు ఈ కేంద్రం పనుల్లో ఒక భాగం. 1999 లో భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ (MoES) క్రింద ఒక స్వయంప్రతిపత్త సంస్థగా దీన్ని స్థాపించారు. ఇది ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ (ESSO) లోని ఒక భాగం.

చరిత్ర

[మార్చు]

1990 వ దశకంలో, మహాసముద్ర అభివృద్ధి శాఖ (డిఓడి) (ప్రస్తుతం దీన్ని భూవిజ్ఞాశాస్త్రాల మంత్రిత్వ శాఖ అంటున్నారు) "పిఎఫ్‌జెడ్ మిషన్" పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. దీనిని హైదరాబాదు లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సి) కు అప్పగించారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు నెమ్మదిగా పూర్తి స్థాయికి వికసించింది. దీని ఫలితంగా, ఈ ప్రాజెక్టును ఎన్‌ఆర్‌ఎస్‌సి నుండి వేరుచేసి, దానిని చూసుకోవడానికి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కోయిస్) అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఇన్‌కోయిస్ వ్యవస్థాపక డైరెక్టరు డాక్టర్ ఎ నరేంద్ర నాథ్. కొత్తగా ఏర్పడిన సంస్థలో ప్రధాన ప్రాజెక్టు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పిఎఫ్‌జెడ్). పిఎఫ్‌జెడ్ సేవలతో పాటు, ముందస్తు సునామి హెచ్చరిక, సముద్ర స్థితి హెచ్చరిక, ఓషన్ మోడలింగ్, డేటా, వెబ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర సేవలను కూడా ప్రారంభించారు. వాటి ఉత్పత్తులను దేశంలోని వివిధ వినియోగదారులకు రోజూ పంపిణీ చేస్తున్నారు. ఇన్‌కోయిస్ ను అంతర్జాతీయ అంతర్జాతీయ మహాసముద్ర సంస్థలలో ఒకటిగా గుర్తించారు. ఇన్‌కోయిస్ తన వెబ్ పోర్టల్ ద్వారా, దేశంలోని వివిధ ప్రదేశాలలో వ్యవస్థాపించిన వివిధ పరికరాల ద్వారా తన సేవలను అందిస్తుంది.

పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పిఎఫ్‌జెడ్)

[మార్చు]

ఇన్‌కోయిస్ ప్రారంభించిన మొదటి సలహా సేవ ఇది. ఈ సేవకు వెన్నెముకగా నిలిచేవి OCEANSATఅందించే సముద్రపు నీటి రంగు, NOAA అందించే సముద్రపు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత. మత్స్యకారులు సముద్రంలో ఉన్నప్పుడు మంచి క్యాచ్ పొందడానికి సహాయపడే ఫిషింగ్ జోన్లను గుర్తించడం కోసం ఈ సేవ ప్రారంభించారు. ఈ సేవను అంతరిక్ష శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని అనేక సంస్థల సహాయంతో భూవిజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. తుది వినియోగదారులకు ఈ సేవలను అందించడానికి ఈ సంస్థలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయి.

ఈ సేవ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, క్లోరోఫిల్ కంటెంట్ వంటి పారామితులను ఉపయోగించుకుంటుంది. ఓషియానిక్ ఫ్రంట్స్, మీండరింగ్ ప్యాటర్న్స్, ఎడ్డీస్, రింగ్స్, అప్‌, వెల్లింగ్ ఏరియాస్ వంటి లక్షణాలను బట్టి చేపలు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తారు. ఈ లక్షణాలను సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, క్లోరోఫిల్ డేటా నుండి సులభంగా గుర్తించవచ్చు. అందువల్ల, చేపలుండే ప్రాంతాలను మెరుగైన కచ్చితత్వంతో గుర్తించడానికి పిఎఫ్జెడ్ సలహాలు మత్స్యకారులకు ఉపయోగపడతాయి.

పిఎఫ్‌జెడ్ సేవ యొక్క మరొక విశేషం, ఆయా చేపల మండలాల్లో ఏయే రకాల చేపలున్నాయో గుర్తించి మత్స్యకారులకు చెప్పడం. ఈ సూచనలను అనుసరించి, ఎక్కువగా పట్టిన రకాలను వదలివేసి, తక్కువగా పట్టిన చేపల రకాలను మాత్రమే వాళ్ళు లక్ష్యంగా చేసుకోవచ్చు. తద్వారా చేపల జనాభా నిర్వహణ కూడా సమర్ధవంతంగా చేసే వీలు కలుగుతుంది. ఎక్కువగా పట్టిన జాతులను మళ్లీ మళ్లీ పట్టకుండా ఉండటానికి వీలు కల్పిస్తుంది. ట్యూనా ఫిషరీస్ ఫోర్కాస్టింగ్ సిస్టం అటువంటి జాతి-నిర్దిష్ట సలహాలను ఇస్తుంది. ఇది ట్యూనా చేపలు ఎక్కడున్నాయో గుర్తించి, మత్స్యకారులను తగిన విధంగా సిద్ధం చేస్తుంది. ట్యూనా ఎక్కువగా వలస పోయే చేప కావడంతో, ఇది చాలా విస్తారమైన ప్రాంతంలో, విస్తారమైన పర్యావరణ వ్యవస్థల్లో నివసిస్తుంది. అందువల్ల ట్యూనా చేపలను పట్టడం ఖరీదైన వ్యవహారం. ఓషియానిక్ ఫ్రంట్స్, నీటి స్పష్టత, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత వంటి పారామితుల సహాయంతో ట్యూనా జాతుల పంపిణీని కనుగొనవచ్చు.

సునామి హెచ్చరిక వ్యవస్థ (TEWS)

[మార్చు]

2004 లో వచ్చిన సుమత్రా భూకంపం, అది తెచ్చిన సునామీ, సృష్టించిన బీభత్సం తరువాత, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సునామీల గురించి, తుఫానుల గురించీ ముందస్తు హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం భావించింది. దీని ప్రకారం, 2007 అక్టోబరు 15 న, భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖగా, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST), అంతరిక్ష విభాగం (DOS), కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ల సహకారంతో, సునామీ హెచ్చరికల వ్యవస్థ (ఇండియన్ సునామి ఎర్లీ వార్నింగ్ సిస్టం - TEWS) అన్న ఒక కేంద్రాన్ని ఇన్‌కోయిస్ లో స్థాపించింది. స్థాపించిన సమయంలో, దేశంలోని తీరప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముఖ్యమైన సునామీ సలహాలను అందించాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రయోజనం కోసం, ఈ కేంద్రంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, బాగా శిక్షణ పొందిన మానవ వనరులనూ చేకూర్చారు. 2012 నాటికల్లా ఇది, హిందూ మహాసముద్రం రిమ్‌లో ఉన్న అన్ని దేశాలకు (ఐఓఆర్) రౌండ్-ది-క్లాక్ హెచ్చరికలు, సలహా సేవలను ఇవ్వడం ప్రారంభించింది.[1]

ప్రస్తుతం, సునామి హెచ్చరిక కేంద్రం, భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) వారి 17 భూకంప స్టేషన్ల నుండి, వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ (డబ్ల్యూఐహెచ్‌జి) కి చెందిన 10 స్టేషన్ల నుండి, 300 కి పైగా అంతర్జాతీయ స్టేషన్ల నుండి డేటాను అందుకుంటోంది. అదనంగా, ఇది 17 సముద్ర మట్టపు అలల గేజీల నుండి ఐదు నిమిషాల కొకసారి డేటాను పొందుతుంది. ఈ అలల గేజిలు ఏరియల్ బే, చెన్నై, ఎన్నోర్, గార్డెన్ రీచ్, హాల్దియా, కాండ్లా, కార్వార్, కృష్ణపట్నం, మార్మగావ్, మచిలీపట్నం, నాగపట్నం, పరదీప్, పోర్ట్ బ్లెయిర్, వడినార్, విశాఖపట్నం మొదలైన చోట్ల ఉన్నాయి. ఈ అలల సెన్సార్లతో పాటు, వేవ్-రైడర్ బాయ్‌లను కూడా వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సునామీ తరంగాల రాకపోకలను ధ్రువీకరించడానికి ఈ అలల గేజ్‌లు, బాయ్‌ల నెట్‌వర్కు, కేంద్రానికి సహాయపడుతుంది. దీని ప్రయోజకత్వాన్ని మరింత మెరుగుపరచేందుకు, సునామీ ఉత్పత్తి చేయగల స్థాయిలో వచ్చే భూకంపాలను అంచనా వేయడానికి, తగిన స్థానాల్లో సీస్మోగ్రాఫ్‌ల నెట్‌వర్కును కూడా ఏర్పాటు చేసారు. వివిధ ప్రాంతాలలో మూడు బాటమ్ ప్రెజర్ రికార్డర్లను కూడా ఏర్పాటు చేసారు.[2]

పరికరాల నుండి పొందిన డేటాను ఉపయోగించి, మొత్తం తీరప్రాంతంపై ఉప్పెన వచ్చే అవకాశాలను చూపే మోడళ్ళను తయారు చేసారు. దీనిని ఆధారంగా చేసుకుని, ఈ ప్రాంతంలోని వివిధ వినియోగదారులకు సలహాలను రూపొందించడానికి సంభావ్య రిస్క్ జోన్లను గుర్తిస్తారు. విపత్తు సంభవించినప్పుడు, తుఫానులు లేదా సునామీ ఏ స్థానంలో ఉందో క్రమమైన కాలావధుల్లో తెలియజేస్తూ ఉంటారు. తద్వారా, ప్రభావితమయ్యే ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి స్థానిక ప్రభుత్వ అధికారులకు సహాయపడుతుంది.

సాగర స్థితి సూచన (OSF)

[మార్చు]
ఇన్‌కోయిస్ అవరణలో ఉన్న OCEANSAT-II భూకేంద్రం

ద్వీపకల్పం కావడంతో, భారతదేశం మూడు వైపుల నుండి నీరు చుట్టుముట్టి ఉంది. అందువల్ల వివిధ వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడానికి సముద్రపు స్థితిని ముందుగానే తెలుసుకోవలసిన అవసరం ఉంది. సముద్రపు స్థితి గురించి ముందస్తు సమాచారం ఉంటే, సముద్రంలో కార్యకలాపాలను సురక్షితంగా ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికీ సహాయపడుతుంది. అంతేకాక, సముద్రం స్థానిక వాతావరణంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, హిందూ మహాసముద్ర ఉపరితలం, ఉపరితలం కింద ఉన్న లక్షణాలను ముందుగానే అంచనా వేసే ఒక కొత్త సేవను ఇన్‌కోయిస్ రూపొందించింది. దీనిని హిందూ మహాసముద్ర అంచనా వ్యవస్థ (INDOFOS) అంటారు. గ్రామీణ సమాచార కేంద్రాలు, ఆల్ ఇండియా రేడియో, ఎఫ్ఎమ్ రేడియో, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, ఎన్జిఓ వెబ్‌సైట్లు, ప్రాంతీయ భాషల్లోని టివి ఛానెళ్ల ద్వారా కూడా ఈ సూచనలు వినియోగదారులకు చేరుతుంది.

ప్రస్తుతం, OSF తరంగాల ఎత్తు, దిశ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, సముద్ర ఉపరితల ప్రవాహాలు, మిశ్రమ పొర లోతు, 20 డిగ్రీల ఐసోథెర్మ్ యొక్క లోతు లపై ముందస్తు సూచనలను ఇస్తుంది. ఈ భవిష్య సూచనలు అత్యాధునిక న్యూమరికల్ మోడళ్ళ ద్వారా ఉత్పత్తి అవుతాయి. హిందూ మహాసముద్రం లక్షణాలను వాస్తవికంగా అనుకరించడానికి, అంచనా వేయడానికీ ఈ మోడళ్ళను అనుకూలీకరించారు. WAVEWATCH III, WAM, మైక్, ప్రాంతీయ మహాసముద్రం మోడలింగ్ సిస్టమ్స్ (ROMS) వంటి వివిధ మోడళ్ళను భవిష్య సూచనల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సేవలతో పాటు, OSF సెంటర్ దాని తుది వినియోగదారుల ప్రయోజనం కోసం వాల్యూ యాడెడ్ సేవలను కూడా అందిస్తుంది.

ఉత్పత్తి అయిన భవిష్య సూచనలు నాలుగు వర్గాల పరిధిలోకి వస్తాయి. అవి ప్రపంచ, ప్రాంతీయ, స్థాన-నిర్దిష్ట, తీరప్రాంత సూచనలు. తీరప్రాంత సూచనల కోసం, నమూనాలు ఓపెన్ మహాసముద్ర ప్రాంతంలో తక్కువ స్పష్టతతో "కోర్స్ గ్రిడ్" అనే భావనతో ఏర్పాటు చేయబడ్డాయి. అయితే స్థాన-నిర్దిష్ట సూచనల కోసం చాలా చక్కని రిజల్యూషన్ ఉపయోగిస్తారు. ఈ నమూనాలు వాటి అవుట్‌పుట్‌ను ఉపగ్రహ డేటాను, స్థల కొలతల నుండి వచ్చిన డేటాతో పోల్చడం ద్వారా వాటి కచ్చితత్వం, విశ్వసనీయత కోసం పరీక్షించబడతాయి. ధ్రువీకరణను ప్రధానంగా తీవ్రమైన పరిస్థితులలోను, రుతుపవనాల కాలంలోనూ చేస్తారు.

సాగర పరిశీలన బృందం (OOG)

[మార్చు]

ఇన్‌కోయిస్ లోని ఈ సమూహం యొక్క ప్రధాన కార్యాచరణ - సముద్రపు ఉపరితలం నుండి 2000 మీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రత, లవణీయతను కొలవడం, పర్యవేక్షించడం. దీని కోసం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3000 ఫ్రీ-డ్రిఫ్టింగ్, ప్రొఫైలింగ్ ఫ్లోట్‌ల నుండి వచ్చే డేటాను వాడుకుంటారు. ఈ ఫ్లోట్‌ల నుండి వచ్చే డేటా సంబంధిత ఏజెన్సీలకు చేరుతుంది. వెంటనే కొద్ది గంటల్లోపే అవి ఈ డేటాను బహిరంగంగా అందుబాటులో ఉంచుతాయి. సముద్రం యొక్క వాతావరణ స్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి ఇది వారికి సహాయపడుతుంది. ఈ వ్యవస్థకు అర్గో అని పేరు పెట్టారు, ఇది ఫ్రీ-డ్రిఫ్టింగ్ ఫ్లోట్లు, జాసన్ ఆల్టైమీటర్ మిషన్ మధ్య బలమైన పరిపూరకరమైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది..

మూలాలు

[మార్చు]
  1. "Indian Tsunami Early Warning Centre to turn regional provider". The Hindu. 5 February 2011. Archived from the original on 29 June 2011. Retrieved 7 July 2018.
  2. Maitreyi, M.L. Melly (13 March 2011). "Efficacy of Indian Early Tsunami Warning System proved". The Hindu. Archived from the original on 29 June 2011. Retrieved 7 July 2018.