సులభ్ ఇంటర్నేషనల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సులభ్ ఇంటర్నేషనల్
పాట్నాలోని సులభ్ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయం పేరు పలక
స్థాపన1970
రకంప్రభుత్వేతర సంస్థ
సేవా ప్రాంతాలుభారతదేశం
జాలగూడుsulabhinternational.org

సులభ్ ఇంటర్నేషనల్ (ఆంగ్లం: Sulabh International Social Service Organization) అనేది భారతదేశం ఆధారిత సామాజిక సేవా సంస్థ. ఇది మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ, సామాజిక సంస్కరణలపై ప్రజలకు అవగాహన కలిపించడం తద్వారా ప్రోత్సహించడానికి కృషిచేస్తుంది. ఇది 50,000లకు పైగా వాలంటీర్లను కలిగి దేశంలోనే అతిపెద్ద లాభాపేక్షలేని సంస్థగా పేరుగాంచింది.[1]

సులభ్ ఇంటర్నేషనల్ 2019లో అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో కలిసి 2016 సంవత్సరానికి గాంధీ శాంతి బహుమతిని గెలుపొందింది.

చరిత్ర[మార్చు]

సులభ్ ఇంటర్నేషనల్ ను బీహార్ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్ పాఠక్ 1970లో స్థాపించాడు. కాగా సులభ్ వారి సముదాయక మరుగుదొడ్లు 1974లో మొదటిసారిగా వాడుకలోకి వచ్చాయి. ఒక్కొక్క యూనిట్ లో స్నానానికి, మలమూత్ర విసర్జనకు, బట్టలు ఉతికేందుకు సదుపాయాలుండేట్లు రూపొందించి డబ్బు చెల్లించే పద్ధతిపై రోజంతా సేవలందించే ఏర్పాట్లుచేశారు. మొదటగా పాట్నాలో ప్రారంభమైన ఈ సేవలు భారతదేశంలోని వివిధ పట్టణాలలో 5,500 వరకు నెలకొల్పడం జరిగింది. విద్యుత్తు, 24 గంటల నీటి సదుపాయం, స్త్రీలకు, పురుషులకు వేర్వేరు సదుపాయాలు, పరిశుభ్రంగా ఉంచటంలో ప్రామాణికతను నెలకొల్పటం వల్ల ఇవి జనాదరణ పొందాయి. 2000 సంవత్సరానికి సులభ్ కాంప్లెక్స్ లు 25 రాష్ట్రాలలో 38 జిల్లాలకు విస్తరించబడ్డాయి.

దీని ఆవిష్కరణలలో స్కావెంజింగ్ లేని టూ-పిట్ పోర్‌ఫ్లష్ టాయిలెట్; సురక్షితమైన, పరిశుభ్రమైన ఆన్-సైట్ మానవ వ్యర్థాలను పారవేసే సాంకేతికత చెప్పుకోవచ్చు. సులభ్ కాంప్లెక్స్‌లుగా పేరెన్నికగన్న పే & యూజ్ పబ్లిక్ టాయిలెట్‌ల నిర్వహణ, నిర్మాణం ఈ సంస్థ చూస్తుంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో ప్రతిరోజూ సుమారు పది మిలియన్ల మంది ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా విసర్జన ఆధారిత ప్లాంట్ల నుండి ఉత్పత్తి చేయబడిన బయో-గ్యాస్, బయోఫెర్టిలైజర్‌లను ఉత్పత్తి చేస్తారు. కొన్ని సంస్థలు, పరిశ్రమల కోసం మధ్యస్థ సామర్థ్యం కలిగిన తక్కువ నిర్వహణ వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాలు నిర్వహిస్తున్నారు. న్యూ ఢిల్లీలో ఇంగ్లీష్-మీడియం పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పేద కుటుంబాలకు చెందిన వారికి ప్రత్యేకంగా స్కావెంజర్‌లకు శిక్షణ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా కేంద్రాల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నారు.

ఢిల్లీలోని సులభ్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో, సంస్థ పారిశుధ్యం, మరుగుదొడ్ల చరిత్రకు అంకితమైన మ్యూజియం (Sulabh International Museum of Toilets)ని కూడా నడుపుతోంది.[2][3] క్రీ.పూ. 2500 సంవత్సరం నాటి నుండి వాడుకలో వున్న మరుగుదొడ్లను గూర్చిన సమాచారాన్ని, కళాత్మక ఆకృతుల్ని ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు.

మూలాలు[మార్చు]

  1. "Sulabh International gets U.N. recognition". The Hindu. Chennai, India. 2008-10-05. Archived from the original on 2008-10-07.
  2. Lonely Planet India – 10th edition
  3. "Sulabh International Museum of Toilets". travelblog.org. June 26, 2009. Retrieved November 19, 2014.