సోది
ఎరుకలు చెప్పే ఎరుకోయమ్మ, ఎరుక
[మార్చు]ఒక నాడు కురవంజి రాజాస్థానాలలో రాణి వాసపు స్త్రీలకు ఎరుక చెప్పేది కురవ జాతికి చెందిన వారవటం వల్ల వారిని కురవంజి అని పిలిచే వారు. వారే ఈనాడు ప్రతి పల్లెలోనూ సోదోయమ్మ సోది, సోదడగరమ్మ సోది అంటూ వీధి వీథి తిరుగుతూ వుంటారు.
భవిష్యత్తు కోసం
[మార్చు]ప్రతి మనిషికీ తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే ఆరాటం సామాన్యంగా వుంటుంది. ప్రస్తుతం విజ్ఞాన శాస్స్త్ర విజయాల వల్లా, సామాజిక విశ్లేషణం వల్లా కాస్త తగ్గినా పూర్తిగా పోలేదు. బిడ్డ పుట్టిన రోజే జాతకం వ్రాయించే వారు ఎంతో మంది వున్నారు. పూర్వ రాజులకూ, సంష్తాన పతులకూ, జమీందార్లకూ, అస్థాన జ్యోతిష్కులు వుండేవారు. ఈ కార్యం ప్రారంభించాలన్నా జ్యోతిష్కుల అభిప్రాయం తీసు కోకుండా ఏ పనీ చేసే వారు కారు. జ్యోతిష్కులు రాజాస్థానాలకు పరిమితమై పోయారు.
ఎరుకల జోశ్యమే పేదలకు
[మార్చు]జ్యోతిష్కులు రాజాస్థానాలకు పరిమిత మైతే పేదలకంతా ఎరుకల స్త్రీలే సోదె ద్వారా వారి వారి భవిష్యత్తును చెపుతూ వుంటారు. సోదెల వారి మాదిరే కోయ దొరలు కూడ పేదలకు జోస్యం చెపుతూ వుంటారు. ఎరుకోయమ్మ ఎరుకో అంటూ వీథుల్లో వెళుతూ పిలిచిన వారికంతా ఎరుక చెపుతూ వుంటారు. ఎరుకంటే వారికి తెలిసింది చెప్పటం, చెప్పటమంటే, భవిష్యత్తును గురించి చెప్ప గల వారు గనుక, వారిని ఎరుక వాళ్ళు అని అంటారు. అయితే ఇది రూపాఝ్ంతరం చెంది, ఎరుక ఎరుకలగా మారి, అది ఒక జాతి పేరుగా, ఎరుకల జాతియై, ఎరుకల వాళ్ళుగా ప్రఖ్యాతి వహించారు. ఎరుక చెప్పే వారి జీవిత భవిష్యత్తు ఏమిటో ఎరుకల వారికి తెలియక పోయినా, ఇతరులకు మాత్రం ఎరుక చెప్పి జీవిస్తున్నారు.
వెంకన్న సోది వేషం
[మార్చు]సోది మీద నమ్మకం, రాజులకూ, జమీదారులకు, సామాన్య ప్రజలకూ పరిమితం కాక, దేవుళ్ళను కూడ అది ఆరర్షించిందంటే, అది ఎంతటి బలవత్తరమైందో వూహించ వచ్చు. ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వర స్వామి. శ్రీనివాసుడు కూడా తన ప్రియురాలు పద్మావతి దగ్గరకు ఎరుక చెప్పే వేషంతో వెళ్ళి, ఆమెకు గద్దె చెప్పి నట్లు నటిస్తూ పద్మావతికి శ్రీనివాసుని పట్ల అనురాగం కలిగించి చివరికి పద్మావని వేంకటేశ్వరుడు వివాహం చేసుకున్న ఘట్టం అందరికీ తెలిసిందే, దీనిని బట్టి సోదె ప్రక్రియ ఎంతటి బలవత్తర మైందో అర్థం చేసుకోవచ్చు.
కష్టాలు, సుఖాలూ
[మార్చు]ప్రతి మనిషీ సుఖాలు వచ్చి నప్పుడు ఏ జాతకాలు చూపించుకోక పోయినా, కష్టాలు వచ్చి నప్పుడు మాత్రం జాతకాలూ, జ్యోతిషమూ, సాముద్రికమూ సోదె చెప్పించుకోవడమూ, చిలక జోశ్యమూ, కోయవారు పలుకులు వినీ తృప్తి పడుతూ వుంటారు.
సహజంగా ప్రతి వారూ పుట్టినప్పుడే పుట్టిన ప్రతి వారికీ బ్రహ్మ ముఖాన వ్రాస్తాడంటారు. అయినా మనసు నిబ్బరం లేక, కష్టాలను తట్టుకోలేక ఎవరు ఏ మంచి వార్థ చెపుతారో యని మగ వారెవరూ ఇంట లేనప్పుడు, స్త్రీలంతా కూర్చుని మంచి చెప్పేటప్పుడు సంతోషిస్తూ, చెడు చెప్పేటప్పుడు ముక్కులు చీదుతూ వుంటారు.
సోదెమ్మ, సోదో
[మార్చు]సోదెమ్మ సోదో అంటూ, నెత్తి మీద ఒక బుట్ట పెట్టు కుంటారు. ఆ బుట్టలో, నాలుగు పలకలు గల గవ్వలతో కుట్టిన ఒక వస్తువుంటుంది. దానినే వాకు నిచ్చే దేవతగా ఆరాధిస్తారు. ఆదేవతను, పసుపు కుంగాలతో అలంకరిస్తారు. ఒక చేతిలో తంబురా, చంకలో పిల్లవాడు, మరో చేతిలో వెండి కట్టలు గల మంత్ర శక్తికలిగిన పుల్లను పట్టుకుంటారు. ముఖాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని వయ్యారంగా వీధిలో నడుస్తూ చూపరులకు ఏవో అతీత శక్తులు కలిగిన స్త్రీ దేవతా మూర్తిగా కనిపిస్తుంది.
ఎవరో అమ్మ పిలుస్తుంది
[మార్చు]ఇంతలో ఎవరో ఒక అమ్మ ఓ సోదమ్మీ అని పిలుస్తుంది...... దానితో అమ్మలక్క లందరూ చుట్టూ మూగుతారు. సోదెలమ్మి చాటలో బియ్యం పోయించు కుని, పశుపు కుంకాలను వారగా పెట్టించి, పావలా డబ్బులు ప్రక్కన పెట్టించి, వాక్కు నెచ్చే ఇలవేల్పు, గవ్వల పలకను ముందుంచి, కూన రాగం తీస్తూ, వెండి కట్టుల పుల్లను ఇల వేల్పుకు తాకించి, అమ్మా పలుకు, జగదంబా పలుకు, మాహమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధురమీనాక్షీ పలుకు, విశాలాక్ష్మి పరులు, విజయవాడ కనక దుర్గమ్మా పలుకు, పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ పలుకు వుయ్యూరు వీరమ్మా పలుకు పలకవే తల్లి అని దేవత లందర్నీ కళ్ళు మూసుకుని భక్తి భావంతో స్తుతించి, చేతిలో వున్న పుల్లను చెప్పించుకునే వారి చేతిలో పొడుస్తూ; ఇంటా, బొట్టా, తోడా, నీడా గడ్డమా అంటూ సోది చెప్పించుకునే వారు బంధువుల తాలూకు ఆత్మలను తన ద్వారా పలికే టట్లు చేసి పోయిన వారి ఆశలు అడియాసలు చెపుతూ, సంతోష కరమైన విషయలౌ చెప్పేటప్పుడు, సంతోషంగానూ, విచార కర మైన విషయాలు చెప్పే టప్పుడు దీనాతి దీనంగా హృదయాలను ద్రవింప చేసే విధంగానూ, కొన్ని ఆసక్తి కర మైన విషయాలనూ, కొన్ని ఆశను రేకెత్తించేవి గానూ, మరి కొన్ని అత్యాశను కలిగించేవి గాను మరి కొన్ని వారి వారి మనసుల్లో ఎముందో అదే భావాని చెపుతూ వినే వారిమార్పుల ననుసరించి, వారికి అభిరుచి గల విషయాలను చెపుతూ, వారితో ఆమోదింప చేస్తూ, భవిష్యత్ వర్తమానాల గురించి జోశ్యం చెపుతూ పోయిన వారి ఆత్మ శాంతికి ముడుపులు కట్టించు కుంటూ, వారి వారి సందేహాల నివృత్తి కొరకు ఓపికగా సమాధానాలు చెపుతూ, జరిగిందీ, జరగబోయేదీ చెపుతూ వినేవారి కళ్ళ వెంట నీరు కార్పిస్తూ, తాను చెప్పిన విషయాలతో వారిని తన్మయుల్ని చేస్తూ, శ్రోతల యొక్క అనుభూతినీ, సాను భూతినీ అనుసరించి సోదెమ్మి, చేర్పులూ, కూర్పులూ కలిపి, రసవత్తరంగా సోదె ముగుస్తుంది ...... చాటలో బియ్యం పావలా డబ్బులు కాక, వారి సంతోషం కొద్దీ ఎక్కువ ముట్ట చెపుతారు.
పుట్టు పూర్వోత్తరాలు
[మార్చు]వెంకటేశ్వర విశ్వ విద్యాలయం సామాజిక మానవ విజ్ఞానానికి చెందిన డా: జి.వి. సుబ్బా రెడ్డి కథనాన్ని బట్టి, దక్షిణ భార దేశంలో, దక్షిణాగ్రం నుంచి. ఉత్తరార్కాటు జిల్లాలు దాటి ఉత్తరంగా వీరు వ్యాపించి వుండేవారనీ, వీరిని ఎరుకల వాళ్ళనీ, కోర్బా వాళ్ళనీ పిలుస్తారనీ అంటారు.ఎరుకల వారిలో ఏడు ఉప తెగ లున్నాయి. వెదురు బుట్ట లల్లడం, పిట్టలు పట్టడం, ఉప్పు అమ్మకం, మంచాలకు నులక పేనడం, పాముల చర్మాలు తీయటం మొదలైన పనులు పౌరుషులు చేస్తూ వుంటారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఎరుకల వారు నేరస్థుల జాబితాలో వుండే వారు. స్వాతంత్ర్యానంతరం, షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించటం జరిగింది.
దేశ దిమ్మరులు
[మార్చు]వీరు దేశ దిమ్మరులు, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి సంసారాలతో సంచారం చేస్తూ వుంటారు. మరి కొంత మంది స్థిర నివాసాలు ఎర్పాటు చేసుకుంటుంటారు. పైన వుదహరించిన ఏడు తెగలకు చెందిన ఎరుకల వారు, అడపకు మూడు కిలో మీటర్ల దూరంలో, దండు హరిజన వాడ ప్రక్కన కమాలపురం గూడెంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళలో నివసిస్తున్నారు. ఈ గూడెంలో నలబై కుటుంబాల వారున్నారు. అమాయక జీవులు అల్ప సంతోషులు. పూటకు అన్నం దొరికితే పరమానంద పడిపోతారు.
మూలం
[మార్చు]తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.