ప్రియురాలు
ప్రియురాలు (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | త్రిపురనేని గోపీచంద్ |
---|---|
తారాగణం | జగ్గయ్య , లక్ష్మీకాంతం, కృష్ణకుమారి, టి.కనకం, సావిత్రి, రేలంగి, చంద్రశేఖర్, నల్ల రామమూర్తి |
సంగీతం | యస్.రాజేశ్వర రావు |
నిర్మాణ సంస్థ | భారతలక్ష్మీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ప్రియురాలు త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో 1952లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను దోనేపూడి కృష్ణమూర్తి నిర్మించాడు.
నటీనటులు
[మార్చు]- లక్ష్మీకాంతం - మోహిని
- కృష్ణకుమారి - పద్మిని
- టి.కనకం - రంగసాని
- గంగారత్నం - శ్రీహరి
- సావిత్రి - సరోజ
- గిరిజ - సంధ్య
- జగ్గయ్య - శ్యామ్
- చంద్రశేఖర్ - విఠల్ రావు
- రేలంగి వెంకట్రామయ్య - కోదండం
- నల్ల రామమూర్తి - నారాయణ
- కొండయ్య - కొండల్రావు
- జి.వెంకటేశ్వరరావు - కులశేఖరం
- పాలడుగు సుబ్బారావు - విటుడు
- కమల
- పువ్వుల అనసూయ
- కె.బలరామయ్య
- కుటుంబరావు
- బైరాగి
- ఇందిర మొదలైనవారు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం : త్రిపురనేని గోపీచంద్
- రచన : త్రిపురనేని గోపీచంద్
- సంగీతం : సాలూరు రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు
- పాటలు : అనిసెట్టి సుబ్బారావు
- శబ్ద గ్రహణం : రంగస్వామి
- కళ : టి.వి.యస్.శర్మ
- ఎడిటింగ్: జి.డి.జోషి
- నృత్యం : హీరాలాల్
- మేకప్: మంగయ్య, భద్రయ్య
- నేపథ్య గాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు,రావు బాలసరస్వతి, జిక్కి,టి.జి.కమలాదేవి, మాధవపెద్ది సత్యం, వి.జె.వర్మ
కథాసంగ్రహం
[మార్చు]మోహిని వేశ్యకుటుంబంలో జన్మించింది. ఆమె గొప్ప నర్తకి. విఠల్‌రావు ఒక చిత్రకారుడు. అతడు మోహినికి గురువై సంగీతం, సంస్కారం నేర్పిస్తాడు. వేశ్యవృత్తిలో సంపాదన చేస్తున్న అక్క రంగసాని, తల్లి శ్రీహరి మోహినిని వృత్తిలోకి దించాలని ఎంత ప్రయత్నించినా ఆమె నీచమైన ఆ వృత్తి చేయనని, నీతిగా జీవిస్తానని పట్టుపడుతుంది.
ధనవంతుడైన కోతిగంతుల కోదండం భార్యను, కూతురు సరోజను నిర్లక్ష్యం చేసి వేశ్యల వెంట తిరుగుతూ, శ్రీహరికి డబ్బు ఆశపెట్టి, మోహిని కోసం ఒత్తిడి చేస్తాడు. శ్యామలరావును పద్మిని ప్రేమిస్తుంది. కానీ అతడు అంగీకరించడు. మోహిని తన అక్క, తల్లితో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళుతుంటే కారు చెడిపోతుంది. శ్యామలరావు నృత్య ప్రదర్శన ఆగిపోకుండా తన కారులో వారిని తీసుకుపోతాడు. మోహిని నృత్యాన్ని, ఆమె సంస్కారాన్ని చూసి శ్యామ్ ఆమెను ప్రేమిస్తాడు.
శ్రీహరి అర్ధరాత్రివేళ కోదండాన్ని మోహిని గదిలోకి పంపుతుంది. మోహిని ఇంట్లోనుంచి పారిపోయి శ్యామలరావును కలుసుకుంటుంది. అతడు ఆమెను తన ప్రాణస్నేహితుడైన విఠల్ రావు ఇంటికి తీసుకుపోతాడు. అతడు వీరిద్దరినీ మద్రాసుకు పంపిస్తాడు.శ్రీహరి, రంగసాని పోలీసు రిపోర్టు ఇచ్చి, మోహిని ఫోటోలు అన్ని చోట్లకూ పంపుతారు.
శ్యామ్, మోహిని మద్రాసులో మారేజి రిజిష్ట్రార్ వద్దకు వెళ్ళగా అతడు ఒక తేదీ నిర్ణయిస్తాడు. ఈలోగా వారు మహాబలిపురం, మైసూరు మొదలైన ప్రదేశాలు చూడడానికి వెళతారు. శ్యామ్ ప్రేమోద్వేగంతో ఆమెను వాంఛిస్తాడు. ఆమె లోబడుతుంది. వారు మద్రాసుకు తిరిగివస్తుంటే హఠాత్తుగా కారు ప్రమాదం జరిగి శ్యామ్ తీవ్రంగా గాయపడతాడు. అతనికి పూర్వస్మృతి పోతుంది. అక్కడి నుండి తెలిసీ తెలియని స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోతాడు. మోహిని హోటల్లో దుఃఖిస్తూ ఉండగా, శ్యామ్ కనపడలేదని చెప్పడానికి వచ్చిన పోలీసు ఆమెను గుర్తుపట్టి బలవంతంగా శ్రీహరికి అప్పగిస్తాడు.
కోదండం భార్య జబ్బుతో చనిపోతుంది. రంగసాని వ్యామోహంలో పడిన కోదండం, కూతురు సరోజను మేనమామ ఇంటికి పంపి ఆస్తిని అంతా అమ్మివేసి మద్రాసు వెళ్ళి ఫిలిం కంపెనీ పెడతాడు. శ్యామ్ వల్ల మోహిని గర్భవతి అయ్యిందన్న విషయాన్ని గ్రహించిన శ్రీహరి, రంగసాని ఆమెను గర్భస్రావానికి మందు తీసుకొని, వేశ్యావృత్తి చేయమని బలవంతం చేస్తారు. ఆమె లొంగక పోవడంతో ఇంట్లోంచి గెంటివేస్తారు. బికారిగా తిరుగుతున్న శ్యామ్‌ను పద్మిని చేరదీస్తుంది. అతనికి మోహిని జ్ఞాపకం లేదని గ్రహించి, అతడిని ఆకర్షించి వశం చేసుకొంటుంది.
మోహిని వీధులపాలై పడరానిపాట్లు పడుతూ ఒక బిడ్డను ప్రసవిస్తుంది. రేడియోలో శ్యామ్ పాటను విని మద్రాసుకు అతడిని వెదుకుకొంటూ వెళుతుంది. శ్యామ్ ఆమెను గుర్తుపట్టక నిందిస్తాడు. పద్మిని వెళ్ళగొడుతుంది. ఈ అవమానం భరించలేక ఆమె బిడ్డతో సహా ఆత్మహత్యకు పాలుపడుతుంది. వారిద్దరినీ విఠల్ రావు కాపాడి తన ఆశ్రమంలో చేర్చుకొంటాడు. సరోజకు విఠల్ రావు మీద ఉన్న ప్రేమను మోహిని గ్రహించి వారిద్దరినీ వివాహం చేసుకోమని కోరుతుంది.
కోదండం, రంగసాని,ఆమె స్నేహితుడు కొండలరావు మద్రాసులో కాండూరి లక్ష్మీపతి అనే వ్యక్తి చేతులలో మోసపోయి పిలిం కంపెనీ పేరుతో డబ్బంతా కోల్పోతారు. మరొక అమ్మాయి కోదండం స్నేహితురాలై రంగసానిని తరిమేస్తారు. శ్యామలరావు, పద్మిని ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురై శ్యామ్‌కు గతం అంతా గుర్తుకు వస్తుంది. అతడు మోహినిని వెదుకుకుంటా వెళతాడు. రంగసాని శ్యామ్‌కు మోహిని విఠల్ రావును వివాహం చేసుకొని కాపురం చేస్తున్నదని, వారికి ఒక బిడ్డ కూడా కలిగిందని అబద్ధం చెబుతుంది. శ్యామ్ మోహినిపై పగబట్టి ఆమెను చంపడానికి బయలుదేరుతాడు. అయితే అతడికి జరిగింది తెలిసి మోహినిని స్వీకరించడంతో కథ సుఖాంతమౌతుంది.
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పాట | పాడినవారు |
---|---|---|
1 | అవనీ నీపతి వెడలిపోయెనా నీగతమే నిన్నేడిపించెనా | ఘంటసాల |
2 | ఆనందం మన జీవన రాగం | ఘంటసాల, రావు బాలసరస్వతీదేవి, జిక్కి |
3 | ఉందుము మధురానగరిలో కృష్ణా బృందావనిలో | రావు బాలసరస్వతీదేవి |
4 | ఎవరిదా వేణుగీతి పిల్లగాలితో ఆడుచుపోయె | రావు బాలసరస్వతీదేవి |
5 | ఆశించేవు వినోదమా ఆవరించునది విషాదామా | |
6 | ఒకసారైనా నీ మధురాలాపన | ఘంటసాల, రావు బాలసరస్వతీదేవి |
7 | వినరావో ఓ వింతలోకమా | ఘంటసాల, రావు బాలసరస్వతీదేవి |
8 | హాపీ హాపీ డే హోపంతా మనదే | ఘంటసాల, జిక్కి బృందం |
మూలాలు
[మార్చు]- ప్రియురాలు (1952) పాటల పుస్తకము
- ఘంటసాల గళామృతము - కొల్లూరి భాస్కరరావు[permanent dead link]