స్థూపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్తూపం అంటే బౌద్ధ నిర్మాణం అని చరిత్రకారులలోని వాడుక. స్తూపాలు చరిత్రకు చాలా ఉపకరిస్తాయి.

వర్ణక్రమం[మార్చు]

ఈ మాటకి నిఘంటువులో రెండు వర్ణక్రమాలు కనిపిస్తున్నాయి. ఏది ఒప్పో తెలియదు. ఒక అభిప్రాయం ప్రకారం -

 • స్తూపం = బౌద్ధులు నిర్మిచిన కట్టడం; ఇది సాధారణంగా అర్ధగోళాకారంలో కనబడుతుంది.
 • స్థూపం = గణితంలో వచ్చే స్తంబం వంటి ఆకారం

ఈ తేడా గమనించాలా వద్దా అన్న విషయం మీద అబిప్రాయం ఏమిటో మరి?

వ్యుత్పత్తి[మార్చు]

శబ్దరత్నాకారుడు స్తూపం అన్న పదానికి మట్టి లాంటి వాటి దిబ్బ అని అర్థం ఇచ్చారు. అయితే దీనికి ప్రముఖ చారిత్రికులు మల్లంపల్లి సోమశేఖర శర్మ స్తూపం అనే పదానికి చరిత్రపరంగా వేరే అర్థం చెప్పారు. ఆయన ప్రకారం చరిత్ర అధ్యయనంలో బౌద్ధవాస్తువును ఇటుకతోనో, రాతితోనో కట్టిన అర్ధగోళాకారము వంటి ఘననిర్మాణమునకే స్తూపమను పేరు రూఢియగుటవలన, దిబ్బ అయినదెల్లా స్తూపము కాజాలదు. ఈ నిర్మాణము బౌద్ధమతము వాస్తువునకు ప్రసాదించిన విశేషము.[1] దీని ప్రాకృత రూపం "థూపము". అయితే ప్రాచీన (బౌద్ధ) కాలంలో "స్తూపము" అనే పదం వాడుకలో ఉన్నట్లు కనిపించదు. అందుకు బదులు "చైత్యము" అనే పదమే వ్యవహారంలో ఉండేది. ఒకే చైత్యము ఉంటే దానిని చైత్యమనీ, చాలా చైత్యాలున్నచోట ప్రధాన కట్టడాన్ని మహాచైత్యమనీ అనేవారు కావచ్చును. "చైత్యము" అన్నపదం "చితా" శబ్దమునుండి పుట్టింది.

చరిత్ర[మార్చు]

ప్రాచీన బౌద్ధంలో బుద్ధుని, లేదా ఇతర "అర్హతుల" ధాతు విశేషాలను గౌరవ ప్రదంగా లేదా స్మృతి చిహ్నంగా లేదా పూజా సంకల్పంతో భద్రపరచే ఆచారం అప్పుడు ఉండేది. అలా చేయవచ్చునని బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో అన్నట్లు మహాపరినిర్వాణ సూత్రంలో ఉంది. బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి అశోకుడు అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. ఈ ప్రతీతిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు. [2] కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి. [3]

నిర్మాణ శైలి[మార్చు]

అమరావతి స్తూపం కట్టడం రేఖాచిత్రం - ఇందులో స్తూప నిర్మాణంలోని వివిధ భాగాలను చూడవచ్చును

బౌద్ధులు అర్థగోళాకారంలో స్తూపాన్ని నిర్మిస్తూంటారు. మృతశరీరావశేషాలపై నిర్మించిన కట్టడాలకు మాత్రమే చారిత్రికంగా స్తూపమనే పేరు అన్వయమవుతోంది. బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూను, సంఘారామాలలో నివశిస్తూను ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకొన్నారు. బౌద్ధుల స్తూపాలలో మూడు రకాలున్నాయి[4]

 • ధాతుగర్భ స్తూపాలు: బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులని గాని అయిన అవశేషాలపై నిర్మించినవి.
 • పారిభోజిక స్తూపాలు: భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి.
 • ఉద్దేశిక స్తూపాలు: ధాతువులు లేకుండా స్మారకచిహ్నంగా నిర్మించినవి.


ఈ చైత్యాలు లేదా స్తూపాలు ఈ గుండ్రని ఆకృతికి కారణాలు గురించి ఊహాగానాలున్నాయి - అది ఉదయించే సూర్యుని చిహ్నం కావచ్చును. లేదా జీవితం బుడగ వంటిదని సూచన కావచ్చును. పైన ఒకటి నుండి మూడు వరకు ఛత్రములుండేవి . అవి త్రిరత్నాల సంకేతం అంటారు. స్తూపం నిర్మాణంలో ముఖ్యమైన అంశాలు[3].

 1. ఒక వేదిక (Drum)
 2. దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome)
 3. అండముపై ఒక హర్మిక (Pavilion)
 4. దానిపై నిర్మాణాన్ని అంతటినీ ఆవరించే దండ సహిత ఛత్రము (Umbrella)
 5. అండము, హర్మికల మధ్య గళము (neck)
 6. చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings)

బౌద్ధస్తూపాలు[మార్చు]

భట్టిప్రోలు స్తూపం నిర్మాణం

బౌద్ధస్తూపాలు బుద్ధుడు లేదా ఆయన ముఖ్యమైన అనూయాయుల జుట్టు, అస్థికలు వంటి శరీరావశేషాలను భూస్థాపితం చేసి దానిపై నిర్మించేవారు. దానిపై రకరకాల శిల్పాలు చెక్కేవారు. బుద్ధుని జీవిత విశేషాలు, బౌద్ధుల జాతక కథలు మొదలైనవాటిలోని సన్నివేశాలను చెక్కించారు. అమరావతి స్తూపంలో

ప్రముఖ స్తూపాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.
 2. మల్లంపల్లి సోమశేఖర శర్మ - అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు
 3. 3.0 3.1 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము - రెండవ భాగము కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సంపాదకత్వంలో - "ఇందులో అమరావతి స్తూపం" వ్యాసం కూర్చినవారు టి.ఎన్.రామచంద్రన్, Archeological Assistant, మద్రాసు ప్రభుత్వ మ్యూజియం. - పుస్తకం ప్రచురణ: కాశీనాధుని నాగేశ్వరరావు - 1934లో
 4. బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)
"https://te.wikipedia.org/w/index.php?title=స్థూపం&oldid=2651585" నుండి వెలికితీశారు