స్మృతికాలపు స్త్రీలు
స్మృతికాలపు స్త్రీలు | |
కృతికర్త: | జటావల్లభుల పురుషోత్తము |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | భారతీయ స్త్రీలు |
ప్రచురణ: | ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము |
విడుదల: | 1935 |
ప్రచురణ మాధ్యమం: | ముద్రణ |
పేజీలు: | 250 |
స్మృతికాలపు స్త్రీలు (Women in the Smritis) జటావల్లభుల పురుషోత్తము రచించిన పుస్తకం. ఇది 1935 లో తొలిసారిగా ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము తరపున వల్లూరి సూర్యనారాయణరావుగారు ప్రచురించారు.
నేపథ్యం
[మార్చు]భారతదేశ చరిత్రలో వివిధకాలములలో స్త్రీలస్థితి యెట్లుండెనో తెల్పు గ్రంథములను వ్రాయుటకై రచయిత సంకల్పించుకొనెను. ఇదిదివఱలో రచించిన "వేదకాలపు స్త్రీలు" అను గ్రంథముయొక్క యుపోద్ఘాతములో వివరాలు చెప్పారు. అప్పటికే స్మృతికాలపు స్త్రీలను గూర్చి కూడా కొంత పరిశీధనము చేసియుండెను. ఈలోపున పరిశోధన పూర్తియై తత్ఫలితముగ నీగ్రంథము వెల్వడుచున్నది.
ఋషులచే వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంథములకే స్మృతులని పేరు. వేదములను మనస్సుననిడికొని వీనిని ఋషులు స్మరించుటచేతనే (శ్రుతింవశన్తిమునయ: స్మరన్తిచతథా స్మృతిం) వీనికి స్మృతులను నామమువచ్చినదని మనవారు చెప్పియున్నారు. ధర్మశాస్త్ర ప్రవర్తకులైన ఋషుల నామములు యాజ్ఞవల్క్యస్మృతిలో నీయబడినవి.
ఇట్లు పరాశరయాజ్ఞ వల్క్యులచే పేర్కొన బడిన స్మృతికారుల సంఖ్య యిఱువదిరెండని తేలుచున్నది; (1) మనువు (2) అత్రి (3) విష్ణువు (4) హారితుడు (5) యాజ్ఞవల్కుడు (6) ఉశనుడు (7) ప్రాచేతనుడు (8) యముడు (9) అపస్తంబుడు (10) అంగిరసుడు (11) సంపర్తుడు (12) కాత్యాయనుడు (13) బృహస్పతి (14) పరాశరుడు (15) శంఖుడు (16) లిఖితుడు (17) దక్షుడు (18) గౌతముడు (19) శాతాతవుడు (20) వసిష్ఠుడు (21) కశ్యపుడు (220 గర్గుడు. వీరుకాక యీక్రిందివారుకూడ స్మృతికర్తలుగ నితర గ్రంథములలో నుదాహరింపబడి యున్నారు; (23) వృద్ధపరాశరుడు (24) దేవలుడు (25) బుధుడు (26) పులస్త్యుడు (27) నారదుడు (28) బోధాయనుడు. ఈ యిఱువది యెనిమిది స్మృతులలోను గర్గవిష్ణు దేవల పులస్త్యకాశ్యపప్రాచేతన స్మృతులను దక్క మిగిలినవాని నన్నిటిని పరిశోధించియే నే నీగ్రంథమును వ్రాసియున్నాను. ఈ దేవలాదిస్మృతులు ప్రస్తుతము లభ్యములు కాకుండుటయే వీనిని వదలివైచుటకు కారణము. దేవలస్మృతి యను పేర నొకస్మృతి యిపుడుగలదు. కాని యది సరియగు దేవలస్మృతి కాదని యందఱు నంగీకరించియున్నారు. పైన పేర్కొన బడిన స్మృతులనే కాక హిరణ్య కేశి బోధాయనాపస్తంబాది విరచితములైన గృహ్యసూత్రములను గూడ పరిశోధించి యందు స్త్రీలనుగూర్చి గల యంశములను గూడ తీసికొంటిని. కొందఱు ధర్మశాస్త్ర కారులే గృహ్యసూత్రములను గూడ వ్రాసియున్నారు. గృహ్యసూత్రములు కూడా స్మృతులవలెనే ప్రమాణములు.
హిందువులకు శ్రుతులకు బిమ్మట స్మృతులే యెక్కుడు ప్రమాణము లగుటచేతను, కాలములో గూడ నివివేదముల కంటే నర్వాచీనములే కావునను నా పరిశోధనకు వేదకాలపు స్త్రీలకు బిమ్మట స్మృతికాలపు స్త్రీలను తీసికొంటిని. స్మృతి వాజ్మయమారంభమైనది మొదలంతమగు వఱకును నడుమ చాలకాలము కలదనియు నీ కాలములో ననేకములగు నితర విధములగు వాజ్మయములు గూడ బయలుదేరినవనియు స్పష్టముగ తెలియుచున్నది. కాన స్మృతియుగమని మనము దేనిని చెప్పలేము. ప్రథమచరమస్మృతులకు నడుమ చాలకాలము గడచెనను సంశమును మన ప్రాచీనులును నవీనులును గూడ నంగీకరించియున్నారు. ఇఱువురి మతములలోను గూడ మనుస్మృతి ప్రథమమును (ఆ మనుస్మృతి చాలమారి ప్రస్తుతమను స్మృతియైనదని నవీనులు చెప్పుదురు) పరాశరస్మృతి చరమమునై యున్నవి. మిగిలిన వీ నడుమకాలమున రచింపబడినవి. కల్పారంభమున మనుస్మృతియు కల్యారంభమున పరాశరస్మృతియు రచింపబడినవని యా స్మృతులలోనే ఉంది. మఱియు త్రేతాయుగములో గౌతమస్మృతియు, ద్వాపరములో శంఖలిఖితస్మృతియు రచింపబడినవని పరాశరస్మృతి చెప్పుచున్నది. కాన మన ప్రాచీనులదృష్టిలోకూడ స్మృతులన్నియు నొకేకాలమున రచింపబడలేదు. ఆధునికులు స్మృతుల కింత ప్రాచీనతయొప్పరు. ప్రస్తుతస్మృతులలో ప్రాచీనతమమైన గౌతమధర్మసూత్రము క్రీ.పూ ఏడవశతాబ్దమునను, సర్వాచీనతమమైన పరాశరస్మృతి సా.శ. పదమూడవశతాబ్దమునను రచింపబడినవని వారందురు. ఈ రెండువేల సంవత్సరముల కాలములోను నపుడపుడు దేశములో గల్గుచుండిన యాచార పరిణామముల ననుసరించి యాయాస్మృతులు వ్రాయబడు చుండినవని విమర్శకుల యభిప్రాయము.
మన ప్రాచీనులుగూడ నొక్కొకస్మృతి యొక్కక యుగమునకు ముఖ్యప్రమాణమనిరి. మను గౌతమశంఖలిఖిత పరాశరస్మృతులు కృత త్రేతా ద్వాపర కలియుగములలో ముఖ్య ప్రమాణములు. ఈ నియమమునకు లోబడి స్మృతులన్నియు సమప్రమాణములే. ఆధునికవిమర్శకులు కొన్నిస్మృతులకు కాలనిర్ణయము చేసియున్నారు. ఆ నిర్ణయము లిట్లున్నవి. గౌతముడు క్రీ.పూ 600. బోధాయనుడు క్రీ.పూ 550. హిరణ్యకేశి క్రీ.పూ 500. ఆపస్తంబుడు క్రీ.పూ 500. ప్రస్తుతమనుస్మృతి క్రీ.పూ 200. మొదలు సా.శ. 100. లోపున. సంవర్తుడు క్రీ.పూ. 200. యాజ్ఞవల్క్యుడు క్రీ. పూ 100 కిని సా.శ. 200.కును నడుమ. బృహస్పతి సా.శ.200. హారితుడు సా.శ. 400 కును 700 కును నడుమ. పరాశరుడు సా.శ. 1200. పరాశరస్మృతికి పిమ్మట పుట్టిన ధర్మశాస్త్ర గ్రంథములన్నియు వ్యాఖ్యానములో నిబంధన గ్రంథములో యైయున్నవి.
మొత్తముపై స్మృతులలో నాయాకాలముల నాటి స్త్రీలపరిస్థితులు ప్రతిబింబింపబడినవని చెప్పవచ్చును గాని యందు గన్పట్టు స్త్రీవిషయకవిధి నిషేధవాక్యములన్నియు పూర్తిగా పాటింపబడుచుండెనని చెప్పుటకు వీలులేదు. కాన స్మృతు లాయాకాలముల నాటి స్త్రీ విషయకములగు నాదర్శములను క్రోడీకరించుచున్నవని కూడా చెప్పవలెను. ఈ స్థితులును నాధర్మములును గూడ నీ గ్రంథములో వివరింపబడినవి కాన చారిత్రకదృష్టి కలవారికిని నదిలేక కేవలము స్మృతులలోని ధర్మముల నా చరణలో పెట్టవలెనని కోరువారికిని గూడ నీ గ్రంథముపయోగించును.
విషయసూచిక
[మార్చు]- ప్రథమాధ్యాయము : స్త్రీ సంతతి
- ద్వితీయాధ్యాయము : వివాహవయస్సు
- తృతీయాధ్యాయము : వధూవరార్హతలు
- చతుర్థాధ్యాయము : వివాహవిధానము
- పంచమాధ్యాయము : దాంపత్యము
- షష్ఠాధ్యాయము : పునర్వివాహము
- సప్తమాధ్యాయము : కర్మకాండ
- అష్టమాధ్యాయము : ధనము
- నవమాధ్యాయము : గౌరవము, స్వాతంత్ర్యము
- దశమాధ్యాయము : వృత్తి, విద్య
- ఏకాదశాధ్యాయము : వివిధవిషయములు