స్వప్నసుందరి రావు
స్వప్నసుందరి రావు కూచిపూడి నృత్య కళాకారిణి.
విశేషాలు[మార్చు]
ఈమె కూచిపూడి నాట్యాన్ని పసుమర్తి సీతారామయ్య, వెంపటి చినసత్యంల వద్ద అభ్యసించింది. భరతనాట్యాన్ని కె.ఎన్.దక్షిణామూర్తి, అడయార్ కె.లక్ష్మణ్, బి.కళ్యాణ సుందరంల పర్యవేక్షణలో నేర్చుకుంది. కళానిధి నారాయణన్ వద్ద అభినయంలో ప్రత్యేక శిక్షణను తీసుకున్నది.
ఈమెకు నాట్యంతో పాటుగా కర్ణాటక సంగీతంలో కూడా గొప్ప పరిజ్ఞానం ఉంది. ఈమె టి.ముక్త వద్ద పదములను ఆలపించడంలో ప్రత్యేక శిక్షణను పొందింది. ఈ శిక్షణ ఈమెకు సంప్రదాయ పదాలకు నృత్యం చేయడంలో ఉపయోగపడింది.
ఈమె ఆలయ సంప్రదాయ నృత్య రీతులపై ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు చేసింది. మరుగుపడిన "విలాసినీ నృత్యా"న్ని వెలికితీసి పునరుద్ధరించి మద్దుల లక్ష్మీనారాయణ సహకారంతో దానికి ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఈమె న్యూఢిల్లీలో కూచిపూడి నృత్యకేంద్రాన్ని స్థాపించి దానికి డైరెక్టర్గా పనిచేసింది. ఈమె అనేక మంది శిష్యులకు కూచిపూడి నృత్యాన్ని నేర్పించింది. అనేక నృత్యనాటికలను సమర్పించింది.
ఈమెకు ఢిల్లీ ప్రభుత్వం నుండి సాహిత్య కళాపరిషత్తు అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటుగా అనేక పురస్కారాలు లభించాయి.