స్వామి రంగనాథానంద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామి రంగనాథానంద
జననంశంకరన్ కుట్టి
(1908-12-15)1908 డిసెంబరు 15
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
నిర్యాణము2005 ఏప్రిల్ 25(2005-04-25) (వయసు 96)
బేలూరు మఠం, కోల్‌కత సమీపంలో
గురువుస్వామి శివానంద
తత్వంవేదాంత

స్వామి రంగనాథానంద (1908 డిసెంబరు 15 - 2005 ఏప్రిల్ 25) రామకృష్ణ మఠానికి చెందిన హిందూ స్వామి. అతను రామకృష్ణ మఠం, మిషన్‌కు 13వ అధ్యక్షుడిగా పనిచేశాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

ఈయన అసలు పేరు శంకరన్ కుట్టి. 1908 డిసెంబరు 15న కేరళ లోని త్రిచూర్ సమీపంలోని త్రికూర్ అనే గ్రామంలో నీలకంఠ శాస్త్రి, లక్ష్మీకుట్టి అమ్మలకు జన్మించారు. తను 14 ఏళ్ళ వయస్సులోనే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస బోధలకు ప్రేరితుడైనాడు. తరువాత తను 18 ఏళ్ళ వయసులోనే శంకరన్ రామకృష్ణ సంఘంలో చేరారు. మొదటి మజిలీ మైసూరు. ఇక్కడ ఆయన అన్ని పనులూ చేసేవారు. పాత్రలు తోమటం, వంట చేయటం, బట్టలు ఉతకటం లాంటి పనులు చేసేవారు. లాంఛన ప్రాయమైన విద్య ఆయనకి 5, 6 తరగతులతోనే ఆగిపోయింది. కానీ చదువులలో సారం అంతా కాచి వడపోసారు: ఉపనిషత్తులు, గీత, ఇతిహాసాలు, భారతీయ సాంస్కృతిక చరిత్ర, సంస్కృత అధ్యయనం- ఇవే కాక శ్రీ రామకృష్ణ-వివేకానం దుల సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. ఈ దశలో శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన శ్రీ శివానందస్వామిజీ శంకరన్‌కి సన్యాస దీక్ష ఇచ్చారు. శంకరన్ రంగనాథస్వామి అయ్యారు. రంగూన్‌ లోని రామకృష్ణ ఆశ్రమానికి 1933 నుంచి 1942 దాకా కార్యదర్శిగా ఉన్నారు. అవి రెండవ ప్రపంచ యుద్ధపు రోజులు. దేశ విభజన రోజుల్లో రంగనాథానంద కరాచీలో ఉన్నారు. కరాచీలో ఎల్‌ కె అద్వానీకి స్వామీజీతో పరిచయం ఏర్పడింది. భగవద్గీతపై స్వామీజీ ప్రసంగాలను విన్నారు. రంగనాథానంద తన నిర్మాణ సంవత్సరాల్లో "గొప్ప ప్రభావం" అని అద్వానీ చెప్పారు. అద్వానీ ప్రకారం, కరాచీలో, మహమ్మద్ అలీ జిన్నా ఒకసారి ఇస్లాం, ప్రవక్త మహమ్మద్ గురించి స్వామి రంగనాథానంద ఉపన్యాసం విని, "నిజమైన ముస్లిం ఎలా ఉండాలో ఇప్పుడు నాకు తెలుసు" అని వ్యాఖ్యానించాడు. (1942-48) తర్వాత రంగనాథానంద స్వామి ఢిల్లీ రామకృష్ణ మిషన్‌కి కార్యదర్శిగా ఉండి ఆ కేంద్రాన్ని అభివృద్ధి పరచారు. ఆ తర్వాత 1962 నుంచి 67 వరకు కలకత్తా లోని రామకృష్ణ మిషన్ సాంస్కృతిక అధ్యయనం కేంద్రం కార్యదర్శిగా వెళ్ళారు. 1973లో హైదరాబాద్ శాఖకు అధ్యక్షుడయ్యాడు, అక్కడ అతను వివేకానంద వాణి స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, దేవాలయం, గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాడు. 1998లో అధ్యక్షులుగా కలకత్తాలోని బేలూరు మఠానికి వెళ్ళారు. ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం (1986), గాంధీ శాంతి పురస్కారం (1999) పొందారు. స్వామీజీ ఆంగ్ల భాషలో ప్రతిభావంతుడు. వేదాంతానికి-విజ్ఞానానికి మధ్య గల సంబంధాన్ని ఇరాన్, ఇరాక్, సింగపూర్, ఐరోపా, అమెరికా, ఇతర దేశాలలో తన ఉపన్యాసాలలో పేర్కొనేవారు.

స్వామి రంగనాథానంద గొప్ప పండితుడు, గురువుగా పరిగణించబడ్డాడు. ఆయన 50కి పైగా పుస్తకాలు రచించారు. భారతీయ విద్యాభవన్ దాదాపు ఇరవై తొమ్మిది ఈ పుస్తకాలను ప్రచురించింది. అతని ప్రసిద్ధ పుస్తకంలో మారుతున్న సమాజానికి శాశ్వతమైన విలువలు, భగవద్గీత, ఉపనిషత్తుల సందేశాలపై వ్యాఖ్యానాలు ఉన్నాయి. మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. అతని వారపు తరగతులు, బహిరంగ ఉపన్యాసాలు అనుచరులలో ప్రసిద్ధి చెందాయి. ది హిందూ ప్రతినిధి అయిన గణపతి ఇలా వ్రాశాడు, "స్వామి రంగనాథానంద తన అన్ని ఉపన్యాసాలలో, సార్వత్రిక అంగీకారాన్ని బోధించే ఆచరణాత్మక వేదాంతమైన శాశ్వత మతం యొక్క తత్వశాస్త్రంపై నొక్కిచెప్పారు". బెంగళూరు, మైసూర్ జైళ్లలో ఖైదీలకు నైతిక, మతపరమైన తరగతులు నిర్వహించాడు. ఢిల్లీలో, రంగనాథానంద ఆసుపత్రులలో సామాజిక సేవలను నిర్వహించి, కుష్టు వ్యాధిగ్రస్తుల సహాయానికి కృషి చేశారు. పూర్వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్వామి రంగనాథానంద, వివేకానందను "ఆధునిక ఆలోచన , శాస్త్రీయ దృక్పథం కలిగిన నాయకులు" ("Leaders with a modern mind and scientific temper.") గా అభివర్ణించారు.[1]

స్వామి రంగనాథానంద పశ్చిమ బెంగాల్‌లోని బేలూరులోని రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయంలో తన జీవితపు చివరి రోజులను గడిపారు. అతను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ మెడికల్ సెంటర్‌లో కార్డియాక్ అరెస్ట్ కారణంగా 2005 ఏప్రిల్ 25, సోమవారం సాయంత్రం 3:51 గంటలకు మరణించాడు. మరణించే నాటికి ఆయన వయసు 96. అతని మృతదేహాన్ని ఆ రోజు బేలూర్ మఠంలో (కోల్‌కతాకు సమీపంలో) దర్శనం కోసం ఉంచారు, మరుసటి రోజు దహనం చేశారు. 2008 డిసెంబరులో కోల్‌కతాలో స్వామి రంగనాథానంద 100వ జయంతిని పురస్కరించుకుని రూ.5 విలువ గల పోస్టల్ స్టాంపును ఇండియా పోస్ట్ విడుదల చేసింది.

మూలాలు

[మార్చు]
  1. "Liberal view of the outside world is vital: Manmohan". The Hindu. 4 March 2007. Archived from the original on 4 November 2012. Retrieved 22 May 2009.
  • ఆచార్య మ.శివరామకృష్ణ ఆంధ్రజ్యోతి 14.12.2008 లో రాసిన వ్యాససారం.
  • బేలూర్ మఠం ప్రచురించిన స్వామికి సంబంధించిన వ్యాససారం.

బయటి లింకులు

[మార్చు]
ఉపన్యాసాలు