హామ్ రేడియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హామ్ రేడియో తయారు చేసుకుంటున్న వారి ఊహా చిత్రం
ఔత్సాహిక హామ్ తయారు చేసుకున్న హామ్ రేడియో
అంతర్జాతీయ హామ్ రేడియో చిహ్నం. ఈ చిహ్నంలోని వజ్రాకారపు ఆకృతిలో ఉన్నది ఎలక్ట్రానిక్ సర్క్యూట్
అత్యంత ఆధునికమయిన రేడియో చిత్రం

హామ్ రేడియో ఒక అభిరుచి. ఖాళీ సమయాలలో, ఈ వ్యాపకంలో ఆసక్తి ఉన్నవారు, తమకున్న ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని, తమంతట తామే ఒక రేడియో - సందేశాలు పంపగలిగే, స్వీకరించగలిగే రేడియో ట్రాన్సీవరు - తయారు చేసి, తమలాంటి ఇతరులతో ఆ రేడియో ద్వారా సంభాషించటమే ఈ అభిరుచి. ఈ అభిరుచి ప్రారంభ కాలంలో, స్వయంగా సెట్ తయారు చేసుకోగలిగేవారు మాత్రమే ఈ అభిరుచి చూపగలిగేవారు. కాలక్రమేణా తమంతట తాము సెట్ తయారు చేసుకోలేక పోయినప్పటికీ ఆసక్తి ఉన్నవారు కూడా ఇతరులు తయారు చేసిన సెట్లు లేదా మార్కెట్‌లో కొనుక్కొని ఈ అభిరుచిని కొనసాగించటం మొదలు పెట్టారు. వాస్తవానికి ఇప్పుడు ఈ అభిరుచిలో ఉన్నవారిలో ఎక్కువమంది (60%-70% వరకు) సెట్లు తమంతట తాము తయారు చేసుకోలేనివారే. కాని, ఏరియల్ కట్టుబాటు, వాతావరణ పరిస్థితిని బట్టి రేడియోను వాడటంలో ప్రయోగాలు చేస్తుంటారు.

హామ్ చరిత్ర[మార్చు]

హామ్ (H A M) అనే పదం ఎలా వచ్చిందో, దాని అర్ధమేమిటో అన్న విషయం మీద చాలా రకాల వివరణలు ఉన్నాయి గానీ, ఇదమిత్థంగా దీని అర్థం ఇది, ఈ పేరు ఇలా వచ్చింది అని స్పష్టంగా ఎక్కడా లేదు. HOME AMATEUR MECHANICలో ప్రతి పదం మొదటి అక్షరం అంటే HAM అని ఒక వివరణ. అలాగే సుప్రసిద్ద రేడియో సాంకేతిక నిపుణులు, శాస్త్రజ్ఞులు అయిన HERTZ, ARMSTRONG (చంద్రుడిమీద దిగిన ఆయన కాదు), MARCONIల పేర్లలోంచి ప్రతి పేరులోనూ మొదటి అక్షరం తీసుకొని వారి మీద గౌరవంతో HAM అని వచ్చిందని మరొక వాదన. ఏది ఏమయినా, ఈ హాబీ రేడీయో తయారు చేయటం, తమంతట తామే తయారు చేసుకునే వారిని, అందులో తమవంటి వారితో సంభాషించేవారిని ఇప్పుడు "హామ్" అని పిలుచుకోవటం పరిపాటయింది.

హామ్ రేడీయోలో ఏమి మాట్లాడుకొంటారు[మార్చు]

ముందు హామ్ రేడియోలో ఏమి మాట్లాడకూడదో తెలుసుకుందాము 1) రాజకీయాలు; 2) మత సంబంధ విషయాలు; 3) డబ్బుల గురించి, 4) వ్యాపార సంబంధమయిన విషయాలు 5) అసభ్య విషయాల గురించి మాట్లాడటం పూర్తిగా నిషేధించారు.

హామ్‌లు తమ రేడియో తయారి గురించి, తాము ఎలా తయారు చేసుకున్నారో, ఎటువంటి ఏరియల్ వాడుతున్నారో, వారున్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నయో అన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటారు. వారు ఒకరి సాంకేతిక అనుభవాలు ఒకరితో పంచుకుంటూ తమ తమ రేడీయోల శక్తిని, పటిమను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తారు

హామ్ రేడియోలో రకాలు[మార్చు]

స్థూలంగా, హామ్ రేడియో వాడే ఫ్రీక్వెన్సీ ప్రకారం రెండు రకాలు. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ( HIGH FREQUENCY{HF}], అతి ఎక్కువ ఫ్రీక్వెన్సీ (VERY HIGH FREQUENCY (VHF) HF సుదూర ప్రాంతాలతో మాట్లాడేందుకు వాడతారు. VHF స్థానికంగా 20-30 కిలోమీటర్ల పరిధిలో మాట్లాడుకోవటానికి వాడతారు.

హామ్ లైసెన్సు (అనుమతి పత్రం)[మార్చు]

హామ్ లైసెన్సు

ఈ హాబీ ప్రభుత్వ అనుమతి లేకుడా మాత్రం కొనసాగించటం కుదరదు. రేడియోలో సంభాషించటానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వంలోని కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ (MINISTRY OF COMMUNICATIONS) వారు పరీక్ష నిర్వహించి, అందులో ఉతీర్ణులైన వారికి, పోలీసు వారి దర్యాప్తు తరువాత ఒక లైసెన్సు ఇస్తారు. ఆ లైసెన్సు ఒక నిర్ణీత గడువుకు ఇస్తారు. ఎప్పటికప్పుడు, గడువుకు ముందుగానే పునరుద్ధరించుకోవాలి.

హామ్ లైసెన్సుకొరకు పరీక్ష[మార్చు]

పైన చెప్పిన విధంగా కమ్యూనికేషన్స్ మినిస్ట్రీ వారు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలోని విషయాలు 1) మోర్స్ కోడ్ నుపయోగించి సందేశములు పంపుట-స్వీకరించుట, 2) మౌలిక ఎలక్ట్రానిక్స్ 3) అంతర్జాతీయ రేడియో నిబంధనలు. ఇంకా వివరాలు ఈ లింక్‌లో దొరుకుతాయి [1] ఈ పరీక్ష గ్రేడ్-1, గ్రేడ్-2కు వ్రాయవచ్చు. గ్రేడ్-2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించితే రేడియోలో మోర్స్ కోడ్‌లో మాత్రమే సందేశాలు పంపుట/స్వీకరించుట చేయవచ్చు. మాటాలాడటం కుదరదు. గ్రేడ్-1లో ఉత్తీర్ణత సాధించితే రేడియోలో మాట్లాడటం కూడా (మోర్స్ కోడ్ సందేశాలతోపాటు) చేయవచ్చు.

సంకేత నామము (CALL SIGN)[మార్చు]

హామ్ లైసెన్సులో ఆ హామ్‌కు ఇవ్వబడ్డ ప్రత్యేక సంకేత నామము ఉంటుది. ఈ సంకేత నామము ఇంకెవరికి ఇవ్వరు. హామ్ రేడియోలో సభాషించునపుడు, ఈ సంకేతనామము, తమను ఇతరులు గుర్తించుట కొరకు, తరచూ చెప్తూ ఉండాలి. ప్రపంచములోని అన్ని దేశాలూ కూడా ఒక ఒప్పందమునకు వచ్చి, దేశములన్నిటికి కూడా ఒక నిర్దిష్ట సంకేత నామమును ఇచ్చుకొన్నారు. కాబట్టి, ఒక హామ్ రేడియో ఆపరేటరుకు వచ్చు సంకేత నామములో మొదటి అక్షరములు అతను ఏ దేశానికి చెందినవాడో తెలియ చేస్తాయి. మిగిలిన అక్షరములు అతని పేరును తెలియ చేస్తాయి. భారతదేశానికి VU2, VU3 కెనడాకు VE3, అమెరికాకు W0, W1, W2 కేటాయించారు. ఉదాహరణకు భారతదేశ హామ్‌కు సంకేతనామము ఈ విధముగా ఉంటుంది- VU2RM లేక VU3KTB. ఇందులో VU2 లేక VU3 సంకేతములు ఆ హామ్ భారతదేశానికి చెందినవాడని తెలియచేయును. అలాగే, తరువాత ఉన్న RM లేక KTB సంకేతములు ఆ హామ్ యొక్క పేరును తెలియచేయును. ఒక హామ్ మరొక హామ్‌తో మాట్లాడుతున్నపుడు, ఆవతలి వారు చెప్పిన సంకేత నామము తమకు తెలియనపుడు, ఒకరికొకరు పరిచయము చేసుకుంటారు. ఆ పరిచయ ప్రకారం వివరాలు సరైనవే అని తెలుసుకోవటం కోసం ఆ సంకేత నామమును వెతుకుటకు ఏ దేశానికి ఆ దేశానికి లేదా ప్రపంచం మొత్తానికి జాబితాలు ఉన్నాయి. అందులో సంకేత నామము, ఆ సంకేత నామము ఎవరిది, వారి చిరునామాతో అన్ని వివరములు ఉంటాయి. ఎవరయినా హామ్ యొక్క చిరునామా మారినట్లయితే, వెంటనే వారు ప్రభుత్వమునకు తెలియ చేసి కొత్త చిరునామా తమ లైసెన్సునందు వ్రాయించు కొనవలెను. ఈ విషయం మీద ఇంకా వివరాలు ఈ లింక్‌లో దొరుకుతాయి [2].

తనిఖీ[మార్చు]

ప్రభుత్వానికి చెందిన తనిఖీ అధికారులు, అప్పుడప్పుడు హామ్ రేడీయో ఔత్సాహికుల రేడీయో గదులను (RADIO SHACK అని అంటారు) తనిఖీ చేసి వారు నిబంధనల ప్రకారం అభిరుచిని కొనసాగిస్తున్నారా లేదా అన్నవిషయం గమనిస్తుంటారు. నిబంధనల ప్రకారం లేకపోతే తగిన చర్యలు తీసుకుంటారు.

లాగ్ పుస్తకం-క్యూ ఎస్ ఎల్ కార్డ్(QSL CARD)[మార్చు]

NXIZKఅనే సంకేతనామము కలిగిన హామ్ యోక్క QSL CARD

హామ్‌లు తమ సంభాషణ వివరాలను (ఏ హామ్‌తో, ఏరోజున, ఏ ఫ్రీక్వెన్సీలో ఎంతసేపు మాట్లాడారు) ఒక పుస్తకంలో తప్పనిసరిగా పొందుపరచాలి. దీనినే, "లాగ్ బుక్(LOG BOOK)" అని అంటారు. అల్లాగే, హామ్ మరొక హామ్‌తో మొదటిసారి మాట్లాడినప్పుడు, ఆ సంభాషణకు గుర్తుగా, ఒక కార్డ్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కార్డ్‌ను "క్యూ.ఎస్.ఎల్" (QSL) కార్డ్ అని అంటారు. ఈ కార్డ్‌లో లాగ్ బుక్ ప్రకారం వివరాలు పొందుపరచాలి. ఈ విధంగా పంపుకునే కార్డ్‌కు కూడా అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రమాణాలను అనుసరించి కార్డ్ కొలతలు 89 mm by 140 mm ఉండాలి. ఈ విధమైన క్యూ.ఎస్.ఎల్. (QSL) కార్డ్‌లను పోగుచేయుట కూడా ఈ అభిరుచిలో భాగమే. ఇతర వివరాలకు ఆంగ్ల వికీపీడియాలోని పేజి చూడవచ్చు[3].

మోర్స్ కోడ్[మార్చు]

మోర్స్ కోడ్‌లో అక్షరాలు, అంకెలు ఈవిధంగా ఉంటాయి
మోర్స్ కోడ్ ను పంపే పరికరం

ఈ కోడ్‌లోనే మొట్టమొదటి రేడియో ప్రసారం జరిగింది. రేడియో విజ్ఞానం బాగా అభివృద్ధి జరగని పూర్వపు రోజులలో, రేడియోలో మాట్లాటం కంటే, కొన్ని శబ్దాలను ప్రసారం చేసి వివరాలను సందేశాలుగా పంపటం సులభంగా ఉండేది. మాట్లాడేటప్పుదు స్పష్టతలేక పోవటం, వాతావరణ పరిస్థితుల వలన మాట సరిగా వినపడక అపార్థాలు ఏర్పడటం నివారించటం కోసం సామ్యూల్ ఎఫ్ బి మోర్స్ ఈ శబ్ద భాషను కనిపేట్టాడు. హామ్‌లు మొదట మోర్స్ కోడ్‌లోనే సందేశాలు పంపుకొనేవారు. ఇందులో అన్ని అక్షరాలు ఒక చుక్క (.) లేదా డాష్ (-) వాటి రకరకాల పొందుపరచటంతో సందేశం పంపుతారు. ఇలా శబ్దాలను పంపటానికి ఒక విద్యుత్ పరికరం రేడియోకు జతపరుస్తారు. పూర్తి వివరాలు ఆంగ్ల వికీపీడియాలో ఈ లింక్‌లో దొరుకుతాయి [4].

హామ్ కోడ్[మార్చు]

హామ్‌లు మోర్స్ కోడ్లో సంభాషించుకునే రోజులలో, పెద్ద పెద్ద వాక్యాలను సందేశంగా పంపటం కష్టంగా ఉండేది. అందుకని సంభాషణలలో తరచూ దొర్లే ప్రశ్నలను చిన్న చిన్న కోడ్‌లుగా మార్చారు. అవన్నీ కూడా 'క్యూ' అక్షరంతో మొదలవుతాయి, మూడు అక్షరాలు మాత్రమే ఉంటాయి, కాబట్టి వాటిని సందేశంగా పంపటం తేలిక. వీటిని 'క్యూ కూడ్స్' (Q-CODES ) అని పిలుస్తారు. ఉదాహరణకు, QRL అంటే "ఈ ప్రీక్వెన్సీ బిజీ" అని, లేదా నేను బిజీ" అని, QSY అంటే "వెరే ప్రీక్వెన్సీకి వెల్తున్నట్టు". పూర్తి వివరాలు ఆంగ్ల వికీ పీడియాలో [5] ఉన్నాయి.

హామ్ ఫ్రీక్వెన్సీలు[మార్చు]

హామ్‌లు కొత్త రోజులలో అంటే, రేడియో కనిపెట్టిన మొదటి రోజులలో ఎక్కడపడితే అక్కడ ఒక పద్ధతి లేకుండా అందరూ మాట్లాడుకునేవారు లేదా మోర్స్ సందేశాలు పంపుకొనేవారు. చివరకు, పరిస్థితి గందరగోళంగా మారటంతో, ప్రభుత్వాలు కలగచేసుకొని, ఎవరు (ఓడలు, పోస్టాఫీసు, హామ్‌లు మొదలగు వారు) ఏ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకోవాలో నిర్ణయించారు. ఇది కూడా పరిస్థితిని అదుపు చెయ్యలేక పోయింది. ఎందుకంటే, పక్క పక్క దేశాలు ఒకే ఫ్రీక్వెన్సీని రెండు వేరు వేరు వర్గాల వారికి ఇచ్చేవారు. ఈ పరిస్థితిని అధిగమించటానికి, ప్రపంచ దేశాలన్నీ ఒక వేదిక మీదకు ఒచ్చి, రేడియో ఫ్రీక్వెన్సీలను పంచుకునే విధానాన్ని అమలు పరిచాయి. ప్రస్తుతం ఈ పని అంతర్జాతీయ టేలి కమ్యూనికేషన్స్ యూనియన్ (ITU) అనే స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నది[6]. ప్రతి దేశం వారి వారి దేశాలలో మోనిటరింగ్ స్టేషన్లను ఏర్పరిచి, అక్కడ నియోగించబడ్డ సిబ్బంది ద్వారా, వైర్లెస్ ద్వారా జరిగే సంభాషణలను, ఇతర ప్రక్రియలను (హామ్‌ల సంభాషణలతో సహా) నిరంతరం 24 గంటలు అన్ని రేడీయో ఫ్రీక్వెన్సీలలోనూ వింటూ ఉంటాయి. ఎవరయినా నిబంధనలను అతిక్రమించినట్లయితే, తగిన చర్యలు (అవసరమయిన చోట్ల పోలీసులకు తెలియ చెయ్యటంతో సహా) తీసుకుంటారు. 10 Kc/s and 3000000 Mc/s వరకు రేడీయో ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. అందులో హామ్‌లకు ఈ క్రింది విధంగా వివిధ ఫ్రీక్వెన్సీలను ఇచ్చారు. హామ్‌లు ప్రస్తుతం ఈ ఫ్రీక్వెన్సీలను మాత్రమే వాడుకోవాలి.

హామ్ రేడియో స్టేషన్లకు కేటాయించిన ఫ్రీక్వెన్సీలు
పౌనపున్యం (ఫ్రీక్వెన్సీ) తరంగధైర్ఘ్యం (వేవ్‌లెన్త్) వాడుక
1800-2000 కి.హె 160 మీ రేడియో రీజన్ 2‍&3
1810-1850 కి.హె రేడియో రీజన్ 1
3500-3800 కి.హె 80 మీ In Region 2 to 4000 కి.హె
7000-7100 కి.హె 40 మీ In Region 2 to 7300 కి.హె
10100-10150 కి.హె 30 మీ on secondary shared basis
14000-14350 కి.హె 20 మీ అత్యంత ప్రాచ్యుర్యం పొందిన షార్ట్ వేవ్ హామ్ బ్యాండ్
50 మెగా.హె 6 మీ very high frequency (for short distance line of sight contact)
144-146 మెగా.హె 2 మీ very high frequency (for short distance line of sight contact)
434-438 మెగా.హె ultra high frequency
1260-1300 మెగా.హె for earth to space communication
3300-3400 మెగా.హె for ham satellite communication
5725-5840 మెగా.హె for ham satellite communication

తెలుగు వారిలో హామ్ లు[మార్చు]

ఔత్సాహిక హామ్ శ్రీ రామ మోహనరావు, కాకినాడ, రెటైర్డ్ వైర్లెస్ అఫీసరు కాకినాడ పోర్ట్

తెలుగు వారిలో హామ్‌లు చాలామంది ఉన్నారు. ఎక్కువగా, హైదరాబాదు, విశాఖపట్టణం, విజయవాడ లాంటి పట్టణాలలోనే కాకుండా, తెనాలి, కాకినాడ వంటి చిన్న ఊళ్ళలలో కూడా ఉన్నారు. తెలుగు వారిలో చాలా మంది, తమ సొంత సెట్లు తయారు చేసుకొని బాండు (హామ్ పరిభాషలో ఈ హాబీలోకి వచ్చి ఇతరులతో సంభాషణ మొదలుపెట్టటం) లోకి వచ్చినవారే. సొంతంగా సెట్ తయారు చేసుకునేవారి సౌలభ్యంకోసం, RM96 అని ఒక సర్క్యూట్ బోర్డ్ VU2 NJS (శ్రీ సోక్రటీసు-ప్రస్తుతం వీరు కెనడాలో నివాసం), VU2 RM (శ్రీ రామమోహనరావు, కాకినాడ-బొమ్మలోని వారు) ఎంతగానో కృషి జరిపి 1996లో రూపొందించారు. ఈ బోర్డ్ వాడి అనేకమంది తమ తమ సెట్లు సొంతంగా చేసుకొని ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచేకాకుండా, యావత్ దక్షిణ భారతదేశంనుంచి ఔత్సాహిక హామ్‌లు బాండ్ మీదకు వచ్చారు.

జనజీవనంలో హామ్ హాబీ[మార్చు]

ప్రకృతి వైపరీత్యాలు- తుఫాన్లు, భూకంపాలు మొదలగునవి- సంభవించినప్పుడు, సాధారణ సమాచార సాధనాలు (ఫోన్లు, సెల్ ఫోన్లు) పనిచేయని పరిస్థితులలో హామ్ రేడియో ద్వారా సమాచారం ఒక చోట నుండి మరొకచోటికి పంపటం తేలిక. ఎందుకంటే, హామ్ రేడీయోకి ఒక ఏరియల్, ఒక చిన్న బ్యాటరీ ఉంటేచాలు. గుజరాత్ భూకంపం, ఆంధ్ర, ఒరిస్సాలలో తుఫానులు వచ్చినపుడు ఉత్సాహవంతులైన హామ్‌లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సహాయ కార్యక్రమాలలో ఎంతగానో సహకరించారు. ఇలా అందరు హామ్‌లు రాలేరు కాబట్టి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోస్తా జిల్లా కేద్రాలలో "హామ్ క్లబ్ స్టేషను" లను ఏర్పరిచి కొంతమంది హామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చి ప్రొత్సహిస్తున్నది. వారికి జిల్లా కలెక్టరు కార్యాలయంలో కాని, ఆ దగ్గరలో కాని కొంత చోటూ కూడా ఇచ్చి (ఇతర సమయాలలో హామ్ రేడీయో హాబీ గురించి నలుగురికీ తెలియ చెయ్యటానికి, ఆసక్తిగల వారికి హామ్ లైసెన్సు పరీక్షకు తరిఫీదు ఇవ్వటానికి) ప్రోత్సహిస్తున్నది.

ఇంటర్ నెట్‌లో హామ్ రేడియో[మార్చు]

లైసెన్సు కలిగి ఉన్న హామ్‌లు, తమ వద్ద హామ్ సెట్ లేకపోయినా ఇంటర్నెట్ ద్వారా ఇతర హామ్‌లతో సంభాషించవచ్చు. CQ-100, [7] ECHO-LINK [8] వంటి వెబ్ సైట్ల ద్వారా ఇది సాధ్య పడుతుంది. ఇందులో CQ-100 లో నిజానికి వైర్ లెస్ ప్రసారం ఏమీ ఉండదు, సంభాషణలు అన్నీ ఇంటర్ నేట్ ద్వారా మాత్రమే ప్రసారమవుతాయు. అంటే, మామూలు హామ్ సెట్ గల వారితో సంభాషణ కుదరదన్న మాట. మరో పక్క ECHO-LINK ద్వారా అయితే సంభాషణలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రిపీటర్ల ద్వారా ప్రసారం జరుగుతాయి. మామూలు హామ్ సెట్లు గలవారు కూడా వారి సెట్లకు కొద్దిపాటి మార్పులు చేసుకొని ECHO-LINK ద్వారా ఇంటర్ నెట్‌లో ఉన్న హామ్‌లతో సంభాషించవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలతో, కొత్త కొత్త సమాచార పరికరాలు వస్తునాయి. దీని మూలంగా రోజు రోజుకీ రేడియో ఫ్రీక్వెన్సీలకు గిరాకీ పెరిగిపోతున్నది. ప్రస్తుతం హామ్ ఫ్రీక్వెన్సీలను వారికి ఉచితంగా ఇచ్చి ఉన్నారు. వీటి మీద ఎవరికీ ఆదాయం వచ్చే అవకాశం లేదు. అందువల్ల, ప్రస్తుత వ్యాపార ధోరణుల దృష్ట్యా, సమీప భవిష్యత్తులో, హామ్ రేడీయో ప్రీక్వెన్సీలను వ్యాపారపరంగా పంపకం జరిగిపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకొన్ని సంవత్సరాల తరువాత చూస్తే, హామ్ రేడియో, ఇంటర్ నెట్లో మాత్రమే ఉంటుంది అని తెలిసినా, ఆశ్చర్యపడకుండా ఉండటానికి మనం సిద్ధమవ్వాలేమో!!

ఇవికూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]