Jump to content

అద్దూరు బలరామిరెడ్డి

వికీపీడియా నుండి

అద్దూరు బలరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి. బలరామిరెడ్డి 1964 నుండి 1965 వరకు కాసు బ్రహ్మానందరెడ్డి మొదటి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేశాడు. బలరామిరెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. ఈయన 1952, 1962, 1972లలో ఈ నియోజకవర్గం నుండి గెలిచాడు. 1955లో పోటీచేయలేదు. 1967లో స్వతంత్ర అభ్యర్ధి, బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి చేతిలో ఓడిపోయాడు.

బలరామిరెడ్డి, 1914, జూలై 19న చిత్తూరు జిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి మునుస్వామి రెడ్డి. బలరామిరెడ్డి సతీమణి రత్నమ్మ. ఈ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. ఈయన బి.ఎస్సీ డిగ్రీతో పట్టభద్రుడైనాడు.[1]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం, మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952 లో మొదటిసారిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బలరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధిగా పోటీ చేసి, కృషికార్ లోక్ పార్టీకి చెందిన టి. వెంకటసుబ్బారావుపై గెలుపొందాడు.[2] 1952 నుండి 1953 వరకు మద్రాసు రాష్ట్ర శాసనసభలో సభ్యుడిగా ఉన్నాడు.[1] 1953లో మద్రాసు నుండి విడివడి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు, టంగుటూరు ప్రకాశం పంతులును ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అయితే, సంజీవరెడ్ది అప్పటికే శాసనసభ్యుడు కాదు. 1952లో మద్రాసు రాష్ట్రంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి ఓడిపోయాడు. సంజీవరెడ్డి మార్గం సుగమం చేసేందుకు, అద్దూరి బలరామిరెడ్డి తన శ్రీకాళహస్తి శాసనసభ సీటుకు రాజీనామా చేశాడు. తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలలో నీలం సంజీవరెడ్డి శ్రీకాళహస్తి నుండి గెలుపొంది, ఆంధ్రరాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.[3] ఈ విధంగా నీలం సంజీవరెడ్డి ఎన్నికలో బలరామిరెడ్డి కీలకపాత్ర వహించాడు.

ఆ తరువాత అద్దూరు బలరామిరెడ్డి 1953లో రాజ్యసభ సభకు ఎన్నికై, 1953, నవంబరు 30 నుండి 1956, ఏప్రిల్ 2 వరకు. మరలా 1956, ఏప్రిల్ 3 నుండి 1962, మార్చి 9 వరకు రాజ్యసభ సభ్యుడిగా రెండు పర్యాయాలు రాజ్యసభ్యుడిగా ఉన్నాడు.[1][4]

1962లో రాష్ట్రానికి తిరిగివచ్చి, శాసనసభ ఎన్నికల్లో శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం పోటీచేసి, అవిభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టాడు.

అద్దూరు బలరామిరెడ్డి, 1973, ఫిబ్రవరి 19న మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019 (PDF). NEW DELHI: RAJYA SABHA SECRETARIAT. p. 410. Retrieved 5 August 2024.
  2. indianelections.in (2024-02-12). "Srikalahasti, Andhra Pradesh: Read & Vote for Favorite political party. -" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-06-19.
  3. డి., సుందరరామ్. "దేశ రాష్ట్ర చిత్రపటంలో చిత్తూరు జిల్లా ప్రాముఖ్యత విశ్లేశణ" (PDF).
  4. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 345.