Jump to content

ఇప్పగూడెం

అక్షాంశ రేఖాంశాలు: 18°14′28″N 80°38′40″E / 18.24117°N 80.64432°E / 18.24117; 80.64432
వికీపీడియా నుండి

ఇప్పగూడెం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలానికి చెందిన గ్రామం.[1]

ఇప్పగూడెం
—  రెవెన్యూ గ్రామం  —
ఇప్పగూడెం is located in తెలంగాణ
ఇప్పగూడెం
ఇప్పగూడెం
అక్షాంశరేఖాంశాలు: 18°14′28″N 80°38′40″E / 18.24117°N 80.64432°E / 18.24117; 80.64432
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జనగామ
మండలం స్టేషన్‌ ఘన్‌పూర్‌
ప్రభుత్వం
 - సర్పంచి మంతెన అజయ్ రెడ్డి
 - ఎంపిటిసి గండి విజయలక్ష్మి
జనాభా (2011)
 - పురుషుల సంఖ్య 4,059
 - స్త్రీల సంఖ్య 4,136
 - గృహాల సంఖ్య 2,129
పిన్ కోడ్ 506252
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన స్టేషన్ ఘన్పూర్ నుండి 11 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన జనగామ నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2129 ఇళ్లతో, 8195 జనాభాతో 3055 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4059, ఆడవారి సంఖ్య 4136. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1480 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 29. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 577707[3].పిన్ కోడ్: 506252.

గ్రామం పేరు వెనుక చరిత్ర

[మార్చు]

కాకతీయుల కాలంలో ఈ గ్రామం ప్రముఖ శైవ క్షేత్రంగా విలసిల్లింది. పూర్వం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగుల చెరువు సమీపంలో ఇప్పగూడెం పేరుతో గ్రామం ఉండేదని చరిత్రకారులు అంటుంటారు. అక్కడే ఉన్న శ్రీ నాగులమ్మ దేవాలయంలో శివుడిని, నాగ దేవతలను ఆరాధిస్తూ స్థానికులు ఆరాధించే వారని గ్రామస్థులు చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఇప్ప చెట్లతో, దట్టమైన పొదలతో నిండి ఉన్న ఆ అటవీ ప్రాంతంలో క్రూర మృగాలు సంచరిస్తుండేవి. క్రమేణా వాటి బెడద ఎక్కువ కావడంతో అక్కడి ప్రజలు ప్రస్తుతం ఉన్న గ్రామానికి వచ్చారని స్థానికులు అంటుంటారు. గ్రామానికి దాదాపు నాలుగువందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు చరిత్రకారులు చెబుతారు. కాకతీయుల కాలంలో ప్రజలు ప్రధానంగా వీరశైవాన్ని ఆచరించేవారు .అందుకు నిదర్శనంగా నాగుల చెరువు పరిసర ప్రాంతంలో పదుల సంఖ్యలో శివలింగాలు కనిపిస్తాయి. అనంతరం పాలకుల్లో వచ్చిన మార్పులు మతంలోనూ కనిపించాయి. అలా మతంలో వచ్చిన మార్పులు అంటే మత మార్పిడి చేసుకున్న వారిని వెలివేయడం, మత మార్పిడి చేసుకోని వారిపై పాలకులు దాడి చేయడం చేసేవారని చరిత్ర గ్రంథాలు పేర్కొంటున్నాయి.[ఆధారం చూపాలి] వెలివేయబడ్డవారు ప్రస్తుత గ్రామానికి వచ్చినట్టు ఆధారాలున్నాయి. ఈ మార్పుల వల్లే గ్రామం అక్కడి నుండి మారిందనేది మరో వాదన.[ఆధారం చూపాలి] మతంలోని శాఖలలోవచ్చిన ఘర్షణల వల్ల శైవ మతం స్థానంలోలో వెష్ణవం వచ్చింది. దానికి నిదర్శనం పాత గ్రామం ఉన్నదని చెబుతున్న నాగుల చెరువు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో శివలింగాలు ఉన్నాయి. కొత్త గ్రామం అంటే ప్రస్తుత ఊరిలో వేణుగోపాల స్వామి గుడి ఉండటం మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీనికి ఆధారం (ఆంధ్రుల సాంఘిక చరిత్ర.. సురవరం ప్రతాపరెడ్డి) ఈ గ్రామానికి పురాతన చరిత్ర ఉందని చెప్పవచ్చు. కాకతీయుల కంటే ఈ గ్రామం ముందుదే అనడానికీ చారిత్రక ఆధారాలున్నాయి. పాత గ్రామం పరిసర ప్రాంతాల్లో జైనుల మూలాలు కూడా ఉన్నాయి. జైనుల దేవుళ్ల విగ్రహాలు కూడా ఇక్కడ ఉండటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నాగుల చెరువు వద్ద కాలి బాటలో లభించిన శ్వేత వర్ణ దిగంబర విగ్రహాలు దీనికి బలమైన ఆధారాలుగా ఉన్నాయి. ప్రసిద్ధి గాంచిన బమ్మెర గ్రామం ఈ గ్రామానికి సమీపంలోనే ఉండటం ఇక్కడ నాగరికత విలసిల్లిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. బమ్మెర గ్రామంలో లభించిన పురాతన శాసనాల్లో కూడా ఇప్పగూడెం గ్రామాన్ని పేర్కొనడం విశేషం. కాకతీయుల కాలంలో ఈ గ్రామ పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల నిర్మాణ శైలి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 18 చెరువుల లింక్ ఉన్న గొలుసు కట్టు చెరువులలో మొదటిది నాగుల చెరువు ఇక్కడే ఉంది.. ఈ చెరువుకు లింక్ గా గూడురు, బమ్మెర, పాలకుర్తి, మల్లంపల్లి తదితర 18 చెరువులున్నాయి. నాగరికత విలసిల్లిన ప్రాంతంగా ఇప్పగూడెం గ్రామాన్ని పేర్కొన వచ్చు.[ఆధారం చూపాలి]

సమీప గ్రామాలు

[మార్చు]

ఇప్పగూడెం సమీప గ్రామాలు:తూర్పున సముద్రాల, పడమర కుర్చపల్లి, కంచనపల్లి, అక్కపల్లి గూడెం, దక్షిణాన కోమటి గూడెం, రంగరాయిగూడెం, కోతులాబాద్, ఈరవెన్ను, ఉత్తరాన విశ్వనాథపురం, తానేదార్ పల్లి గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఎనభై ఐదేళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. గతంలో గ్రామం చుట్టుపక్కల ఉన్న కుర్చపల్లి, అక్కపల్లిగూడెం, రంగరాయి గూడెం, కోమటిగూడెం, తానేదార్ పల్లి, సముద్రాల, కోతులాబాద్, ఈరవెన్ను గ్రామాల నుండి విద్యార్థులు చదువుకోవడానికి ఈ పాఠశాలే పెద్ద దిక్కుగా ఉండేది. విశాలమైన పాఠశాల ప్రాంగణం ఉంది. ఈ స్కూల్ నుండి అనేక మంది పేరొందిన అధికారులు, ఇంజనీర్లు, సాప్ట్ వేర్ ఇంజనీర్లు, రాజకీయ నాయకులు తయారయ్యారు. గ్రామంలోని యువకులు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. విద్యార్థులకు ఇదే ప్రధాన వనరుగా ఉంది. గ్రామంలో రెండు ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ బడికే వస్తున్నప్పటికీ మండల కేంద్రంలోని ప్రయివేటు పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం పాలకుర్తి ప్రధాన రహదారిపై ఘనపురం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . బస్సులు, ఆటోలు ప్రధాన రవాణా వనరులు. గ్రామంలో సిసి రోడ్లు ఉన్నాయి.

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

ఇప్పగూడెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆరోగ్య కేంద్రానికి ప్రముఖ కమ్యూనిస్టు నేత మంతెన నారాయణ రెడ్డి కుటుంబానికి చెందిన దాదాపు 20 గుంటల స్థలాన్ని వారి కుమారులు అజయ్ రెడ్డి, శివాజీరెడ్డి (శివన్న) లు ఉచితంగా ఇచ్చారు. ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ ఆర్.ఎం.పీలదే రాజ్యంగా నడుస్తుంది. పిహెచ్.సిలో వైద్యుల కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మంచినీటి వసతి

[మార్చు]

ఇప్పగూడెం గ్రామంలో రక్షిత మంచినీటికి తీవ్ర ఇబ్బంది ఉంది. ఊరు చుట్టూ కుంటలే ఉన్నప్పటికీ మంచినీరు మాత్రం దొరకదు. దొరికేదంతా ఫ్లోరైడ్ నీరే. దీన్ని ఆసరా చేసుకుని గ్రామంలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. వారి వ్యాపారం మూడు బిందెలు ఆరు క్యానులుగా విలసిల్లుతోంది. ఎంతగా అంటే మంచినీరు అమ్మిన వారు మేడలు మిద్దెలు కట్టేంత రేంజ్ లో వారి వ్యాపారం ఉంది...

రోడ్దు వసతి

[మార్చు]

స్టేషన్ ఘనఫురం పాలకుర్తి ప్రధాన రహదారిపై ఘనపురం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈగ్రామం. గ్రామంలో సిసి రోడ్లు ఉన్నాయి.

విద్యుద్దీపాలు

[మార్చు]

విద్యుత్ దీపాలు ఉన్నాయి.

తపాలా సౌకర్యం

[మార్చు]

ఈ గ్రామంలో సబ్ పోస్టాపీస్ ఉంది. పాలకుర్తి మండలానికి కూడా ఈ పోస్టాఫీసే ప్రధాన కార్యాలయంగా ఉండేది. సుమారు ఆరు దశాబ్దాలు రెండు మండలాలకు సబ్ పోస్టాపీసుగా ఇప్పగూడెం ఎస్ వో కొనసాగింది. ఇటీవలే పాలకుర్తికి ప్రత్యేక పిన్ కోడ్ తో సబ్ పోస్టాపీసు ఏర్పాటు చేశారు.

గ్రామంలో రాజకీయాలు

[మార్చు]

ఇప్పగూడెంలో ప్రధాన రాజకీయ పార్టీలు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) , తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, ఇంకా బిజెపి, టిడిపిలాంటి పార్టీలు కూడా ఉన్నాయి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయం ప్రధాన దేవాలయంగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలో యాదలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి సమేతంగా వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు. ప్రతి ఏటా మేనెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దేవుని తీర్థంగా, దేవుని పెళ్ళిగా గ్రామస్థులు పిలిచే ఈ వేడుక గ్రామస్తులకు ప్రధాన పండగ. పురాతన శివాలయం, అంజనేయ స్వామి గుడి గ్రామంలో ఉన్నాయి. గ్రామ శివారులో నాగుల చెరువు వద్ద నాగులమ్మ గుడి ఉంది. ప్రతి శివరాత్రికి అక్కడ ఉత్సవం నిర్వహిస్తారు. నాగుల చెరువు ప్రాంతంలో కాకతీయుల కాలం నాటి శిల్పాలు శివలింగాలు చూడదగిన ప్రదేశాలు. గ్రామానికి పెట్టని కోటలా ఉన్న గుట్టలను జూలై నుండి జనవరి వరకు ఎంత చూసినా తనివితీరదు. గ్రామం ఈ చివర నుంఢి కోమటి గూడెం వెళ్లే రోడ్డు వరకు దాదాపు 7కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ గుట్టలకు ఏరియాను బట్టి పేర్లున్నాయి. సింగారపు ఏనె, చింతగట్టు, న్యాయమోల్ల గుట్టలు, ఆరెగండి అనే పేర్లతో పిలుస్తారు. ఇక గ్రామ శివారు గ్రామమైన రంగరాయ గూడెం సమీపంలోని రంగనాయకుల బండ కూడా చూడదగిన ప్రాంతమే. ఇక్కడ చోలుల కాలంనాటి రంగనాయకుల స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి సమీపంలోనే ఏకశిలతోే సుమారు 20 అడుగుల ఎత్తైన దీప స్తంభం ఉంది. అయితే గ్రామంలోని పురాతన సంపదపై కన్ను వేసిన గుప్తనిధుల వేటగాల్లు పురాతన శిల్పాలను నాశనం చేస్తున్నారు. అయినా పురాతత్వ శాఖ వారు కానీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు. నాగులమ్మ దేవాలయంలో దాదాపు ఒక ఫీట్ మందం కలిగిన బండను పగలగొట్టి ఆరు అడుగుల గొయ్యి తవ్వి సంపద దోచుకుపోయారు. రంగనాయకుల బండపైన గల దీప స్తంభాన్ని కూడా సగానికి విరగగొట్టి ఆ ముక్కను రెండుగా చీల్చారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ప్రధాన పంటలు వరి, పత్తి, పొగాకు, పప్పుధాన్యాలు, మిరప లాంటి పంటలు ప్రధాన పంటలుగా ఉన్నాయి. గ్రామంలో దాదాపు యాభైకి పైగా చెరువులు కుంటలు ఉన్నప్పటికీ సాగునీటి కొరత తీవ్రంగా ఉంది.. గ్రామానిక ప్రధాన ఆదెరువుగా ఉన్న నాగుల చెరువు ఉంది... దేవాదుల కాలువల చెరువు గర్బం నుండి వెళ్లడంతో చెరువులోకి నీరు రావడం కష్టంగా మారింది. దీన్ని అధిగమించేందుకు గ్రామస్థులు మోటార్లు పెట్టి నీటిని తోడినా సరిపడా నీరు అందడం లేదు.. నాగుల చెరువులోకి నీరు తెచ్చే పనులకు 2017 లో శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు..

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. కల్లుగీత, చేనేత, బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, గొర్రెల మేకల పెంపకం ప్రధాన వృత్తులుగా ఉన్నాయి.

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

ఈ గ్రామం నుండి ప్రముఖులలో సిపిఎం పార్టీ నేత మంతెన నారాయణ రెడ్డి ఒకరు. గ్రామంలో సిపిఎం పార్టీని నిర్మించిన వారిలో ఆయన ముఖ్యుడు. కుందారం గ్రామంలో దొరసాని భూముల పంపకంతో ఆయన సిపిఎం నేతగా ప్రాచుర్యంలోకి వచ్చారు.జనగామ నుండి ఓసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. గ్రామ సర్పంచ్ గా పనిచేశారు సమితి సభ్యునిగానూ పనిచేశారు.సిపిఎం జిల్లా కమిటీ సభ్యునిగా ఉన్న ఆయన అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు.

హన్మకొండ ఎమ్మెల్యేగా పనిచేసిన మందాడి సత్యనారాయణ రెడ్డి ఇప్పగూడెం గ్రామవాస్తవ్యులే. ఆయన జనగామ నుండి బిజెపి తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోెయారు. అనంతరం టిఆర్ఎస్ ఆవిర్భావ సభ్యునిగా ఉన్న ఆయన 2004లో అనూహ్యంగా హన్మకొండ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. గొప్ప వాగ్దాటి గల ఆయన వైఎస్ ఆకర్ష్ లో భాగంగా టిఆర్ఎస్ లో అసమ్మతికి నాయకత్వం వహించారు.

కాకతీయ యూనివర్శిటీలో ప్రొఫెసర్లు గుర్రం దామోదర్, తాటికాయల ఆశీర్వాదం ఇప్పగూడెం గ్రామానికి చెందిన వారే. వీరితో పాటు భౌతిక శాస్త్రం బోధనలో జిల్లాలోనే పేరొందిన కొల్లూరు శ్రీరాములు ఈ గ్రామానికి చెందిన వారే.

‘‘గారడి’’ శ్రీనన్న ప్రజలు పిలుచుకునే ఇంద్రజాలికుడు జూలుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి ఈ గ్రామానికి చెందిన వారే. ఈయన పలు సార్లు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మ్యాజిక్ అవార్డులను అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]