ఎస్. కె. డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్. కె. డే
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
1962 మే – 1967 మే
అంతకు ముందు వారుఎన్. కె. సోమాని
నియోజకవర్గంనాగౌర్
పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
In office
1957 జనవరి 31 – 1962 మార్చి 1
అంతకు ముందు వారుసురీంద్ర కుమార్ డే
వ్యక్తిగత వివరాలు
జననం
సురీంద్ర కుమార్ డే

(1906-09-13)1906 సెప్టెంబరు 13
లక్ష్మీబస్సా గ్రామం, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1989 మే 24(1989-05-24) (వయసు 82)
న్యూఢిల్లీ, భారతదేశం
నైపుణ్యంసోషల్ ఇంజనీర్, రచయిత, శాస్త్రవేత్త

సురేంద్ర కుమార్ డే, (1906 సెప్టెంబర్ 13-1989 మే 24) భారతదేశపు మొదటి కేంద్ర కో-ఆపరేషన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి.[1] స్వతంత్ర భారతదేశంలో సామాజిక అభివృద్ధి రంగంలో మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి సురేంద్ర కుమార్ డే. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేమని ఆయన గట్టిగా విశ్వసించాడు, ప్రజాస్వామ్య ఫలాలు ప్రతి గ్రామానికి చేరాలని చెప్తూ ఉండేవాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఎస్. కె. డే 1906 సెప్టెంబర్ 13న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భాగం) సిల్హెట్ జిల్లాలోని లక్ష్మీబస్సా గ్రామంలో జన్మించాడు. ఇతను ప్రముఖ జాతీయవాది నాయకుడు బిపిన్ చంద్ర పాల్ అల్లుడు.డే అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివాడు.

కెరీర్

[మార్చు]

భారత ప్రభుత్వ పునరావాస మంత్రిత్వ శాఖకు గౌరవ సాంకేతిక సలహాదారుగా తన వృత్తిని డే ప్రారంభించాడు. ఈ పదవిలోనే డే "సామాజిక ఇంజనీర్" గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. దీనితో, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారుల గుర్తింపు పొందాడు.

మంత్రి పదవిలో

[మార్చు]

అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం అన్న అంశంలో డే చూపించే సామర్థ్యం, నిబద్ధత వల్ల కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి గ్రామీణాభివృద్ధి శాఖను డేకి అప్పగించేలా ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూని ప్రేరేపించింది.

నెహ్రూ మరణించాకా డే తన మంత్రిత్వ శాఖకు రాజీనామా చేసి, దేశంలో పంచాయతీ రాజ్ సంస్థలను నిర్మించడానికి తన సమయాన్ని, సామర్థ్యాన్ని వెచ్చించాడు. మంత్రిగా అతను ప్రారంభించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (1953) అతనికి చాలా ఇష్టమైనది. ఇది తరువాత దేశవ్యాప్తంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్లకు ఆధారం అయ్యింది. "ప్రభుత్వం తల్లీదండ్రి" గా చూడటం కంటే సమాజం తనకు తానుగా సహాయం చేసుకోగలదనే అతని నమ్మకంలో డే సముదాయ అభివృద్ధి తాలూకా ఆలోచన వేళ్ళూనుకుంది. డే సమాజ అభివృద్ధి నమూనా త్రివిధ వ్యూహం కలగింది -ప్రాంతం యొక్క అభివృద్ధి, సమన్వయంతో కూడిన పరిపాలన, వ్యక్తి సమాజం వ అభివృద్ధి.

మొదటి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 1948లో ఉత్తర ప్రదేశ్‌లోని ఇటావాలో ప్రారంభించారు. 1952లో దేశవ్యాప్తంగా ఇటువంటి 55 ప్రాజెక్టులు మొదలుపెట్టారు. వీటి విజయం ఆధారంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను దేశంలోని అన్ని బ్లాకులకు విస్తరించారు.

గ్రామీణ టౌన్‌షిప్

[మార్చు]

1949లో, డే గ్రామీణాభివృద్ధి కోసం వ్యవసాయ-పారిశ్రామిక టౌన్‌షిప్ కాన్సెప్ట్ రూపొందించారు. వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి కలయికపై దృష్టి పెట్టడం ఈ నమూనా ప్రధాన లక్ష్యం. చుట్టుపక్కల గ్రామాలు వస్తువులు, సేవల పరంగా ఈ పట్టణానికి మద్దతు అందిస్తాయి. ఇది స్వయం సమృద్ధి కలిగివుండి, పరస్పర సహకారం ఆధారంగా పనిచేస్తుంది.

ఈ నమూనా 1950లో హర్యానాలోని నిలోఖేరి వద్ద "మజ్దూరి మంజిల్" ప్రాజెక్టుగా కార్యరూపం దాల్చింది. విభజన సమయంలో పాకిస్తాన్ నుండి తరలివచ్చిన ఏడువేలమంది నిరాశ్రయులైన శరణార్థులకు ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూర్చింది. ఈ నమూనాను సంక్షేమ రాజ్యానికి కార్యరూపంగా డే భావించాడు.

ఈ నమూనాకు ఆకర్షితుడైన నెహ్రూ దీనిని "అభివృద్ధికి మక్కా"గా అభివర్ణించాడు, దేశవ్యాప్తంగా ఇంకా అనేక నిలోఖేరీలను సృష్టించాలని పిలుపునిచ్చాడు. దురదృష్టవశాత్తు, కొన్నేళ్ళకు, నిలోఖేరీ నిర్లక్ష్యానికి గురై, ఆరోగ్యం, నీరు, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేనిదయ్యింది.

ఎస్. కె. డే ఒక వైపు, గ్రామీణాభివృద్ధి విషయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చేసిన శ్రీనికేతన్ ప్రయోగం నుంచి, స్వయం సమృద్ధి, శారీరక శ్రమ వంటివాటిపై దృష్టి సారించిన మహాత్మా గాంధీ గ్రామీణ నిర్మాణం ఆలోచనల నుంచి ప్రభావితుడైనట్టు తెలుస్తోంది. ఉదారవాదం, మార్క్సిజం, గాంధీవాదాల కలయికగా ఏర్పడిన గ్రామీణాభివృద్ధి కార్యక్రమంగా కూడా దీన్ని చూడొచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛను ఉదారవాదం నుండి, చిన్న తరహా కుటీర, గ్రామీణ పరిశ్రమలు గాంధీయిజం నుంచి, పని చేసే హక్కు, కర్తవ్యం నొక్కిచెప్పడం మార్క్సిజం నుండి దీనిలోకి వచ్చినట్టు కనిపిస్తుంది.

పంచాయతీ రాజ్

[మార్చు]

కమ్యూనిటీ డెవలెప్మెంట్ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన బల్వంత్ రాయ్ మెహతా కమిటీ (1957)లో డే సభ్యుడు.గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుదలను కొనసాగించడానికి స్థానిక కార్యక్రమాలను ఉపయోగించుకోవడంలో, సంస్థలను రూపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతవరకు విజయవంతమైందో కమిటీ అంచనా వేసింది. ప్రణాళికల్లో, నిర్ణయాలు తీసుకోవడంలో, అమలు ప్రక్రియలో సమాజం పాలుపంచుకున్నప్పుడు మాత్రమే కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమం లోతుగా, శాశ్వతమైనదిగానూ విజయవంతం అవుతుందని, తద్వారా బలమైన పంచాయతీ రాజ్ వ్యవస్థకు అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. బల్వంత్రాయ్ మెహతా కమిటీ గ్రామీణాభివృద్ధిలో పంచాయతీ రాజ్ సంస్థకు ఒక ప్రాథమిక అభివృద్ధి పాత్రను ప్రతిపాదించింది. కమిటీ సామాజిక అభివృద్ధి, జాతీయ విస్తరణ కార్యక్రమాల (వ్యవసాయ శాఖ కింద) విజయానికి ఇవి అవసరమని పేర్కొంది.

డే "పంచాయిత్-ఇ-రాజ్, ఎ సింథసిస్" అన్న పుస్తకం రాశాడు[2]. ఈ పుస్తకంలో పంచాయితీరాజ్ అన్న పదానికి తాత్త్వికమైన మరో అర్థాన్ని సూచించాడు. ఒక వ్యక్తికీ, ప్రపంచానికీ మధ్య ఉండే సంబంధంలో అత్యంత ముఖ్యమైన లింకు పంచాయితీ రాజ్ అని డే ప్రతిపాదించాడు. గ్రామసభకీ, లోక్‌సభకీ మధ్య సన్నిహితమైన సంబంధం ఉండేలా అతను ఊహించాడు, ప్రజాస్వామ్యం అన్నది పార్లమెంటు నుంచి గ్రామసభ వరకూ ప్రవహించాలి అని అనేవాడు. తమ తమ రాష్ట్రాల్లో పంచాయితీరాజ్ సంస్థలను ఏర్పాటుచేయమని డే రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాడు. 1960ల నాటికల్లా అన్ని రాష్ట్రాలూ పంచాయితీరాజ్ సంస్థలను ఏర్పాటుచేశాయి, 2,17,300 పంచాయితీలు ఏర్పడ్డాయి.

ఇతర విజయాలు

[మార్చు]

జాతీయ అభివృద్ధి మండలి (నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) ఏర్పాటులో కూడా డే కీలక పాత్ర పోషించాడు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మాసపత్రిక "కురుక్షేత్ర" ఏర్పాటు వెనుక, చాలాకాలం పాటు నిర్వహణ వెనుక డే మార్గదర్శనం ఉంది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha Debates (Fourteenth Session, Eighth Lok Sabha)" (PDF). Lok Sabha Debates. 51 (1): 3–4. 18 July 1989. Retrieved 15 June 2022.
  2. "Panchayati Raj : a synthesis / S.K. Dey - Catalogue | National Library of Australia". catalogue.nla.gov.au (in ఇంగ్లీష్). Retrieved 2024-07-18.
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 14 August 2014. Retrieved 14 August 2014.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. http://164.100.47.5/Newmembers/mpterms.aspx
"https://te.wikipedia.org/w/index.php?title=ఎస్._కె._డే&oldid=4337325" నుండి వెలికితీశారు