జాతీయ అభివృద్ధి మండలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాతీయ అభివృద్ధి మండలి (నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ - NDC) అనేది ప్రధానమంత్రి అధ్యక్షతన భారతదేశంలో అభివృద్ధి విషయాలపై నిర్ణయాల రూపకల్పన, చర్చల కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ. ప్రణాళికా సంఘం రూపొందించిన పంచవర్ష ప్రణాళికలకు మద్దతుగా దేశపు కృషిని, వనరులను బలోపేతం చేయడానికి, సమీకరించడానికీ, అన్ని కీలక రంగాలలో ఉమ్మడి ఆర్థిక విధానాలను ప్రోత్సహించడానికీ, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమతుల్యమైన, వేగవంతమైన అభివృద్ధి జరిగేలా చూడడానికీ దీన్ని 1952 ఆగస్టు 6 న స్థాపించారు. కౌన్సిల్‌లో ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా వారి ప్రత్యామ్నాయాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు, NITI ఆయోగ్ (పూర్వపు ప్రణాళికా సంఘం) సభ్యులూ ఉంటారు.

ఎన్‌డిసిని (నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) రద్దు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు రద్దు చేయాలని తీర్మానం చేయలేదు. నీతి ఆయోగ్ పాలక మండలి (ఇందులో దాదాపు NDC లాగానే కూర్పు, పదవులూ ఉంటాయి) ప్రారంభమైనప్పటి నుండి, NDCకి ఎటువంటి పనిని కేటాయించలేదు, సమావేశాలు కూడా నిర్వహించలేదు. మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ల హయాంలో ప్లానింగ్‌ కమిషన్‌ తన జీవితకాలం ముగిసిపోయిందని, దానికి కొంత సంస్కరణ అవసరమనీ భావించారు. 2014 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రణాళికా సంఘం రద్దును ప్రకటించి, కార్యనిర్వాహక తీర్మానం ద్వారా నీతి ఆయోగ్‌ను రూపొందించాడు.[1] ఇది రాజ్యాంగ సంస్థ లేదా చట్టబద్ధమైన సంస్థ కాదు.

చరిత్ర

[మార్చు]

మొదటి సమావేశం 1952 నవంబరు 8-9 న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఇప్పటి వరకు 57 సమావేశాలు జరిగాయి. జాతీయ అభివృద్ధి మండలి 57వ సమావేశం 2012 డిసెంబరు 27 న[2] ముంబైలోని విధాన్ భవన్‌లో జరిగింది.

లక్ష్యాలు

[మార్చు]

క్రింది లక్ష్యాలతో కౌన్సిల్‌ను ఏర్పాటు చేసారు

  1. ప్రణాళికకు మద్దతుగా దేశంలో కృషినీ వనరులనూ బలోపేతం చేయడం, సమీకరించడం
  2. అన్ని కీలక రంగాలలో ఉమ్మడి ఆర్థిక విధానాలను ప్రోత్సహించడం
  3. దేశంలోని అన్ని ప్రాంతాలలో సమతుల్యత, వేగవంతమైన అభివృద్ధి ఉండేలా చూడడం
  4. దేశంలోని పౌరులకు విద్య, వైద్య సంరక్షణ, సామాజిక సేవలు మొదలైన సామాజిక సౌకర్యాలను అందించడం [3]
  5. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం [3]
  6. తలసరి ఆదాయాన్ని పెంచడం [4]

విధులు

[మార్చు]

కౌన్సిల్ విధులు

  1. ప్రణాళిక కోసం వనరుల అంచనాతో సహా జాతీయ ప్రణాళికను రూపొందించడానికి మార్గదర్శకాలను సూచించడం;
  2. నీతి ఆయోగ్ రూపొందించిన జాతీయ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడం;
  3. ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన వనరులను అంచనా వేయడం, వాటిని పెంచడానికి చర్యలను సూచించడం
  4. జాతీయ అభివృద్ధిని ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక విధానాల్లోని ముఖ్యమైన ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోవడం;
  5. ప్రణాళిక పనిని ఎప్పటికప్పుడు సమీక్షించడం, జాతీయ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలు గమ్యాలను సాధించడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేయడం.
  6. జాతీయ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యాలు గమ్యాల సాధనకు చర్యలను సిఫార్సు చేయడం.

కూర్పు

[మార్చు]

నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు భారత ప్రధాని అధ్యక్షత వహిస్తారు. ఇందులో కేంద్ర మంత్రులందరు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల నిర్వాహకులు, నీతి ఆయోగ్ సభ్యులూ సభ్యులుగా ఉంటారు. స్వతంత్ర బాధ్యత కలిగిన సహాయ మంత్రులు కూడా కౌన్సిల్ చర్చలకు ఆహ్వానితులే.

NDC 58వ సమావేశం

ఇంకా నిర్వహించలేదు

NDC 57వ సమావేశం

(2012-2017) ప్రణాళికను చర్చించడానికి 2012 డిసెంబరు 27 న నిర్వహించారు

NDC 56వ సమావేశం

NDC 56వ సమావేశం 2011 అక్టోబరు 22 న 12వ ప్రణాళిక విధాన పత్రాన్ని పరిశీలించడానికి జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించాడు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, NDC వద్ద పరిశీలన కోసం ఆరు ప్రధాన అంశాలను లేవనెత్తారు:

1. పన్నెండవ ప్రణాళిక కాలానికి రాష్ట్ర స్థాయి పంచవర్ష ప్రణాళికలను ముందుగానే నిర్ణయించడం, అభివృద్ధి, ఇతర సామాజిక సూచికల కోసం లక్ష్యాలను నిర్దేశించడం. వాటిని పన్నెండవ ప్రణాళిక కోసం స్థిరమైన జాతీయ లక్ష్యాలుగా నిర్మించాలి. రైతులు, వ్యవస్థాపకుల ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే ఆర్థిక వాతావరణాన్ని సృష్టించాలి. ఇది రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం, ఉత్పత్తి, ఉపాధిల పెరుగుదల పరంగా చాలా ఫలితాలను నిర్ణయిస్తుంది.

2. ప్రణాళిక కోసం వనరుల సమీకరణ, కేటాయింపు. గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఆరోగ్య సేవల విస్తరణలపై సమ్మిళిత వృద్ధి ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ రంగాలకు తగిన కేటాయింపులు చేయాలి. ఆర్థిక లోటును తగ్గిస్తూనే ప్రణాళికకు కేంద్రపు స్థూల బడ్జెట్ మద్దతు (GDP నిష్పత్తిగా) పెరగాలి. దానికి పన్ను రాబడుల నిష్పత్తిని GDPకి పెంచడం, లక్ష్యశుద్ధి లేని సబ్సిడీలను తగ్గించడం అవసరం. రాష్ట్రాలు మెరుగైన రాబడి పనితీరునే లక్ష్యంగా పెట్టుకోవాలి, సబ్సిడీలపై క్రమేణా నియంత్రణ సాధించాలి. GSTని ముందస్తుగా అమలు చేయడం వల్ల కేంద్ర, రాష్ట్రాలకు మరింత ఆదాయాన్ని కలిగించడమే కాకుండా, దేశంలో ఒకే మార్కెట్‌ను సృష్టించడంతోపాటు పరోక్ష పన్నుల వ్యవస్థలోని అనేక అవకతవకలను తొలగించవచ్చు. కేంద్ర రాష్ట్రాలు రెండూ, పరిమిత ప్రజా వనరులను వినియోగించుకోవడం కోసం, సాధ్యమైన చోటల్లా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించిన పరిధిని తప్పనిసరిగా అన్వేషించాలి.

3. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో వ్యవసాయానికి మరింత శ్రద్ధ, ప్రాధాన్యత అవసరం (ఉదా. ఉద్యానవన ఉత్పత్తులను పూర్తిగా APMC చట్టం నుండి మినహాయించడం.)

4. ఇంధన వనరుల నిర్వహణ అనేది ఒక ప్రధాన సవాలుగా ఉంటుంది. ఎందుకంటే వేగవంతమైన వృద్ధికి దేశీయ ఇంధన సరఫరాలలో గణనీయమైన విస్తరణ అవసరం, శక్తి సామర్థ్యంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. మొత్తం విద్యుత్ రంగం యొక్క సాధ్యత అనేది పంపిణీ వ్యవస్థ యొక్క ఆర్థిక సాధ్యతపై విమర్శనాత్మకంగా ఆధారపడి ఉంటుంది. పంపిణీ వ్యవస్థ లోని మొత్తం నష్టాలు, సరిగ్గా లెక్కించినట్లయితే, బహుశా రూ. 70,000 కోట్ల వరకు ఉండవచ్చు. రాష్ట్రాలు ఈ నష్టాలను సబ్సిడీల ద్వారా భర్తీ చేయగలిగితే, వ్యవస్థకు ప్రమాదం ఉండదు. అయితే, రాష్ట్ర బడ్జెట్లు ఈ స్థాయిలో సబ్సిడీలను అందించలేవు. నష్టాలను బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పూడుస్తున్నారు. పన్నెండవ ప్రణాళిక ముగిసే నాటికి AT&C నష్టాలు 15%కి తగ్గించాలి. ఖర్చులకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలను సవరించాలి. సుంకం పెరుగుదలతో కలిపి పంపిణీ సంస్కరణల ప్యాకేజీని అమలు చేయడం తక్షణ అవసరం. ఇది అన్ని అదనపు విక్రయాలకు పంపిణీ సంస్థలను ఆచరణీయంగా చేస్తుంది. సత్వర విద్యుత్తు అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి పన్నెండవ ప్రణాళిక కూర్పు, ఈ మార్గాల్లో విశ్వసనీయమైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాలకు వనరులను అందించేలా ఉండాలి. కొత్త ఇంధన సామర్థ్య భవన ప్రమాణాలను తప్పనిసరి చేయాలి.

5. నీటి వనరుల నిర్వహణ - దేశంలో నీటి కోసం డిమాండు, సరఫరాను మించిపోయింది. ఇది దేశంలోని అనేక ప్రాంతాలలో తీవ్రమైన నీటి కొరతకూ మితి లేని భూగర్భ జలాల తోడివేతకూ దారి తీస్తుంది. లభ్యమయ్యే నీటి పరిమాణాన్ని మనం పెంచుతున్నాము, కానీ నిజమైన పరిష్కారం నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంలోనే ఉంది. ప్రస్తుతం, మన నీటిలో దాదాపు 80% వ్యవసాయంలో ఉపయోగిస్తున్నాం. ఇది చాలా అసమర్థంగా ఉపయోగించబడుతోంది. వ్యవసాయంలో నీటి వినియోగాన్ని తెలిసిన సాంకేతికతతో సగానికి తగ్గించవచ్చు. ఉదాహరణకు, వరికి సాంప్రదాయిక నీటిపారుదల పద్ధతి నుండి శ్రీ సాగుకు మారడం. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా నీటి లభ్యతను మెరుగుపరచవచ్చు. ప్రస్తుతం 30 శాతం మురుగు నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాల విషయంలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వేగవంతం కావటంతో, మన మంచినీటి వ్యవస్థలపై ఈ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈ అన్ని రంగాలలో దిద్దుబాటు చర్యలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల డొమైన్‌లో ఉన్నాయి. చట్టాల్లో మార్పులతో సహా నీటి విధానాన్ని సమగ్రంగా పునఃపరిశీలించాలని అప్రోచ్ పేపర్ కోరింది. కొన్ని రాష్ట్రాలు, రైతులను చురుకుగా పాల్గొనేలా చేసి నీటి హేతుబద్ధ వినియోగం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టాయి. AIBP క్రింద భవిష్యత్ సహాయం నీటి యొక్క మరింత హేతుబద్ధమైన వినియోగాన్ని నిర్ధారించే కదలికలతో అనుసంధానించబడి ఉండాలి.

6. క్షేత్రస్థాయిలో ప్రణాళికా పథకాల అమలును మెరుగుపరచడం. గత కొన్ని సంవత్సరాలుగా, ఆరోగ్యం, విద్య, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రాంత అభివృద్ధి కార్యక్రమం మొదలైన వాటిలో వివిధ ప్రధాన కార్యక్రమాలకు కేటాయించిన వనరుల పరిమాణాన్ని మనం బాగా విస్తరించాం. చతుర్వేది కమిటీ నివేదిక కేంద్ర ప్రాయోజిత పథకాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరంపై అనేక సిఫార్సులు చేసింది. పాలనను మెరుగుపరచడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఇ-గవర్నెన్స్‌ను పంచాయతీ స్థాయికి విస్తరించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పారదర్శకతను ప్రవేశపెట్టడం, IT ప్రయోజనాలతో కలిపి UID నంబర్‌ను ఉపయోగించడం వంటి అంశాలు ప్రాధాన్యతా రంగాలుగా మారాయి. ఈ అనేక కార్యక్రమాలలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆధార్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. సెంట్రల్ ప్లాన్ స్కీమ్ మానిటరింగ్ సిస్టమ్ నిర్వహణ సమాచారం, నిర్ణయాలను తీసుకోవడాంలో మద్దతు వ్యవస్థగా పనిచేస్తూ, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం చేసే చెల్లింపులను ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులను రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ స్థాయిల ద్వారా అమలు స్థాయిలో చేసే తుది వ్యయం వరకు ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. [1]
  2. Dasgupta, Ashok (27 December 2012). "NDC scales down annual growth rate to 8 p.c. - The Hindu". The Hindu.
  3. 3.0 3.1 "CBSE Class 10 Social Economics Understanding Economic Development SAQ". 7 August 2017.
  4. "Class 10 Social Science Economics Economic Development". 7 August 2017.