Jump to content

ఒప్పం

వికీపీడియా నుండి
ఒప్పం
సినిమా పోస్టర్
దర్శకత్వంప్రియదర్శన్
స్క్రీన్ ప్లేప్రియదర్శన్
కథగోవింద్ విజయన్
నిర్మాతఆంటోని పెరంబవూర్
తారాగణం
ఛాయాగ్రహణంఎన్.కె.ఏకాంబరం
కూర్పుఎం.ఎస్.అయ్యప్పన్ నాయర్
సంగీతం
  • 4 మ్యూజిక్స్ (పాటలు)
  • రాన్ ఏతాన్ యోహాన్ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
ఆశీర్వాద్ సినిమాస్
పంపిణీదార్లుమాక్స్ లాబ్ సినిమాస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
8 సెప్టెంబరు 2016 (2016-09-08)
సినిమా నిడివి
157 నిమిషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం
బాక్సాఫీసుest.₹65 కోట్లు [1]

ఒప్పం (అనువాదము: తోడు) గోవింద్ విజయన్ కథ ఆధారంగా, 2016లో ప్రియదర్శన్ రచనా, దర్శకత్వం వహించిన మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఆశీర్వాద్ సినిమాస్ తరుఫున ఆంటోని పెరుంబవూర్ దీన్ని నిర్మించారు.మోహన్ లాల్, అనుశ్రీ, సముద్రఖని, విమలా రామన్, నేదుముడి వేణు, బేబీ మీనాక్షీలు ముఖ్య నటీనటులు. ఈ చిత్రానికి పాటలు 4 మ్యూజిక్స్ బృందము సమకూర్చగా, స్వరాలను రాన్ ఏతాన్ యోహాన్ సమకూర్చారు. ఎన్‌కె ఏకాంబరం ఛాయాగ్రాహకునిగా వ్యవహరించారు.

ఒక అంకణాలింటికి లిఫ్ట్ ఆపరేటరూ, కేర్‌టేకరుగా ఉన్న జయరామన్ (మోహన్‌లాల్) అనే అంధుడు ముఖ్య పాత్రధారి. ఇతను వృత్తిరీత్యా న్యాయమూర్తి యైన కృష్ణంరాజుకు నమ్మిన బంటు. బళ్ళో చదువుకుంటున్న ఆయన కూతురు నందినీ (మీనాక్షీ) ఆలనాపాలనా జయరామనే చూసుకుంటుంటాడు. ఇంతలో గతములో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా కృష్ణమూర్తి, వరుస హత్యలు చేస్తున్న ఒక హంతకుడిచే హత్య చేయబడతాడు. ఈ నేరము జయరామన్‌పై పడుతుంది. తాను నిర్దోషినని నిరూపించుకోవడముతో పాటు నందినీని ఆ హంతకుడి బారి నుండి కాపాడాల్సిన బాధ్యత అతనిపై ఉంటుంది. ఇది కథ యొక్క ఇతివృత్తము.

నిర్మాణం

[మార్చు]

ఎన్నో విజయవంతమైన చిత్రాలందించిన మోహన్‌లాల్, ప్రియదర్శన్‌ల ద్వయము మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారని 2015లో వార్తలొచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల చిత్రీకరణ వాయిదాపడి, తర్వాతి ఏడులో మొదలైనది. మోహన్‌లాల్‌తో మరో చిత్రము చేయాలని నిర్ణయించుకున్నాక, ప్రియదర్శన్ కథల కోసము వెదక సాగారు. వీరిద్దరూ ఎప్పుడూ చేసే హాస్య చిత్రాలకు భిన్నంగా ఏదైనా చేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. చివరికి మోహన్‌లాల్, గోవిందరాజన్ వ్రాసిన ఒక కథానికను సూచించగా, ప్రియదర్శన్‌కు అది నచ్చడముతో దాన్నుండి స్క్రీన్‌ప్లే తయారు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తము 2016 ఫిబ్రవరీ మాసానికి పూర్తి అవ్వగా, మార్చిలో చిత్రీకరణ మొదలైంది. జూన్ వరకూ కొనసాగిన చిత్రీకరణలో భాగంగా కొచ్చీ, ఊటీ, వాగమోన్, తిరువనంతపురము, ఇడుక్కీలలో సన్నివేశాలు తీసారు.

విడుదల

[మార్చు]

2016, సెప్టెంబరు 8న దేశవ్యాప్తంగా అలాగే 21వ తేదీన అంతర్జాతీయంగా ఈ చిత్రము విడుదలైంది. ₹7 కోట్ల వ్యయముతో నిర్మించిన ఈ చిత్రము అంతర్జాతీయంగా ₹100 కోట్ల వసూళ్లు సాధించి, వంద కోట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. మలయాళీ చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రాల్లో ఈ చిత్రము మూడో స్థానములో నిలువగా, ఆ సంవత్సరములో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాల్లో మన్యం పులి (పులిమురుగన్) తరువాత రెండో స్థానములో నిలిచింది. ఈ చిత్రము విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. వారు మోహన్‌లాల్ నటననూ, చిత్రాన్ని తెరకెక్కించిన విధానాన్నీ పొగిడారు. దక్షిణ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలకు, ఉత్తమ చిత్రము, ఉత్తమ దర్శకుడిగా ప్రియదర్శన్, ఉత్తమ నటుడిగా మోహన్‌లాల్ పేర్లతో సహా దీన్ని ఐదు విభాగాల్లో ప్రతిపాదించగా, ఉత్తమ సాహిత్యము (మధూ వాసుదేవన్), ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు (ఎం.జీ శ్రీ కుమారు) విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. 2017 ఫిబ్రవరీ మూడవ తేదిన తెలుగు అనువాదము కనుపాపనూ, హిందీ అనువాదము ప్రైమ్ విట్‌నెస్‌నూ (తెలుగు అర్థము: ముఖ్య సాక్షి) విడుదల చేసారు. 2019లో కన్నడములో దీన్ని 'కవచా'గా పునర్నిర్మించారు.

పుట్టుకతో గుడ్డివాడైన జయరామన్‌కు నిశితమైన వినికిడీ, స్పర్శా, వాసన శక్తులు కలవు. ఆపైన అతడు కలరియపట్టు యుద్ధ విద్యలో నిష్ణాతుడు. ఉమ్మడి కుటుంబములో ఒకడైన అతను, కొచ్చీలోని ఒక అంకణాలింటికి లిఫ్ట్ ఆపరేటరూ, కేర్‌టేకరుగా పనిచేస్తుంటాడు. అతను తన చెల్లెలి పెళ్ళికి డబ్బులు కూడబెట్టాలి. జయరామన్ అదే ఇంట్లో ఉంటున్న, సర్వోన్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన, కృష్ణమూర్తికి నమ్మిన బంటు. ఇతడు కృష్ణమూర్తి ఎవరినో వెతుకుతూ చేస్తున్న అనేక ప్రయాణాల్లో, ఏ వివరాలూ అడగకుండా, అతనికి తోడుగా ఉంటాడు.

అలాంటి ఒక ప్రయాణంలో, కృష్ణమూర్తి జయరామన్‌కు తన వెతుకులాటకు కారణం చెబుతాడు. చాలా కాలం క్రితం వాసుదేవన్ అనే ముద్దాయికి కృష్ణమూర్తి అతను చేయని తప్పకి శిక్ష విధిస్తాడు. వాసుదేవన్ నిర్దోషి అని తెలుస్తున్నప్పటికీ సాక్ష్యాధారాలు అతనికి వ్యతిరేకంగా ఉండడముతో వాటిననుసరించి కృష్ణమూర్తి తీర్పిస్తాడు. వాసూకు శిక్ష పడ్డాక, అతని కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటుంది. బాధతో పిచ్చివాడైపోయిన వాసూ, ఏనాటికైనా కృష్ణమూర్తి కుటుంబాన్ని చంపి పగ తీర్చుకుంటానని శపథం చేస్తాడు. ప్రస్తుతం వాసూ విడుదలయ్యాడని తెలియగానే, కృష్ణమూర్తికి అతను తననీ, తన కుటుంబాన్నీ ఏమి చేస్తాడోననే భయం పట్టుకుంటుంది.

మూర్తికి నందినీ అనే పేరుతో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. వాసూ నుండి కాపాడడానికి ఆమెను హాస్టల్లో ఉంచి ఒక కాన్వెంట్ బళ్ళో చదివిస్తుంటాడు. ఆ పాపకు మూర్తి ఎవరన్నది తెలీదు. ఆ పాపను చూసుకునే పని మూర్తి జయరామన్‌కు అప్పగిస్తాడు. అతను ఎప్పటికప్పుడెళ్ళి పాపను కలుస్తుంటాడు. ఆమె తన తండ్రి ఎవరని అడిగిన ప్రతీసారీ, ఈసారి వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పి దాటేస్తుంటాడు.

కృష్ణమూర్తి తన బ్యాంకు ఖాతాలోని డబ్బును నందినికై తెరిచిన వేరే ఖాతాలోకి మార్చేందుకు జయరామన్‌ను సహాయం అడుగుతాడు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్‌ను కాకుండా మామూలు పద్ధతిని ఎంచుకుంటాడు. జయరామన్ డబ్బును మూర్తి ఖాతాలో నుండి తీసి, అతనికి ఇస్తాడు. భర్త నుండి విడాకులు తీసుకుని, కృష్ణమూర్తి ఇంట్లో పనిమనిషిగా ఉంటున్న దేవయాని అనే ఆమె, మూర్తికి జయరామన్ డబ్బు ఇవ్వడాన్ని చూస్తుంది. మూర్తి ఆ డబ్బును తన ఇంట్లోని బీరువాలో దాస్తాడు.

ఇదిలా ఉండగా ఆ అంకణాలింట్లో ఘనంగా జరుగుతున్న ఒక పెళ్ళికి అంకణాల్లోని వారందరూ వెళతారు. సంబరాలు ముగిసాక జయరామన్ మూర్తి అంకణానికి వెళ్ళగా ఆయన అక్కడ చనిపోయి పడి ఉన్నాడనీ, బీరువాలో డబ్బు లేదనీ గుర్తిస్తాడు. అంకణములో ఇంకో వ్యక్తి ఉన్నాడని జయరామన్ పసిగట్టగా, ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నిస్తే జయరామన్ అతణ్ణి లొంగదీసుకుంటాడు. జయరామన్ గుడ్డివాడని అర్థము చేసుకున్న ఆ హంతకుడు వాసూ, నెమ్మదిగా అక్కణ్ణుండి జారుకుని, ఒక కారులో తప్పించుకు పారిపోతాడు.

ఈ గొడవ తరువాత అక్కడికొచ్చిన పోలీసులూ, మూర్తి దాచుకున్న డబ్బులు కనబడట్లేదనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు, వాటిని జయరామనే దొంగలించాడని అనుమానిస్తారు. తదుపరి విచారణలో డబ్బు దేవయానీ సోదరుడి దగ్గర దొరికినప్పటికీ, హత్యానేరములో జయరామన్‌ను అరెస్ట్ చేస్తారు. హంతకుడి యొక్క జాడ తాను పసిగట్టగలుగుతున్నాననీ, తనకు వాణ్ణి పట్టుకునేందుకు అవకాశము ఇవ్వమనీ జయరామన్ మొత్తుకున్నప్పటికీ, అతన్ని ఎవరూ పట్టించుకోరు. అంతే కాక విచారణలో భాగంగా పోలిసులు అతన్ని కొట్టబోవడముతో, అతడేవారిని తిరిగి కొట్టి, అక్కణ్ణుంచి తప్పించుకుంటాడు. తన స్నేహితురాలైన గంగా అనే పోలీసు అధికారి సహాయముతో నందినిని వాసూకి కనబడకుండా ఉంచడానికి సిద్ధమవుతాడు.

మూలాలు

[మార్చు]
  1. "Malayalam actor Prithiviraj announces directorial venture with Mohanlal". 23 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఒప్పం&oldid=4213769" నుండి వెలికితీశారు