Jump to content

ప్రియదర్శన్

వికీపీడియా నుండి
ప్రియదర్శన్
జననం
ప్రియదర్శన్ సోమన్ నాయర్

(1957-01-30) 1957 జనవరి 30 (వయసు 67)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థగవర్నమెంట్ మోడల్ స్కూల్
త్రివేండ్రం యూనివర్శిటీ కాలేజి
వృత్తిసినీ దర్శకుడు, రచయిత, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1984 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 1990; div. 2014)
పిల్లలుకల్యాణీ ప్రియదర్శన్,
సిద్ధార్థ్ ప్రియదర్శన్
తల్లిదండ్రులుకె. సోమన్ నాయర్
రాజమ్మ
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం (2012)

ప్రియదర్శన్ సోమన్ నాయర్ భారతీయ సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత. పలు భారతీయ భాషల్లో 90కి పైగా సినిమాలు తీశాడు. ఎక్కువగా మలయాళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తమిళంలో 6, తెలుగులో రెండు సినిమాలు చేశాడు. ఆయన 1984 లో మలయాళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించినా 2000 దశకంలో ఎక్కువగా హిందీలో సినిమాలు తీశాడు. తెలుగులో ఆయన తీసిన రెండు సినిమాలు నిర్ణయం, గాండీవం.

2007 లో ప్రియదర్శన్ రూపొందించిన తమిళ సినిమా కాంచీవరం జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం అందుకుంది. భారత ప్రభుత్వం ఆయనకు 2012 లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రియదర్శన్ కేరళ లోని తిరువనంతపురంలో సోమన్ నాయర్, రాజమ్మ దంపతులకు జనవరి 30, 1957న జన్మించాడు. గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చదువుకున్నాడు. త్రివేండ్రం విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో ఎం. ఏ పట్టా పుచ్చుకున్నాడు. ఆయన తండ్రి ఓ కళాశాలలో లైబ్రేరియన్ కావడంతో ప్రియదర్శన్ చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడు. కళాశాలలో చదివే రోజుల్లో ఆకాశవాణి కోసం చిన్న నాటకాలు, రూపకాలు రాసి పంపేవాడు. మలయాళ దర్శకుడు పి. వేణు సినిమాలు చూసి స్ఫూర్తి పొందేవాడు. మోహన్ లాల్, శ్రీ కుమార్ మొదలైన వారు స్నేహితులుగా ఉండేవారు. అప్పుడే మోహన్ లాల్ సినిమాల్లో ప్రవేశిస్తున్నాడు. స్నేహితులతో కలిసి సినిమాల్లో అవకాశం కోసం చెన్నై వెళ్ళాడు. మోహన్ లాల్ సహాయంతో ప్రియదర్శన్ కొన్ని సినిమాలకు రచనలో సహాయం అందించాడు. వాటిలో కొన్ని విజయం సాధించాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ కేరళకు రావలసి వచ్చింది.[2]

కెరీర్

[మార్చు]

1984లో ప్రియదర్శన్ తన స్నేహితులైన సురేష్ కుమార్, సనల్ కుమార్ లతో కలిసి అప్పట్లో మలయాళంలో గిరాకీ ఉన్న నటుడైన శంకర్ సహాయంతో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర ఆర్థిక సహాయం పొంది శంకర్, మోహన్ లాల్ హీరోలుగా ఓ సినిమా తీశారు. అలా 1984 లో పూచక్కోరు మూక్కుత్తు అనే సినిమాతో ప్రియదర్శన్ దర్శకుడయ్యాడు. అది తక్కువ బడ్జెట్ లో తీసిన ఓ హాస్య సినిమా అయినా ఆశ్చర్యకరమైన రీతిలో విజయం సాధించించి. కేరళలోని కొన్ని థియేటర్లలో వంద రోజులు ఆడింది.

అదే ఊపులో ప్రియదర్శన్ మరి కొన్ని హాస్య సినిమాలు తీసి విజయం సాధించాడు. 1988 సంవత్సరంలో ప్రియదర్శన్ అనేక విజయవంతమైన సినిమాలు రూపొందించాడు. 1991 లో అక్కినేని నాగార్జున వందనం అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేయమని కోరడంతో నిర్ణయం పేరుతో దాన్ని తెలుగులో తీశాడు. 1992 లో తన మలయాళ సినిమా కిళుక్కమ్ ను హిందీ లో ముస్కురహత్ పేరుతో హిందీలో రీమేక్ చేయడం ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. 1993 లో అతను హిందీలో తీసిన గర్దిష్ మంచి విజయం సాధించడంతో అక్కడ కూడా నిలదొక్కుకున్నాడు. 1994 లో తన రెండో తెలుగు సినిమా నందమూరి బాలకృష్ణతో గాండీవం అనే సినిమా తీశాడు. తెలుగులో ఇప్పటిదాకా ఆయన తీసిన ఆఖరు చిత్రం ఇదే.

పురస్కారాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ప్రియదర్శన్, ఆయన రూపొందించిన సినిమాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నాయి.

  • 2012 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం.[3]
  • 2007 లో ఆయన దర్శకత్వం వహించిన కాంచీవరం సినిమాకు జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం
  • 1995 లో కాలాపానీ సినిమాకు కేరళ రాష్ట్ర ఉత్తమ చిత్ర పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. The Times (26 January 2012). "Anup Jalota, Priyadarshan to receive Padma Shri". The Times of India. indiatimes.com. Retrieved 13 August 2012.
  2. "Trivandrum days". The Hindu.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.