Jump to content

కనిష్కుడు

వికీపీడియా నుండి
కనిష్కుడు I
కుషాణ వంశ రాజు
కనిష్క బంగారు నాణెం. బ్రిటీష్ మ్యూజియం.
పరిపాలన2nd century
పూర్వాధికారివిమా కడ్ఫిసెస్
ఉత్తరాధికారిహువిష్కుడు
జననంపెషావర్
మరణంపెషావర్
Burial
Houseకుషాణ షాలు
రాజవంశంకుషాణులు
మతంహిందువు, తరువాత బౌద్ధం
కనిష్కుని తండ్రి విమ కడ్ఫైసెస్. బ్రిటిష్ మ్యూజియం

ఒకటవ కనిష్కుడు, కుషాణ వంశానికి చెందిన చక్రవర్తి. ఇతను రెండవ శతాబ్దం (127-150 ఎ.డి) కి చెందిన వాడు. కనిష్కుడు సైనిక, రాజకీయ, ఆధ్యాత్మికంగా సాధించిన విజయాలకు ప్రసిద్ధి చెందినవాడు. కుషాణ వంశ వ్యవస్థాపకుడు కుజుల కడ్ఫిసెస్ వారసుడైన కనిష్కుడు బాక్ట్రియా నుంచి టరిం బేసిన్ లోని తుర్ఫాన్ నుంచి, గంగా పరీవాహక ప్రాంతమైన పాటలీపుత్ర వరకు తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కనిష్కుని ప్రధాన రాజధాని గాంధారంలోని పురుసపుర (పెషావర్). అతని మరో ప్రధాన రాజధాని కపిస.

కనిష్కుని ఆక్రమణలు, బౌద్ధ ప్రచారం సిల్క్ రోడ్ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించింది. అతని కాలంలోనే బౌద్ధం సిల్క్ రోడ్ ద్వారా గాంధారాన్ని దాటి కారకోరం పర్వతశ్రేణుల ద్వారా చైనా చేరింది.

పురాతన పండితుల ప్రకారం కనిష్కుడు 78 ఎ.డిలో సింహాసనాన్ని అధిష్టించాడు. ఆ సంవత్సరంలోనే శకం ప్రారంభమైంది. కానీ నిజానికి ఈ తేదీ కనిష్కుని పట్టాభిషేక సంవత్సరం కాదని ఒక నమ్మకం. ఫాక్ ప్రకారం 127 ఎ.డిలో కనిష్కుడు సింహాసనం అధిరోహించాడు.[1]

వంశవృక్షం

[మార్చు]
కనిష్కుని విగ్రహం, రెండవ శతాబ్దం, మధుర మ్యూజియం

కనిష్కుడు కుషాణ వంశానికి చెందినవాడు. అతను యుళి జాతికి చెందినవాడు కావచ్చు. అతని మాతృభాష తెలియరాలేదు. రబాటక్ ప్రాంతంలో దొరికిన శాసనంలో ఆర్య అనే భాషను గ్రీకు లిపిని ఉపయోగించి రాసి ఉంది. ఆ శాసనానికి రబాటిక్ శాసనం అని పేరు వచ్చింది. ఈ శాసనంలో కనిష్కుని వంశవృక్షం అంతా వర్ణించి ఉంది. ఈ భాష ప్రస్తుత ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఉబ్జెకిస్థాన్ ల దగ్గర్లో ఉండే అరియానా అనే ప్రాంతంలోని బాక్ట్రియన్ భాషకు దగ్గరగా ఉంటుంది. బాక్ట్రియన్ అనేది మధ్య ఇరానియన్ కాలంలోని తూర్పు ఇరానియన్ భాష.[2] అయితే ఈ భాషను కుషాణులు స్థానికులతో వ్యవహరించేందుకు ఉపయోగించేవారు. కానీ రాజవంశీయులు, అధికారులు, సైనాధికారులు వారిలో వారు మాట్లాడుకునేందుకు, వ్యవహారాలు జరిపేందుకు ఏ భాషను వాడేవారో మాత్రం ఇప్పటికీ తెలీలేదు.టారిం బేసిన్ లో జీవించిన మధ్యయుగ టాచ్రైన్ సమాజం, కుషాణుల మధ్య ఉన్న వివాదాస్పద సిద్ధాంతాలు గనుక నిజమే అయితే కనిష్కుడు ఇండో-యూరోపియన్ భాష అయిన టాచ్రైన్ లో మాట్లాడి ఉండొచ్చు. అయితే ఇండో-యురోపియన్ భాషల్ని వాటి ప్రయోగాలను బట్టీ సెంటం, సాటంగా విభజిస్తారు. దాని ప్రకారం బాక్ట్రియన్ భాష సేటం విభాగానికి చెందింది కాగా, టాచ్రైన్ భాష సెంటం విభాగంలోనిది కావడంతో అయోమయ పరిస్థితి అలాగే కొనసాగుతోంది.

రబాటక్ శాసనం ప్రకారం కనిష్కుడు విమా కడ్ఫసిస్ వారసుడు.[3][4] రబాటక్ లో దొరికిన శాసనంలో కనిష్కుడు కుషాణ రాజులతో తన సంబంధాన్ని వివరంగా రాయించాడు. ఆ శాసనం ప్రకారం రాజా కుజుల కడ్ఫసిస్, కనిష్కుని ముత్తాత కాగా, అతని తాత పేరు రాజా విమ టక్టు, తండ్రి రాజా విమా కడ్ఫసిస్. వారి తరువాత రాజ్యానికి వచ్చిన రాజు తాను కనిష్కుడు అని చెక్కించాడు అతను.[5]

దక్షిణ, మధ్య ఆసియాలో ఆక్రమణలు

[మార్చు]

నిజానికి కనిష్కుని సామ్రాజ్యం చాలా పెద్దది. దక్షిణ ఉబ్జెకిస్థాన్, తజికిస్థాన్ నుంచి మొదలై, మధ్య ఆసియాలోని వాయవ్య పాకిస్తాన్ ప్రాంతంలోని ఉత్తర అము డార్య, ఉత్తర భారతంలో ఆగ్నేయంలో ఉన్న మథుర వరకు కనిష్కుని సామ్రాజ్యం విస్తరించి ఉంది. అయితే రబాటక్ శాసనం ప్రకారం అయితే పాటలీపుత్ర, శ్రీ చంప వరకూ కూడా కనిష్కుడు పరిపాలించాడు. అతని సామ్రాజ్యంలో కాశ్మీర్ కూడా భాగమే. బరముళ్ళ దారిలో అతని పేరు మీదుగా కనిష్కపురం అని ఒక ఊరు ఉంది. ఇప్పటికీ ఆ ఊర్లో పెద్ద పెద్ద స్థూపాలు ఉండటం విశేషం.

కనిష్కుని కాలం నాటి కాంస్య నాణెం. ప్రస్తుత చైనాలోని ఖొటాన్ ప్రాంతంలో లభించింది ఈ నాణెం.

మధ్య ఆసియా ప్రాంతంపై అతని ఆధిపత్యానికి అంతగా గుర్తింపు లేదు. బుక్ ఆఫ్ ది లేటర్ హాన్, హొయు, హన్సు అనే పుస్తకాలలో హాన్ సైన్యానికి చెందిన జనరల్ బన్ చవు కుషాణుల సైన్యంపై గెలిచిన యుద్ధం గురించి వివరించి ఉంది. ఖోటాన్ ప్రాంతం దగ్గర్లో కుషాణులకు చెందిన దాదాపు 70,000 మంది సైనికులతో యుద్ధం చేసి గెలిచినట్టుగా రాసి ఉంది. ఆ పుస్తకాల ప్రకారం సా.శ. 90 లో ఈ యుద్ధాన్ని కుషాణుల ఒకానొక వైస్రాయ్ గ్జియి నడిపించాడు. ఈ ప్రాంతం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో కుషాణుల అధీనంలోకి వచ్చింది.[6] దాంతో, క్రీ.పూ. 127లో చైనీయులు తిరిగి ఆ ప్రాంతాలపై నియంత్రణ పొందే వరకూ, [7] కుషాణులు కష్గర్, ఖోటాన్, యార్కండ్ ప్రాంతాల వరకూ తమ అధీనంలోకి తెప్పించుకోగలిగారు. ఇవన్నీ చైనీయుల అధీనంలోని టారిం బేసిన్ కు చెందినవి. ఇప్పటికీ టారిం బేసిన్ లో కనిష్కుని నాణాలు ఎన్నో లభ్యమవుతున్నాయి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Falk (2001), pp. 121–136. Falk (2004), pp. 167–176.
  2. Gnoli (2002), pp. 84–90.
  3. Sims-Williams and Cribb (1995/6), pp.75–142.
  4. Sims-Williams (1998), pp. 79–83.
  5. Sims-Williams and Cribb (1995/6), p. 80.
  6. Chavannes, (1906), p. 232 and note 3.
  7. Hill (2009), p. 11.