Jump to content

క్రూగర్ నేషనల్ పార్క్

వికీపీడియా నుండి
దక్షిణ ఆఫ్రికాలో పార్కు ఉన్న ప్రదేశం (ఎరుపు రంగులో సూచించబడినది)

క్రూగర్ నేషనల్ పార్క్ (ఆంగ్లం: Kruger National Park) స్థానిక, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే దక్షిణ ఆఫ్రికాలో గల అత్యంత విశాలమైన వన్యప్రాణి సంరక్షక కేంద్రం. ఇది ఆఫ్రికా ఖండంలో కూడా అతి పెద్ద అరణ్యము. దీని వైశాల్యము 19,485 చ.కి.మీ.లు. దీనికి తూర్పున మొజాంబిక్, ఉత్తరాన జింబాబ్వే దేశాలు ఉన్నాయి.

ప్రతి సంవత్సరం దాదపు పదిలక్షల పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తుంటారు. ఇందులో దాదాపు 2,000 రకాల మొక్కలు, 507 జాతుల పక్షులు, 147 క్షీరదాలు, 114 సరీసృపాలు, 49 రకాల చేపలు ఉన్నాయి. బిగ్ ఫైవ్ (Big Five) గా వ్యవహరించబడే సింహము, ఏనుగు, ఖడ్గమృగము, అడవి దున్న, చిరుతపులి లను చూడవచ్చును.

Self-Drive (స్వంత స్వారీ) క్రూగర్ ప్రత్యేకత. పర్యాటకుల వద్ద కారు/జీపు ఉన్నచో వారే పార్కు మొత్తం చుట్టేయవచ్చును. అధిక రుసుముతో స్థానిక ల్యాండ్రోవర్లు/గైడ్లతో పార్కును పర్యటించవచ్చును.

చరిత్ర

[మార్చు]

ప్రాచీనులు ఇక్కడ 15,00,000 ఏళ్ళ క్రితమే నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. బుష్ మెన్ అనే జాతి ప్రజలు 10,00,000 ఏళ్ళ క్రితం నివసించారు. 200 వ సంవత్సరంలో ఉత్తర దిశ నుండి వచ్చిన న్గుని భాష మాట్లాడే ప్రజలు బుష్ మెన్ లను తరిమికొట్టారు. 800 సంవత్సరానికల్లా మొజాంబిక్లో ఏర్పడ్డ నౌకాశ్రయాన్ని ఉపయోగించుకొని అరబ్లు బానిసల కొరకు ఈ ప్రదేశం పై దండెత్తసాగారు. కొందరు అరబ్బులు ఇక్కడే స్థిరపడి ఉత్తర భాగంలో ఉన్న ఇనుము దోచుకొన్నారు. థులమేలా అనే ప్రదేశంలో 1250 నుండి 1700వ సంవత్సరం వరకు వెలువడిన దాదాపు 200 గనులను కనుగొనవచ్చును.

ఈ ప్రదేశాన్ని మొట్టమొదట అన్వేషించినది నెదర్లాండ్స్ దేశానికి చెందిన ఫ్రాన్సోయిస్ డీ క్యూపర్. 1725లో ఇతను యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున కేప్ కాలనీ వలస పేరుతో ఒక బృందానికి నాయకత్వం వహించాడు. అయితే ఈ వలసను స్థానిక జాతీయులు గొమోండ్వానేలో ఎదుర్కొని వీరిని తరిమేశారు.

1838 లో Voortrekkerexpeditions (Pioneer Expeditions) తరఫున లూయీస్ ట్రెగార్డ్ట్, హాన్స్ వాన్ రెన్స్బర్గ్ లోవెల్డ్ ప్రాంతాన్ని అన్వేషించటానికి వచ్చారు. 1845 లో జోవో అల్బాసినీ అనే పద్ధెనిమిది ఏళ్ళ ఇటాలియన్ ఇక్కడ నివసించిన యూరోపియన్లలో ప్రథముడిగా నిలిచాడు. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. అప్పుడే ఇక్కడ యుద్ధవాతావరణం నెలకొన్నది.

సెప్టంబరు 1873 లో పిలిగ్రింస్రస్ లో, 1881 లో బార్బర్టన్ లో స్వర్ణం కనుగొనబడింది. సింహాలు, మొసళ్ళు, మలేరియా బెడద ఉన్ననూ అదృష్టాన్ని వెదుక్కొంటూ అన్ని దేశాల వారు ఇక్కడికి పోటెత్తారు. ఈ భారీ వలసలతో, వేటతో, జంతు చర్మాలు, కొమ్ముల పరివర్తకంతో ఇక్కడి వన్యప్రాణులకు ప్రాణహాని మొదలైనది.

గేం రిజర్వ్

[మార్చు]
స్కుకుజా క్యాంప్ స్వాగత ద్వారం వద్ద మా స్థాపకులు అని వ్రాసి ఉన్న శిలాఫలకం పై పీట్ గ్రాబ్లర్, పాల్ క్రూగర్,, జేమ్స్ స్టీవెన్సన్- హ్యామిల్టన్ ల ముఖశిల్పాలు

1869లో సోకిన వైరస్ వలన చాలా జంతువులు మృత్యువాత పడ్డాయి. భవిష్యత్తులో వేటగాళ్ళ కోసం ట్రాన్స్వాల్ నేషనల్ కౌన్సిల్ చిన్నపాటి గేం రిజర్వ్ (సఫారీ) ను ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది. 1898 లో సాబీ గేం రిజర్వ్ కొరకు విరాళాలు వచ్చినవి, కానీ అంతలోనే రెండవ బోయర్ యుద్ధం జరిగింది. యుద్ధం తర్వాత (1902లో) అప్పటి మేజర్ జేమ్స్ స్టీవెన్సన్-హ్యామిల్టన్ ఈ పార్కుకు నాయకతవం వహించాడు. కొద్ది నెలలలోనే సాబీ, ఆయిల్ ఫాంట్స్ నది మధ్యలో ప్రదేశాన్ని కూడా పార్కులో చేర్చటం జరిగింది.

ఉత్తరభాగంలో ఉన్న షింగ్వెడ్జి గేం రిజర్వ్ ను 1903లో పార్కులో చేర్చారు. క్రూక్స్ కార్నర్ అనే త్రికోణాకారపు భాగం కూడా ఇందులోనిదే. ఈ త్రికోణాకారపు భాగానికి మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా, జింబాబ్వేలు సరిహద్దులు. 19వ శతాబ్దంలో ఈ ప్రదేశం వేటగాళ్ళకు, ఆయుధ అక్రమ రవాణాదార్లకు, శరణార్థులకు, అనాథలకు భూతల స్వర్గముగా వెలిగినది. ఒక దేశపు రక్షకభటులు విజృంభించినపుడు, నది ద్వారా, ఇంకో దేశానికి తప్పించుకు పారిపోవుటకు చాలా అనువుగా ఉండేది. 1920లో లింపోపో ప్రాంతంలో రక్షకభటుల కళ్ళకు చిక్కక, ఏనుగు దంతాలను వేటాడే సిసిల్ బర్నార్డ్ (బ్వెకెన్యా) కు ఇచ్చట ఒక శిలాఫలకమును ఆవిష్కరించబడిననూ, అతనే ఒక రేంజర్ గా మారిపోవటం, ఒక రక్షకభట ఉపకార్యాలయాన్ని ఇక్కడ నిర్మించబడటం, హాస్యాస్పదం.

సుదీర్ఘకాలంగా వేటాడబడటం వలన ఈ వన్యప్రాణి సంరక్షక కేంద్రంలో మిగిలిన వన్యప్రాణులు చాలా తక్కువగా ఉండేవి. లోవెల్డ్ ప్రదేశం మలేరియాకు, తెల్ల దొరల శ్మశానవాటికగా పేరుగాంచినందుకు స్టీవెన్సన్ అందరి ఉద్యోగులను అక్కడి నుండి తొలగించాడు. అతను, అతని అనుచరులు ఇతర సాధుజంతువులను రక్షించటానికి, వాటి సంఖ్య అభివృద్ధి చెందటానికి క్రూర మృగాలనన్నింటినీ అంతమొందించటం మొదలు పెట్టారు.

జాతీయ ఉద్యానవనం

[మార్చు]

1912 లో ఈ వన్యసంరక్షక కేంద్రంలో ఒక రైల్వే లైను వేయబడింది. ఈ రైల్వే లైను వేయటం వలన స్టీవెన్సన్ పర్యాటకులను మధ్యాహ్న భోజనానికి ఆకర్షితులు చేయగలిగారు. 1916 లో ఈ కేంద్రం భవిష్యత్తు సంరక్షక కేంద్రంగా పరిశీలించబడింది. 1926 లో బ్రిటీషు పరిపాలక వ్యవస్థ దీనిని పాల్ క్రూగర్ పేరుపై నామకరణం చేయటం సమంజసమని దక్షిణ ఆఫ్రికా మొట్టమొదటి జాతీయ వనంగా పేర్కొనటం ఎంతైన అవసరమని నిర్ణయించింది. 1927 లో తొల్దొలుత పర్యాటకులు £ 1.00 ప్రవేశ రుసుముతో సందర్శనార్థం అనుమతించబడ్డారు. ఆ సంవత్సరం అతి తక్కువ కార్లు వనాన్ని సందర్శించిననూ 1935వ సంవత్సరానికి 26,000 వేల మంది పర్యాటకులు ప్రవేశ ద్వారాలను దాటారు.

అత్యధిక పర్యాటకులు క్రూర మృగాలను దర్శించటానికి ఔత్సాహికులు అవ్వటం స్టీవెన్సన్-హ్యామిల్టన్ కు సంభ్రమాశ్చర్యాన్ని కలిగించింది. ఈ పరిణామాంతో అతను క్రూరమృగాలను సంహరించటం ఆపివేశాడు. 1946 లో పదవీవిరమణ చేసి, 1957లో తుదిశ్వాస విడిచారు.

1960వ దశకంలో చేపట్టిన వన్యప్రాణులకు త్రాగునీరు (Water for Wildlife) ప్రాజెక్టుతో వన్యప్రాణుల సంతతిలో అభివృద్ధి కనబడింది. దాదాపు 300 గాలిమరలు ఉద్యానవనంలో స్థాపింపబడ్దాయి. వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేయబడ్డ జలద్వారాలు వన్యప్రాణులను వనంలోకి ఆకర్షించాయి. అయితే ఇది ప్రకృతివిరుద్ధ ధర్మమని, ప్రకృతిని బంధించరాదని, దానికై దానిని వదిలివేయటమే సరియైన నిర్ణయమని తర్వాతి కాలంలో పార్కు యాజమాన్యం భావించింది.

ఆధునికీకరణ

[మార్చు]

1991 లో నేషనల్ పార్క్స్ కౌన్సిల్ కు రాబ్బీ రాబిన్సన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమింపబడ్డాడు. రాబిన్సన్ క్రూగర్ నేషనల్ పార్క్ ను ఆధునిక దక్షిణ ఆఫ్రికాగా రూపాంతరం చేయాలని ప్రయత్నించాడు. పశ్చిమ సరిహద్దుల్లోని తీగలను తొలగించాడు. ప్రక్క దేశాలలో ఉన్న గేం రిజర్వ్ ల నుండి జంతువులు ధారాళంగా ఇందులోకి వచ్చేలా చేశాడు.

1998 లో క్రూగర్ నేషనల్ పార్క్ తొట్టతొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా డేవిడ్ మబుండ అనే ఒక నల్ల జాతీయుని ఎన్నుకొనబడటం జరిగింది. 2003 లో మబుండ ప్రకారం వనం చుట్టు ప్రక్కల నివసించే నిరుపేదల సహాయ సహకారాలతో, స్థిరత్వానికి భవిష్యత్తులో అత్యధిక ప్రాధ్యాన్యం ఇవ్వబడుతుంది. గణాంకాల ప్రకారం ఒక మిలియను ప్రజలు 181 స్థిరనివాసాలలో ఈ కేంద్రంలో 60% భూమిపై హక్కు కలిగి ఉన్నారు. పార్కు దక్షిణభాగాన్ని వ్యాకరణించటంతో ఈ సంఘాలకు పర్యావరణ-పర్యాటక ప్రదేశాలను పంచవచ్చని తేలినది (ఉదా: వన్యప్రాణి పర్యటనలు, ప్రవేశ నియంత్రణ, భోజనశాలలు, మార్గనిర్దేశక పర్యటనలు 4 X 4 త్రోవలు, అటవీ శిబిరాలు, హోటళ్ళు).

క్యాంపులు

[మార్చు]
  • బలూలే
  • బర్గ్-ఎన్-దాల్
  • మొసళ్ళ వంతెన (Crocodile Bridge)
  • లెటాబా
  • మాలెలేని
  • మొపాని
  • ఆలిఫాంట్స్ (Olifants)
  • అండర్ సేబీ (Under Sabie)
  • ప్రెటోరియస్ కాప్ (Pretoriuskop)
  • పుండా మారియ (Punda Maria)
  • సతారా
  • షింగ్వెడ్జి
  • స్కుకూజా