గీతాంజలి కావ్యం
రచయిత(లు) |
|
---|---|
మూల శీర్షిక | গীতাঞ্জলি |
దేశం | బ్రిటీష్ రాజ్ |
భాష | బెంగాలీ, ఇంగ్లీషు |
విషయం | దైవభక్తి |
శైలి | పద్యాలు |
ప్రచురణ కర్త | మాక్మిల్లన్ అండ్ కంపెనీ |
ప్రచురించిన తేది | 1910 |
ఆంగ్లంలో ప్రచురించిన తేది | 1912 |
పుటలు | 104 |
గీతాంజలి (Bengali: গীতাঞ্জলি, lit. ''గీతాల కైమోడ్పు'') రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది.
చరిత్ర
[మార్చు]బెంగాలీ భాషలో వ్రాయబడిన మూల గ్రంథం గీతాంజలి 103/157 పద్యాల సంకలనం. ఇది 1910, ఆగష్టు 14న ప్రచురింపబడింది. ఇంగ్లీషు గీతాంజలి లేదా సాంగ్ ఆఫరింగ్స్ 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లం లోనికి తర్జుమా చేశాడు. ఈ ఇంగ్లీషు గీతాంజలి మొదటిసారి 1912 నవంబర్ నెలలో లండన్‌లోని ఇండియా సొసైటీ ప్రచురించింది. ఈ గ్రంథంలో 53 పద్యాలు మూల గ్రంథమైన బెంగాలీ గీతాంజలి నుండి అనువాదం చేయగా తక్కిన 50 పద్యాలు ఇతడు వ్రాసిన నాటకం "అచలయతన్" నుండి మరో ఎనిమిది గ్రంథాలనుండి స్వీకరించి అనువదించాడు.[1] మానవుని కృంగదీసే నిరాశా నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూచి శ్రమ యొక్క గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం దీనిలోని ముఖ్యాంశం. ఈ కావ్యంలోని మార్మిక మాధుర్యం, శబ్ద మాధుర్యం, తాత్విక సౌరభం ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. ప్రకృతి ఈ కావ్య రచనకు రవీంద్రనాథ్ టాగూరుకు ప్రేరణగా నిలించింది. ఆ రోజుల్లో (1900-1913) భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రచయిత. భక్తితో కూడిన దేశప్రేమ మనకు ఈ పద్యాలలో కనిపిస్తుంది[2].
ఈ అనువాదాన్ని రవీంద్రనాథ్ టాగూరు 1912లో తన ఇంగ్లాండు పర్యటనకు ముందు వ్రాశాడు. ఇంగ్లాడులోని ప్రజలు ఈ పద్యాలను విపరీతంగా ఆదరించారు. 1913లో గీతాంజలి ఇంగ్లీషు అనువాదం కారణంగా రవీంద్రనాథ్ టాగూరు సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఐరోపా ఖండేతర వ్యక్తిగా నిలిచాడు.[3]
పాశ్చాత్య దేశాలలో గీతాంజలి ఎక్కువ ప్రజాదరణను చూరగొనింది. తత్ఫలితంగా ఎన్నో అనువాదాలు వెలువడ్డాయి.[4]
20వ శతాబ్దపు ప్రముఖ ఐరిష్ కవి విలియం బట్లర్ యీట్స్ ఇంగ్లీషు గీతాంజలి 1912 నాటి మొదటి ముద్రణకు పరిచయ వాక్యాలు వ్రాశాడు. [5]
గీతాంజలి తెలుగు అనువాదాలు
[మార్చు]రవీంద్రనాథ్ టాగూరు బెంగాలీలో వ్రాసిన గీతాంజలిని పలువురు తెలుగు కవులు, రచయితలు తెలుగు భాషలోనికి అనువదించారు. వాటిలో 1. గీతాంజలి (కవిత) - గుడిపాటి వెంకట చలం, 2. గీతాంజలి - రాయప్రోలు సుబ్బారావు, 3.గీతాంజలి - కె.వి.రమణారెడ్డి, 4. గీతాంజలి - ఆదిపూడి సోమనాథరావు, 5.గీతాంజలి - బొమ్మకంటి వేంకట సింగరాచార్య, 6. రవీంద్రుని గీతాంజలి - బెందాళం కృష్ణారావు, 7. రవీంద్రుని గీతాంజలి - చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు, 8. గీతాంజలి - మువ్వల సుబ్బరామయ్య, 9. గీతాంజలి - నాగరాజు రామస్వామి, 10. రవీంద్ర గీత - కొంగర జగ్గయ్య, 11. గీతాంజలి - శంకరంబాడి సుందరాచారి, 12. గీతాంజలి - బెజవాడ గోపాలరెడ్డి, 13. గీతాంజలి - బెల్లంకొండ రామదాసు[6] 15. గీతాంజలి - దుర్గానంద్, 16. ఠాగూరు గీతాంజలి - భూషి కృష్ణదాసు, 17. గీతాంజలి - రూపనగుడి నారాయణరావు, 18. గీతాంజలి - అమరేంద్ర, 19.సడిలేని అడుగులు - మసన చెన్నప్ప[7], 20.గీతాంజలి - డా|| భార్గవి, 21. ఇటీవల వచ్చిన శివరామకృష్ణ "గీతాంజలి" మొదలైనవి పేర్కొన దగినవి.
కొన్ని పద్యాలు
[మార్చు]గీతాంజలి కావ్యంలోని మచ్చుకు కొన్ని కవితలు
- ప్రార్థన[8]
ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,
సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం
విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం
ఇంకిపోకుండా వుంటుందో,
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
- మరణం[9]
జీవితపు ఆఖరు మజిలీ,
ఓ నా మృత్యువా, వచ్చి నాతో ఊసులాడు.
ప్రతిదినం నేను నీ రాకకై ఎదురుచూస్తున్నా ప్రభూ,
నా జీవితపు ప్రమోదాలను జీవింపజేస్తూ.
నేను, నా సర్వస్వం, బహుశా నా ప్రేమ
రహస్య అగాధాల వరకు నీ వైపు ప్రవహించాయి.
ఒక్క నీ ఆఖరు వాలుచూపు..
నా జీవితం అంతా నీది.
సుమాలు, సుమమాలలు వధువు కోసం సిద్ధం.
వివాహం తరువాత వధువు ఇంటిని విడిచి పయనం
తన ప్రభువును ఏకాంతపు రాత్రులలో కలవడం కోసం.
ఒక్క నిమిషం. కాసేపు నీ ప్రక్కన నన్నుకూర్చో నివ్వవూ?
పనులు తరువాత చేసుకుంటాను. నీ ముఖాన్ని ఒక్క మాటైనా చూడకపోతే, నా హృదయానికి శాంతీ, స్థిమితమూ ఉండవు. నాకు ఎంత చిన్న పని అయినా ఈదరాని మహాసముద్రంలా కనిపిస్తుంది.
కిటికీ దగ్గర కూర్చున్నాను. వేసవి వచ్చింది. వేసవి నిశ్వాసలు వినవస్తున్నాయి. వికసిస్తున్న పూల పొదల వద్ద భ్రమరాలు రొద చేస్తూ తిరుగుతున్నాయి.
ప్రభూ! ఇది కాసేపు నీ ముఖం వైపే చూస్తూ ప్రశాంతంగా నీప్రక్కనే కూర్చుని, తీరికగా నా జీవన గీతాన్ని నీకు సమర్పించవలసిన సమయం.
జీవన జీవనమా!
నీ సజీవ స్పర్శ ఎల్లప్పుడూ నా శరీరంపై వుంటుందని తెలిసి, నా దేహాన్ని దేవాలయంలా పరిశుద్ధంగా వుంచుకోడానికి ప్రయత్నిస్తాను. అసత్యాన్ని మనసులో అడుగుపెట్టనివ్వక అల్లంత
దూరంలో వుంచుతాను. నా మనో మందిరంలో హేతు జ్యోతిని వెలిగించిన సత్యానివి నీవు.
నా హృదయాంతరంలో నీ పీఠం వున్నదని తెలిసి, దుష్టత్వాన్ని చేరనివ్వక నా హృదయాన్ని ఎల్లప్పుడూ నవవసంత ప్రేమారామంగా వుంచుకుంటాను.
నేను చేసే ప్రతి పనిలో నీవే ప్రతిఫలించాలని నా కోరిక. నీవు ప్రతిఫలిస్తే నాకు ఏ పని చేయాలన్నా శక్తి కలిగేది.
నీవు పాడుతూ వున్నప్పుడు నేను వింటాను. నీవు ఎలా పాడుతున్నావో, ఏమి పాడుతున్నావో నాకు అవగతం కాదు. అయినా నిశ్శబ్దంగా ఆశ్చర్యంతో ఆ పాట వింటాను.
నీ గానజ్యోతి యీ ప్రపంచాన్నంతా దీప్తం చేస్తుంది. నీ గానంలోని జీవశక్తి ఉచ్ఛ్వాస నిశ్వాసల వలె వియత్తలమంతా నిండి పోతుంది. పరమ పావనమైన నీ గానవాహిని రాళ్ళనూ, రప్పలనూ ఛేదించుకుని పరుగులు తీస్తూ ప్రవహించి పోతుంది.
నీ గానంలో శ్రుతి కలపాలని నా హృదయం అర్రులు చాస్తుంది. కాని ఎంత పెగల్చుకున్నా గొంతులో నుంచి వెలువడదు. మాట బయటకు వచ్చినా మాట పాటగా మారదు.
ఏం చేయాలో తోచక వెర్రిగా ఏడుస్తాను.
ప్రభూ నీవు నన్ను నీ గానాల వలలో బందీని చేశావు సుమా!
శివరామకృష్ణ అనువాదం క్రింది విధంగా హృద్యంగా ఉన్నది - 46 వ కవిత:
కాలపు ఏ చివరి అంచు నుండి నువ్వు నాకోసం వస్తున్నావో నాకు తెలియదు. నీవాళ్ళే అయిన సూర్యుడూ, తారకలూ నిన్ను నా నుండి ఎప్పటికీ మరుగుచేసి ఉంచలేరు.
ఎన్ని ఉదయాలూ సాయంత్రాలూ నీ అడుగుల సవ్వడులు వినిపించాయో1 నీ దూత నా యెదలోకి వచ్చి ఎవ్వరికీ తెలియకుండా పలుకరించి వెళ్ళాడు.
ఈ రోజు నా బ్రతుకులో ఈ కల్లోలం యేమిటో, హృదయంలో ఈ సంతోషపు స్పందనలేమిటో అర్థం కావడం లేదు.
నా విధులన్నీ పూర్తిచేసుకోవలసిన సమయం వచ్చేట్లుంది. ఒక అవ్యక్త మధుర పరిమళం గాలిలో తేలి వస్తోంది, నువ్వు ఇక్కడే ఉన్నావనిపిస్తూ!
మూలాలు
[మార్చు]- ↑ Ghosal, Sukriti. "The Language of Gitanjali: the Paradoxical Matrix" (PDF). The Criterion: An International Journal in English. Retrieved 14 August 2012.
- ↑ గీతాంజలి వంగీపురం సుందరాచార్యుల అనువాదానికి జె.ఎ.సి.ఎస్.రావు వ్రాసిన ముందుమాట నుండి
- ↑ Sukriti. "Gitanjali: Song Offerings". Retrieved 8 April 2017.
- ↑ Gitanjali: Selected Poems (2010-07-30). "Gitanjali: Selected Poems". School of Wisdom. Archived from the original on 2012-07-21. Retrieved 2012-07-11.
- ↑ "Yeats' introduction to Tagore's Gitanji". The Fortnightly Review (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-05-27. Retrieved 2017-12-21.
- ↑ బెల్లంకొండ రామదాసు. గీతాంజలి (అనువాదం - మూలం: రవీంద్రనాథ్ టాగూరు). విజయవాడ: జయంతి పబ్లికేషన్స్. Retrieved 22 March 2018.
- ↑ "సడిలేని అడుగులు - విశ్వకవి రవీంద్రుని గీతాంజలికి ఆచార్య మసన చెన్నప్ప సరళ సుందర అనువాదం - సబ్బని లక్ష్మీనారాయణ". Archived from the original on 2017-11-07. Retrieved 2018-03-23.
- ↑ చలం అనువాదం
- ↑ పొద్దు అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైన ఇ.ఎన్.వి.రవి స్వేచ్ఛానువాదం
బయటి లింకులు
[మార్చు]