గుల్మార్గ్
గుల్మార్గ్ | |
---|---|
హిల్ స్టేషన్ | |
జమ్మూ కాశ్మీర్, భారతదేశం | |
Coordinates: 34°03′N 74°23′E / 34.05°N 74.38°E | |
Country | భారతదేశం |
Union Territory | జమ్మూ కాశ్మీర్ |
District | బారాముల్లా |
Elevation | 2,650 మీ (8,690 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,965 |
Languages | |
• Official | కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, డోగ్రి, ఇంగ్లీష్[1][2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 193403 |
గుల్మార్గ్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ (కేంద్రపాలిత ప్రాంతం) లోని ఒక హిల్ స్టేషన్. దీని అసలు పేరు గౌరీమార్గ్, దీనిని 16వ శతాబ్దంలో కాశ్మీర్ ని పాలించిన యూసుఫ్ షా చక్ గుల్మార్గ్‌గా మార్చాడు[3]. దీనిని భూమిపై స్వర్గం అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. పూల భూమిగా పిలువబడే ఈ ప్రదేశం బారాముల్లా జిల్లాలో ఉంది. ఇక్కడ పచ్చటి వాలులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సముద్ర మట్టానికి 2730 మీ. ఎత్తులో ఉన్న గుల్‌మార్గ్ కి శీతాకాలంలో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు[4].
చరిత్ర
[మార్చు]1579 నుండి 1586 వరకు కాశ్మీర్‌ను పాలించిన యూసుఫ్ షా చక్, తనభార్య అయిన హబ్బా ఖాటూన్‌తో కలిసి ఈ ప్రదేశానికి తరచూ వచ్చేవాడు 'గుల్‌మార్గ్' ("పువ్వుల గడ్డి మైదానం లేదా పూల భూమి") అని పేరు మార్చాడు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ గుల్మార్గ్‌లోని తన తోటల కోసం 21 రకాల అడవి పువ్వులను సేకరించి పెంచాడు. 19వ శతాబ్దంలో, బ్రిటీష్ పౌర సేవకులు ఇండో-గంగా మైదానాలలో వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి గుల్మార్గ్ కు వెళ్లేవారు. గుల్‌మార్గ్‌లో మూడు గోల్ఫ్ కోర్స్‌లు స్థాపించబడ్డాయి, వీటిలో ఒకటి ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసారు. ఇక్కడ 2,650 మీటర్ల (8,690 అడుగులు) ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన గోల్ఫ్ కోర్స్ ఉంది. 1927లో, బ్రిటీష్ వాళ్ళు గుల్మార్గ్‌లో స్కీ క్లబ్‌ను స్థాపించారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసిన తరువాత, గుల్మార్గ్ స్వతంత్ర రాచరిక రాష్ట్రమైన కాశ్మీర్, జమ్మూలో భాగమైంది. ఆపరేషన్ గుల్మార్గ్ పేరుతో రాష్ట్రంపై దాడికి పాకిస్థాన్ ప్రణాళిక చేసింది. ఆయుధాలతో పాకిస్తానీ సాధారణ దళాల మద్దతుతో, హాజీ పీర్ పాస్, గుల్‌మార్గ్ గుండా రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌కు వెళ్లింది. 1 వ సిక్కు రెజిమెంట్ నేతృత్వంలోని భారత సైన్యం, రాష్ట్ర డోగ్రా పాలకుడు మహారాజా హరి సింగ్ విలీన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత శ్రీనగర్‌కు విమానంలో సైనికులను తరలించారు. 1947 అక్టోబరు 26న గుల్మార్గ్‌తో సహా అనేక పట్టణాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
1948లో, ఇండియన్ ఆర్మీ గుల్‌మార్గ్‌లో ఒక స్కీ స్కూల్‌ను స్థాపించింది, అది తర్వాత స్నో-క్రాఫ్ట్, ఇండియన్ ఆర్మీ హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్‌గా మారింది. 1 జనవరి 1949న, యుద్ధం యుఎన్ పర్యవేక్షణలో ముగిసింది, 1972 నాటి సిమ్లా ఒప్పందం ద్వారా నియంత్రణ రేఖ (LOC)గా పేరు మార్చబడిన కాల్పుల విరమణ రేఖ (CFL) గుల్మార్గ్‌కు దగ్గరగా వచ్చింది. 1968లో, స్కీ బోధకులకు శిక్షణ ఇవ్వడానికి గుల్‌మార్గ్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటెనీరింగ్ స్థాపించబడింది. గుల్మార్గ్ ఆసియా దేశాల నుండి స్కీయర్లకు కేంద్రంగా మారింది[5]. ఆ తరువాత తీవ్రవాదం కారణంగా మూసివేయబడింది. మళ్ళీ 1998లో పునఃప్రారంభించబడింది. మే 1998లో, ప్రాజెక్ట్ మొదటి దశ గుల్మార్గ్, కొంగ్డోరి మధ్య వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. మే 2005లో, ప్రాజెక్ట్ 2వ దశ కూడా ప్రారంభించబడింది, ఇది ఆసియాలోని పొడవైన, ఎత్తైన రోప్‌వేలలో ఒకటిగా నిలిచింది. ప్రాజెక్ట్ ఫేజ్ 3లో భాగంగా ఏర్పాటు చేయబడిన చైర్‌లిఫ్ట్ 2011లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. జాతీయ వింటర్ గేమ్స్ 1998, 2004, 2008లో గుల్‌మార్గ్‌లో జరిగాయి. 2014లో, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గుల్మార్గ్ కోసం ఒక మాస్టర్ ప్లాన్-2032ను రూపొందించింది. గుల్‌మార్గ్‌కు సమీపంలోని 20 ఎకరాల స్థలంలో ఘన-వ్యర్థాల శుద్ధి కర్మాగారాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రణాళికలో ఉంది.
వాతావరణం
[మార్చు]శ్రీనగర్ నుండి 56 కిమీ దూరంలో 2,650 మీ (8,694 అడుగులు) ఎత్తులో హిమాలయాలలోని పీర్ పంజాల్ శ్రేణిలో కప్పు ఆకారపు లోయలో గుల్మార్గ్ ఉంది. గుల్‌మార్గ్‌లోని మట్టిలో హిమనదీయ నిక్షేపాలు, లాకుస్ట్రిన్ నిక్షేపాలు, ప్లీస్టోసీన్ యుగం నాటి మొరైన్ షెల్స్, సున్నపురాళ్ళు, ఇసుకరాళ్ళు, స్కిస్ట్‌లు ఇతర రకాల రాళ్లు ఉన్నాయి. ఇక్కడ శీతాకాలంలో ఎక్కువగా మంచు ఉంటుంది, అధిక ఎత్తులో ఉన్నందున, గుల్మార్గ్ తేమతో కూడిన ఖండాంతర వాతావరణాన్ని కలిగి ఉంటుంది, వేసవి కాలంలో ఉష్ణోగ్రత మధ్యస్తంగా ఉంటుంది, గుల్‌మార్గ్‌లోని పచ్చికభూములలో వసంతకాలంలో డైసీలు, ఫర్‌మెర్-మీ-నాట్స్, బటర్‌కప్‌ల వంటి అడవి పువ్వులు పెరుగుతాయి. ఇక్కడ ఉద్యానవనాలు, చిన్న సరస్సులు, చుట్టూ పచ్చని పైన్, ఫిర్ అడవులు ఉంటాయి. గుల్మార్గ్‌లో స్కీయింగ్, శీతాకాలపు క్రీడలు 4,267 మీ (13,999 అడుగులు) ఎత్తులో ఉన్న అఫర్వాత్ శిఖరం వాలులలో నిర్వహిస్తారు.
పర్యాటకం
[మార్చు]గుల్మార్గ్ గొండోలా
[మార్చు]ఫ్రెంచ్ కంపెనీ పోమగల్స్కి నిర్మించిన గుల్‌మార్గ్ గోండోలా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది, ఇది 3,979 మీటర్లు ఉంటుంది. రెండు-దశల రోప్‌వే గుల్‌మార్గ్ సమీపంలోని అఫర్వాత్ శిఖరం మధ్య గంటకు 600 మందిని రవాణా చేస్తుంది. ఇది ఆసియాలో అత్యంత ఎత్తైన కేబుల్ కార్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతి పెద్దది, రెండవది కూడా. గొండోలా ఒకేసారి ఆరుగురు వ్యక్తులను, గంటకు 600 మందిని తీసుకువెళ్లగలదు.
స్కీయింగ్
[మార్చు]స్కీయింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి, గుల్మార్గ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ స్కీయింగ్ రిసార్ట్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. డిసెంబరులో మంచు కురిసిన తర్వాత, స్కీయింగ్ కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇక్కడ స్కీయింగ్ చేయాలంటే వాలులపై స్కీయింగ్ చేసిన అనుభవం ఉండాలి. స్కీయింగ్ నేర్చుకోవడం ప్రారంభించిన వారికి కూడా ఇది సరైన ప్రదేశం. ఇక్కడ అన్ని స్కీయింగ్ సౌకర్యాలు, మంచి బోధకులు కూడా అందుబాటులో ఉన్నారు.
ఇగ్లూ కేఫ్, గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్
[మార్చు]ఫిబ్రవరి 2022లో, గుల్మార్గ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ ప్రారంభించబడింది[6]. ఇది 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వ్యాసంతో నిర్మించబడింది. దాదాపు 40 మంది వ్యక్తులు అక్కడ ఒకేసారి భోజనం చేయవచ్చు. 2023లో, గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్‌ను గుల్‌మార్గ్‌లోని కొలహోయ్ గ్రీన్ హైట్స్ అనే హోటల్ అభివృద్ధి చేసింది.
గోల్ఫ్ కోర్స్
[మార్చు]గుల్‌మార్గ్ గోల్ఫ్ కోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్ఫ్ కోర్స్‌లలో ఒకటి. బ్రిటిష్ వాళ్లు తమ సెలవులను గడపడానికి ఇక్కడికి వచ్చేవారు. గోల్ఫ్ ఔత్సాహికుల కోసం 1904లో ఈ గోల్ఫ్ కోర్సులను నెలకొల్పారు. ప్రస్తుతం దీనిని జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తోంది.
మహారాణి ఆలయం
[మార్చు]మహారాణి మందిర్ (సాధారణంగా గుల్మార్గ్ శివాలయం అని పిలుస్తారు) 1915 వరకు పాలించిన తన భార్య మహారాణి మోహినీ బాయి సిసోడియా కోసం హిందూ పాలకుడు మహారాజ్ హరి సింగ్ నిర్మించాడు. ఈ ఆలయాన్ని డోగ్రా రాజుల విలాసవంతమైన ఆస్తిగా భావించేవారు. ఈ ఆలయం శివుడు, పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం పచ్చదనంతో కూడిన చిన్న కొండపై ఉంది. ఈ ఆలయం గుల్మార్గ్ నలుమూలల నుండి కనిపిస్తుంది.
గుల్మార్గ్‌లోని మహారాజా ప్యాలెస్
[మార్చు]8700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను 19వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా హరి సింగ్ నిర్మించాడు[7].
ఖిలన్మార్గ్
[మార్చు]ఖిలన్మార్గ్ గుల్మార్గ్ నడిబొడ్డున ఉన్న ఒక అందమైన లోయ. ఇక్కడ పచ్చని పొలాల్లో అడవి పూల అందాలు కనుచూపు మేరలో కనిపిస్తాయి. ఖిలాన్‌మార్గ్ నుండి మంచుతో కప్పబడిన హిమాలయాలు, కాశ్మీర్ లోయ కనపడతాయి.
అల్పథార్ సరస్సు
[మార్చు]పైన్, దేవదార్ చెట్లతో ఉన్న ఈ సరస్సు అఫర్వాత్ శిఖరం క్రింద ఉంది.
నింగ్లీ నల్లా
[మార్చు]నింగ్లీ నల్లా, గుల్మార్గ్ నుండి ఎనిమిది కి.మీ దూరంలో ఉంది, ఇది అఫర్వాత్ శిఖరం నుండి మంచు కరిగి అల్పత్తర్ సరస్సు నుండి నీరు ఏర్పడిన ప్రవాహం. ఈ తెల్లటి ప్రవాహం లోయలో పడి చివరకు జీలం నదిలో కలుస్తుంది. లోయలో ప్రవహించే ఈ ప్రవాహం గుల్మార్గ్‌లోని ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్.
హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్
[మార్చు]1948లో, ఇండియన్ ఆర్మీ గుల్‌మార్గ్‌లో ఒక స్కీ స్కూల్‌ను స్థాపించింది, అది తర్వాత హై ఆల్టిట్యూడ్ వార్‌ఫేర్ స్కూల్‌గా మారింది, ఇది స్నో-క్రాఫ్ట్, శీతాకాలపు యుద్ధాలలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది హిమపాతాలకు గురయ్యే ప్రాంతంలో ఉంది[8].
సమీప దృశ్యాలు
[మార్చు]శ్రీనగర్
[మార్చు]ఇది జమ్మూ కాశ్మీర్ రాజధాని, ఇక్కడ ఇది అతిపెద్ద నగరం. సముద్ర మట్టానికి 1730 మీ. ఎత్తులో ఉన్న శ్రీనగర్ కాలువ, హౌస్ బోట్, మొఘల్ గార్డెన్‌లకు ప్రసిద్ధి చెందింది.
బాబా రేషి దర్గా
[మార్చు]ఇది ముస్లింల ప్రధాన మత కేంద్రం. ఈ జియారత్ 1480లో మరణించిన ప్రముఖ ముస్లిం సన్యాసి జ్ఞాపకార్థం నిర్మించబడింది. పదవీ విరమణ చేయడానికి ముందు, అతను కాశ్మీర్ రాజు జియా-ఉల్-అబిదీన్ ఆస్థానంలో ఉన్నాడు. ఇక్కడికి ఏటా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
బాలీవుడ్
[మార్చు]బాబీ , ఆప్ కీ కసమ్, జబ్ తక్ హై జాన్, యే జవానీ హై దీవానీ, హైవే , ఫాంటమ్ , హైదర్ , మొదలైన అనేక బాలీవుడ్ చిత్రాల షూటింగ్ గుల్మార్గ్ లోనే చేసారు.
మూలాలు
[మార్చు]- ↑ "The Jammu and Kashmir Official Languages Act, 2020" (PDF). The Gazette of India. 27 September 2020. Retrieved 27 September 2020.
- ↑ "Parliament passes JK Official Languages Bill, 2020". Rising Kashmir. 23 September 2020. Archived from the original on 24 September 2020. Retrieved 23 September 2020.
- ↑ "Kashmir, Volume 1, Page 206, 1950, .. Twenty-eight miles to the west of Srinagar, at a height of 8,700 feet above sea level, is Gulmarg, which has the appearance of a balcony. Originally called 'Gauri Marg' (the path of Gauri - Siva's wife), and later on christened 'Gaulmarg' by King Yousuf Shah Chak of the Chak family (16th century A.D.) ..
- ↑ "Land Reforms in India: Computerisation of Land Records," Wajahat Habibullah and Manoj Ahuja (Editors), SAGE Publications, India, 2005, ISBN 9788132103493
- ↑ Seth, Pran Nath (1 January 2006). Successful Tourism: Volume I: Fundamentals of Tourism. Sterling Publishers Pvt. Ltd. pp. 175–176. ISBN 978-81-207-3199-8.
- ↑ Shenoy, Sanjana (2022-02-07). "India's First Igloo Cafe Comes Up In Gulmarg And We Can't Wait To Have Coffee Here". Curly Tales. Retrieved 2023-05-10.
- ↑ Desk, GK Photo. "In Pictures: Tourists Throng Maharaja Palace At Gulmarg On Hari Singh's Birth Anniversary". Greater Kashmir. Retrieved 2023-05-10.
- ↑ Hooda, Deepshikha (2018-07-11). "High Altitude Warfare School: Where Indian jawans are trained to survive in Siachen". The Economic Times. ISSN 0013-0389. Retrieved 2023-05-10.