చట్టి చిన పూర్ణయ్య పంతులు
చట్టి చిన పూర్ణయ్య | |
---|---|
జననం | చట్టి చిన పూర్ణయ్య 1885 శ్రీకూర్మం |
వృత్తి | శ్రీకాకుళం పురపాలక సంఘానికి అధ్యక్షుడు |
ప్రసిద్ధి | ప్రఖ్యాత రంగస్థల నటులు. |
తండ్రి | వెంకటనర్సులు |
తల్లి | వెంకట నరసమ్మ |
చట్టి చిన పూర్ణయ్య పంతులు (1885 - 1935) ప్రఖ్యాత రంగస్థల నటులు. ఈయన 1885 సంవత్సరం శ్రీకూర్మం క్షేత్రంలో జన్మించాడు. వీరి తల్లిదండ్రులు వెంకటనర్సులు, వెంకట నరసమ్మ. 1901లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులై 1911 సంవత్సరంలో పట్టభద్రులయ్యాడు. 1912లో ప్లీడరు పరీక్షలో ఉత్తీర్ణులై వృత్తిని ప్రారంభిచాడు. శ్రీకాకుళంలో 1905లో "హామ్లెట్" నాటకంలో హోరేషియా భూమికను పోషించడం ద్వారా నాటకరంగంలో ప్రవేశించాడు. 1907లో రమా విలాసినీ సమాజంలో చేరి గయోపాఖ్యానంలో బలరాముడు, పాండవోద్యోగ విజయాలలో కర్ణుడు మొదలైన పాత్రలను ధరించాడు. 1911లో మద్రాసులో చిత్రనళీయం నాటకంలో బహూక పాత్రపోషించి ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారిని మెప్పించాడు.
1914 సంవత్సరంలో శ్రీకాకుళం పురపాలక సంఘానికి కౌన్సిలర్ గా ఎన్నికై 1921లో అధ్యక్షులయ్యాడు. ఆ తర్వాత వరుసగా నాల్గు సార్లు అధ్యక్షులుగా ఎన్నికకావడం అపూర్వం. 1928లో దేవిడీ జమిందారు గారి ఆదరణతో రమా విలాస అమెచ్యూర్ల్ అనే నాటక సమాజాన్ని ప్రారంభించాడు. వీరి తొలి నాటక ప్రదర్శనం ద్రౌపదీ వస్త్రాపహరణంలో దుర్యోధన పాత్రను పోషించాడు. 1925లో రోషనారలో శివాజీగా నటించాడు. వీరు శివాజీ వేషం చాలా ప్రసిద్ధి పొందినది. నాటి జిల్లా కలెక్టరు గిల్లెట్ వీరిన్ శివాజీ మహారాజ్ అని సంబోధించేవాడు. వీరు గద్యానికి ప్రాముఖ్యం ఇచ్చి 1921 నుండి పద్యాలు పాడడం మానేశారు. పద్యాలున్న చోట వాటి భావం గద్యంలోనే చెప్పేవాడు.
1928లో యూనివర్సిటీ - ఆరనికీ డి ఫ్రాన్స్ లో భారతీయ నాటక శాస్త్రంలో గౌరవాచార్యుడిగా బిరుదుపొందాడు. 1929లో తెలుగు నాటకరంగ నిర్వాహకులు, కళాకారులు, కవులు, పోషకులలోని ముఖ్యులు కలిసి నాటకరంగ పునరుద్ధరణకు పెట్టిన ఆంధ్ర నాటక కళాపరిషత్తులో వ్యవస్థాపకుల్లో ఒకడు..[1] తెనాలిలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తు సమావేశానికి వీరు అధ్యక్షత వహించాడు.
మూలాలు
[మార్చు]- ↑ సురభి సప్తతి స్వర్ణోత్సవ సంచిక (1 ed.). హైదరాబాద్: సురభి నాటక కళాసంఘము. 1960. Retrieved 11 December 2014.