చాంద్ బీబీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుల్తానా చాంద్ బీబీ
బీజాపుర్, అహ్మద్ నగర్ లకు రాజప్రతినిధి
చాంద్ బీబీ హాకింగ్; 18 శతాబ్దపు రంగుల చిత్రం
జననం1550 CE
అహ్మద్ నగర్ కోట
నేడు మహారాష్ట్ర
మరణం1599 CE
Spouseఅలీ అదిల్ షా
Houseనిజాం షాహి (పుట్టుకతో)
అదిల్ షాహి (వివాహం తరువాత)
తండ్రిఒకటవ హుస్సేన్ నిజాం షా
తల్లిఖుంజా హుమాయూన్ బేగం
మతంఇస్లాం, షియా

సుల్తానా చాంద్ బీబీ (1550–1599 CE) ఒక భారతీయ పాలకురాలు, యోధురాలు. ఆమె 1580-1590లో రెండవ ఇబ్రహీం ఆదిల్ షా కు పిన్న వయసులో బీజాపూర్ సుల్తానేట్ కి రాజప్రతినిధి (రీజెంట్‌)గా వ్యవవహరించింది. 1595-1600లో ఆమె మేనల్లుడు బహదూర్ షా పిన్న వయసులో అహ్మద్‌నగర్ సుల్తానేట్‌కు కూడా రాజప్రతినిధిగా వ్యవహరించింది.[1] చాంద్ బీబీ 1595లో అక్బర్ చక్రవర్తి మొఘల్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి అహ్మద్‌నగర్‌ను రక్షించడం వలన ప్రసిద్ధి చెందింది.[2]

ప్రారంభ జీవితం

[మార్చు]

చాంద్ బీబీ భారతదేశంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మొదటి హుస్సేన్ నిజాంషా కుమార్తె,[3] అహ్మద్‌నగర్ సుల్తాన్ రెండవ బుర్హాన్ నిజాంషా కు సోదరి. ఆమె అరబిక్, పర్షియన్, టర్కిష్, మరాఠీ, కన్నడ వంటి అనేక భాషలలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు సితార్ వాయించడం, పువ్వులు చిత్రించడం వంటి అభిరుచులున్నాయి.[4]

బీజాపూర్ సుల్తానేట్

[మార్చు]

నాటి వారి సమాజ విధానాన్ని అనుసరించి, చాంద్ బీబీ బీజాపూర్ సుల్తానేట్ చెందిన మొదటి అలీ ఆదిల్ షాను వివాహం చేసుకుంది.[5] బీజాపూర్ తూర్పు సరిహద్దుకు సమీపంలో ఆమె భర్త నిర్మించిన పెద్ద దిగుడు బావికి ఆమె పేరు మీద 'చాంద్ బావ్ డి' అని పేరు పెట్టారు.[6]  

అలీ ఆదిల్ షా తండ్రి మొదటి ఇబ్రహీం ఆదిల్ షా సున్నీ ప్రభువులు, హబ్షీలు, దక్కనీల మధ్య అధికారాన్ని పంచాడు. అయితే, అలీ ఆదిల్ షా షియాలకు అనుకూలంగా ఉన్నాడు. [7] 1580లో ఆయన మరణించిన తరువాత, షియా ప్రభువులు అతని తొమ్మిదేళ్ల మేనల్లుడు రెండవ ఇబ్రహీం ఆదిల్ షా ను పాలకుడిగా ప్రకటించారు.[8] కమల్ ఖాన్ అనే దక్కనీ సైన్యాధిపతి అధికారాన్ని స్వాధీనం చేసుకుని రాజప్రతినిధి అయ్యాడు. అయితే చాంద్ బీబీ ఆతను సింహాసనాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్నాడని భావించినందున కమల్ ఖాన్ ఆమెతో అగౌరవంగా వ్యవహరించాడు. చాంద్ బీబీ మరొక సైనికాధికారి హాజీ కిష్వార్ ఖాన్ సహాయంతో కమల్ ఖాన్ పై దాడికి కుట్ర పన్ని పారిపోతున్నప్పుడు కమల్ ఖాన్ పట్టుకున్నారు. కోటలో శిరచ్ఛేదం చేసారు.

కిష్వార్ ఖాన్ ఇబ్రహీంకు రెండవ రాజప్రతినిధి అయ్యాడు. ధరాసియో వద్ద అహ్మద్ నగర్ సుల్తానేట్తో జరిగిన యుద్ధంలో, ఆయన నేతృత్వంలోని బీజాపూర్ సైన్యం శత్రు సైన్యానికి చెందిన ఫిరంగులు, ఏనుగులన్నింటినీ స్వాధీనం చేసుకుంది. విజయం తరువాత, కిష్వార్ ఖాన్ ఇతర బీజాపురి సైనికాధికారులను వారు స్వాధీనం చేసుకున్న ఏనుగులన్నింటినీ తనకు అప్పగించమని ఆదేశించాడు. ఏనుగులకు చాలా విలువ ఉండేది, ఇతర సైనికాధికారులకు ఇది చాలా కోపం తెప్పిచ్చింది. చాంద్ బీబీతో పాటు, వారు బంకపూర్ సైనికాధికారి ముస్తఫా ఖాన్ సహాయంతో కిష్వార్ ఖాన్ను నిర్మూలించడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. కిష్వార్ ఖాన్ గూఢచారులు కుట్ర గురించి అతనికి సమాచారం ఇచ్చారు, అతను ముస్తఫా ఖాన్ కు వ్యతిరేకంగా దళాలను పంపి బంధించి యుద్ధంలో చంపించాడు.[8] చాంద్ బీబీ కిష్వార్ ఖాన్ ని సవాలు చేసింది, కానీ అతను ఆమెను సతారా కోటలో ఖైదు చేసి, తనను తాను రాజుగా ప్రకటించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, కిష్వార్ ఖాన్ మిగిలిన సైనికాధికారులలో చాలా అప్రతిష్టపాలైయ్యాడు. [7] సైన్యంలో ముగ్గురు హబ్షి ప్రభువుల దళాలు ఉన్నాయి: ఇఖ్లాస్ ఖాన్, హమీద్ ఖాన్, దిలావర్ ఖాన్. హబ్షి సైనికాధికారి ఇఖ్లాస్ ఖాన్ నేతృత్వంలోని ఉమ్మడి సైన్యం బీజాపూర్ కు కవాతు చేసినప్పుడు అతను పారిపోయాడు. అహ్మద్ నగర్ లో కిష్వార్ ఖాన్ తన అదృష్టాన్ని పరీక్షించి విఫలమయ్యాడు, తరువాత గోల్కొండకు పారిపోయాడు. అతను రాజ్య బహిష్కరణలో ఉండగానే ముస్తఫా ఖాన్ బంధువు అతనిని చంపాడు. దీని తరువాత,చాంద్ బీబీ కొంతకాలం రాజప్రతినిధిగా వ్యవహరించింది.[8]

ఇఖ్లాస్ ఖాన్ అప్పుడు రాజప్రతినిధి అయ్యాడు, కానీ కొంతకాలం తర్వాత చాంద్ బీబీ అతనిని తొలగించింది. తరువాత, అతను తన నియంతృత్వాన్ని తిరిగి ప్రారంభించాడు, దీనిని ఇతర హబ్షి సైనికాధికారులు అంగీకరించలేదు.[7] బీజాపూర్ లో నెలకొన్న పరిస్థితిని సద్వినియోగం చేసుకుని, అహ్మద్ నగర్ నిజాం షాహీ సుల్తాన్ గోల్కొండ కు చెందిన కుతుబ్ షాహీతో పొత్తు పెట్టుకుని బీజాపూర్ పై దాడి చేశాడు. ఉమ్మడి దాడిని తిప్పికొట్టడానికి బీజాపూర్ వద్ద అందుబాటులో ఉన్న దళాలు సరిపోలేదు.[8] హబ్షి సైనికాధికారులు తాము ఒంటరిగా నగరాన్ని రక్షించలేమని గ్రహించి, తమ రాజీనామాను చాంద్ బీబీకి అప్పగించారు. [7] చాంద్ బీబీ నియమించిన షియా సైనికాధికారి అబూ-ఉల్-హసన్ కర్ణాటకలో మరాఠా దళాలను పిలిచాడు. మరాఠాలు ఆక్రమణదారుల సరఫరా మార్గాలపై దాడి చేశారు, అహ్మద్ నగర్ - గోల్కొండ మిత్రరాజ్యాల సైన్యం వెనక్కి తగ్గవలసి వచ్చింది.[8]

ఇఖ్లాస్ ఖాన్ బీజాపూర్ ను స్వాధీనం చేసుకోవడానికి దిలావర్ ఖాన్ పై దాడి చేశాడు. అయితే, అతను ఓడిపోయాడు, దిలావర్ ఖాన్ 1582 నుండి 1591 వరకు రాజప్రతినిధిగా వ్యవహరించాడు. బీజాపూర్ రాజ్యం క్రమబద్ధమైన తరువాత, చాంద్ బీబీ అహ్మద్ నగర్ కి తిరిగి వచ్చింది.[7]

అహ్మద్‌నగర్ సుల్తానేట్

[మార్చు]
బీజాపూర్ అలీ ఆదిల్ షా ముఖ్యమంత్రి ఇఖ్లాస్ ఖాన్

1591లో, మొఘల్ చక్రవర్తి అక్బర్ తన ఆధిపత్యాన్ని గుర్తించమని నలుగురు దక్కన్ సుల్తానేట్‌లను అడిగాడు. సుల్తానేట్లందరూ సమ్మతిని తెలియచేయలేదు, అక్బర్ రాయబారులు 1593లో తిరిగి వెళ్లారు. 1595లో అహ్మద్‌నగర్ సుల్తానేట్ పాలకుడు ఇబ్రహీం నిజాం షా, బీజాపూర్ రెండవ ఇబ్రహీం ఆదిల్ షాతో అహ్మద్‌నగర్ నుండి 40 మైళ్ల దూరంలో ఉన్న షాహదుర్గ్ వద్ద జరిగిన తీవ్రమైన యుద్ధంలో చంపబడ్డాడు.[9] అతని మరణానంతరం, చాంద్ బీబీ (అతని తండ్రి అత్త) రాజప్రతినిధిగా ఉండి ఆమె పాలనలో అతని పసికందు బహదూర్ షాను రాజుగా ప్రకటించాలని కొందరు పెద్దలు భావించారు.

అయితే, దక్కనీ మంత్రి మియాన్ మంజు 1595 ఆగస్టు 6న షా తాహిర్ పన్నెండేళ్ల కుమారుడు రెండవ అహ్మద్ నిజాం షా ను పాలకుడిగా ప్రకటించాడు. ఇఖ్లాస్ ఖాన్ నేతృత్వంలోని అహ్మద్ నగర్ హబ్షి ప్రభువులు ఈ ప్రణాళికను వ్యతిరేకించారు. ప్రభువులలో పెరుగుతున్న అసమ్మతి వలన మియాన్ మంజు అప్పుడు గుజరాత్ లో ఉన్న అక్బర్ కుమారుడు మురాద్ మీర్జాను అహ్మద్ నగర్ కు తన సైన్యాన్ని తరలించడానికి ఆహ్వానించాడు. మురాద్ మాల్వా వచ్చి అక్కడ అతను అబ్దుల్ రహీమ్ ఖాన్-ఇ-ఖానా నేతృత్వంలోని మొఘల్ దళాలలో చేరాడు. మాండూ వద్ద రాజా అలీ ఖాన్ వారితో చేరాడు, ఐక్య సైన్యం అహ్మద్ నగర్ వైపు ముందుకు సాగింది.[9]

అయితే, మురాద్ అహ్మద్ నగర్ కు కవాతు చేస్తున్నప్పుడు, చాలా మంది కులీనులు ఇఖ్లాస్ ఖాన్ను విడిచిపెట్టి మియాన్ మంజుతో చేరారు. మియాన్ మంజు, ఇఖ్లాస్ ఖాన్ ఇంకా ఇతర ప్రత్యర్థులను ఓడించాడు. ఇప్పుడు, మొఘలులను ఆహ్వానించినందుకు ఆయన విచారించాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆయన రాజప్రతినిధిగా ఉండమని చాంద్ బీబీని అభ్యర్థించి, రెండవ అహ్మద్ షాతో కలిసి అహ్మద్ నగర్ నుండి బయలుదేరారు. ఇఖ్లాస్ ఖాన్ కూడా పైథాన్ పారిపోయాడు, అక్కడ అతనిపై మొఘలులు దాడి చేసి ఓడించారు.[9]

చాంద్ బీబీ రాజప్రతినిధిగా ఉండడానికి అంగీకరించి, బహదూర్ షాను అహ్మద్ నగర్ కు రాజుగా ప్రకటించింది.[10]

అహ్మద్‌నగర్ రక్షణ

యువరాణి చాంద్ బీబీ అహ్మద్ నగర్ ను 1595లో రక్షించింది

1595 నవంబరులో మొఘలులు అహ్మద్ నగర్ పై దాడి చేశారు.[11] చాంద్ బీబీ నాయకత్వం వహించి అహ్మద్ నగర్ కోట ను విజయవంతంగా రక్షించింది .[12]   తరువాత, షా మురాద్, చాంద్ బీబీ దగ్గరకి ఒక రాయబారిని పంపాడు, బెరార్ ఆక్రమించే బదులుగా ముట్టడిని పెంచుతానని చెప్పాడు. చాంద్ బీబీ దళాలు కరువుతో బాధపడ్డాయి. 1596లో, మురాద్ కు బెరార్ ను అప్పగించడం ద్వారా శాంతి నెలకొల్పాలని ఆమె నిర్ణయించుకుంది, దానితో అతను వెనక్కి తగ్గాడు.

చాంద్ బీబీ తన మేనల్లుళ్ళు బీజాపూర్ కు చెందిన రెండవ ఇబ్రహీం ఆదిల్ షా , గోల్కొండకు చెందిన ముహమ్మద్ కులీ కుతుబ్ షా మొఘల్ దళాలకు వ్యతిరేకంగా ఏకం కావాలని విజ్ఞప్తి చేసింది.[13] రెండవ ఇబ్రహీం ఆదిల్ షా సోహైల్ ఖాన్ ఆధ్వర్యంలో 25,000 మంది సైనికులను పంపాడు, వీరితో పాటు నలదుర్గ్ వద్ద యెఖ్లాస్ ఖాన్ కు చెందిన మిగిలిన సైనిక దళం కూడా చేరింది. తరువాత, గోల్కొండ నుండి 6,000 మంది సైనికుల బృందం ఇందులో చేరింది.

చాంద్ బీబీ ముహమ్మద్ ఖాన్‌ను మంత్రిగా నియమించింది, కానీ అతను నమ్మకద్రోహి. మొత్తం సుల్తానేట్‌ను మొఘల్‌లకు అప్పగించేందుకు అతను ఖాన్-ఐ-ఖానాకు ఒప్పుకున్నాడు. ఇంతలో, ఖాన్-ఐ-ఖానా బేరార్ లో చేర్చబడని జిల్లాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. బీజాపూర్‌కు సోహైల్ ఖాన్ తిరిగి వచ్చి ఖాన్-ఐ-ఖానా మొఘల్ దళాలపై దాడి చేయమని ఆదేశించారు. ఖాన్-ఐ-ఖానా, మీర్జా షారూఖ్ నేతృత్వంలోని మొఘల్ దళాలు బేరార్‌లోని సహపూర్‌లోని మురాద్ శిబిరాన్ని విడిచిపెట్టి, గోదావరి నది ఒడ్డున సోన్‌పేట్ (సూపా) సమీపంలో సోహైల్ ఖాన్ ఆధ్వర్యంలో బీజాపూర్, అహ్మద్‌నగర్, గోల్కొండ సంయుక్త దళాలను ఎదుర్కొన్నాయి. 1597లో 8-9 ఫిబ్రవరిన జరిగిన భీకర యుద్ధంలో, మొఘలులు విజయం సాధించారు. విజయం సాధించినప్పటికీ, మొఘల్ దళాలు తమ దాడిని కొనసాగించలేక చాలా బలహీనంగా ఉండి, సహ్ పూర్ తిరిగి వచ్చాయి. వారి సైనికాధికారి లో ఒకరైన రాజా అలీ ఖాన్ యుద్ధంలో మరణించాడు, ఇతర అధికారుల మధ్య తరచుగా వివాదాలు ఉండేవి. ఈ వివాదాల కారణంగా, 1597లో అక్బర్, ఖాన్-ఐ-ఖానాను వెనక్కి పిలిపించాడు. ఆ తరువాత కొద్దికాలానికే యువరాజు మురాద్ మరణించాడు.[11] అక్బర్ తన కుమారుడు డానియల్, ఖాన్-ఐ -ఖానా లను కొత్త సైన్యాలతో పంపాడు. అక్బర్ స్వయంగా అనుసరించి బర్హన్పూర్ లో ఉన్నాడు.[12]

అహ్మద్ నగర్ లో , కొత్తగా నియమితులైన మంత్రి నేహాంగ్ ఖాన్, చాంద్ బీబీ అధికారాన్ని వ్యతిరేకించాడు. ఖాన్-ఐ-ఖానా లేకపోవడం, వర్షాకాలం వలన నేహాంగ్ ఖాన్ 'బీడ్' పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1599లో అక్బర్ బీడ్ గవర్నర్ ను తొలగించడానికి డానియల్, మీర్జా యూసుఫ్ ఖాన్, ఖాన్-ఐ-ఖానాలను పంపాడు. మొఘలులు తనను అక్కడ కలుస్తారని ఆశిస్తూ, నేహాంగ్ ఖాన్ జైపూర్ కోట్లీ కనుమను స్వాధీనం చేసుకోవడానికి కవాతు చేశాడు. అయితే, డానియల్ కనుమను తప్పించుకుని అహ్మద్ నగర్ కోటకు చేరుకున్నాడు. అతని దళాలు కోటను ముట్టడించాయి. చాంద్ బీబీ మళ్ళీ కోటను రక్షించింది. అయితే, ఆమె సమర్థవంతంగా ప్రతిఘటించలేక డానియాల్ తో ఒప్పందం గురించి నిర్ణయించుకుంది.[10] హమీద్ ఖాన్ అనే ప్రభువు, చాంద్ బీబీ మొఘలులతో ఒప్పందం కుదుర్చుకున్నారని తప్పుడు వార్తలను వ్యాప్తి చేశాడు.[14]  అప్పుడు చంద్ బీబీని ఆగ్రహించిన ఆమె సొంత దళాల గుంపు చంపింది. ఆమె మరణం తరువాత, డానియల్, మీర్జా యూసుఫ్ ఖాన్ మొఘల్ దళాలు నాలుగు నెలల నాలుగు రోజుల ముట్టడించి అహ్మద్ నగర్ ను స్వాధీనం చేసుకున్నాయి.[11]

రెండవ సలాబత్ ఖాన్ సమాధి అహ్మద్ నగర్

దక్కన్ నిజాం షా , చాంద్ బీబీ ఆస్థికలను మషాద్ కు తీసుకువచ్చి, వాటిని ఇమామ్ రెజా మందిరం పక్కన ఖననం చేయమని మీరాబుటోరాబ్ తోరాబి మషాదీని ఆదేశించాడు.[15][16]. రెండవ సలాబత్ ఖాన్ సమాధిని స్థానికంగా "చాంద్ బీబీ కా మహల్ [చాంద్ బీబీ ప్యాలెస్]" అని పిలుస్తారు.అయితే అది ఆమె సమాధి కాదు.[17]

చాంద్ బీబీ పై ఒక నిశ్శబ్ద చిత్రం

[మార్చు]

భారతీయ చిత్రనిర్మాత నారాయణరావు డి. సర్పోత్దార్ 1931లో చాంద్ బీబీ (అహ్మద్ నగర్ రాణి) అనే పేరుతో ఒక నిశ్శబ్ద చిత్రం రూపొందించారు. ఇది సుల్తానా చాంద్ బీబీ, రాణి గురించిన భారతీయ హిందీ భాషా చిత్రం, ఇందులో శకుంతలా పరాంజపే నటించారు, ఇది 1937లో విడుదలైంది.[18]

ఇవి కూడా చూడండి

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Women In Power: 1570-1600". Archived from the original on 2006-12-19. Retrieved 2006-12-24.
  2. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 118–119. ISBN 978-9-38060-734-4.
  3. "The Adil Shahi Dynasty of Bijapur". Archived from the original on 8 May 2006. Retrieved 2006-12-24.
  4. Jyotsna Kamat. "Education in Karnataka through the ages: Education Among Muslims". Retrieved 2006-12-24.
  5. Sewell, Robert (2006) [1900]. A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India.
  6. "Reviving an ancient tank". The Hindu. 2005-10-10. Archived from the original on 2006-02-17. Retrieved 2006-12-24.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 Dr. Richard Pankhurst. "Great Habshis in Ethiopian/Indian history: History of the Ethiopian Diaspora, in India - Part IV". Retrieved 2006-12-24.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 Ravi Rikhye (2005-03-07). "The Wars & Campaigns of Ibrahim Adil Shahi II of Bijapur 1576-1626". Archived from the original on 2006-10-20. Retrieved 2006-12-24.
  9. 9.0 9.1 9.2 "Medieval Period". The Gazetteers Department, Government of Maharashtra. Retrieved 2006-12-24.
  10. 10.0 10.1 "The History of Ahmednagar". Archived from the original on 9 May 2007. Retrieved 2006-12-24.
  11. 11.0 11.1 11.2 "Medieval Period". The Gazetteers Department, Government of Maharashtra. Retrieved 2006-12-24.
  12. 12.0 12.1 "Akbar conquers Ahmednagar". Archived from the original on 23 November 2010. Retrieved 2006-12-24.
  13. Michell, George; Mark Zebrowski (1999). Architecture and Art of the Deccan Sultanates. ISBN 0-521-56321-6.
  14. Altaf Hussain Asad (2005-01-02). "A woman of substance". Dawn Magazine. Retrieved 2007-06-18.
  15. "ترابی مشهدی - ویکی فقه". fa.wikifeqh.ir. Retrieved 2022-07-20.
  16. Jalali, Ghulam Reza (2008). مشاهیر مدفون در حرم رضوی [Dignitaries Buried in the Holy Shrine of Imam al-Rida] (in Persian). Mashhad, Iran: Islamic Research Foundation, Astan Quds Razavi. p. 113. ISBN 9789649712390.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  17. Islamic Culture. Islamic Culture Board. 1944. Retrieved 17 January 2013.
  18. Rajadhyaksha, Ashish; Willemen, Paul (1999). Encyclopaedia of Indian cinema. British Film Institute. Retrieved 12 August 2012.