Jump to content

జాన్ డాల్టన్

వికీపీడియా నుండి
(జాన్‌ డాల్టన్ నుండి దారిమార్పు చెందింది)
జాన్ డాల్టన్
జననం(1766-09-06)1766 సెప్టెంబరు 6
ఈగిల్స్‌ఫీల్డ్, కంబర్‌లాండ్, ఇంగ్లాండ్
మరణం1844 జూలై 27(1844-07-27) (వయసు 77)
మాంచెస్టర్, ఇంగ్లాండ్
ముఖ్యమైన విద్యార్థులుజేమ్స్ ప్రెస్కాట్ జౌల్
ప్రసిద్ధిఅణు సిద్ధాంతం, Law of Multiple Proportions, Dalton's Law of Partial Pressures, డాల్టనిజం
ప్రభావితం చేసినవారుJohn Gough
Author abbreviation (botany)Jn.Dalton
సంతకం

ద్రవ్యం, పరమాణువులు, రసాయనిక చర్యలపై అనేక పరిశోధనలు చేసి ఆధునిక పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త, జాన్ డాల్టన్. రసాయన శాస్త్రం అభివృద్ధికి, పదార్థాలన్నింటికీ విద్యుత్‌ ధర్మం ఉందనడానికి, అణుశక్తి వినియోగానికి డాల్టన్‌ పరమాణు సిద్ధాంతమే బాటలు పరిచింది. ఈయన వాతావరణ శాస్త్రం, వర్ణాంధత్వం మీద కూడా పరిశోధనలు చేశాడు.[1] అణు సిద్ధాంతానికి ఆధునికతను సమకూర్చినవాడుగా చంద్రుడి మీద ఒక క్రేటర్ కు ఈయన పేరు పెట్టారు.

ఇంగ్లండ్‌లోని ఈగల్స్‌ ఫీల్డ్‌ గ్రామంలో ఓ పేద చేనేత కార్మికుడి అయిదుగురి సంతానంలో ఒకడుగా 1766 సెప్టెంబరు 6న పుట్టిన డాల్టన్‌ చిన్నతనంలోనే సైన్స్‌, గణితం, ఇంగ్లిషుల్లో పట్టు సాధించాడు. వాతావరణ శాస్త్రం (మెట్రియాలజీ)పై ఆసక్తి పెంచుకుని పరిశీలనకు కావలసిన పరికరాలను స్వయంగా రూపొందించుకున్నాడు. వాతావరణ పీడనం, ఉష్ణోగ్రత, గాలి వేగం, తేమ లాంటి విషయాలను రోజూ నమోదు చేసుకోవడాన్ని ప్రారంభించి జీవితాంతం కొనసాగించాడు. చనిపోయే చివరి రోజు వరకు ఆయన నమోదు చేసిన అంశాలు 2 లక్షల పైమాటే! స్కూల్లో పిల్లలకు చదువు చెప్పడం, తండ్రికి సాయపడడంతో పాటు లాటిన్‌, గ్రీకు భాషలు నేర్చుకున్నాడు.

ఇరవై ఏడేళ్లకల్లా కళాశాల అధ్యాపకునిగా చేరినా పరిశోధనలు మానలేదు. ఇంగ్లండ్‌లోని కొండలు, లోయలు, పట్టణాలు తదితర ఎన్నో ప్రాంతాల్లో వాతావరణాన్ని పరిశీలించి, ఎక్కడైనా గాలి సమ్మేళనం (composition) ఒకేలా ఉందని తేల్చుకున్నాడు. అలా ఆయన చేసిన పరిశోధనల ఫలితంగా 'పాక్షిక పీడన సిద్ధాంతం' (Theory of Partial Pressures) చెప్పగలిగాడు. ఆపై రసాయన చర్యలపై దృష్టి సారించి పరమాణు సిద్ధాంతాన్ని అందించాడు. పరమాణువులు ఎలా సంపర్కం చెందుతాయో తెలిపేలా మూలకాలకి డాల్టన్‌ ఏర్పరిచిన సంకేతాలకు ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది.

అలాగే మూలకాలు సమ్మేళనంగా ఏర్పడే అంశానికి సంబంధించి 'నిర్దుష్ట అనుపాత నియమం' (Law of Definite proportions), బహుళ అనుపాత నియమం (Law of multiple proportions) నిర్వచించాడు. వాతావరణ పీడనాన్ని సూచించే భారమితి (Barometer), తేమని తెలిపే హైగ్రోమీటర్‌, మేఘాలు ఏర్పడే విధానాలు, వర్షపాతం, బాష్పీభవనం, తుషారస్థానం (Dew Point) గురించిన పరిశోధనలు డాల్టన్‌ చేసినవే. తన పరిశోధనలకు ఎన్నో డాక్టరేట్లు, పురస్కారాలు పొందాడు.

మూలాలు

[మార్చు]
  1. రోహిణి ప్రసాద్, కొడవటిగంటి (2012). అణువుల శక్తి. హైదరాబాదు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్. p. 10.