Jump to content

టార్చ్

వికీపీడియా నుండి
టార్చ్
సంస్థ అవలోకనం
స్థాపనం 2021
అధికార పరిధి తెలంగాణ, భారతదేశం
ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం


టార్చ్ (TORCH) పూర్తి పేరు 'టీమ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆన్‌ కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ ’. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ.

ఏర్పాటు

[మార్చు]
చరిత్ర పరిశోధకుల బృందంతో 2021లో హైదరాబాద్ వేదికగా ఇది ఏర్పాటైంది.

లక్ష్యాలు

[మార్చు]
  • శిథిలదశలో ఉన్న చారిత్రక కట్టడాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కార్యాచరణ చేపట్టడం. ఇందులో భాగంగా ప్రభుత్వానికి, పురాతత్వశాఖకు మధ్య వారధిగా పనిచేయడం.
  • ప్రభుత్వంతోపాటు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు, ఎన్జీవోల భాగస్వామ్యంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేయడం
  • అంతరించిపోయే దశలో ఉన్న కళలను ఏదో ఒకరూపంలో డాక్యుమెంట్ చేసి పరిరక్షించడం
  • ఇప్పటివరకు ప్రపంచానికి పరిచయం కాని కట్టడాలను, ఇతర చారిత్రాత్మక విశేషాలను అందరికీ పరిచయం చేసే దిశగా ప్రయత్నాలు చేయడం

చేపట్టిన ప్రాజెక్టులు

[మార్చు]

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో పలు ప్రాజెక్టులు కూడా చేసింది. చరిత్ర పరిశోధకుల బృందంతో ఏర్పాటైన టార్చ్‌, స్వచ్ఛందంగా పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశోధన ద్వారా వెలికితీసిన అంశాలను అందరికీ తెలియజేస్తున్నది. క్షుణ్ణంగా అన్వేషించి సేకరించిన తెలంగాణ అస్థిత్వపు సమాచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నది.

శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలు, స్తూపాలు, సమాధులు, తోరణాలు, మెట్లబావులు, రాక్‌ ఆర్ట్స్‌, స్మారక చిహ్నాలు తదితర వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా వాటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నది. వీటి విశేషాలను సంబంధిత అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులకు నివేదిస్తున్నది. కాకతీయ సామ్రాజ్యంపై ప్రత్యేక దృష్టి ఓరుగల్లు కేంద్రంగా ప్రజారంజక పరిపాలన సాగించిన కాకతీయ సామ్రాజ్యంపై టార్చ్‌ ప్రధానంగా దృష్టి పెట్టింది. తవ్వేకొద్దీ వచ్చే నీటి ఊటలా ఉండే కాకతీయుల చారిత్రక ఆనవాళ్లను విస్తృతంగా వెలికితీస్తున్నది.

చారిత్రక సంపదపై అందరికీ అవగాహన కల్పించేందుకు హెరిటేజ్‌ వాక్‌, సెమినార్లు, ప్రచురణలు, వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నది. యువ పరిశోధకులు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేస్తున్నది.

ఇప్పటివరకు చేసిన ప్రధాన ప్రాజెక్టులు:

1. కాకతీయ ప్రస్తుత వారసుడు, బస్తర్ మహారాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ గారిని 700 సంవత్సరాల అనంతరం వరంగల్ కు ఆహ్వానించి వారి రాక సందర్భంగా 777 చిత్రాలను 7- 7- 2021 నుండి ఏడు రోజుల పాటు హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించడం జరిగింది.


2. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కిన సందర్భంగా ఆ కట్టడం చారిత్రిక, సాంస్కృతిక విశేషాలను నలుదిశలా చాటేందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ‘ఏ సింఫనీ ఇన్‌ స్టోన్‌’ పేరిట 2021 అక్టోబరులో 100 రోజులపాటు ఫొటో ఎగ్జిబిషన్‌ నిర్వహించింది.


3. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో ఉన్న కాకతీయుల వారసులపై ఏండ్లపాటు పరిశోధన చేసిన టార్చ్‌ బృందం ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించింది.


4. తెలంగాణలోని కాకతీయుల ఆలయాలు, చారిత్రక కట్టడాలు, కోటలు, మెట్ల బావులు, శాసనాలు, శిల్పాలపై దసరా సందర్భంగా బస్తర్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది. రెండు లక్షల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చారు.


5. కాకతీయుల యుద్ధ నాట్యం పేరిణి ప్రదర్శనను టార్చ్‌ ఆధ్వర్యంలో బస్తర్‌లోని కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ కోటలో ఏర్పాటు చేయించింది. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయ, ముఖ్యమంత్రి భూపేష్‌ భగల్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చారు.


6. దేశంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక-సారలమ్మ జాతరకు విశ్వవ్యాప్త గుర్తింపు తేవాలనే ఆలోచనతో టార్చ్‌ బృందం ప్రత్యేకంగా డాక్యుమెంటరీ రూపొందించింది.


7. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లో టార్చ్‌ బృందం చేసిన పరిశోధనల్లో లభించిన వ్యాసాలు, పుస్తకాలు, శాసనాలు, ఫొటోలు, పెయింటింగ్‌లు, కళాఖండాల సమాచారాన్ని ఆధునిక టెక్నాలజీతో డిజిటలైజ్‌ చేస్తున్నది. ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు, పరిశోధకులు, పురాతత్వ ఔత్సాహికులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నది.


8. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో పోలిస్తే కాకతీయులకు సంబంధించి తెలియని చరిత్రే ఎక్కువ ఉంది. ఈ మేరకు అన్వేషణ కొనసాగిస్తున్న టార్చ్‌ బృందం, తమ పరిశోధనలో వెలుగులోకొచ్చిన సమాచారాన్ని డాక్యుమెంట్‌ రూపంలో భద్రపరిచి ముందుతరాలకు అందిస్తున్నది. ప్రాజెక్ట్ పునర్జీవ పేరుతో శిథిల ఆలయాలు, ఆకారం చెదిరి రూపు కోల్పోయిన శిల్పాల గత రూపును గతంలో వందల ఏళ్ల క్రితం ఎలా ఉండేవో ఐకనోగ్రఫీ ప్రకారం పరిశోధించి పెన్సిల్ ఆర్ట్, డిజిటల్ ఆర్ట్ రూపంలో డాక్యుమెంట్ చేస్తున్నది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా అరవింద్, ఈమని శివ నాగి రెడ్డి (రిటైర్డ్ ఆర్కియాలజిస్ట్), ఏలూరి శేషబ్రహ్మం (ప్రముఖ కళాకారుడు), రఘువీర్ (స్తపతి); రక్షిత్ (చిత్రకారుడు); హిమాన్సీ (నృత్యకారిణి)లు బృందంగా ఏర్పడి దాదాపు 100 పాడైపోయిన శిల్పాలను సేకరించి, స్కెచింగ్ చేసి, శిల్పాలకు పాత రూపాన్ని ప్రసాదిస్తున్నారు.


9. తెలంగాణ చరిత్ర, సంస్కృతి పై ప్రచురింపబడిన అరుదైన, విలువైన పుస్తకాలను సేకరించింది. ప్రత్యేక గ్రంథాలయ ఏర్పాటు కార్యక్రమం ప్రగతిలో ఉంది.


10. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రానికి 20 కి.మీ.ల దూరంలో ఉన్న కొత్తూరు గ్రామానికి ఈశాన్యంలో ఉన్న దుర్గమారణ్యంలో దేవునిగుట్ట మీద రాతి ఇటుకలమీద చెక్కిన శిల్పాలతో కట్టిన గుడి ఉంది. ఇలాంటి నిర్మాణం భారతదేశ చరిత్రలోనే అరుదైంది, ఇంతవరకు దేశంలో ఎక్కడకూడా ఈ ఆలయాన్ని పోలిన నిర్మాణం లేదు. ఇంతటి చరిత్ర ప్రశస్తి పొందిన ఆలయం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో 360 డిగ్రీ, ఫోటో, వీడియో, ఆర్కిటెక్ డ్రాయింగ్స్ తో డాక్యుమెంట్ చేయించింది. ఈ గుడిని ఎందరికో పరిచయం చేస్తూ, విదేశీ పర్యాటకులు, చరిత్రకారులు దీన్ని దర్శించేలా చేసింది.


11. వరంగల్ జిల్లా విద్యా శాఖ రాష్ట్ర పర్యాటక, పురావస్తు శాఖల సమన్వయంతో ప్రపంచ పర్యాటక దినోత్సవం వరంగల్ కోట కేంద్రంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హెరిటేజ్ వాక్ నిర్వహించింది.


12. చారిత్రక విశిష్టత కలిగిన ఆలయాలు, గుర్తింపుకు నోచుకుని కట్టడాల వైశిష్ట్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలిపే ఉద్దేశంతో నిర్వహించే 'ది టెంపుల్ డాన్స్' సంస్థతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.


13. వికీపీడియా అనుబంధ సంస్థ అయిన వికీమీడియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న చారిత్రక కట్టడాలను అంతర్జాల వేదికగా అందుబాటులో ఉండేలా చేయడం కోసం సంస్థ వాలంటీర్స్ తో రవీంద్ర భారతి వేదికగా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి దాదాపు 3000 పైగా చాయా చిత్రాలను సేకరించడం జరిగింది.

14. ఆహారపు అలవాట్లను కూడా మన సంస్కృతిలో ఒక భాగంగా భావించిన టార్చ్ విటమిన్ - B1(థయమిన్)లోపం వల్ల కలుగుతున్న ప్రాణనష్టాన్ని గుర్తించి ఆ విటమిన్ ఆవశ్యకతను తెలియపరుస్తూ, ఆ విటమిన్ ను అందించే పోషకాహారపదార్థాలను సూచిస్తూ వీడియో రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించడంలో తన వంతు కృషి జరిపింది.

15. Google maps వేదికగా తెలంగాణ చారిత్రక కట్టడాలకు ప్రాచుర్యం లభించే దిశగా 30,000 పైగా ఫోటోలను అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని దాదాపు 7 కోట్ల మంది వీక్షించారు.


16. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ కేంద్రంగా 75 రోజుల పాటు జరిగే దసరా వేడుకలకు యునెస్కో గుర్తింపు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా అందుకు కావల్సిన ప్రాథమిక పరిశోధన వివరాలను సేకరించడం కోసం గత రెండు సంవత్సరాల కాలంలో అనేకమార్లు బృంద పర్యటనలు జరిపి సమాచార సేకరణ జరిపింది.


17. కళాశాల స్థాయిలో విద్యార్థులను చరిత్ర, సంస్కృతి పరిరక్షణలో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచనతో రాష్ట్రం లోని పలు కళాశాలలతో కలిసి పనిచేయడం జరుగుతుంది.అందులో భాగంగా కొన్ని కళాశాలలతో MOU కుదుర్చుకోవడం, ఆయా కళాశాలలో గెస్ట్ లెక్చర్స్, ఫోటో ఎగ్జబిషన్స్, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.

18. చరిత్ర మీద విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తూ, వారసత్వ సంపదను పరిరక్షించుకునే దిశగా తమ వంతు ప్రయత్నాలు చేయమని ప్రోత్సహిస్తూ వరంగల్, హనుమకొండ మొదలగు ప్రదేశాల్లో వర్క్ షాప్ లు నిర్వహించింది.

19. సిద్దిపేట మొదలగు ప్రదేశాల్లో 'పురాతన నాణేల ప్రదర్శన'నిర్వహించింది. ఆయా నాణేల పట్ల విద్యార్థులకు విద్యార్థులకు అవగాహన కల్పించింది.

20. పరిష్కరించబడని కొన్ని పురాతన శాసనాలను enstampage చేయించింది. ఆ శాసనాల్లోని వివరాలను సేకరించింది.

21. చారిత్రక విషయాలను కొన్నింటిని PODCASTల రూపంలోకి మార్చి అందరికీ అందుబాటులోకి తెచ్చింది.

22. FACEBOOK, YOUTUBE, INSTAGRAM వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా చరిత్ర, సంస్కృతికి సంబంధించిన పలు విషయాలను అందరికీ చేరవేయడంలో ముందంజలో ఉంది.

23. హనుమకొండలోని అగ్గలయ్య గుట్ట, వరంగల్ లోని మెట్లబావి వంటి పర్యాటక ప్రదేశాల పునరుద్ధరణ అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, ఆయా ప్రదేశాల పునరుద్దరణలో ప్రభుత్వానికి తన వంతు సహకారాన్ని అందించింది.

24. పూర్వం వాడుకలో ఉండి ప్రస్తుతం అరుదైపోయిన పలు వాద్య పరికరాలను సేకరించి మ్యూజియాలకు అందించింది.

25. వస్తు ప్రదర్శనశాలల్లో ఉన్న అరుదైన వస్తువులను, శిల్పాలను ఎక్కువ కాలం పరిరక్షించడం అవసరమని గుర్తించి కొన్ని ప్రదర్శనశాలలకు గాజు బాక్స్ లను దానం చేసింది.

26. విద్యాసంస్థల్లోని చరిత్ర, కళా విభాగాలకు ఆయా విభాగాల్లోని సబ్జెక్ట్ లకు సంబంధించిన చిత్రాల ఫోటోఫ్రేమ్ లను అందించింది.

27. 'స్వచ్చ్ స్మారక్' పేరిట ఓ కార్యక్రమాన్ని పలుచోట్ల (వరంగల్ లోని రాతికోట, రామప్ప గుడి అనుబంధ ఆలయమైన గొల్ల గుడి, ముప్పారంలోని ముప్పిరినాథ ఆలయం మొదలగునవి) నిర్వహించింది. చారిత్రక కట్టడాలను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని NSS బృందాలు సహకరించాయి.

28. ఇప్పగూడెంలోని తార విగ్రహం (రాష్ట్రకూటుల ఏలుబడికాలం 9వశతాబ్దం నాటిదని, వజ్రయాన బౌద్ధానికి చెందినదని ప్రఖ్యాత చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డిగారు నిర్ధారించారు.) కు రక్షణ కల్పించి, మ్యూజియంకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించింది. అలాగే వరంగల్ లో అతి పొడవైన రాతి టబ్ ను గుర్తించి మ్యూజియంకు తరలించడంలో తోడ్పడింది.

29. ఉమ్మడి ఆదిలాబాద్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రాజ్ గోండ్ గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ పండుగ దండారి పండుగ. ఈ పండుగ విశేషాలన్నింటిని ఒక వీడియో డాక్యుమెంటరీగా రూపొందించింది.

30. ఛత్తీస్ గడ్ రాష్ట్రం లోని దంతెవాడ ప్రాంతంలో దంతేశ్వరీమాత గౌరవార్థం హోళీ పండుగ ముందు 'ఫాగున్ మడాయి' పేరిట పది రోజుల పాటు జరిగే పండుగ(బస్తర్‌లోని రాచరిక, ఆదివాసీ మరియు ఆదివాసీయేతర సంప్రదాయాల సంగమాన్ని సూచిస్తుంది.) విశేషాలన్నింటిని ఒక వీడియో డాక్యుమెంటరీగా రూపొందించింది.

31. సాహిత్యం, మైక్రో ఆర్ట్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ,దారు శిల్పం,హస్తకళాఖండాలు... ఇలా విభిన్న కళారంగాల్లోని కళాకారులను ఒక జట్టుగా రూపొందించి, వారికి వ్యాపార మెళకువలు నేర్పుతూ జనబాహుళ్యంలోకి ఆ చారిత్రక, సాంస్కృతిక విశిష్టత గల కళాకృతులు చేరేలా చేస్తోంది. కళాభిరుచి గల ప్రజలకు కళాకారులకు మధ్య వారధిగా నిలుస్తోంది.

32. 2024 నవంబర్ లో చంద్రవెల్లి(పెద్దపల్లి జిల్లా, కంబంపల్లి మండలానికి చెందిన ప్రాంతం)లో సగం శిథిల స్థితిలో చెట్లు, ముళ్ళపొదలతో కప్పబడిపోయిన కాకతీయుల నాటి కట్టడాన్ని(శివాలయం) పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా 'స్వచ్ఛ్ స్మారక్' పేరిట ఆ కట్టడాన్ని శుభ్రం చేసింది. వీడియో డాక్యుమెంట్ రూపొందించింది.

ప్రచురించిన పుస్తకాలు

[మార్చు]

1. నేను ప్రవీర్ - ఆదివాసీల దేవుణ్ణి (I Praveer God Of Adivasis ఆంగ్ల గ్రంథానికి తెలుగు అనువాదం)

పొందిన పురస్కారాలు

[మార్చు]

కార్యవర్గం

[మార్చు]

• గౌరవ అధ్యక్షులు: మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌

• సలహాదారులు: మామిడి హరికృష్ణ

• అధ్యక్షులు: కట్టా శ్రీనివాస్

• ఉపాధ్యక్షులు: అరుసం మధుసూదన్ (మైమ్ మధు)

• ప్రధాన కార్యదర్శి: పకిడె అర‌వింద్ ఆర్య

• సంయుక్త కార్యదర్శి: అజహర్ షేక్

• డిజిటల్ మీడియా: శ్రావణ్ కుమార్

• కోశాధికారి: నందకిషోర్

• కార్యనిర్వాహక సభ్యులు: శేష బ్రహ్మం, హనుమాద్రి శ్రీకాంత్, సముద్రాల సునీల్, వడిజె ప్రవీణ్ రావు, సామలేటి మహేష్, అజయ్ కుమార్, కార్తీక రాజు

బయటి లింకులు

[మార్చు]
  • facebook పేజీ:

https://www.facebook.com/Torchtelangana

  • instagram పేజీ:

https://www.instagram.com/torch.in

  • X (twitter) పేజీ:

https://x.com/TorchTelangana

  • youtube పేజీ:

https://youtube.com/@torch-telangana

మూలాలు

[మార్చు]
  • నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనం [1]
  • ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం

[2]

  • ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన కథనం

[3]

"https://te.wikipedia.org/w/index.php?title=టార్చ్&oldid=4369305" నుండి వెలికితీశారు