Jump to content

తేనెటీగల పెంపకం

వికీపీడియా నుండి

తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి.[1]

ఆదాయమార్గంగా తేనెటీగల పెంపకం – ప్రయోజనాలు

[మార్చు]
  • తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం చాలు
  • తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి వ్యవసాయపరంగా ఎలాంటి విలువలేని స్థలమైనా చాలు
  • మరి ఏ ఇతర వ్యవసాయ పరిశ్రమ కన్నా కూడా, తేనెటీగల పెంపకానికి అతి కొద్దిపాటి వనరులు సరిపోతాయి.
  • తేనెటీగల పెంపకం పర్యావరణం పై సానుకూల ప్రభావం చూపుతుంది. పూలుపూచే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి. ఆ విధంగా, ప్రోద్దుతిరుగుడు వంటి పంటలలో, వివిధ పండ్ల జాతులలో అధిక దిగుబడికి తేనెటీగల పెంపకం దొహదం చేస్తుంది.
  • తేనె చాల రుచికరమైన, అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం, తేనె పట్టుకోసం అడవులలో తేనెటీగలను వేటాడడం పాత పద్ధతి, ఈ పద్ధతిలోఎన్నెన్నో తేనెటీగల సమూహాలు నాశనమైపోయేవి. ఇళ్ళ వద్దనే పెట్టెలలో తేనెటీగలను పెంచి, తేనేను సేకరించడం వల్ల తేనెటీగల వినాశనాన్ని నివారించవచ్చు.
  • తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారుగాకాని, బృందాలుగాకాని చేపట్టవచ్చు.
  • తేనెకు, మైనానికి మార్కెట్లో ఎంతో గిరాకీ ఉంది.

తేనెటీగల జాతులు

[మార్చు]

ఇండియాలో నాలుగు జాతుల తేనెటీగలు ఉన్నాయి. అవి

  • రాక్ బీ (ఎపిస్ డార్సటా) ఇవి చాలా ఎక్కువ తేనె సేకరిస్తాయి. సగటున ఒక్కొక్క తేనె పట్టుకు 50 - 80 కిలోల తేనెను ఇవి సేకరిస్తాయి.
  • లిటిల్ బీ (ఎపిస్ ప్లోరియా) ఇవి బాగా తక్కువగా తేనెను సేకరిస్తాయి. ఒక్కొక్క పట్టుకు కేవలం 200 - 900 గ్రాముల తేనె మాత్రమే వస్తుంది.
  • ఇండియన్ బీ (ఎపిస్ సెరనా ఇండికా) ఇవి ఏడాదికి సగటున 6 - 8 కిలోల తేనెను సేకరిస్తాయి.
  • యూరోపియన్ బీ (ఇటాలియన్ బీస్) (ఎపిసమెల్లిఫెరా) ఒక్కొక్క తేనె పట్టుకు సగటున 25 - 40 కిలోల తేనే వస్తుంది.
  • కొండి లేని తేనెటీగ (ట్రిగొనా ఇరిడిపెన్నిస్) పైన పేర్కొన్న నాలుగు జాతులే కాకుండా కేరళలో కొండిలేని తేనెటీగ అనే మరో జాతి కూడా ఉంది. అయితే నిజానికి వాటికి కొండి బొత్తిగా లేకపోలేదు కాని అది అంతగా పెరగదు. ఇవి పరాగ సంపర్కానికి బాగా తోడ్పడతాయి. సంవత్సరానికి 300 – 400 గ్రాములు తేనెను సేకరించగలవు.

తయారీ విధానం

[మార్చు]

తేనెటీగలను పొలంలో లేదా ఇంటివద్ద పెట్టెలలో పెంచవచ్చు

తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాలు

  • తేనెపెట్టె (హైవ్) ఇది పొడవుగావుండే ఒక చెక్క పెట్టె. దీని పై భాగం నుంచి కింది వరకు పొడవైన అనేక పెట్టెలు వుంటాయి. ఈ పెట్టె కొలతలు సుమారుగా ఇలా వుంటాయి. పొడవు 100 సెంటీ మీటర్లు, వెడల్పు 45 సెంటీ మీటర్లు, ఎత్తు25 సెంటీ మీటర్లు, మందం 2 సెంటీ మీటర్లు, తేనే టీగలు రావడానికి, పోవడానికి వీలుగా ఈ పెట్టెకు ఒక్కొక్కటి ఒక సెంటీ మీటరు వెడల్పు కలిగిన రంధ్రాలు వుంటాయి. పెట్టెకు పైన పట్టెల బిగింపు ఈ రంధ్రాలు మూసుకుపోని విధంగా వుండాలి. పట్టెలు పెట్టె కింది వరకు వుండాలి. ఎక్కువగా తేనెటీగలు పట్టితే, ఆ బరువును తట్టుకునే విధంగా పట్టెలు 1.5 సెంటీ మీటర్ల మందంతో వుండాలి. పెట్టెలో తేనెటీగలు తిరగడానికి ఇరుకుగా వుండకుండా, పెట్టెకు పెట్టెకు మధ్య కనీసం 3.3 సెంటీ మీటర్ల ఎడం వుండాలి.
  • పొగ డబ్బా (స్మోకర్) ఇది ముఖ్యమైన రెండవ పరికరం. ఒక చిన్న డబ్బాను ఇందుకు ఉపయోగించవచ్చు. తేనెటీగలు మనలను కుట్టకుండా చూసుకోవడానికి, వాటిని అదుపుచేయడానికి డబ్బా ఉపయోగపడుతుంది.
  • గుడ్డ ముక్క - తేనే పట్టుకు దగ్గరగా పనిచేస్తున్నపుడు తేనెటీగలు కుట్టకుండా కళ్ళను ముక్కును కప్పుకోవడానికి
  • చాకు - తేనె పట్టె పై పట్టెలను కదిలించి, తేనే అరలను కత్తిరించడానికి
  • ఈక - తేనె అర నుంచి తేనెటీగలను నెట్టివేయడానికి
  • రాణి ఈగను వేరుపరచు జిల్లెడ (క్వీన్ ఎక్క్సూడర్)
  • అగ్గి పెట్టె

తేనె పెట్టెల ఏర్పాటు

[మార్చు]
  • తేనె పెట్టెలను తప్పని సరిగా, నీరు నిల్వన ప్రదేశంలో ఏర్పాటు చెయ్యాలి. మకరందం, పుప్పొడి, నీరు బాగా లభ్యమయ్యే పండ్ల తోటల సమీపంలో అయితే మరీ మంచిది.
  • తేనె పెట్టెలో ఎప్పడూ అనువైన ఉష్ణోగ్రత వుండాలి. అందువల్ల, తేనె పెట్టెకు నేరుగా ఎండ తగలకుండా చూడాలి
  • చీమలు పట్టకుండా, తేనె పెట్టె స్టాండు కాళ్లకింద నీటిగిన్నెలు అమర్చాలి. వాన ఎండల నుంచి రక్షణకోసం తేనెటీగల పట్టెలను తూర్పు దిశకు అమర్చాలి. తేనె పెట్టె వుండే దిక్కుకు కొద్ది తేడాతో అమరిక వుండాలి.
  • తేనెటీగల అరలను పశువులకు, జంతువులకు అందుబాటులో వుండకుండా చూడాలి జన సమ్మర్దమైన రోడ్లపక్కన, వీధి దీపాల దగ్గర వీటిని వుంచకూడదు.

తేనె టీగల సముదాయాన్ని ఏర్పాటుచేయడం

[మార్చు]
  • అడవిలో తేనెటీగల గుడ్లు వున్న తేనెపట్టెనుతెచ్చి, తేనెపెట్టెలో పెట్టడం ద్వారానో తేనెపట్టె సమీపం నుంచి వెళ్ళే తేనెటీగల గుంపును తేనెపెట్టెలోకి ఆకర్షించడం ద్వారానో తేనెటీగల సముదాయాన్ని ఏర్పాటు చేయవచ్చు.
  • తేనెటీగల గుడ్లునో, అటుగా వెళ్ళే తేనెటీగల గుంపునో ఆకర్షించడాని కంటే ముందుగా చేయవలసింది ఆ తేనెపెట్టెలో తేనెటీగలకు అలవాటైన వాసన వుండేలా చూడడం. కొన్ని పాత తేనెతుట్టె ముక్కలనో, కొద్దిపాటి తేనె మైనాన్నో తీసుకుని ఈ కొత్త తేనె పెట్టెకు బాగా రుద్దాలి. వీలైతే, గుంపుగా వెళ్ళే తేనెటీగల నుంచి రాణి ఈగను పట్టుకుని, తేనె పెట్టెలో అడుగున వుంచాలి. అప్పుడు ఇతర తేనెటీగలు అక్కడికి ఆకర్షితమవుతాయి.
  • అరకప్పు వేడి నీటిలో, అరకప్పు చక్కెర కలిపిన ద్రావణాన్ని, తేనె పెట్టెలోకి చేరిన ఈ తేనెటీగల సముదాయానికి కొన్ని వారాలపాటు ఆహారంగా అందించాలి. తేనెటీగలు పట్టెల వెంబడి తేనే అరల నేర్పరచడాన్ని కూడా ఇది త్వరితం చేస్తుంది.
  • ఒక తేనె పెట్టెలో మరీ ఎక్కువ సంఖ్యలో తేనెటీగలు వుండకుండా జాగ్రత్త వహించాలి.

తేనె పెట్టె నిర్వహణ

[మార్చు]
  • తేనె పట్టులో తేనె నిండే రోజులలో కనీసం వారానికొకసారి తేనె పెట్టెలను పరిశీలించాలి. ఉదయం పూట అయితే మరీ మంచిది.
  • ఈ వరసలో తేనె పెట్టెను శుభ్రం చేయాలి. పై భాగం, సూపర్ / సూపర్స్ ఛేంజర్, పిల్ల ఈగలు అరలు (బ్రూడ్ ఛేంజర్స్), అడుగు పలక (ప్లోర్ బోర్డు)
  • రాణి ఈగ బాగున్నదీ లేనిదీ, పిల్ల ఈగల పెరుగుదల ఎలా వున్నదీ, తేనె పుప్పొడి ఏ మేరకు పోగైందీ,
  • రాణి ఈగ వుండే అరలు ఎలా వున్నదీ, తేనెటీగలు ఏ సంఖ్యలో వున్నదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
  • తేనెటీగలకు హానికలిగించే ఈ క్రింది క్రిమికీటకాలు తేనె పెట్టెలో చేరాయేమో గమనిస్తుండాలి. మైనపు పురుగు (వాక్స్ మాత్) [ గల్లేరియా మెల్లోనెల్లా] తేనె పెట్టె అరల నుంచి, పెట్టె మూలల నుంచి గ్రుడ్లను, కోశాలను తొలగించాలి. మైనపు పెంకు పురుగు (వాక్స్ బీటిల్స్ ) [ ప్లాటీ బోలియం] పురుగులనన్నీటిని ఏరిపారేయాలి. పెద్దవాటిని చంపేయాలి మైట్స్ పెట్టె ఫ్రేమ్ ను, కింది పలకను తాజాగా తయారు చేసిన పొటాషియం పెర్మాంగనేట్ ద్రావణంలో ముంచిన దూది లేదా నూలుగుడ్డ పీలికలతో బాగా తుడవాలి. కింది పలక మీద మైట్స్ అన్నీ పూర్తిగాపోయే వరకు ఇలా పదే పదే తుడవాలి
  • తేనె సేకరణ తక్కువగా వుండే సీజన్లో నిర్వహణ సూపర్స్ ను తొలగించి, పిల్ల ఈగల అరలో ఆరోగ్యవంతమైన పిల్ల ఈగలను దగ్గరదగ్గరగా వుంచాలి. అవసరమైతే అరను విడదీసే డివిజన్ బోర్డు ఉపయోగించాలి.
  • రాణి ఈగ సెల్స్, పోతుటీగ సెల్స్ కనిపిస్తే వాటిని నాశనం చేయాలి ఒక్కొక్క తేనె పట్టుకు వారానికి 200 గ్రాముల చక్కెరను సమానపరిమాణపు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని అందుబాటులో వుంచాలి.
  • తేనె పెట్టెలోని అన్ని తేనె పట్టులకు ఆహారం అందుబాటులో వుంచాలి.
  • తేనె సేకరణ ఎక్కువగా వుండే కాలంలో నిర్వహణ తేనె సేకరణ ఎక్కువగా వుండే కాలానికి ముందే తేనె పట్టులో ఈగలు తగిన సంఖ్యలో వుండేలా చూడాలి. మొదటి సూపర్ కు, బ్రూడ్ ఛేంబర్ కు మధ్య వీలున్నంత ఎక్కువ ఖాళీజాగా వుండేలా చూడాలి. అయితే మొదటి సూపర్ పైన ఖాళీజాగా వుంచకూడదు.
  • రాణి ఈగను పిల్లల (బ్రూడ్) అరకే పరిమితం చేసే విధంగా, బ్రూడ్- సూపర్ ఛేంబర్ల మధ్య రాణిని వేరుపరచు జల్లెడ ( క్వీన్ ఎక్క్స్లూడర్) ను వుంచాలి.
  • తేనె పట్టును వారానికొకసారి గమనిస్తూ, తేనె నిండుగా వున్న చట్రాలను సూపర్ పక్కగా జరపాలి. మూడువంతులు తేనె, లేదా పుప్పొడితో ఒక వంతు అంటుకుపోయిన పిల్ల ఈగలతో వున్న చట్రాలను బ్రూడ్ ఛేంబర్ నుంచి తీసివేయాలి. వాటి స్థానంలో ఖాళీ పట్టెలను లేదా చట్రాలను వుంచాలి.
  • పూర్తిగా లేదా మూడింట రెండు వంతులు తేనేతో నిండిన చట్రాలను బయటకు తీసి, తేనె పిండుకున్న తర్వాత తిరిగి సూపర్స్ లో పెట్టాలి.

తేనె తీయడం

[మార్చు]
  • పొగపెట్టి ఈగలను పక్కకు మళ్ళించి, తేనె పట్టిన భాగాలను జాగ్రత్తగా కత్తిరించి, తేనెను తీయాలి.
  • సాధారణంగా పూలు బాగాపూచే అక్టోబరు/ నవంబరు ఫిబ్రవరి / జూన్ సీజన్లలోను, ఆ తర్వాత కొద్దిరోజుల పాటు తేనె తీయడానికి అనువైన కాలం
  • బాగా తేనె నిండిన తేనె పట్టె లేత రంగులో వుంటుంది. రెండు వైపుల సగానికి పైగా తేనె గూళ్ళు మైనంతో నిండి వుంటాయి.

గ్రీక్ బాస్కెట్ హైవ్ (బుట్టలో తేనెపట్టు పెంపకం)
గ్రీక్ బాస్కెట్ హైవ్ అనేది సాంప్రదాయికమైన పరిజ్ఞానం. కేవలం, స్థానికంగా లభ్యమయ్యే వస్తువులు, స్థానిక నైపుణ్యాలతో ఈ బుట్టతో తేనెటీగల పెంపకం సాగించ గలుగుతుండడంతో, ఇది ఇప్పటికీ అనువైన విధానమే.

నిర్మాణం

[మార్చు]
  • ఈ బుట్ట పైభాగంలో ఎక్కువ వెడల్పుగా కింద తక్కువ వెడల్పుగా వుంటుంది.
  • పైభాగాన్ని ఒక్కొక్కటి 1.25 అంగుళాల వెడల్పు వుండే, సమాంతరంమైన కొయ్య పలకలతో కప్పుతారు. తేనెటీగలు బయటకు వెళ్ళలేని మూత మాదిరిగా, వీటిని దగ్గర దగ్గరగా అమర్చుతారు. ఈ కొయ్య పలకలు ఒక అంగుళం మేర లోపలివైపునకు వంపు తిరిగి వుంటాయి. ఈ వంపు పలక మధ్యన కేంద్రీకృతమవుతుంది. పలకల రెండు చివరలూ 2-3 అంగుళాల వరకు సమతలంగా వుండాలి. ఎందుకంటే, బుట్ట అంచుకంటె మందమైన ఈ పలకలు చివరలలో వంపుగావుంటే, ఆ సందులనుంచి తేనెటీగలు తప్పించుకునే అవకాశం వుంటుంది. దానిని నివారించడం కోసమే, ఇలా బుట్ట అంచుపై చక్కగా నిలవడానికి వీలుగా, పలకల చివరలను సమతలంగా వుంచుతారు.
  • ప్రతి పలక పొడవునా, మధ్యలో కిందుగా ఒక మంచి తేనెతుట్టెను, కరిగించిన తేనె మైనంతో అతికించాలి. తేనెటీగలు ఆ కొయ్యపలక కిందుగా బుట్ట చివరివరకు మంచి తేనెపట్టును పెట్టడానికి ఇది వాటికి దారి చూపుతుందన్నమాట.
  • ఈ బుట్టకు లోపలివైపు, వెలుపలివైపు రెండుభాగాలు ఆవుపేడ, ఒకభాగం బంకమన్ను కలిపిన మిశ్రమాన్ని పూయాలి. ఈ మిశ్రమం పూత ఆరిన తర్వాత పలకలను బుట్ట పైన అమర్చి, గడ్డితో చేసిన కిరీటాకారపు టోపీతో కప్పాలి. ఎండ, వానలనుంచి తేనెటీగల బుట్టను ఇది కాపాడుతుంది.
  • బుట్టలోకి తేనెటీగలు వెళ్ళడానికి ఏర్పాటుచేసే ప్రవేశద్వారం బుట్ట అడుగునుంచి కనీసం మూడు అంగుళాలు ఎత్తులో వుండాలి. ఎందుకంటె, ఒకవేళ ఏదైనా తేనె తుట్టె కిందపడినా, ద్వారం మూసుకుపోకుండా వుండడానికి
  • తేనె పట్టు తేనెతోనిండి, తేనె తీయడానికి సిద్ధంగా వుంటే, పలకలనుంచి తేనె పట్టులను జాగ్రత్తగా కోయాలి. అయితే, ప్రతి పలకకు పావు అంగుళాన్ని మించకుండా, మంచి తేనెపట్టు ముక్కను మిగిలించి, మిగతా దానిని కోయాలి. ఈ మిగిలిన చిన్న తేనెతుట్టె, తేనెటీగలను ఆకర్షించి, నేరుగా కొత్త తేనె పట్టు పెట్టే మార్గాన్ని సిద్ధంచేస్తుంది.

ఆధారము: సెంటర్ ఆఫ్ సైన్స్‌ ఫర్ విలేజెస్, మగన్ సంగ్రహాలయ, వార్ధా-442 001, మహారాష్ట్ర

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]