పదహారు కుడుముల నోము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పదహారు కుడుముల తద్ది లేదా నోము ఆంధ్రప్రదేశ్ లో మహిళలు ఆచరించే నోము. సాధారణంగా ఐశ్వర్యం కోసం ఈ కుడుముల నోము నోచుకుంటారు.

విధానం

[మార్చు]

ప్రతీ సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ (తెల్లవారితే వినాయక చవితి) నాడు తలస్నానం చేసి, 256 కుడుములు తయారు చేసుకోవాలి. పదహారు కొత్త చేటలు తెచ్చి ఒక్కొక్క చేటలో పదహారు కుడుములు, పదహారు నల్లపూసలు, పదహారు రూపాయల దక్షిణ, రవిక ఉంచి, పదహారు మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. వీరికి దాహం తీర్చడం కూడా కొందరికి సంప్రదాయం ఉంది.

నోము కథ

[మార్చు]

ఒకానొకప్పుడు పార్వతీపరమేశ్వరులు ఒకసారి భూలోకంలో మానవుల కష్టనష్టాలు చూసి, తమ భక్తులను ఉధ్ధరించేందుకు సంచారం కోసం కైలాసం నుంచి భువి మీదకు వచ్చారట. అలా సంచరిస్తుంటే అడవిలో ఒక రాచకన్య కనిపించింది. ఎంతో బాధను అనుభవిస్తున్న ఆ కన్యను అడిగారట. "పుత్రీ ఏమిటి నీ మోములో ఏదో చెప్పుకోలేని బాధను చూస్తున్నాము. ఏదైనా మాతో చెప్పవచ్చు. నీ కష్టాలు తీర్చే మార్గం అన్వేషిస్తాము" అని అన్నారట. వెంటనే ఆ రాచకన్య ఏడుస్తూ తన బాధను చెప్పింది. మా తల్లిదండ్రులను నా అనుకున్న వారంతా మోసం చేశారని, రాజ్యాన్ని చేజిక్కించుకోని, నిరాధారంగా శిక్షలు వేసి అడవుల దారి పట్టించారనీ" చెప్పుకున్న ఆ రాచకన్య దీనస్థితిని తెలుసుకున్నారు. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు, వారికి చెందిన ఐశ్వర్యం, రాజ్యం వారికి తిరిగి రప్పించాలనుకుని, ఆ రాచకన్యకు భాద్రపద శుధ్ధ తదియ రోజు వచ్చే ఈ హరితాళిక నోము అన్ని బాధలను తొలగిస్తూ సకల ఐశ్వర్యములను ప్రసాదించు వరదాయినీ అని చెప్పారట. అదే పదహారు కుడుముల తద్ది. ఆ నోము నోచుకుంటే కష్టాలు తొలగుతాయని చెప్పి అదృశ్యమయ్యారట. కొన్ని రోజులకు భాద్రపద మాసం రానే వచ్చింది. ఆ పార్వతీ పరమేశ్వరులు చెప్పింది చెప్పినట్లు ఆ రాచకన్య నోముకున్నది. నోచిన రాచకన్యకు, తల్లిదండ్రులకు ఆ కష్టాలు తొలగినాయి. శతృరాజులే తమకు తామే వచ్చి తప్పులను మన్నించండి అని క్షమాపణలు కోరుకోని రాజ్యాన్ని తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారట. అలా క్రమంగా ఆ మహారాజ దంపతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇహమందు సుఖసంతోషాలను అనుభవించి పరమేశ్వరుణ్ణి చేరుకున్నారట. ఎవరైనా ఈ నోమును శ్రద్ధగా ప్రతి సంవత్సరం నోముకున్నా, ఈ కథను విన్నా వారికి కూడా శివానుగ్రహము కల్గుతుంది.

శ్రీ హరితాళికా గౌరీ వ్రతకథ సంపూర్ణం

ఉద్యాపనం

[మార్చు]

పదహారు సంవత్సరాలు పై విధంగా చేసి, పదహారవ సంవత్సరం 116 మంది ముత్తైదువులకు వాయనమివ్వాలి. అయితే దీనిని చాలామంది అనుసరించడం లేదు. కేవలం ఒక సంవత్సరం చేసే నోముగా ఉంది.