Jump to content

బాతిక్ బాలయ్య

వికీపీడియా నుండి
బాతిక్ బాలయ్య
జననంయాసాల బాలయ్య
1939
ఇబ్రహీంపూర్‌, నారాయణరావుపేట మండలం, సిద్ధిపేట జిల్లా
మరణండిసెంబరు 23, 2020
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిచిత్రకారుడు
తండ్రిదుర్గయ్య
తల్లివిశాలాక్షి

బాతిక్ బాలయ్య, (1939 - డిసెంబరు 23, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, గ్రామీణ జానపద చిత్రాలను తన కుంచెతో ఆవిష్కరించి బాతిక్ చిత్రకళలో పేరొందాడు. సుమారు 40 ఏళ్లపాటు కొన్నివేల బాతిక్‌ చిత్రాలు వేశాడు.[1][2]

జీవిత విషయాలు

[మార్చు]

బాలయ్య 1939లో యాసాల దుర్గయ్య, విశాలాక్షి దంపతులకు సిద్ధిపేట జిల్లా, నారాయణరావుపేట మండలం, ఇబ్రహీంపూర్‌లో బాలయ్య జన్మించాడు. ఎం.ఏ. బి.ఈడి పూర్తిచేసి సిద్ధిపేట, మెదక్‌, సదాశివపేట, నారాయణరావుపేట వంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు.[3]

కళారంగం

[మార్చు]

చిన్నప్పటి నుంచే చిత్రకళపై మక్కువ పెంచుకున్న బాలయ్య, మసిబారిన మట్టి గోడలపై కట్టెపుల్లలతో చిత్రాలను గీసేవాడు. కాపు రాజయ్య శిక్షణలో డ్రాయింగ్‌ పరీక్షలు రాసిన బాలయ్య, 1972లో లక్ష్మాగౌడ్‌ వద్ద బాతిక్‌ చిత్రకళలో శిక్షణ పొందాడు. ప్రకృతి, పండుగలు, వ్యవసాయ వృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవనం మొదలైన అంశాలతో బాతిక్‌ చిత్రాల రూపకల్పన చేశాడు. గణేశుడు, వెంకటేశ్వరస్వామి, రామప్ప, నాగినులు, కోణార్క్‌ శిల్పాలు చిత్రించాడు. బాలయ్య వేసిన చిత్రాలు అనేక వార, మాసపత్రికలు, గ్రీటింగ్‌ కార్డులుగా, క్యాలెండర్లుగానూ రూపొందాయి. దేశంలోని ప్రధాన పట్టణాలతో పాటు అమెరికాలోని పలు గ్యాలరీలలో చిత్రప్రదర్శనలు నిర్వహించారు.[4]

గుర్తింపులు - గౌరవాలు

[మార్చు]
  1. బాలయ్య వేసిన గ్రామ దేవతలు చిత్రాన్ని మళయాల మనోరమ పత్రిక వార్షిక సంచికలో ముద్రించింది.
  2. సాలార్జంగ్‌ మ్యూజియం, ఏపీ లలిత కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మ్యూజియం, కేంద్ర లలిత కళా అకాడమీ, మద్రాసు లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం, లాస్‌ ఏంజెల్స్‌ మ్యూజియంలో బాలయ్య వేసిన చిత్రాలున్నాయి.

పురస్కారాలు

[మార్చు]
  1. 1994లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి పురస్కారం
  2. 1963లో గూడూరు లలితకళా మందిర్‌ పురస్కారం
  3. 1965లో తెనాలి ఆంధ్ర శిల్పకళా పరిషత్‌ పురస్కారం
  4. 1966లో భీమవరం అంకాల కళా అకాడమీ పురస్కారం
  5. 1974, 1977, 1983, 1990, 1995లలో సిద్ధిపేట లలితకళా సమితి పురస్కారం
  6. 1997, 1998లలో అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్‌ పురస్కారాలు
  7. 1977లో బాపట్ల లలితకళా కేంద్ర పురస్కారం
  8. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
  9. 2001లో హైదరాబాద్‌ ఆర్ట్స్‌ సొసైటీ రజిత పతకం
  10. 2002లో అఖిలభారత లలితకళలు, హస్తకళల సొసైటీ ప్రశంసాపత్రం
  11. 2003లో సిద్ధిపేట లలితకళా సమితి, అఖిల భారత లలిత కళలు, హస్తకళల సొసైటీలు పరిణత కళా కారుడుగా సత్కారం
  12. సీఎం కేసీఆర్‌ నుంచి గౌరవ పురస్కారం

మరణం

[మార్చు]

అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందిన బాలయ్య 2020, డిసెంబరు 23 తెల్లవారుజామున మరణించాడు.[5] అంత్యక్రియలు చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి.[6]

మూలాలు

[మార్చు]
  1. The Hindu, Tribute Art (25 December 2020). "Remembering Yasala Balaiah's world through his batik paintings". Neeraja Murthy. Archived from the original on 29 January 2021. Retrieved 31 January 2021.
  2. ఈనాడు, తెలంగాణ (24 December 2020). "'బాతిక్‌' బ్రహ్మ బాలయ్య కన్నుమూత". Archived from the original on 25 December 2020. Retrieved 31 January 2021.
  3. తెలంగాణ మ్యాగజైన్, తెలంగాణ (3 July 2017). "బాతిక్ బాలయ్య". www.magazine.telangana.gov.in. Archived from the original on 23 సెప్టెంబరు 2020. Retrieved 31 January 2021.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (24 December 2020). "బాతిక్‌ బాలయ్య ఇకలేరు". Archived from the original on 25 January 2021. Retrieved 31 January 2021.
  5. నమస్తే తెలంగాణ, తెలంఆణ (24 December 2020). "బాతిక్‌ బాలయ్య మృతి". Archived from the original on 24 December 2020. Retrieved 31 January 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (24 December 2020). "బాతిక్ బాల‌య్య‌ మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం". Archived from the original on 24 December 2020. Retrieved 31 January 2021.