భగవద్గీత-జ్ఞానవిజ్ఞాన యోగము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగవద్గీత
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక


జ్ఞానవిజ్ఞాన యోగము, భగవద్గీతలో ఏడవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

కృష్ణుడు:

నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము, దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.

వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.

నా ఈ ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి, నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు.

దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది.

నీళ్ళల్లో రుచి, సూర్యచంద్రులలో కాంతి, వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే.

త్రిగుణాలన్ని నా ఆధీనమే,నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతున్ని ఐన నన్ను తెలుసుకోలేకపోతున్నారు.

త్రిగుణాతీతమూ,దైవతమూ ఐన నా మాయ దాటడానికి సాధ్యము కాదు.ఐనా నన్ను శరణు జొచ్చువారికి అది సులభసాధ్యము. రాక్షసభావులూ,మూఢులూ,మూర్ఖులూ,నీచులూ నన్ను పొందలేరు. ఆపదలపాలైనవాడు,తెలుసుకోగోరేవాడు,సంపదను కోరేవాడు,జ్ఞాని అను నాలుగు విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు నలుగురూ ఉత్తములే కాని జ్ఞాని ఎల్లపుడు నా యందే మనసు నిలుపుకొని సేవిస్తాడు కాబట్టి అతడు నాకు,అతడికి నేను చాలా ఇష్టులము, అతడు శ్రేష్టుడు.

అనేకజన్మల పిదప "వాసుదేవుడే సమస్తము" అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు.

ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ధ, విశ్వాసం కలిగేలా చేస్తున్నాను.వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు.నన్ను సేవించినవారు నన్ను పొందుతారు.

నిర్వికారమూ, సర్వాతీతము ఐన నా స్వస్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు.యోగమాయచే కూడినవాడవడం చేత నన్ను వారు తెలుసుకోలేరు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలోని సర్వజీవులూ నాకు తెలుసు.నేనెవ్వరికీ తెలియదు. రాగద్వేషాలచే కలిగిన సుఖదుఃఖాలచే జీవులు మోహించబడుచున్నారు.పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్నీ, పరబ్రహ్మనూ తెలుసుకుంటారు. భూతాధిపతిని, దైవాన్ని, యజ్ఞాధిపతిని ఐన నన్ను తెలుసుకొన్నవాళ్ళూ మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు.