Jump to content

భగవద్గీత-సాంఖ్య యోగము

వికీపీడియా నుండి
భగవద్గీత
యోగములు
1. అర్జునవిషాద
2. సాంఖ్య
3. కర్మ
4. జ్ఞాన
5. కర్మసన్యాస
6. ఆత్మసంయమ
7. జ్ఞానవిజ్ఞాన
8. అక్షరపరబ్రహ్మ
9. రాజవిద్యారాజగుహ్య
10.విభూతి
11.విశ్వరూపసందర్శన
12.భక్తి యోగము
13.క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ
14.గుణత్రయవిభాగ
15.పురుషోత్తమప్రాప్తి
16.దైవాసురసంపద్విభాగ
17.శ్రద్దాత్రయవిభాగ
18.మోక్షసన్యాస
గీతా మహాత్యము
గీత సంస్కృత పాఠము
గీత తెలుగు అనువాదము
హిందూధర్మశాస్త్రాలు

గమనిక



సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.

మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగములో కురుక్షేత్రంలో మొహరించిన సేనల వర్ణన, వారిని చూసి అర్జునుని మనస్సు వికలం కావడం, తాను యుద్ధం చేయలేనని అర్జునుడు అనడం చెప్పబడినాయి. అర్జునుని విషాదం ఈ రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగం ఆరంభంలో కొనసాగింది. చివరకు అతను నీవు తప్ప నాకు వేరు గతి లేదు. నాకు ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. అని కృష్ణునికి శరణాగతుడై చతికిలపడ్డాడు. అప్పుడు కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే ఈ సాంఖ్య యోగము

సంక్షిప్త గీత

[మార్చు]

సాంఖ్య యోగాన్ని సంక్షిప్త గీత అని కూడా అంటారు. భగవద్గీతలో కొన్ని అధ్యాయాలలో జ్ఞానము, కొన్ని అధ్యాయాలలో కర్మము ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అయితే సాంఖ్యయోగంలో ఎందుకంటే ఇందులో జ్ఞానము, కర్మము కూడా తెలుపబడినాయి. అన్నింటికంటే పెద్ద అధ్యాయం కూడా ఇదే.

అధ్యాయ సంగ్రహం

[మార్చు]
అర్జునుని శరణాగతి

అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు. కాని అర్జునుడు "నేను గురువులను, పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను. అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా. నాకు దుఃఖం ఆగడం లేదు. నేను నీ శిష్యుణ్ణి. నాకేది మంచిదో నీవే చెప్పు" అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో "దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు. తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని, వర్తమానం గురించికాని బాధపడరు. అయినా నేను, నువ్వు, ఈ రాజులు గతంలోనూ ఉన్నాము. భవిష్యత్తులోనూ ఉంటాము. బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే. సుఖదుఃఖాలు శాశ్వతం కావు. ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు.

ఆత్మ లక్షణాలు

దేహం అనిత్యం, కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం. ఆత్మ సర్వవ్యాపకం. దేహాలు నశించినా ఆత్మ నశించదు. ఆత్మ చంపబడుతుందని కాని, చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు. ఇది సనాతనము అనగా ఎప్పుడు ఉండేది. మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. అగ్నికాని, గాలి కాని, నీరు గాని, ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు. ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు. పుట్టిన శరీరం చావక తప్పదు. మరలా పుట్టక తప్పడు. దీనికి బాధపడనవసరం లేదు. అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.

విద్యుక్త ధర్మ నిర్వహణ

క్షత్రియులకు యుద్దధర్మం శ్రేష్ఠం. నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనంచే చేయలేదని అనుకుంటారు. అపకీర్తి వస్తుంది. అమర్యాద పాలవుతావు. శత్రువులు చులకన చేస్తారు. మరణిస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం పొందుతావు. సుఖదుఃఖాలను, జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు. కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.

నిష్కామ కర్మ

ఇప్పుడు నేను చెప్పబోయేది ఏ కొంచం ఆచరించినా గొప్పఫలితాన్ని ఇచ్చి సంసారభయాన్ని దాటగలవు. ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏక కారణంగా ఉంటుంది. కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి ఆ కర్మలే చేస్తూ నిశ్చలమైన ధ్యానంకాని, బుద్ధికాని లేక జననమరణాలు పొందుతుంటారు. ప్రకృతి యొక్క మూడుగుణాలకు అతీతుడవై, సుఖదుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి. బావితో ఎంత ప్రయోజనముందో ఆ ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి, జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది. పని చెయ్యి. కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు. అలా అని పని చేయడం ఆపకు.

జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగిఉండు. ఈ బుద్ధి కలిగినవారు పాపపుణ్యాలు నశింపచేసుకుని మోక్షము పొందుతారు. నీ మనసు స్థిరం కావాలి.

స్థితప్రజ్ఞుడి లక్షణాలు

అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు, నడవడిక గురించి అడుగగా కృష్ణుడు "అన్ని కోరికలను వదిలి, దుఖానికి కలత పొందక, సుఖానికి పరవశించక, అనురాగము, కోపము, భయములను వదిలివేసి తన ఆత్మ యందె సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడుతాడు" అన్నాడు. ఇంద్రియ నిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది. విషయాల గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి, అది నెరవేరకపోవడం వలన కోపం, ఆ కోపం వలన అవివేకం, అవివేకం వలన యుక్తాయుక్తజ్ఞానం, బుద్ధి నశించి అథోగతిపాలవుతాడు.

విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం, కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు. నిశ్చలత్వం లేని వాడికి శాంతి, అదిలేనివాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు. లౌకిక విషయాలందు నిద్రతోను, సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.

బ్రాహ్మిస్థితి

సముద్రంలోకి ఎన్ని నీళ్ళు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా, గంభీరంగా చెలియలికట్ట దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు. అహంకారాన్ని, కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మిస్థితి అంటారు. ఈ స్థితిని ఎవరైతే జీవించి ఉండగానే పొందగలడో అతడే బ్రహ్మనిర్వాణపదాన్ని పొందుతాడు.

తాత్విక, ఆధ్యాత్మిక విశేషాలు

[మార్చు]

కొన్ని ముఖ్య శ్లోకాలు, వ్యాఖ్యలు

[మార్చు]

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||

కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి. - భగవంతునిపట్ల ప్రపత్తి (సంపూర్ణ శరణాగతి) కలిగితే కాని జ్ఞానము, భక్తి, మోక్షము సిద్ధించవని ఈ శ్లోకంలో సూచించబడింది.

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||

మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలను విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు. - జనన మరణాలు శరీరానికే గాణి ఆత్మకు ఉండవని తెలిపే ఈ శ్లోకం భగవద్గీతలో ప్రసిద్ధ శ్లోకాలలో ఒకటి.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||

కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు. - హిందువులకు జీవన ధర్మాన్ని బోధించే సుప్రసిద్ధ శ్లోకాలలో ఇది ఒకటి.

ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||

విషయధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం వలన కామము, కామం వలన క్రోధం జనిస్తాయి. క్రోధం వలన విభ్రాంతి కలగుతుంది. విభ్రాంతితో మతిమరపు, దానితో బుద్ధి నాశనం కలిగి, బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు. రాగద్వేషాలనుండి విడివడి, స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు. - స్థిత ప్రజ్ఞులు విషయాల పట్ల ఆసక్తిని విడనాడాలని చెప్పే శ్లోకం.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||

అందరికి ఏది రాత్రియో, సంపూర్ణ నిగ్రహ వంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి. - సాధకుని లక్షణాలను తెలిపే శ్లోకం.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  • శ్రీమద్భగవద్గీత - తత్వవివేచనీ వ్యాఖ్య - రచన: జయదయాల్ గోయందకా - గీతాప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ (2002)
  • భగవద్గీత యథాతథము - రచన: ఏ.సి.భక్తివేదాంత ప్రభుపాద రచన - ప్రచురణ: భక్తివేదాంత బుక్‌ట్రస్ట్, హైదరాబాదు (2006)
  • శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహాభారతము - బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, కొంపెల్ల వేంకటరామశాస్త్రి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి (2001)
  • శ్రీ మద్భగవద్గీత - రచన: ఈశ్వర సత్యనారాయణ శర్మ - ప్రచురణ : కళ్యాణి ప్రెస్, తెనాలి (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం - ఈ పరచనలలో 9వ అధ్యాయాన్ని గురించి విశేషమైన వివరణ ఉంది.
  • శ్రీమద్భగవద్గీతా పరిచయం - సంకలనం: బాలగంగాధర పట్నాయక్, దీపశిఖ, ఒడిషా - శ్రీ శాంతి ఆశ్రమం, తూర్పుగోదావరి జిల్లా - ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

బయటి లింకులు

[మార్చు]