మేఘనాధ్ సాహా
మేఘనాధ్ సాహా | |
---|---|
జననం | షారాతోలి, ఢాకా, బంగ్లాదేశ్ | 1893 అక్టోబరు 6
మరణం | 1956 ఫిబ్రవరి 16 | (వయసు 62)
నివాసం | India |
జాతీయత | Indian |
రంగములు | భౌతిక శాస్త్రము |
వృత్తిసంస్థలు | అలహాబాద్ విశ్వవిద్యాలయం కలకత్తా విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | ఢాకా కళాశాల ప్రెసిడెన్సీ కళాశాల |
ప్రసిద్ధి | ఉష్ణ అయనీకరణం |
మేఘనాధ్ సాహా (1893 అక్టోబరు 6 — 1956 ఫిబ్రవరి 16) భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.[1] నక్షత్రాలలో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొన్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భాగమైన ఢాకాలోని సియోర్‌తలి గ్రామంలో 1893 అక్టోబరు 6న, అయిదుగురి పిల్లల్లో చివరివాడిగా పుట్టిన మేఘనాథ్ సాహా కేవలం చదువు సాయంతో ఎదిగాడు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి ఆదాయం చాలకపోవడంతో ఆ కుటుంబం తరచు పస్తులతో గడిపేది. సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్టడానికి తండ్రి ప్రయత్నించేవాడు. అయితే సాహా చురుకుదనాన్ని గమనించిన ఉపాధ్యాయులు తండ్రికి నచ్చచెప్పి దాతల సాయంతో ఓ బోర్డింగ్ స్కూలులో చేర్చారు. సాహా చక్కగా చదువుతూ స్కాలర్‌షిప్‌లు సాధించి పై చదవుల కోసం ఢాకా వెళ్లాడు.
ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్‌ను విభజించినందుకు నిరసనగా పన్నెండేళ్ల సాహా, గవర్నర్ తమ స్కూలును సందర్శిస్తున్న కార్యక్రమాన్ని స్నేహితులతో బహిష్కరించి డిస్మిస్ అయ్యాడు. మరో స్కూల్లో చేరి అక్కడ కూడా స్కాలర్‌షిప్ సాధించడం విశేషం. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో అతడికి బోధించిన వారిలో ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జగదీశ్ చంద్రబోస్, ప్రఫుల్ల చంద్ర రాయ్ ఉండగా, అతడి క్లాస్‌మేట్స్‌లో సత్యేంద్రనాథ్ బోస్, పీసీ మహాలనోబిస్ కూడా శాస్త్రవేత్తలవడం మరో విశేషం.
ఎమ్మెస్సీ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వక పోవడంతో ఉపాధి కోసం ట్యూషన్లు చెబుతూనే పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. ఆపై కలకత్తాలో అధ్యాపకుడిగా చేరిన ఆయన ఖగోళ భౌతిక శాస్త్రంపై పట్టు సాధించారు. సూర్యకాంతి గాజు పట్టకం ద్వారా ప్రసరించినప్పుడు ఏర్పడే వర్ణపటం (Spectrum) ఎందుకు ఏర్పడుతుందో చెబుతూ అయనీకరణ సూత్రాన్ని ప్రతిపాదించారు. దీని వల్ల సూర్యుని ఉష్ణోగ్రతలు, సౌష్టవం, సంయోజనం లాంటి ధర్మాలను విశ్లేషించారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (లండన్) గా ఎన్నికయ్యారు. అలహాబాదు విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా ప్రొఫెసర్‌గా వర్ణపట విజ్ఞానం (Spectroscopy), అయనావరణం (Ionosphere) పై పరిశోధనలు చేశారు. సూర్యకిరణాల బరువును, వత్తిడిని కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. ఇంకా పురాతన శిలలు, సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధనలు చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ (కేంద్రక భౌతికశాస్త్రం) విభాగాన్ని ప్రారంభించారు. సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌ను 1948లో కలకత్తాలో స్థాపించారు. దేశంలో పరమాణు కణాల త్వరణాన్ని పెంచే తొలి యాక్సిలరేటర్ ఆయన పర్యవేక్షణలోనే నిర్మితమైంది. సైన్స్ అండ్ కల్చర్ పత్రికను నడిపారు. ఆయన రాసిన 'ఎ ట్రిటైజ్ ఆన్ హీట్' ఓ ప్రామాణిక పాఠ్యగ్రంథం.
1923 లో సాహా అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యాడు. 1927 లో రాయల్ సొసైటీలో సభ్యత్వం లభించింది. 1938 లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ కలకత్తా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు.
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]- "మేగనాథ్ సాహా". Archived from the original on 2015-02-23. Retrieved 2008-05-31.
- జీవితచరిత్ర
- తన తండ్రి గురించి చిత్రా రాయ్ Archived 2011-07-13 at the Wayback Machine
- జీవనరేఖలు
- సైన్స్ వరల్డ్: సాహా ఈక్వేషన్
- ఎం.ఎన్.సాహా పత్రాల జాబితా
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- భారతీయులు
- ప్రపంచ ప్రసిద్ధులు
- 1893 జననాలు
- 1956 మరణాలు
- ఖగోళ శాస్త్రవేత్తలు
- భౌతిక శాస్త్రవేత్తలు
- భారతీయ భౌతిక శాస్త్రవేత్తలు