లలితా సహస్ర నామములు- 1-100
Jump to navigation
Jump to search
లలితా సహస్ర నామ స్తోత్రములోని మొదటి నూరు నామములకు సంక్షిప్త వివరణ ఇక్కడ ఇవ్వబడింది.[1][2]
శ్లోకం 01
[మార్చు]- శ్రీమాతా : మంగళకరమైన, శుభప్రదమైన తల్లి.
- శ్రీమహారాజ్ఞీ : శుభకరమైన గొప్పదైన రాణి.
- శ్రీమత్సింహాసనేశ్వరీ : శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది.
- చిదగ్ని కుండ సంభూతా : చైతన్యమనెడి అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది.
- దేవకార్య సముద్యతా : దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది.
శ్లోకం 02
[మార్చు]- ఉద్యద్భాను సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
- చతుర్బాహు సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
- రాగస్వరూప పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
- క్రోధాకారాంకుశోజ్జ్వలా : క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది.
శ్లోకం 03
[మార్చు]- మనో రూపేక్షు కోదండా : మనస్సును రూపముగా గల్గిన చెఱకుగడ విల్లును ధరించింది.
- పంచతన్మాత్ర సాయకా : జ్ఞానేంద్రియ విషయ పంచకము యొక్క సూక్ష్మాంశలు అయిన శబ్ద స్పర్శ రూప రస గంధములు అనబడు 'తన్మాత్ర'లను బాణములుగా ధరించినది.
- నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
శ్లోకం 04
[మార్చు]- చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా : సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది.
- కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండితా : పద్మరాగముల వరుసచేత ప్రకాశించుచున్న కిరీటముచే అలంకరింపబడింది.
శ్లోకం 05
[మార్చు]- అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా : అష్టమినాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న (అర్థచంద్రాకారము కలిగిన) ఫాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నది.
- ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా : ముఖము అనెడి చంద్రునియందు మచ్చవలె ఒప్పెడు కస్తురి బొట్టును కలిగినది.
శ్లోకం 06
[మార్చు]- వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : ముఖమనెడు మన్మథుని శుభమైన నివాసమునకు తోరణమువలె ఒప్పు కనుబొమలు కలిగినది.
- వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా : ముఖదీప్తి అనెడు సంపదప్రదమైన స్రోతస్సు (ప్రవాహము) నందు కదలాడుచున్న చేపలవలె ఒప్పుచుండు కన్నులు కలిగినది.
శ్లోకం 07
[మార్చు]- నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా : క్రొత్తగా వికసించుచున్న సంపెంగ పువ్వును పోలెడు ముక్కుదూలముతో ప్రకాశించునది
- తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : ఆకాశములో ప్రకాశించునట్లు కనబడు చుక్కల యొక్క కాంతిని తిరస్కరించుచున్న ముక్కు బులాకీ చేత ప్రకాశించునది.
శ్లోకం 08
[మార్చు]- కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా : కడిమి పూల గుచ్చములచే, ఆభరణములచే సింగారించిన చెవులతో మనస్సును దోచునంత అందము కలిగినది.
- తాటంక యుగళీభూత తపనోడుప మండలా : చెవి కమ్మలుగా జంటగా అయిన సుర్య చంద్ర మండలమును గలది.
శ్లోకం 09
[మార్చు]- పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.
- నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది. (విద్రుమ అనగా పై పెదవి. బింబమనగా క్రింది పెదవి).
శ్లోకం 10
[మార్చు]- శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.
- కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.
శ్లోకం 11
[మార్చు]- నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ - తన యొక్క సంభాషణ యొక్క తియ్యదనము చేత విశేషముగా లేదా అధికముగా అదలింపబడిన కచ్ఛపీ అను పేరుగల వీణ గలది.
- మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా - చిరునవ్వు నిండిన కాంతి ప్రవాహమునందు మునకలిడుచున్న శివుని యొక్క మనస్సు కలిగినది.
శ్లోకం 12
[మార్చు]- అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా - లభ్యము గాని లేదా దొరకని పోలిక గల గడ్డము యొక్క శోభ చేత ప్రకాశించునది.
- కామేశ బద్ధ మాంగల్యసూత్ర శోభిత కంధరా - పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే, పవిత్ర సౌందర్యముతో ప్రకాశించుచున్న మెడ గలిగినది.
శ్లోకం 13
[మార్చు]- కనకాంగద కేయూర కమనీయ భూజాన్వితా - బంగారు ఆభరణాలు, వంకీలతో అందమైన బాహువులు కలిగినది.
- రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా - రత్నముల చేత అలంకరించిన కంఠమునందు 'చింతాకు' అనే కదులుచున్న ముత్యాలతో కూడిన ఆభరణము ధరించునది.
శ్లోకం 14
[మార్చు]- కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతి పణ స్తనీ - కామేశ్వరుని యొక్క ప్రేమ అనెడి శ్రేష్టమైన మణిని పొందుటకై బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్తనములు గలది.
- నాభ్యాలవాల రోమాళి లతాఫలకుచద్వయీ - బొడ్డు అనెడి పాదు లోని నూగారు అనెడి తీగకు పండ్లవలె ఒప్పు జంట స్తనములు గలిగినది.
శ్లోకం 15
[మార్చు]- లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమా - కనబడుచున్న నూగారు అనెడు తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది.
- స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయా - వక్షముల బరువు చేత విరుగుచున్న నడుమునకు కట్టిన పట్టీల యొక్క బంధముల వలె కనబడు మూడు ముడుతలు గలది.
శ్లోకం 16
[మార్చు]- అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ - ఉదయ సూర్యుని రంగువలె కుంకుమపువ్వు రంగువలె అగుపడు వస్త్రముతో వెలుగొందు కటి ప్రదేశము గలది.
- రత్నకింకిణికా రమ్యా రశనాదామ భూషితా - రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైన ఒడ్డాణపు త్రాటి చేత అలంకరింపబడింది.
శ్లోకం 17
[మార్చు]- కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా - కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది.
- మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా - మాణిక్య సంబంధమైన కిరీటము వంటి ఆకారముతో ఒక్కు మోకాళ్లతో ప్రకాశించునది.
శ్లోకం 18
[మార్చు]- ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా - ఆరుద్ర పురుగుల చేత చుట్టును పొదగబడిన మన్మథుని యొక్క అమ్ముల పొదులతో ఒప్పు పిక్కలు గలది.
- గూఢగుల్ఫా - నిండైన చీలమండలు గలది.
- కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా - తాబేలు యొక్క ఉపరితలం అనగా వీపు భాగపు నునుపును గెలుచు స్వభావము గల పాదాగ్రములు కలిగినది.
శ్లోకం 19
[మార్చు]- నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా - గోళ్ళ యొక్క కాంతుల చేత చక్కగా కప్పివేయబడిన నమస్కరించుచున్న జనుల యొక్క అజ్ఞానం గలది.
- పద ద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా - పాదముల జంట యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మములు గలది.
శ్లోకం 20
[మార్చు]- శింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజా - ధ్వని చేయుచున్న మణులు గల అందెలచేత అలంకరింపబడిన శోభగల పద్మముల వంటి పాదములు గలది.
- మరాళీ మందగమనా - హంసవలె ఠీవి నడక కలిగినది.
- మహాలావణ్య శేవధిః - అతిశయించిన అందమునకు గని లేదా నిధి.
శ్లోకం 21
[మార్చు]- సర్వారుణా - సర్వము అరుణ వర్ణంగా భాసించునది.
- అనవద్యాంగీ - వంక పెట్టుటకు వీలులేని అవయవములు గలది.
- సర్వాభరణ భూషితా - సమస్తమైన నగల చేత అలంకరించబడింది.
- శివకామేశ్వరాంకస్థా - శివస్వరూపుడు కామ స్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది.
- శివా - వ్యక్తమైన శివుని రూపము కలది.
- స్వాధీన వల్లభా - తనకు లోబడిన భర్త గలది.
శ్లోకం 22
[మార్చు]- సుమేరు మధ్యశృంగస్థా - మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది.
- శ్రీమన్నగర నాయికా - శుభప్రథమైన ఐశ్వర్యములతో కూడిన నగరంనకు అధిష్ఠాత్రి.
- చింతామణి గృహాంతఃస్థా - చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది.
- పంచబ్రహ్మాసనస్థితా - ఐదుగురు బ్రహ్మ రూపాలు (సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన) ధరించినటువంటి శివునిచే నిర్మింపబడిన ఆసనములో కూర్చున్నది.
శ్లోకం 23
[మార్చు]- మహాపద్మాటవీ సంస్థా - మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉంది.
- కదంబ వనవాసినీ - కడిమి చెట్ల యొక్క తోటయందు వసించునది.
- సుధాసాగర మధ్యస్థా - అమృత సముద్రము అనగా క్షీర సాగర మధ్య భాగములో స్థితురాలైనది.
- కామాక్షీ - అందమైన కన్నులు గలది.
- కామదాయినీ - కోరికలను నెరవేర్చునది.
శ్లోకం 24
[మార్చు]- దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా - సంఘాతము అనగా నరకము. అటువంటి నరకము నుండి దేవతలను, ఋషులను, గణములను రక్షింప కొనియాడబడుచున్న దివ్యత్వము గలది.
- భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా - భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.
శ్లోకం 25
[మార్చు]- సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా - సంపత్కరీ దేవి (గజ సైన్య దేవతా నాయకి) అధిరోహించిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడునది.
- అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా - అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుఱ్ఱముల యొక్క కోట్లానుకోట్లచే చుట్టుకొనబడింది.
శ్లోకం 26
[మార్చు]- చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా - చక్రరాజము అను పేరుగల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడింది.
- గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా - గేయచక్రము అని పేరుగల రథమును అధిష్ఠించిన మంత్రిణిచే అన్ని వైపుల నుండి సేవింపబడునది.
శ్లోకం 27
[మార్చు]- కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా - కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతియందు ఎల్లప్పుడూ వుండు దేవి ముందు ఉండి సేవింపబడునది.
- జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా - జ్వాలామాలిని అను పేరు గల నిత్యదేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్నిప్రాకారము యొక్క మధ్యనున్నది.
శ్లోకం 28
[మార్చు]- భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షితా - భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది.
- నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా - నిత్యాదేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి, సామర్థ్య, ఉత్సాహాలను చూసి సంతోషించింది.
శ్లోకం 29
[మార్చు]- భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా - భండాసురుని పుత్రులను సంహరించుటకు సంసిద్ధురాలైన బాలాదేవి యొక్క విక్రమమునకు సంతసించునది.
- మంత్రిణ్యంగా విరచిత విషంగ వధతోషితా - మంత్రిణీ దేవి చేత చేయబడిన విషంగ వధను విని సంతసించింది.
శ్లోకం 30
[మార్చు]- విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా - విశుక్రుని ప్రాణాలను హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించింది.
- కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా - కామేశ్వరుని యొక్క ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన గణపతిని గలది.
శ్లోకం 31
[మార్చు]- మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా - మహాగణపతి చేత నశింపచేయబడిన జయ విఘ్న యంత్రమునకు మిక్కిలి సంతోషించింది.
- భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణీ - రాక్షస రాజైన భండాసురిని చేత ప్రయోగింపబడిన శస్త్రములకు విరుగుడు అస్త్రములను కురిపించునది.
శ్లోకం 32
[మార్చు]- కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - చేతివ్రేళ్ళ గోళ్ళ నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది.
- మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా - మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత - నిశ్శేషంగా దహింపబడిన రాక్షస సైన్యము గలది.
శ్లోకం 33
[మార్చు]- కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా - కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్శేషంగా భండాసురుణ్ణి దహించి అతడు పాలించే 'శూన్యక నగరము' యొక్క పేరు సార్థకం చేసినది. (పాలకుడు లేని నగరం శూన్యమే కదా.)
- బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవా - బ్రహ్మ, విష్ణువు*, ఇంద్రుడు మొదలైన దేవతల చేత స్తుతింపబడిన పరాక్రమ వైభవం గలది. (*'ఉపేంద్ర' అనగా ఇంద్రుడి యొక్క తమ్ముడు. అదితి సంతతియైన ఇంద్రుడి తరువాత జన్మించినది విష్ణువు.)
శ్లోకం 34
[మార్చు]- హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః - శివుని యొక్క మూడవ కంటికి నిశ్శేషంగా దహింపబడిన మన్మథునికి సంజీవనము వంటి మందువలె పనిచేసినది అనగా పునర్జీవనము ప్రసాదించునది.
- శ్రీ మద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా - మంగళకరమైన లేదా మహిమాన్వితమైన పంచదశి మంత్రములోని 'వాగ్భవము' అను పేరుగల అక్షర సముదాయమే ముఖ్యమైన స్వరూపముగాగల పద్మము వంటి ముఖము గలది.
శ్లోకం 35
[మార్చు]- కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ - కంఠము యొక్క క్రింద నుండి నడుము లేదా నాభి ప్రదేశము వరకు గల శరీరమును లేదా దేహమును పంచదశి మంత్రములోని 'మధ్యకూట' స్వరూపముగా గలది.
- శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణీ - పంచదశి మంత్రములోని 'శక్తికూటము'తో సామ్యమమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించింది.
శ్లోకం 36
[మార్చు]- మూలమంత్రాత్మికా - మూలమంత్రమును అనగా పంచదశాక్షరీ మంత్రమును ఆత్మస్వరూపముగా గలది.
- మూలకూట త్రయకళేబరా - మూలమంత్రము యొక్క కూటత్రయమును తన శరీరముగా గలది.
- కులమృతైక రసికా - కులమునకు సంబంధించిన అమృతములో మిక్కిలి ఆసక్తి కలది.
- కులసంకేత పాలినీ - కుల సంబంధమైన ఏర్పాటులను పాలించింది.
శ్లోకం 37
[మార్చు]- కులాంగనా - కుల సంబంధమైన స్త్రీ.
- కులాంతస్థా - బాహ్యమున శ్రీచక్రార్చన చేయు విధానమును 'కౌళము' లేదా కులాచారము అంటారు. కులము యొక్క మధ్యములో స్థితమై ఉన్నది పరమేశ్వరి.
- కౌలినీ - కులదేవతల రూపంలో ఆరాధింపబడునది. 'కుళము' అనగా శక్తి. 'అకుళము' శివుడిని సూచిస్తుంది. కుళాకుళ సంబంధమే కౌళ విద్య లో చెప్పబడింది. శివ శక్తుల సమరస్యము కలిగినది 'కౌళిని'.
- కులయోగినీ - కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.
- అకులా - అకులా స్వరూపురాలు (కుల మార్గం అనగా షట్చక్రములు ఉన్న దారి. అటుపైన సహస్రార చక్రమును 'అకులం' అంటారు.) శివుని చేత సృష్టించ బడినది కాబట్టి 'కులము లేనిది' అని మరొక తాత్పర్యం.
- సమయాంతస్థా - సమయాచారమనగా మానస పూజ లేదా అంతర్గత ఉపాసన. సమయాచారులకు పురశ్చరణ, హోమ, జప, బాహ్య పూజా విధి విధానాలు వర్తించవు. మహాదేవి సమయాచార అంతర్వర్తిని.
- సమయాచార తత్పరా - సమయాచారములో ఆసక్తి కలది.
శ్లోకం 38
[మార్చు]- మూలాధారైక నిలయా - మూలాధార చక్రమే ముఖ్యమైన నివాసముగా గలది.
- బ్రహ్మగ్రంథి విభేదినీ - బ్రహ్మగ్రంథిని విడగొట్టునది.
- మణిపూరాంత రుదితా - మణిపూర చక్రము యొక్క లోపలి నుండి ఉదయించునది లేదా ప్రకటమగునది.
- విష్ణుగ్రంథి విభేదినీ - విష్ణుగ్రంథిని విడగొట్టునది.
మూలాలు
[మార్చు]- ↑ "Untitled | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
- ↑ Incarnation 14 (2020-08-31). "శ్రీ లలితా సహస్ర నామములు – 79 / Sri Lalita Sahasranamavali – Meaning – 79". Prasad Bharadwaj Incarnation 14 Blog (in ఇంగ్లీష్). Retrieved 2023-07-08.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)