అభినవ్ భారత్ సొసైటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అభినవ్ భారత్ సొసైటీ, [1] లో వినాయక్ దామోదర్ సావర్కర్, అతని సోదరుడు గణేష్ దామోదర్ సావర్కర్ లు స్థాపించిన భారత స్వాతంత్ర్య రహస్య విప్లవ సంఘం. వినాయక్ సావర్కర్ పూణేలోని ఫెర్గూసన్ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు నాసిక్‌లో మొదట "మిత్ర మేళా"గా దీన్ని స్థాపించాడు. సావర్కర్ న్యాయశాస్త్రం అభ్యసించడానికి లండన్‌ వెళ్ళిన తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శాఖలతో, అనేక వందల మంది విప్లవకారులు, రాజకీయ కార్యకర్తలను చేర్చుకుని ఈ సమాజాన్ని విస్తరించాడు. ఈ సంస్థ కొందరు బ్రిటీష్ అధికారుల హత్యలు చేసింది. ఆ తర్వాత సావర్కర్ సోదరులు దోషులుగా నిర్ధారించబడి, జైలు పాలయ్యారు. 1952లో సంఘాన్ని అధికారికంగా రద్దు చేసారు. [2] [3]

చరిత్ర[మార్చు]

వినాయక్ సావర్కర్, గణేష్ సావర్కర్ లు 1899లో నాసిక్‌లో మిత్ర మేళా అనే విప్లవ రహస్య సంఘాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో మహారాష్ట్రలో పనిచేస్తున్న అనేక విప్లవ సంఘాల్లో ఇది ఒకటి. సాయుధ తిరుగుబాటు ద్వారా బ్రిటిష్ పాలనను పడగొట్టాలని ఈ సంస్థ విశ్వసించింది. [4] 1904 లో మహారాష్ట్రలోని వివిధ పట్టణాలకు చెందిన 200 మంది సభ్యులు హాజరైన ఒక సమావేశంలో వినాయక్ సావర్కర్, గియుసెప్పీ మజ్జినీ స్థాపించిన యంగ్ ఇటలీ సంస్థ తరహా లోనే దీనికి అభినవ్ భారత్ అనే పేరు పెట్టాడు. 

1906లో, వినాయక్ సావర్కర్ న్యాయశాస్త్రం చదవడానికి లండన్ వెళ్లాడు. అదే సంవత్సరంలో అతను మజ్జినీ చరిత్ర అనే సంపుటాన్ని సంకలనం చేసాడు. ఇటాలియన్ విప్లవకారుడు మజ్జినీ రచనల అనువదిస్తూ, 25 పేజీల పరిచయాన్ని ఆ పుస్తకంలో రాసాడు. [5] ఈ పుస్తకం మహారాష్ట్రలో 1907 జూన్‌లో ప్రచురించబడి, మొదటి ఎడిషన్లో వేసిన 2,000 కాపీలు ఒక నెలలోనే అమ్ముడయ్యాయి. [6] మజ్జినీ యొక్క రహస్య సమాజాలు, గెరిల్లా యుద్ధ పద్ధతులను సావర్కర్ పూర్తిగా స్వీకరించాడు. అతను భారతదేశంలోని తన స్వదేశీయులకు క్రమం తప్పకుండా వార్తాలేఖలు పంపించేవాడు. అలాగే లండన్‌లో విప్లవ ప్రచారాన్ని చేసాడు. [7]

కార్యకలాపాలు[మార్చు]

సావర్కర్ విప్లవ భావాలు లెఫ్టినెంట్ కల్నల్ విలియం కర్జన్-విల్లీ హత్యకు దారితీశాయి. 1909 జూలై 1 సాయంత్రం లండన్‌లోని ఇంపీరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో భారతీయ విద్యార్థుల సమావేశంలో మదన్‌ లాల్ ధింగ్రా, భారతదేశ వ్యవహారాల మంత్రికి రాజకీయ సహాయకుడైన విల్లీని చంపాడు. ధింగ్రాను అరెస్టు చేసి, విచారించి ఉరితీశారు. 1909 లో చారిత్రాత్మక "నాసిక్ కుట్ర కేసు"లో అనంత్ లక్ష్మణ్ కన్హరే, నాసిక్ జిల్లా మేజిస్ట్రేటైన AMT జాక్సన్ ను భారతదేశంలో హత్య చేసాడు. [7] [8]

జాక్సన్ హత్య దర్యాప్తులో అభినవ్ భారత్ సొసైటీ ఉనికి గురించి, దానిని నడిపించడంలో సావర్కర్ సోదరుల పాత్ర ఉందని తేలింది. వినాయక్ సావర్కర్ ఇరవై బ్రౌనింగ్ పిస్టల్స్‌ను భారతదేశానికి పంపినట్లు కూడా తేలింది. వాటిలో ఒకదాన్ని జాక్సన్ హత్యకు ఉపయోగించారు. జాక్సన్ హత్యలో అతనిపై అభియోగాలు మోపారు. విచారణ పూర్తయ్యాక అతనికి ఆజన్మాంత ద్వీపాంతర వాస శిక్ష విధించబడింది. 1910లో సావర్కర్‌ను అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలులో ఖైదు చేసారు. [7]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Jayapalan 2001; Bapu 2013
  2. Jaffrelot 1996
  3. Teltumbde 2005
  4. Bapu 2013, pp. 95–96.
  5. Sharma 2006, p. 157.
  6. Joglekar 2006, p. 49.
  7. 7.0 7.1 7.2 Bapu 2013, p. 96.
  8. "Nasik Conspiracy Case - 1910". Bombay High Court. Archived from the original on 9 April 2009. Retrieved 2015-03-03.