అలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్షణ భంగిమలోనున్న ఒక అలుగు,  హార్నిమన్ సంగ్రహాలయం, లండన్

అలుగు లేదా పొలుసుల పిపీలికారి అనేది ఫోలిడోటా జాతికి చెందిన క్షీరదము. దీని ఆంగ్లనామము పాంగోలిన్ అనేది యవన నామమైన φολῐ́ς,ఫోలీష్ అనగా సూదుల్లాంటి పొలుసున్నది అని అర్థము. ఈ జాతిలోని ఒకటైన మేనిడే అనే కుటుంబానికి మూడు ఉపకుటుంబాలున్నాయి: "మ్యానిస్" అనబడే దానిలో నాలుగు రకాల అలుగులు ఆసియాకి చెందినవి. "ఫాటాజినస్" అనబడే దానిలో రెండు రకాల అలుగులు ఆఫ్రికాకి చెందినవి, "స్మట్సియా" అనబడే దానిలో మరో రెండు రకాల అలుగులు ఆఫ్రికాకి చెందినవి. ఈ రకాలు అలుగులన్నీ ముప్ఫై నుండి నూఱు సెం.మీ||ల పరిమాణంతో ఉంటాయి. చాలా రకాల అలుగులు నేటికి అంతరించిపోయాయి.

అలుగులకు కెరటీన్ అని పిలువబడే మాంసకృతితో నిర్మించబడ్డ పెద్ద, పెద్ద పొలుసులు ఒళ్లంతా ఉంటాయి. పైగా అలుగులే అలా పొలుసులుండే ఏకైక క్షీరదాలు. ఇవి చెట్టుతొర్రలలో లేదా నేలబొరియలలో నివసిస్తాయి. అలుగులు రాత్రిసంచార జంతువులు., వాటి ఆహారం ప్రత్యేకించి కేవలం చీమలు, చెదపురుగులే. వాటిని అవి తమతమ పొడవాటి సన్నమైన నాలుకలతో నోటిలోకి జుర్రుకుని తింటాయి. ఈ జంతువులు సాధారణంగా ఒంటరిగా జీవించే గుణం గలవి. ఇవి కేవలం సంతానోత్పత్తికొఱకు మాత్రమే కలుస్తాయి. ఇవి తమ జీవితకాలంలో రెండు-మూడు పిల్లలనే కంటాయి. ప్రతి పిల్లను రెండేళ్ల వరకు శ్రద్ధగా పోషించి పెంచుతాయి.

అలుగులు మనుషుల ద్వారా వాటి మాంసం, పొలుసులకోసం వేటాడబడి చంపబడుతున్నాయి. అలాగే అడవుల నరికివేత కారణంగా వాటికి నివసించడానికి వీలైన చోటులు కరువౌతున్నాయి. ఎనిమిది అలుగుల జాతులలో, నాలుగు(ఫాటాగినస్ టెట్రడాక్టిలా, ఫాటాగినస్ త్రైకస్పిస్, స్మట్సియా జైగాంటికా, స్మట్సియా తెమ్మింక్కీ)అంతరించిపోయే ప్రమాదానికి అంచులో ఉండగా, రెండు జాతులు(మ్యానిస్ క్రాసిఖౌడేటా, మ్యానిస్ క్యులియోనెంసిస్) అంతరించిపోవడానికి సిద్ధమయ్యాయి. మఱోరెండు జాతులైన(మ్యానిస్ పెంటాడాక్టిలా, మ్యానిస్ జావానికా)దాదాపు అంతరించిపోయాయని ప్రాకృతిక అంతరింపు ప్రమాదజంతువుల పరిరక్షణా ప్రపంచసంస్థ. వెల్లడిచేసింది.

వర్గీకరణం[మార్చు]

అలుగు ఆంగ్లనామమైన "ప్యాంగోలిన్" మలయ(మలయాళం కాదు) భాషలోని "పెంగ్గులింగ్" అనగా "చుట్టుకునే గుణం కలది" నుండి వచ్చింది.

వర్ణన[మార్చు]

అలుగు యొక్క శారీరక రూపురేఖలు చూడటానికి గట్టిగా, పరస్పర అల్లికగల పొలుసులతో ఉంటుంది, ఆ పొలుసులు శిశు అలుగులకు మెత్తగా ఉండి, అవి పెద్దవి అయ్యేకొలది గట్టిబడతాయి.  అవి మనుషుల గోర్లు ఏ పదార్థముతో తయారయ్యాయో, అదే కెరటీను అనే పదార్థంతో తయారయ్యాయి. ఇతర సరీసృపాల పొలుసులకు ఇవి భిన్నంగానుంటాయి.  అలుగు యొక్క ఈ పొలుసుల శరీరము చూడటానికి ప్రాకుతున్న ఒక దేవదారుపండులా ఉంటుంది. అటువంటి పొలుసులు ఈ ప్రాణికి ఒక రక్షణాకవచంలాగ పనికి వస్తాయి.  ఈ పొలుసులు చాలా పదునుగా ఉంటాయి. ఈ జంతువులు ప్రమాదవేళలలో ఒక బంతిలాగ చుట్టూకుంటాయి.

అలుగులు కంపుకరడిలాగ ఒక దుర్గంధభరితమైన రసాయనాన్ని తమ మలద్వారం నుండి చిమ్మగలవు. వీటికి పొట్టికాళ్ళు, పదునైన గోళ్లు ఉంటాయి.  వాటితో ఇది చీమలపుట్టలను, చెదపుట్టలను తవ్వుకొని ఆహారాన్ని తింటుంది.

అలుగుల నాలుకలు ఘన పిపీలికారి, గొట్టంవంటి మూతిగల మకరంద గబ్బిలం కున్నట్లు చాలా పొడుగుగా ఉంటాయి. అలుగు నాలుక దాని కంఠపు ఎముకకు ఇతర జంతువులకున్నట్లు అతుక్కుని ఉండదు. కాని ఉరము భాగంలోని ఉరోఽస్థి,  శ్వాసనాళముకు మధ్య అంటుకొని ఉంటుంది. పెద్దలుగుల నాలుకలు దాదాపు నలభై సెం.మీ||ల పొడవు, అర సెం.మీ|| అడ్డుకొలతతో ఉంటాయి.

అలుగుల అస్థిపంజరాలు, అస్థి సంగ్రహాలయం, ఓక్లహామా, అమెరికా

ప్రవర్తన[మార్చు]

అలుగులన్నీ రాత్రించర జంతువులు. ఆ వేళలలో అవి చీమలను, చెదపురుగులను తమ వాసనాశక్తితో పసిగట్టి బాగా తింటాయి. పెద్దతోక అలుగు మాత్రమే ప్రొద్దునవేళలలో సంచరించి రాత్రి వేళలలో ఒక బంతిలాగ చుట్టుకొని పడుకొంటుంది. అలుగులు చాలా పిరికిగా రహస్యంగా బ్రతికే జంతువులు. 

వృక్షములపై బ్రతికే అలుగులు చెట్టుతొర్రలలో గూటిని కట్టుకొని నివసించగా, నేలలో నివసించేవి, పదకొండు అడుగుల లోతు బొరియలు తవ్వుకొని వాటిలో నివసిస్తాయి.

అలుగులు సాధారణంగా తమ వెనుకటి రెండుకాళ్లతోనే నడుస్తాయి, కాకపోతే సందర్భానుసారంగా ముందుకాళ్లపై కూడా తమ శరీరబరువును ఆంచుతాయి. కొన్ని కాసేపు వెనుక రెండుకాళ్లమీద నడిచి కాసేపు బరువును నాలుగుకాళ్లమీద ఆంచుతాయి.

ఆహారం[మార్చు]

ఆసియా సింహాలనుండి తననుతాను  రక్షించుకోవడానికి బంతిలా చుట్టుకుపోయిన  ఒక అలుగు

అలుగులు కీటకాహారులు. వాటి ఆహారములో ఎక్కువశాతం చీమలు, చెదపురుగులు ఉండగా, అప్పుడప్పుడు ఇతర పురుగులను కూడా(ముఖ్యంగా గొంగళిపురుగులు) తింటాయి. ఈ ప్రాణులు ఎక్కువగా తమ ఆహార విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటాయి- అంటే ఇవి కొన్ని రకాల పురుగులను మాత్రమే తింటాయి.  అవి సాధారణంగా తినని పురుగు సులువుగా దొరికినా, ఇవి వాటిని తినకుండా విడిచిపెట్టేస్తాయి. అలుగుల దృష్టి చాలా నిర్బలమైనది. అందుకు అవి ఎక్కువగా తమ వినికిడి, వాసనలపైనే ఆహారముకోసం ఆధారపడతాయి.  అలుగులకు దంతాలు లేవు కాబట్టి వాటి శారీరక నిర్మాణం.  అవి చీమలనుచెదపురుగులను తినడానికి సహకరించేలాగనే ఉంది. వాటి ఎముకల కూర్పు గట్టిగా ఉంటుంది.  వాటి దృఢమైన ముందుకాళ్లు పుట్టలను తవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. అంతేగాక అవి చెట్లెక్కడానికి, భూమిని తవ్వడానికి కూడా  సహకరిస్తాయి. వీటి పొడవైన నాలుకలు చీమలపుట్టలలోకి వెళ్ళి బోలెడన్ని చీమలను నోటిలోకి జుర్రుకోవడానికి ఉపయోగపడతాయి. 

వీటి నాలుకలు, కడుపులే వీటి ఆహారానికి, జీవనశైలికి ఆధారం. అలుగుల లాలాజలం బాగా బంకగా ఉండటం వలన చీమలు మొదలయిన పురుగులు దానికి అంటుకుపోతాయి.  పన్నులు లేనందువలన అలుగులు నమలలేవు. అందుకుగాను, అవి వేటాడే సమయాలలోనే జీర్ణఱాళ్లు(ఆంగ్లం: గ్యాస్ట్రోలిత్స్) అనే చిన్న చిన్న ఱాళ్లను మ్రింగి కడుపులో  ఆ ఱాళ్ల ద్వారా ఆహారాన్ని ఱుబ్బుకొని జీర్ణం చేసుకుంటాయి. అదీకాక, వాటి కడుపులో ఒక భాగమైన గిౙర్డ్ అనబడే గదిలో కెరటీనుతో చేయబడిన ముల్లులుంటాయి.  అవి ఆహారాన్ని ఇంకా ఱుబ్బి జీర్ణం చేస్తాయి.  చెట్టలుగు కొన్ని అలుగుల తోక చెట్లెక్కడంలో తోడ్పడుతుంది. అలాగే చెట్టు బెరడును పెకిలించడానికి(లోపల పురుగులు కనిపించేందుకు) కూడా సహకరిస్తుంది.

సంతానోత్పత్తి[మార్చు]

అలుగులుఒంటరి జీవులైనప్పటికీ సంతానోత్పత్తికై కలుస్తాయి. మగవి, ఆడవి కన్నా నలభైశాతం బరువెక్కువ ఉంటాయి. వాటి కాపురసమయం సరిగ్గా లెక్కవేయలేముగాని, అవి సాధారణంగా ఏడాదికొకసారి కలుస్తాయి ఎక్కువగా వేసవి లేదా శిశిరంలో. మగ అలుగులు ఆడ అలుగుల వెంటబడటం కాకుండా, మగవి తమ మలమూత్రాలను తమ గూటికి వెళ్లే మార్గమంతా విసర్జించగా, ఆడవి ఆ వాసనను అనుసరిస్తూ మగ అలుగుల వద్దకు చేరుతాయి. ఒకవేళ ఇతర మగ అలుగులు పోటీ పడితేగనుక, మగవన్నీ తమ తోకలతో పోరాడుకుని గెలిచిన మగ అలుగు, ఆడ అలుగును సొంతం చేసుకుంటుంది.

గర్భధారణ కాలంలో అలుగురకాన్ని బట్టి దాదాపు డెబ్భై నుండి నూటనలభై రోజులు ఉంటుంది. ఆఫ్రికా అలుగులు ఒక పిల్లకే ఏకకాలంలో జన్మనిస్తే, ఆసియా అలుగులు మాత్రం నాలుగు పిల్లలకు ఒక కాంపులో జన్మనివ్వగలవు. పుట్టిన అలుగుపిల్ల ఎనభై నుండి నాల్గువందలయాభై గ్రాముల బరువు, పదిహేను సెం.మీ||ల పొడవు ఉంటుంది. పుట్టినకొంతకాలం వరకు పొలుసులు పల్చగా, తెల్లగా మఱియు బలహీనంగా ఉంటాయి. కొన్ని రోజులకవి గట్టిబడి, కాస్త పెద్ద అలుగుకున్నట్లు రంగులోకి వస్తాయి. పిల్ల పెద్దదయ్యేంతవరకు ఆడఅలుగులు గూటిలోనే ఉండి వాటి చుట్టూ తమ తోకలను చుట్టి వెచ్చదనాన్నిస్తాయి. మగ అలుగులు వెళ్లి ఆహారాన్ని తెచ్చి పెడతాయి. పిల్లలు కాస్త కళ్లు తెరిచాక(నెల రోజులకు) అవి తల్లి వీపుమీదకెక్కి తల్లితోపాటు బయట తిరుగుతాయి. అప్పుడు అవి పురుగులను ఎలా వేటాడి తినాలో అమ్మద్వారా నేర్చుకుంటాయి. అలా మూడు నెలలు తర్వాత పిల్లలు స్వతహాగా వేటాడి జీవించడం ప్రారంభిస్తాయి. రెండు సంవత్సరాల వయసులో అవి తల్లులను వదిలి తమ జీవితాన్ని తాము గడపడానికి వెళ్లిపోతాయి.

హాని[మార్చు]

పూర్వం జార్జ్2 కు భారతదేశం  తరఫున బహూకరించబడిన  అలుగుపొలుసుల కవచం

ఆఫ్రికాదేశాలలో అలుగులను వేటాడి తింటారు. కొందఱు స్థానికులు వాటి పొలుసుల నుండి కొన్ని రకాల ఔషధాలను తయారు చేస్తారు.  దక్షిణ చీనావియత్నాంలలో కూడా వాటి మాంసం ఒక రకమైన ప్రత్యేక ఆహారంగా తింటారు, వాటి పొలుసులు ఔషధగుణాలను కలిగుంటాయని భావిస్తారు. గత దశాబ్దంగా, పదిలక్షలకు పైగా అలుగులు అపహరింపబడ్డాయి. అలుగులే ప్రపంచంలో  అత్యధికంగా అపహరింపబడి, చంపబడే ప్రాణులు. అదీకాక అడవుల నరికివేత కూడా వాటి సంఖ్యను తగ్గించడానికి దోహదపడింది. అలుగులలో కొన్ని రకాలైన "మ్యానిస్ పెంటాడాక్టిలా"  వాణిజ్యపరంగా పొలుసులకోసం వేటకు గురై అంతరించిపోయాయి.

అలుగులు ప్రపంచవ్యాప్తంగా సంరక్షింపబడుతున్నప్పటికీ, అలుగులను స్వప్రయోజనాలకు అపహరించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, చట్టవిరుద్ధంగా, రహస్యంగా తూర్పు ఆసియా దేశాలలో వాటి వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.  వాటి పొలుసుల పొడి బాలెంతలకు పాలు ఎక్కువపడేలాగ చేస్తుందని, రాచపుండు(క్యాంసర్), ఉబ్బసం వంటి రోగాలను నయంచేస్తుందనే అపోహలతో ఎన్నో అలుగులను మనుషులు చంపుతూవచ్చారు. ఏప్రిల్ 2013లో ఫిలిపీన్ దేశతీరానికి సమీపంలో పయనిస్తున్న ఒక చీనాదేశపు నౌకలో దారుణంగా పదిటన్నుల మృత అలుగులను పంపణీ చేస్తూండగా పట్టుకున్నారు. ఇంకో చోట ఆగస్టు 2016లో ఒక ఇండోనేషియా వ్యక్తి ఇంట్లో పోలీసులకు 650 మృత అలుగులు అతని ఇంట్లోని రహస్యపు ఫ్రిజ్లో దొరికాయి. నైజీరియా దేశంలో కూడా ఈ జంతువు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది.

పరిరక్షణ[మార్చు]

 మాంసం, పొలుసులు కోసం అలుగులను చంపడం ఎక్కువౌతున్న తరుణంలో వాటి సంరక్షణార్థం చాలా చర్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీసుకోవడం ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా అలుగులను రక్షించడంలో భాగంగా వేటాడితే కఠిన శిక్షలు, పర్యావరణ సమతుల్యత కొఱకు వాటి అవసరము వంటి అంశాలపై దేశాలు దృష్టిపెట్టాయి.  జూలలో వాటిని పెంచి, అవి సంతానాన్ని కనేలాగ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని ఆహారశైలి చాలా విచిత్రంగా, ప్రత్యేకంగా ఉన్నందుకు ఆ ప్రయత్నాలు అంతలా ఫలించడం లేదు.  పైగా అవి కట్టడిలో ఉంటే మానసికంగా చాలా క్రుంగిపోయి, నిమోనియా, కడుపులో పుండులు వంటివి సోకి త్వరగా చనిపోతున్నాయి. ఒకసారి వేటకు గుఱైన అలుగులు  మానసికంగాను, శారీరకంగా బలహీనపడిపోయి, వాటి సంఖ్యను పునరుద్ధరించే అవకాశాలు మనుషులకు పూర్తిగా ఇవ్వడంలేదు. వాటికి సంతానోత్పత్తికి అనువైన ప్రశాంతస్థలాలను కేటాయించడం,  బలపడిన అలుగులను తిరిగి వాటి స్వస్థానాలకు(అడవులకు) తరలించడం వంటి పద్ధతులను శ్రేష్ఠీకరించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.

వర్గీకరణం[మార్చు]

చీనా అలుగు
నేల అలుగు- చుట్టుకున్న భంగిమలో

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అలుగు&oldid=2991373" నుండి వెలికితీశారు