Jump to content

ఆనంద్ (సినిమా)

వికీపీడియా నుండి
ఆనంద్
ఒక మంచి కాఫీ లాంటి సినిమా
దర్శకత్వంశేఖర్ కమ్ముల
రచనశేఖర్ కమ్ముల
నిర్మాతశేఖర్ కమ్ముల
తారాగణంరాజా
కమలిని ముఖర్జీ
సత్య కృష్ణన్
అనీష్ కురువిల్లా
గోపీచంద్ లగడపాటి
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుమార్తాండ్ కె.వెంకటేష్
సంగీతంకె. ఎం. రాధాకృష్ణన్
పంపిణీదార్లుఅమీగోస్ క్రియేషన్స్, కె.ఎ.డి.ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీs
అక్టోబర్ 15, 2004[1]
సినిమా నిడివి
180 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్సుమారు 1.5 కోట్లు రూ.[2]

ఆనంద్, 2004లో విడుదలైన ఒక తెలుగు సినిమా. జీవితంలో ప్రేమ, ఆత్మాభిమానం, తృప్తి వంటి అంశాలతో కూడిన ఈ సినిమా [3] తక్కువ బడ్జెట్‌తో, పెద్ద తారాగణం లేకుండా, సాదాసీదా కథనంతో వెలువడి అనూహ్యమైన విజయం సాధించింది. ఇందులో ముఖ్య పాత్రలను రాజా, కమలినీ ముఖర్జీ పోషించారు. ఈ చిత్రం విజయవంతమైన తరువాత తమిళంలో "నినైతాలె" అనే పేరుతో పునర్నిర్మించబడింది.[4]

దర్శకుడు శేఖర్ కమ్ముల హోవర్డ్ విశ్వవిద్యాలయంలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్‌గా ఈ సినిమా స్క్రీన్‌ప్లేను సమర్పించాడు కూడాను.[5] [6]

చిత్రం ఆరంభంలో ఒక ధనికుడు త్రాగి కారు నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఒక మధ్యతరగతి కుటుంబంలోని భార్య, భర్త, కుమారుడు మరణిస్తారు. ఒంటరి అయిన వారి అమ్మయి (పేరు - రూప) ఆత్మాభిమానంతో, ఇరుగు పొరుగుల సహకారంతో, స్వయంకృషితో, పొదుపుగా జీవితంలో నెట్టుకొచ్చి ఒక ఉద్యోగంలో స్థిరపడుతుంది. ఆమె తన కంపెనీ ఎమ్.డి. రాహుల్ (అనుజ్ గుర్వారా)తో ప్రేమలో పడుతుంది. వివాహానికి అంతా సిద్ధమవుతుంది. రూపకు ఆమె స్నేహితురాలు అనిత, పొరుగింటి మామ్మ, ఇంకా ఇరుగుపొరుగు పిల్లలు సహచరులు.

మరొకవంక రూపతల్లిదండ్రుల మరణానికి కారకుడైన ధనికుడు ఆపరాధ భావంతో పిచ్చివాడైపోతాడు. అతని వ్యాపారాన్ని అతని భార్య, పిల్లలు నిర్వహిస్తుంటారు. అతని రెండవ కొడుకు ఆనంద్ (రాజా) ఈ చిత్రంలో కథానాయకుడు.

రూప, రాహుల్‌ల వివాహానికి సర్వం సిద్ధమౌతుంది. అయితే పెళ్ళి సమయంలో కట్టుకొనే చీర అనే చిన్న విషయంలో రాహుల్ తల్లితో విభేదం వచ్చి (ఇది రూపకు చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఆమె తన తల్లి చీర కట్టుకోవాలని ఎంతో కాలంగా దాచుకునివుంటుంది) వివాహం ఆగిపోతుంది. పెళ్ళికి వచ్చిన ఆనంద్ అది గమనిస్తాడు. రూప అంటే ఇష్టపడి ఆమెను ఒప్పించి తను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొంటాడు. అందుకోసం వారి ఇంటి ప్రక్కనే అద్దెకు దిగుతాడు.

అయితే రూప చాలా అభిమానవతి. అందుకు తోడు మధ్యలో వచ్చిన చిన్న చిన్న పొరపొచ్చాలు ఆనంద్ ప్రయత్నానికి ఇంకా అడ్డంకులు ఎదురవుతాయి. క్రమంగా ఆనంద్ ఆమె మనసుకు దగ్గరై, తన అన్న, తల్లి, ఇంకా అనిత వంటి వారి సహకారంతో రూపకు దగ్గర కావడమే ఈ సినిమా కథాంశం.

నట వర్గం

[మార్చు]

కథను పవన్ కల్యాణ్ దృష్టిలో పెట్టుకుని రాసినా శేఖర్ ఎప్పుడూ ఆయనను సంప్రదించలేదని తెలిపాడు. కథానాయిక పాత్రకు మొదటగా ఆసిన్, సదాను అనుకున్నారు.[7] మూడు నెలల ఎన్నిక ప్రక్రియ తరువాత శేఖర్ కమ్ముల అంతకుముందు అంతగా పెద్ద నటులు కాని రాజా, కమలిని వంటి నటులను ఎన్నుకొన్నాడు. నటనా కౌశలం కంటే మధ్య తరగతి పాత్రలకు సరిపోయే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. [8] హైదరాబాదులో తను ఉండే పద్మారావు నగర్ సమీపంలోనే ఒక ఇంటిని ప్రధాన షూటింగ్ స్థలం సెట్టింగ్‌గా ఎన్నుకొన్నాడు. [8]

కమలిని బెంగాలీ అమ్మాయి గనుక ఆమె సంభాషణలకు డబ్బింగ్ చెప్పడానికి [9] తెలుగులో పేరున్న గాయని,, టెలివిజన్ యాంకర్ ఉపద్రష్ట సునీతను ఎంచుకొన్నారు. డబ్బింగ్ ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతకు కూడా అవార్డు లభించింది.[10] ఇంకా తారాగణంలో చాలా మందికి తెలుగు సరిగా రానందున వారికి అనుగుణంగా డైలాగులను, పాత్ర చిత్రణను మార్చాల్సి వచ్చింది.

నిర్మాణం

[మార్చు]

2000 సంవత్సరంలో శేఖర్ కమ్ముల "డాలర్ డ్రీమ్స్" అనే సినిమాను నిర్మించాడు. అది విమర్శకుల మన్ననలు పొందింది. ఆనంద్ సినిమా తీయాలని అతను చాలా మంది నిర్మాతలను కలిశాడు కాని ఎవరూ ఉత్సాహం చూపలేదు. తరువాత అతను కొందరి సలహాపై నేషనల్ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ (NFDC) సహాయం కోరాడు. వారు కొంత పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు.[11] తెలుగు సినిమాలలో కమర్షియల్ చిత్రాలకు పెట్టుబడి పెట్టడం ఆ సంస్థకు ఇదే మొదటిసారి.[12] ఆనంద్ సినిమా కథను పవన్ కల్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాశాననీ కానీ ఎప్పుడూ తనని సంప్రదించలేదని శేఖర్ కమ్ముల ఒక సందర్భంలో తెలిపారు.[7]

విశేషాలు

[మార్చు]

మధ్య తరగతి జీవితాలను, వ్యక్తిత్వాన్ని తెలుగు సినిమాలలో అసంబద్ధంగా చిత్రిస్తున్నారని శేఖర్ అభిప్రాయం. కనుక వారి పాత్రలను సముచితంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించి సఫలమయ్యాడు.[13] అన్ని సినిమాల్లో లాగ కాక ఇద్దరు మానసిక పరిపక్వత గల వ్యక్తుల మధ్య ప్రేమను చాలా బాగా చూపించారు. ప్రేమ అన్న భావనకు మంచి అర్ధం చెప్పారు.

పాటలు

[మార్చు]

వేటూరి సుందరరామమూర్తితో కలిసి చర్చించి శేఖర్ చిత్ర కథకు, కథనానికి సరిపోయే ఆరు పాటలను సిద్ధం చేసుకొన్నాడు. ఇందుకు వేటూరికి నెల పైనే పట్టింది. వేటూరి గీత రచనా వేగానికి ఇది చాలా ఎక్కువ కాలం.[8] ఈ పాటలతో వీరి సాహిత్యం ఈ తరం వారిని కూడా ఎంతో మైమరపించింది. ఇందులోని పాటలకు కె. ఎం. రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చాడు. వాటిలో ఐదు పాటలు కర్ణాటక సంగీతం బాణీలలో కూర్చబడ్డాయి;[14] ఇందులోని ఆరు పాటలు

విడుదల, సమీక్షలు

[మార్చు]

ఈ సినిమా చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా విడుదలైన రోజునే అక్టోబరు 15, 2004 న విడుదలైంది.[7] కొద్దిపాటి బడ్జెట్‌తో, పెద్ద ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు నిమర్శకులనుండి మంచి సమీక్షలే వచ్చాయి. [15] సినిమా చూడదగిందని సమీక్షకులు అన్నారు. చిరంజీవి కథానాయకునిగా నిర్మింపబడిన భారీ చిత్రం శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. సినిమా, ఈ సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. కానీ ఆనంద్ చిత్రం పోటీకి నిలబడి ఇంచుమించు సమానమైన ప్రేక్షకాదరణ పొందింది.[16] 2004 సంవత్సరం అత్యధిక వసూళ్ళు సాధించిన ఐదు తెలుగు చిత్రాలలో ఆనంద్ ఒకటి.[17] వందరోజుల చిత్రంగా విజయవంతమయ్యింది. ఇతర మెలోడ్రామా, యాక్షన్ చిత్రాలకు భిన్నంగా, మధ్యతరగతి జీవితంలో సహజంగా జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని వర్ణించారు.[18]

అవార్డులు

[మార్చు]

ఈ సినిమాకు నంది అవార్డు, మరి కొన్ని అవార్డులు లభించాయి.[19] సామాన్యమైన కథతో, సీదా సాదా కథనంతో వెలువడిన ఈ చిత్రం చాలా అవార్డులు గెలుచుకోవడం గమనించదగిన విషయం.[20] సినిమాలో సున్నితమైన పాటలు కూడా బాగా విజయవంతమయ్యాయి.[21] ఫార్ములా చిత్రాలకు భిన్నంగా ఉండబట్టే చిత్రానికి మంచి ఆదరణ లభించిందని దర్శకుని అభిప్రాయం;[22] సినిమాకు లభించిన ఏడు నంది అవార్డులు[10]

  • ఉత్తమ చిత్రం
  • ఉత్తమ దర్శకుడు (శేఖర్ కమ్ముల)
  • ఉత్తమ నిర్మాత (శేఖర్ కమ్ముల)
  • ఉత్తమ కథా నాయకి (కమలిని)
  • ఉత్తమ సహాయ నటి (సత్యా కృష్ణన్)
  • ఉత్తమ బాల నటి (బఖిత)
  • ఉత్తమ స్త్రీ పాత్ర డబ్బింగ్ (సునీత)
ఇతర అవార్డులు
  • సంతోషం సినిమా పత్రిక - ఉత్తమ కథా నాయకి, ఉత్తమ గాయకుడు, ఉత్తమ ఎడిటింగ్[23]
  • వంశీ అవార్డులు - ఉత్తమ కథా చిత్రం, ఉత్తమ క్రొత్త సంగీత దర్శకుడు,, పాటలకు ప్రత్యేక ప్రశంస [24]
  • మా టి.వి. అవార్డులు - ఉత్తమ దర్శకుడు, ఉత్తమ పరిచయ నాయకి, ఉత్తమ సహాయ నటి.[25]

మూలాలు

[మార్చు]
  1. "Release dates for Anand (2004)". IMDB. Retrieved 2007-10-03.
  2. "Box office/business for Anand (2004)". IMDB. Retrieved 2007-10-03.
  3. Kausar Alam, Hina. "'I'm not here to transport people to fantasy land'". Rediff.com. Retrieved 2007-10-04.
  4. "Love beats - Ninathale". Chennaivision.com. Archived from the original on 2007-10-03. Retrieved 2007-10-04.
  5. "Master of Fine Arts in Film Program". Howard University. Archived from the original on 2007-11-01. Retrieved 2007-10-04.
  6. Farida, Syeda. "A different reverie". Hindu.com. Archived from the original on 2010-08-25. Retrieved 2007-10-05.
  7. 7.0 7.1 7.2 "Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్‌ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ." EENADU. Retrieved 2024-03-12.
  8. 8.0 8.1 8.2 Jeevi. "Interview with Sekhar Kammula by Jeevi". Idlebrain.com. Retrieved 2007-10-09.
  9. "Anand - Press Meet". Idlebrain.com. Retrieved 2007-10-10.
  10. 10.0 10.1 "Nandi Awards 2004 Response". Idlebrain.com. Retrieved 2007-10-12.
  11. Verma, Sujatha. "Freshly Ground". The Hindu: Metro Plus Hyderabad. Retrieved 2007-10-07.
  12. "About the Film". Amigos Creations. Archived from the original on 2007-02-11. Retrieved 2007-10-10.
  13. Phani. "An exclusive interview with Sekhar Kammula". Totaltollywood.com. Archived from the original on 2007-05-05. Retrieved 2007-10-11.
  14. "Anand (2004) - Music India Online". Musicindiaonline.com. Archived from the original on 2007-10-30. Retrieved 2007-10-14.
  15. Jeevi. "Movie review - Anand". Idlebrain.com. Retrieved 2007-10-11.
  16. "'Shankardada' stays top, 'Anand' a surprise hit". Musicindiaonline.com. Archived from the original on 2007-10-29. Retrieved 2008-06-21.
  17. Pillai, Sridhar. "Year 2004 — a flashback". Hindu.com. Archived from the original on 2005-04-04. Retrieved 2007-10-12.
  18. Om. "Sekhar Kammula: Passion for cinema?". Passionforcinema.com. Archived from the original on 2007-10-11. Retrieved 2007-10-12.
  19. "National Film Awards 2000". Research, Reference and Training Division. Retrieved 2007-10-08.
  20. Rajamani, Radhika. "Happy Days -- Go for it!". Rediff.com. Retrieved 2007-10-06.
  21. Sunil, Sreya. "Anand has soft melodies". Idlebrain.com. Archived from the original on 2007-10-26. Retrieved 2007-10-06.
  22. Sirasai. "An Exclusive Interview With Sekhar Kammula". Greatandhra.com. Archived from the original on 2007-10-12. Retrieved 2007-10-13.
  23. "Santosham Film Awards 2005". Idlebrain.com. Retrieved 2007-10-12.
  24. "Vamsee Film Awards 2004 Function". Idlebrain.com. Retrieved 2007-10-12.
  25. "CineMAA Awards 2004". Idlebrain.com. Retrieved 2007-10-12.

బయటి లింకులు

[మార్చు]