ఆనంద్ (సినిమా)
| ఆనంద్ (2004) | |
![]() ఒక మంచి కాఫీ లాంటి సినిమా |
|
|---|---|
| దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
| నిర్మాణం | శేఖర్ కమ్ముల |
| రచన | శేఖర్ కమ్ముల |
| తారాగణం | రాజా కమలిని ముఖర్జీ సత్యా కృష్ణన్ అనీష్ కురువిల్లా |
| సంగీతం | కె.ఎమ్.రాధాకృష్ణన్ |
| ఛాయాగ్రహణం | విజయ్ సి.కుమార్ |
| కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
| పంపిణీ | అమీగోస్ క్రియేషన్స్, కె.ఎ.డి.ఎంటర్‌టైన్‌మెంట్ |
| విడుదల తేదీ | అక్టోబర్ 15, 2004[1] |
| నిడివి | 180 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| అవార్డులు | నంది అవార్డు |
| భాష | తెలుగు |
| పెట్టుబడి | షుమారు 1.5 కోట్లు రూ.[2] |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
ఆనంద్, 2004లో విడుదలైన ఒక తెలుగు సినిమా. జీవితంలో ప్రేమ, ఆత్మాభిమానం, తృప్తి వంటి అంశాలతో కూడిన ఈ సినిమా [3] తక్కువ బడ్జెట్‌తో, పెద్ద తారాగణం లేకుండా, సీదా సాదా కధనంతో వెలువడి అనూహ్యమైన విజయం సాధించింది. ఇందులో ముఖ్య పాత్రలు రాజా మరియు కమలినీ ముఖర్జీ పోషించారు. ఈ చిత్రం విజయవంతమైన తరువాత తమిళంలో "నినతలె" అనే పేరుతో పునర్నిర్మించబడింది.[4]
దర్శకుడు శేఖర్ కమ్ముల హోవర్డ్ విశ్వవిద్యాలయంలో తన మాస్టర్స్ డిగ్రీ థీసిస్‌గా ఈ సినిమా స్క్రీన్‌ప్లేను సమర్పించాడు కూడాను.[5] [6]
విషయ సూచిక |
[మార్చు] కధ
చిత్రం ఆరంభంలో ఒక ధనికుడు త్రాగి కారు నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో ఒక మధ్యతరగతి కుటుంబంలోని భార్య, భర్త, కుమారుడు మరణిస్తారు. ఒంటరి అయిన వారి అమ్మయి(పేరు - రూప) ఆత్మాభిమానంతో, ఇరుగు పొరుగుల సహకారంతో, స్వయంకృషితో, పొదుపుగా జీవితంలో నెట్టుకొచ్చి ఒక ఉద్యోగంలో స్థిరపడింది. పెద్దయ్యాక రూప పాత్రలో కమలినీ ముఖర్జీ నటించింది. ఆమె తన కంపెనీ ఎమ్.డి. రాహుల్ (అనుజ్ గుర్వారా)తో ప్రేమలో పడుతుంది. వివాహానికి అంతా సిద్ధమవుతుంది. రూపకు ఆమె స్నేహితురాలు అనిత, పొరుగింటి మామ్మ, ఇంకా ఇరుగుపొరుగు పిల్లలు సహచరులు.
మరొకవంక రూపతల్లిదండ్రుల మరణానికి కారకుడైన ధనికుడు ఆపరాధ భావంతో పిచ్చివాడైపోతాడు. అతని వ్యాపారాన్ని అతని భార్య, పిల్లలు నిర్వహిస్తుంటారు. అతని రెండవ కొడుకు ఆనంద్ (రాజా) ఈ చిత్రంలో కథానాయకుడు.
రూప, రాహుల్‌ల వివాహానికి సర్వం సిద్ధమౌతుంది. అయితే పెళ్ళి సమయంలో కట్టుకొనే చీర అనే చిన్న విషయంలో రాహుల్ తల్లితో విభేదం వచ్చి (ఇది రూపకు చాలా పెద్ద విషయం, ఎందుకంటే ఆమె తన తల్లి చీర కట్టుకోవాలని ఎంతో కాలంగా దాచుకునివుంటుంది) వివాహం ఆగిపొతుంది. పెళ్ళికి వచ్చిన ఆనంద్ అది గమనించాడు. రూప అంటే ఇష్టపడి ఆమెను ఒప్పించి తను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొన్నాడు. అందుకోసం వారి ఇంటి ప్రక్కనే అద్దెకు దిగాడు.
అయితే రూప చాలా అభిమానవతి. అందుకు తోడు మధ్యలో వచ్చిన చిన్న చిన్న పొరపొచ్చాలు ఆనంద్ ప్రయత్నానికి ఇంకా అడ్డంకులయ్యాయి. క్రమంగా ఆనంద్ ఆమె మనసుకు దగ్గరై, తన అన్న మరియు తల్లి, ఇంకా అనిత వంటి వారి సహకారంతో రూపకు దగ్గర కావడమే ఈ సినిమా కధాంశం.
[మార్చు] నట వర్గం
మూడు నెలల ఎన్నిక ప్రక్రియ తరువాత శేఖర్ కమ్ముల అంతకుముందు అంతగా పెద్ద నటులు కాని రాజా, కమలిని వంటి నటులను ఎన్నుకొన్నాడు. నటనా కౌశలం కంటే మధ్య తరగతి పాత్రలకు సరిపోయే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. [7] హైదరాబాదులో తను ఉండే పద్మారావు నగర్ సమీపంలోనే ఒక ఇంటిని ప్రధాన షూటింగ్ స్థలం సెట్టింగ్‌గా ఎన్నుకొన్నాడు. [7]
కమలిని బెంగాలీ అమ్మాయి గనుక ఆమె సంభాషణలకు డబ్బింగ్ చెప్పడానికి [8] తెలుగులో పేరున్న గాయని, మరియు టెలివిజన్ యాంకర్ ఉపద్రష్ట సునీతను ఎంచుకొన్నారు. డబ్బింగ్ ఎంత సహజంగా వచ్చిందంటే అందుకు సునీతకు కూడా అవార్డు లభించింది. [9]. ఇంకా తారాగణంలో చాలా మందికి తెలుగు సరిగా రానందున వారికి అనుగుణంగా డైలాగులను, పాత్ర చిత్రణను మార్చాల్సి వచ్చింది.
- రాజా - ఆనంద్
- కమలిని ముఖర్జీ - రూప
- సత్యా కృష్ణన్ - అనిత (ఉత్తమ సహాయ నటి అవార్డు పొందింది)
- అనీష్ కురువిల్లా- ఆనంద్ కజిన్‌గా
- అనూజ్ గర్వారా - రాహుల్
- బఖితా ఫ్రాన్సిస్ - సమత అనే అల్లరి పిల్ల
[మార్చు] నిర్మాణం
2000 సంవత్సరంలో శేఖర్ కమ్ముల "డాలర్ డ్రీమ్స్" అనే సినిమాను నిర్మించాడు. అది విమర్శకుల మన్ననలు పొందింది. తరువాత ఆనంద్ సినిమా తీయాలని అతను చాలా మంది నిర్మాతలను కలిశాడు కాని ఎవరూ ఉత్సాహం చూపలేదు. తరువాత అతను కొందరి సలహాపై నేషనల్ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పోరేషన్ (NFDC) సహాయం కోరాడు. వారు కొంత పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. [10] తెలుగు సినిమాలలో కమర్షియల్ చిత్రాలకు పెట్టుబడి పెట్టడం ఆ సంస్థకు ఇదే మొదటిసారి.[11]
[మార్చు] విశేషాలు
మధ్య తరగతి జీవితాలను, వ్యక్తిత్వాన్ని తెలుగు సినిమాలలో అసంబద్ధంగా చిత్రిస్తున్నారని శేఖర్ అభిప్రాయం. కనుక వారి పాత్రలను సముచితంగా తీర్చి దిద్దాలని ప్రయత్నించి సఫలమయ్యాడు.[12] అన్ని సినిమాల్లో లాగ కాక ఇద్దరు మానసిక పరిపక్వత గల వ్యక్తుల మధ్య ప్రేమను చాలా బాగా చూపించారు. ప్రేమ అన్న భావనకు మంచి అర్ధం చెప్పారు.
[మార్చు] పాటలు
వేటూరి సుందరరామమూర్తితో కలిసి చర్చించి శేఖర్ చిత్ర కధకు, కధనానికి సరిపోయే ఆరు పాటలను సిద్ధం చేసుకొన్నాడు. ఇందుకు వేటూరికి నెల పైనే పట్టిందట. వేటూరి గీత రచనా వేగానికి ఇది చాలా ఎక్కువ కాలం.[7] ఈ పాటలతొ వీరి సాహిత్య0 ఈ తర0 వారిని కూడా ఎ0తో మైమరపి0చి0ది.
ఇందులోని పాటలకు కె.ఎమ్.రాధాకృష్ణన్ సంగీతం సమకూర్చాడు. వాటిలో ఐదు పాటలు కర్ణాటక సంగీతం బాణీలలో కూర్చబడ్డాయి.[13]
- ఇందులోని ఆరు పాటలు
- వచ్చే వచ్చే వాన జల్లుల్లారా - గానం:శ్రేయా గోషల్
- యమునా తీరం, సంధ్యా రాగం - గానం: హరిహరన్, చిత్ర
- నువ్వేనా నువ్వేనా - గానం:శ్రేయా గోషల్, కె.ఎమ్.రాధాకృష్ణన్
- చారుమతీ ఐ లమ్ యు - గానం:లకీ ఆలీ
- తెలిసి తెలిసి - గానం:శ్రేయా గోషల్
- ఎదలో గానం - గానం: హరిహరన్, చిత్ర
[మార్చు] సమీక్షలు
కొద్దిపాటి బడ్జెట్‌తో, పెద్ద ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు నిమర్శకులనుండి మంచి సమీక్షలే వచ్చాయి. [14] సినిమా చూడదగిందని సమీక్షకులు అన్నారు. చిరంజీవి కథానాయకునిగా నిర్మింపబడిన భారీ చిత్రం శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్. సినిమా, ఈ సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. కానీ ఆనంద్ చిత్రం పోటీకి నిలబడి ఇంచుమించు సమానమైన ప్రేక్షకాదరణ పొందింది.[15]. 2004 సంవత్సరం అత్యధిక వసూళ్ళు సాధించిన ఐదు తెలుగు చిత్రాలలో ఆనంద్ ఒకటి. [16] వందరోజుల చిత్రంగా విజయవంతమయ్యింది. ఇతర మెలోడ్రామా, యాక్షన్ చిత్రాలకు భిన్నంగా, మధ్యతరగతి జీవితంలో సహజంగా జరిగే సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని వర్ణించారు. [17]
[మార్చు] అవార్డులు
ఈ సినిమాకు నంది అవార్డు, మరి కొన్ని అవార్డులు లభించాయి. [18] సామాన్యమైన కధతో, సీదా సాదా కధనంతో వెలువడిన ఈ చిత్రం చాలా అవార్డులు గెలుచుకోవడం గమనించదగిన విషయం.[19]. సినిమాలో సున్నితమైన పాటలు కూడా బాగా విజయవంతమయ్యాయి.[20] ఫార్ములా చిత్రాలకు భిన్నంగా ఉండబట్టే చిత్రానికి మంచి ఆదరణ లభించిందని దర్శకుని అభిప్రాయం.[21]
- సినిమాకు లభించిన ఏడు నంది అవార్డులు[9]
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు (శేఖర్ కమ్ముల)
- ఉత్తమ నిర్మాత (శేఖర్ కమ్ముల)
- ఉత్తమ కధా నాయకి (కమలిని)
- ఉత్తమ సహాయ నటి (సత్యా కృష్ణన్)
- ఉత్తమ బాల నటి (బఖిత)
- ఉత్తమ స్త్రీ పాత్ర డబ్బింగ్ (సునీత)
- ఇతర అవార్డులు
- సంతోషం సినిమా పత్రిక - ఉత్తమ కధా నాయకి, ఉత్తమ గాయకుడు, ఉత్తమ ఎడిటింగ్[22]
- వంశీ అవార్డులు - ఉత్తమ కధా చిత్రం, ఉత్తమ క్రొత్త సంగీత దర్శకుడు, మరియు పాటలకు ప్రత్యేక ప్రశంస [23]
- మా టి.వి. అవార్డులు - ఉత్తమ దర్శకుడు, ఉత్తమ పరిచయ నాయకి, ఉత్తమ సహాయ నటి.[24]
[మార్చు] మూలాలు
- ↑ Release dates for Anand (2004). IMDB. తీసుకొన్న తేదీ: 2007-10-03.
- ↑ Box office/business for Anand (2004). IMDB. తీసుకొన్న తేదీ: 2007-10-03.
- ↑ Kausar Alam, Hina. 'I’m not here to transport people to fantasy land'. Rediff.com. తీసుకొన్న తేదీ: 2007-10-04.
- ↑ Love beats - Ninathale. Chennaivision.com. తీసుకొన్న తేదీ: 2007-10-04.
- ↑ Master of Fine Arts in Film Program. Howard University. తీసుకొన్న తేదీ: 2007-10-04.
- ↑ Farida, Syeda. A different reverie. Hindu.com. తీసుకొన్న తేదీ: 2007-10-05.
- ↑ 7.0 7.1 7.2 Jeevi. Interview with Sekhar Kammula by Jeevi. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-09.
- ↑ Anand - Press Meet. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-10.
- ↑ 9.0 9.1 Nandi Awards 2004 Response. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-10.
- ↑ Verma, Sujatha. Freshly Ground. The Hindu: Metro Plus Hyderabad. తీసుకొన్న తేదీ: 2007-10-07.
- ↑ About the Film. Amigos Creations. తీసుకొన్న తేదీ: 2007-10-10.
- ↑ Phani. An exclusive interview with Sekhar Kammula. Totaltollywood.com. తీసుకొన్న తేదీ: 2007-10-11.
- ↑ Anand (2004) - Music India Online. Musicindiaonline.com. తీసుకొన్న తేదీ: 2007-10-14.
- ↑ Jeevi. Movie review - Anand. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-11.
- ↑ 'Shankardada' stays top, 'Anand' a surprise hit. Musicindiaonline.com.
- ↑ Pillai, Sridhar. Year 2004 — a flashback. Hindu.com. తీసుకొన్న తేదీ: 2007-10-12.
- ↑ Om. Sekhar Kammula: Passion for cinema?. Passionforcinema.com. తీసుకొన్న తేదీ: 2007-10-12.
- ↑ National Film Awards 2000. Research, Reference and Training Division. తీసుకొన్న తేదీ: 2007-10-08.
- ↑ Rajamani, Radhika. Happy Days -- Go for it!. Rediff.com. తీసుకొన్న తేదీ: 2007-10-06.
- ↑ Sunil, Sreya. Anand has soft melodies. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-06.
- ↑ Sirasai. An Exclusive Interview With Sekhar Kammula. Greatandhra.com. తీసుకొన్న తేదీ: 2007-10-13.
- ↑ Santosham Film Awards 2005. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-12.
- ↑ Vamsee Film Awards 2004 Function. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-12.
- ↑ CineMAA Awards 2004. Idlebrain.com. తీసుకొన్న తేదీ: 2007-10-12.
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసులో Anand పేజీ
- Anand - Amigos Creations
- Anand (2004) songs on Raaga.com
- Lyrics Of Anand Lyrics and Songs On MusicMazaa.com
