కర్దమ మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కర్దముడు అనే పేరున్న మహర్షి, ప్రజాపతి సనాతన ధర్మంలోని పలు గ్రంథాల్లో ప్రస్తావితమైనారు. ఆయన భార్య దేవహూతితో కలిసి బ్రహ్మ ఆజ్ఞపై సంతానం అభివృద్ధి చేసినందుకు ప్రజాపతిగా గుర్తించారు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడై తపస్సు చేసినందుకు ఆయనను మహర్షిగా సంబోధించారు.

జీవిత విశేషాలు[మార్చు]

బ్రహ్మ ఆజ్ఞ, తపస్సు[మార్చు]

లోకంలో సంతానం తక్కువై ప్రజలు లేకపోవడంతో లోకాలు సృష్టించాల్సిన బాధ్యతలో ఉన్న బ్రహ్మ కర్దముడిని పిలిపించారు. ఆ సమయానికి కర్దముడు విరాగియై తపస్సు చేసుకుంటున్నాడు. బ్రహ్మ కర్దముడికి భూమిపై జనసమృద్ధి లేనందువల్ల సంసారంలోకి ప్రవేశించి, సంతానాభివృద్ధి చేయమని ఆదేశించారు. అప్పటికి ప్రజాపతిగా ప్రజలను సృష్టించిన కర్దముడు మళ్ళీ సంసారంలోకి వెళ్ళమన్నాకా సరేనని తపస్సులోకి వెళ్ళిపోయి చిరకాలం తపస్సు చేశారు. నిర్గుణంగా తపస్సు చేసి సమాధి స్థితిలోంచి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్మరించడంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు. నువ్వు ఏ కోరికతో తపస్సు పూర్తిచేశాకా నన్ను స్మరించావో ఆ కోరిక సిద్ధిస్తుందని, బ్రహ్మ నిన్ను కోరిన కోరిక నీ ద్వారా సిద్ధించును గాక అంటూ వరమిచ్చారు. బ్రహ్మావర్తపు రాజు కుమార్తెను వివాహం చేసుకొమ్మని, కర్మను తనయందు సమర్పణ చేస్తే సంసారం బాధించదని చెప్పారు.[1]

వివాహం[మార్చు]

స్వాయంభూ మనువు భార్యాకుమార్తెలతో వచ్చి, తన కుమార్తె దేవహూతిని వివాహం చేసుకొమ్మని, కర్దముని చరిత్ర విని అతన్నే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసినట్టు చెప్పారు. సంతానం కలగగానే వెళ్ళిపోతానని, అందుకు సమ్మతిస్తేనే వివాహం చేసుకుంటానని కర్దముడు చెప్పారు, దానికి దేవహూతి అంగీకరించడంతో వారిద్దరి వివాహం జరిగింది. వివాహం చేసుకున్నాకా భార్యను అలక్ష్యం చేస్తున్నట్టు నటిస్తూ కర్దముడు ఆమెను చాలా పరీక్షించారు. ఆ పరీక్షకు తట్టుకుని ఆయన సేవకే అంకితం కావడంతో తుదకు ఆమెపై అనుగ్రహం కలిగింది కర్దముడికి. అంతవరకూ వారిద్దరూ సరైన ఆహారంలేక కృశించిపోయారు. దాంతో ముందుగా ఆరోగ్యాన్ని, యౌవనాన్ని, రూపాన్నీ అనుగ్రహించారు.[2]

మూలాలు[మార్చు]

  1. కందుకూరి, శివానందమూర్తి (2013). "కర్దమ మహర్షి". మార్గదర్శకులు మహర్షులు (3 ed.). తాడేపల్లిగూడెం: శివానంద సుపథ ఫౌండేషన్. pp. 97–103.
  2. "మన మహర్షులు - కర్దమ మహర్షి". TeluguOne Devotional (in english). 2023-04-11. Retrieved 2023-04-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)