క్రైస్తవ ప్రార్థన
' క్రైస్తవ ప్రార్థన '
క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుతాడు, కాగా ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడేందుకు వీలు కలుగుతుందని క్రైస్తవుల నమ్మిక.బైబిల్లో పలు విధాల ప్రార్థనలు ప్రస్తావించ బడ్డాయి.
తొలి మానవుడైన ఆదాము కుమారుడైన షేతుకు ఎనోషు అనే కుమారుడు పుట్టినప్పటినుండి యెహోవా నామమున ప్రార్థన చెయ్యటం ప్రారంభమైందని ఆదికాండము నాలుగో అధ్యాయం చివరి వచనంలో చెప్పబడింది.
బైబిల్లోని రెండో భాగమైన నూతన నిబంధనలో యేసు క్రీస్తు శిష్యులు ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించమని ప్రభువును అడిగినప్పుడు ఇలా ప్రార్తించమంటూ యేసు నేర్పిన ప్రార్థన "ప్రభువు ప్రార్థన"గా బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్షణం ఎక్కడో ఓ చోట ఈ ప్రార్థన ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ వ్యాసంలో "ప్రభువు ప్రార్థన"తో పాటు దానిపై ప్రొటెస్టంట్ ఉద్యమ నిర్మాణకుడైన ఆచార్య మార్టిన్ లూథర్ వివరణను ఇవ్వటం జరిగింది.
ప్రభువు ప్రార్థన
[మార్చు]- పరలోక మందున్న మా తండ్రీ
- నీ నామము పరిశుద్ధ పరచ బడును గాక
- నీ రాజ్యము వచ్చును గాక
- నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక
- మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము
- మా యెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమింపుము
- మమ్ము శోధన లోనికి తేక కీడు నుండి తప్పించుము
- రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవియై ఉన్నవి. ఆమేన్!
ఆచార్య మార్టిన్ లూథర్ వివరణ (చిన్న ప్రశ్నోత్తరి నుంచి)
[మార్చు]అత్యంత సులభమైన పద్ధతిలో ఇంటి యజమాని ఇంట్లో వాళ్ళందరికీ నేర్పించాల్సింది
దేవుని పిలవటం
[మార్చు]పరలోకమందున్న మా తండ్రీ
- అర్ధం: ఆయనే మనకు నిజమైన తండ్రి అని, మనం ఆయన స్వంత బిడ్డలమని నమ్మటానికి ఈ మాటల్తో దేవుడు మనల్ని మృదువుగా ఆహ్వానిస్తున్నాడు. అందుకనే ఇష్టమైన పిల్లలు తమ ప్రియమైన తండ్రిని గట్టి నమ్మకంతో, ధైర్యంగా అడిగినట్టు మనం ఆయనకు ప్రార్థన చేస్తాం.
మొదటి మనవి
[మార్చు]నీ నామము పరిశుద్ధ పరచ బడును గాక
- అర్ధం: దేవుని నామం ఎప్పటికీ పరిశుద్ధమైందే. అసలు ఆ నామంలోనే పరిశుద్ధత ఉంది. అయితే ఆ పవిత్ర నామాన్ని పరిశుద్ధ పరచేందుకు మనక్కూడా శక్తి కావాలని ఈ మనవిలో అడుగుతాం.
దేవుని నామాన్ని పరిశుద్ధంగా ఎలా ఉంచాలి?
- దేవుని వాక్యం స్పష్టంగా, సత్యంగా బోధించబడ్డప్పుడు, అలాగే మనం ఆయన బిడ్డల్లా వాక్యానుసారమైన పవిత్ర జీవితాన్ని గడపటంద్వారా దేవుని నామం పరిశుద్ధ పరచ బడుతుంది. పరలోకమందున్న మా ప్రియ తండ్రీ! ఇలా చెయ్యటానికి మాకు సాయంచెయ్యి. అయితే దేవుని వాక్యాన్ని తప్పుగా బోధిస్తూ అలా నడుచుకొనేవాళ్ళు దేవుని నామాన్ని మనమధ్య అవమాన పరుస్తున్నారు. పరలోకమందున్న ప్రియ తండ్రీ! అలా చెయ్యకుండ మమ్మల్ని కాపాడు.
రెండో మనవి
[మార్చు]నీ రాజ్యము వచ్చును గాక!
- అర్ధం: మన ప్రార్థనతో నిమిత్తం లేకుండానే దేవుని రాజ్యం దానంతటదే కచ్చితంగా వస్తుంది. అయితే ఈ విన్నపంలో ఆ రాజ్యం మన మధ్యక్కూడా రావాలని కోరుకుంటాం.
దేవుని రాజ్యం ఎలా వస్తుంది?
- మన పరలోకపు తండ్రి తన పరిశుద్ధాత్మను దయచేసినప్పుడు దేవుని రాజ్యం మన మధ్యకొస్తుంది. కనుక ఆయన కృపను బట్టి పరిశుద్ధ వాక్యాన్ని నమ్మి దైవ చిత్తానుసారమైన ఆ జీవితాన్ని ఇప్పుడు భూమ్మీద, నిరంతరం పరలోకంలో జీవిస్తాం.
మూడో మనవి
[మార్చు]నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక
- అర్ధం: మన ప్రార్థనతో నిమిత్తం లేకుండానే దేవుని కృపగల చిత్తం దానంతటదే నెరవేరుతుంది. అయితే ఆ దయగల చిత్తం మన మధ్యకూడా నెరవేరాలని ఈ విన్నపంలో వేడుకుంటాము.
దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది?
- దేవుని పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేస్తూ, ఆయన రాజ్యం రాకుండా ఆటంకపర్చే సాతాన్ని, లోకాన్ని, అలాగే మన పాప శరీరపు ప్రతీ దుష్ట పన్నాగాన్ని, ఉద్దేశ్యాన్ని ఆయన ఓడించి నాశనం చేసినప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుంది. మనం బ్రతికినంత కాలం దేవుడు తన వాక్యంలో, విశ్వాసంలో మనల్ని బలపర్చి, స్థిరపరస్తున్నప్పుడు ఆయన చిత్తం నెరవేరుతుంది. ఇదే ఆయన కృపగల చిత్తం, దయగల మనస్సు.
నాలుగో మనవి
[మార్చు]మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము
- అర్ధం: మనం అడక్కుండానే ఆయన మనతోపాటు, చెడ్డవాళ్ళక్కూడా ప్రతిరోజూ ఆహారాన్ని ఇస్తున్నాడు. ఈ నిజాన్ని మనం తెలుసుకొని, కృతజ్ఞతా పూర్వకంగా దాన్ని పొందే మంచి బుద్ది మనకివ్వాలని ఈ మనవిలో దేవుని వేడుకుంటాం.
అనుదినాహారమంటే ఏంటి?
- మన శరీర క్షేమానికవసరమైన ప్రతిదీ అనుదినాహారమే. అంటే - మన అన్నపానాలు, బట్టలు, జోళ్ళు, ఇల్లు, సంసారం, పాడి పంటలు, డబ్బు, దైవభక్తి కలిగిన మంచి భార్య లేదా భర్త, పిల్లలు, మంచి పనివాళ్ళు, దేవుని భయం కలిగిన నమ్మకస్తులైన అధికార్లు, మంచి ప్రభుత్వం, చక్కటి వాతావరణం, శాంతి సమాధానాలు, ఆరోగ్యం, మంచి పేరు, మంచి స్నేహితులు, నమ్మకస్తులైన పొరుగువాళ్ళు - వీటన్నిటినీ అనుదినాహారమనే అనొచ్చు.
అయిదో మనవి
[మార్చు]మా యెడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించియున్న ప్రకారము మా అపరాధములను క్షమింపుము
- అర్ధం: నిజానికి మనం అడిగే వాటిల్లో ఏ ఒక్కటి పొందటానిక్కూడా మనకు యోగ్యత లేదు, అడిగే అర్హతకూడా లేదు. ఎందుకంటే మనం ఏ రోజుకారోజు మరింతగా పాపం చేస్తూ, శిక్ష మాత్రమే పొందాల్సిన వాళ్ళమై ఉన్నాం. అయినప్పటికీ మన పరలోకపు తండ్రి మన పాపముల వైపు చూడకుండా, వాటినిబట్టి మన మనవుల్ని కొట్టెయ్యకుండా తన కృపను ప్రేమను చూపించి మన మడిగేవన్నీ ఇవ్వాలని ఈ మనవిలో కోరుకుంటాం. అలాగే మనం కూడా మనకు వ్యతిరేకంగా పాపము చేసిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి సంతోషంగా వాళ్ళకి మేలు చేయాలి.
ఆరో మనవి
[మార్చు]మమ్ము శోధన లోనికి తేకుము
- అర్ధం: నిశ్చయముగ దేవుడెవరినీ పాపం చేసేలా శోధించడు. అయితే సైతాను, శరీర సంబంధమైన కోర్కెలు మనల్ని మోసం చెయ్యకుండా, అలాగే తప్పుడు బోధల వైపుకు, నిరాశలోకి, లజ్జాకరమైన మహా పాపంకేసి మళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడి తన కృపలో నిలిపి ఉంచాలని ఈ మనవిలో అడుగుతాం. ఒకవేళ వాటి చేత మనం శోధింప బడ్డప్పటికీ, శోధనలోంచి బయటపడి విజయాన్ని పొందటానికి శక్తి నివ్వమని ప్రార్థిస్తాం.
ఏడొ మనవి
[మార్చు]కీడు నుండి మమ్మును తప్పించుము
- అర్ధం: ముగింపులో - మన శరీరాత్మల్ని, ఆస్తిని, పేరు ప్రఖ్యాతుల్ని నాశనం చేసే ప్రతీ కీడు నుండి మనల్ని తప్పించి కాపాడాలని ఈ మనవిలో వేడుకొంటాం. చివరిగా, చావు గడియ వచ్చినప్పుడు దీవెనకరమైన మంచి మరణాన్నిచ్చి ఈ ఏడ్పుగొట్టు లోకంలోంచి పరలోకంలొ ఉన్న ఆయన దగ్గరికి కృపతో చేర్చుకోవాలని ఈ మనవిలో అడుగుతాం.
దైవ స్తుతి
[మార్చు]రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవైయున్నవి. ఆమేన్!
- అర్ధం: ఈ మనవులన్నీ పరలోకమందున్న మన తండ్రికి ఇష్టమైనవేనని, ఆయన వాటిని విన్నాడని ఖచ్చితంగా నమ్ముతాం. ఎందుకంటే ఇలా ప్రార్థన చెయ్యమని మన కాజ్ఞాపించిన దేవుడు తప్పకుండా వాటిని వింటానని ప్రమాణం చేశాడు. అందుకనే - “ఆమేన్” అంటే “అలాగే జరుగుతుంది”, అని చెప్పి మనం ప్రార్థన ముగిస్తాం.
ప్రతిరోజూ చేసే ప్రార్థనలు ఆచార్య మార్టిన్ లూథర్ చిన్న ప్రశ్నోత్తరి నుంచి
అత్యంత సులభమైన పద్ధతిలో ఇంటి యజమాని తన ఇంట్లో వాళ్ళందరికీ నేర్పించాల్సింది.
ప్రొద్దున్నే చేసే ప్రార్థన
- తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, ఆమేన్.
- మా పరలోకపు తండ్రీ! గడిచిన రాత్రంతా సమస్త కీడులనుండి అపాయములనుండి నన్ను కాపాడి నందుకు నీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను చేసే అన్ని పనులు, ఇంకా నా జీవితమంతా నీకు ఇష్టమైనదిగా ఉండేలా ఈ రోజంతా ప్రతి విధమైన కీడు నుండి పాపము నుండి నన్ను కాపాడు. నా శరీరాత్మల్ని నాకు కలిగిన సమస్తాన్ని నీ చేతుల కప్పగిస్తున్నాను. కపట శత్రువుకు నా మీద ఎలాంటి అధికారం ఉండకుండా నీ పరిశుద్ధ దూతను నాకు తోడుగా ఉంచు. ఆమేన్.
సాయంకాలము చేసే ప్రార్థన
- తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున, ఆమేన్!
- మా పరలోకపు తండ్రీ, ఈ రోజంతా నన్ను నీ కృపలో కాపాడి నందుకై నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా పాపాలన్నీ క్షమించి ఈ రాత్రంతా నీ కృపలో భద్రం చెయ్యి. నా శరీరాత్మల్ని నా కున్న సమస్తాన్నీ నీ చేతుల కప్పగిస్తున్నాను. కపట శత్రువుకు నా మీద ఎలాంటి అధికారం ఉండకుండా నీ పరిశుద్ధ దూతను నాకు తోడుగా ఉంచు. ఆమేన్!
దీవెన అడుగుతూ చేసే ప్రార్థన (భోంచేసేప్పుడు చెప్పుకోటానికి)
- ఓ దేవా! అందరి కళ్ళూ నీవైపే చూస్తాయి. తగిన సమయంలో కావాల్సిన అహారాన్ని నువ్వు వాళ్ళకిస్తావు. ఇంకా నువ్వు గుప్పిలి విప్పి ప్రతి ప్రాణి కోరికా తీరుస్తావు, ఆమేన్! ప్రభువైన దేవా, పరలోకపు తండ్రీ నీ అపారమైన కృపలోంచి మేము పొందిన ఈవుల ద్వార మమ్మల్ని దీవించుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అడుగుతున్నాము. ఆమేన్!
కృపావచనం
- యోహోవాకు స్తుతి చెల్లించుడి. ఆయన ఉత్తముడు. ఆయన కృప నిరంతరముండును, ఆమెన్!
ప్రభువైన దేవా, పరలోకపు తండ్రీ, నీవిచ్చిన ఈవులన్నిటి కోసం నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంటున్నాము. ఆమేన్!