గబ్రియేలా మిస్ట్రాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గబ్రియేలా మిస్ట్రాల్
Gabriela Mistral
పుట్టిన తేదీ, స్థలంLucila de María del Perpetuo Socorro Godoy Alcayaga
(1889-04-07)1889 ఏప్రిల్ 7
చిలీ
మరణం1957 జనవరి 10(1957-01-10) (వయసు 67)
న్యూయార్క్
కాలం1914-1957
పురస్కారాలునోబెల్ బహుమతి
1945

సంతకం

గబ్రియేలా మిస్ట్రాల్ (Spanish: [ɡaˈβɾjela misˈt̪ɾal]) (7 ఏప్రిల్ 1885 - 10 జనవరి 1957) సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి. ఆమె సాహిత్యానికి ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని పొందారు. లాటిన్ అమెరికాలో జన్మించిన తొలి నోబెల్ బహుమతి స్వీకర్తగా ఆమె చరిత్ర సృష్టించారు.[1] కష్టాలమయమైన జీవితాన్ని గడపవలసి వచ్చినా కవిత్వంతో సాంత్వన పొందారు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గబ్రియేలా మిస్ట్రాల్ అసలు పేరు లుసిల గొడొయ్ అల్చయాగ. ఏప్రిల్ 7, 1885లో లాటిన్ అమెరికా ప్రాంతానికి చెందిన చిలీ దేశంలో జన్మించారు. తండ్రి జూఅన్ గెరొనిమొ గొడొయ్ విల్లన్యువ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తల్లి పెట్రొనిల అల్చయగ దర్జీగా పనిచేస్తూ దేశదిమ్మరి కవిత్వాన్ని రచించారు.[1] మిస్ట్రాల్ వ్యక్తిగత జీవితం కష్టాలమయంగా సాగింది. ఆమె తండ్రి మూడేళ్ళ ప్రాయంలోనే కుటుంబాన్ని వదిలిపెట్టేశారు. పదహారేళ్ళ వయసులోనే ఆర్థిక స్థితి కారణంగా పల్లెలో ఉపాధ్యాయనిగా చేరారు. ఆ సమయంలో రైల్వేలో ఉద్యోగిగా పనిచేసే రోమెలియో ఉరేటాని ప్రేమించింది. అయితే అతను కొద్దికాలంలోనే ఆత్మహత్య చేసుకుని మృతిచెందారు. మరణించినప్పుడు అతని జేబులో మిస్ట్రాల్ రాసిన లేఖ మాత్రమే దొరికింది. ఆ ఘటనకు కలతచెందిన ఆమె జీవితాంతం అవివాహితగానే ఉండిపోయింది. గబ్రియేలా పెంచుకున్న కొడుకు కూడా యుక్త వయసులో మరణించారు.[3] ఈ విషాదాలు ఆమె వ్యక్తిత్వంపై, తద్వారా కవిత్వంపై ముద్రవేశాయి. వివిధ ఉద్యోగాలు నిర్వహించి, పలు పదవులు చేపట్టిన గబ్రియేలా జీవితమంతా కవిత్వాన్ని రచించారు. జనవరి 10, 1957లో అమెరికాలో కాన్సర్ వ్యాధి కారణంగా మరణించారు.[2]

వృత్తి[మార్చు]

16 సంవత్సరాల వయసులో చిన్న పల్లెటూరిలో కుటుంబ కష్టాల కారణంగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. తర్వాతి కాలంలో చిలీ, అమెరికా, మెక్సికోల్లో విద్యకు సంబంధించిన సాంస్కృతిక సంస్థల్లో ఆమె పనిచేశారు. చిలీ, మెక్సికో దేశాల్లో విద్యారంగంలో ముఖ్యపాత్ర వహించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో స్పానిష్ సాహిత్యాన్ని బోధించారు.[3]

రచన రంగం[మార్చు]

గబ్రియేలా మిస్ట్రాల్ అనే తన కలంపేరుతో ప్రసిద్ధి పొందారు. గబ్రియేలా మిస్ట్రాల్ అన్న పేరులోని తొలి సగాన్ని ఫ్రెంచి కవి మిస్ట్రల్ నుంచి, రెండవ సగాన్ని ఇటలీ రచయిత గబ్రియేలా నుంచి స్వీకరించారు. బాల్యం, ప్రేమ, ప్రకృతి, క్రైస్తవ మత విశ్వాసాలు, మరణం వంటివి ఎక్కువగా గబ్రియేలా సాహిత్యంలో కవితా వస్తువులు అయ్యాయి. ఆమె కవిత్వం సూటిగా, సుస్పష్టంగా తేలికైన పదాలతో రచించడం ఆమె శైలి. ప్రకృతి ప్రేమ ఆమె సాహిత్యంలోని ప్రముఖ పాత్ర వహిస్తుంది.[3]
1914లో ఆమె తొలి సంకలనాన్ని ప్రచురించారు. మృతుల జ్ఞాపకాలు అన్న అర్థంతో ఉండే శీర్షికతో ఆ పుస్తకం రూపొందింది. ఆ పుస్తకంలోని ప్రేమ కవితలు ఆమెకు గుర్తింపు తీసుకువచ్చాయి. 1922, 1924, 1938ల్లో ఆమె కవితా సంకలనాలను వివిధ కవితావస్తువులతో వెలువరించారు.[2]

వ్యక్తిత్వం[మార్చు]

జీవితంలోని బాధామయ ఘటనలు ఆమె వ్యక్తిత్వంపై ప్రభావం వేశాయి. ఆ ప్రభావం ఆమె కవిత్వంపై చూపడం వల్లనే నిరాశ, మృతుల జ్ఞాపకాలు వంటి వస్తువులు ఆమె కవిత్వంలో భాగమయ్యాయి.[3] మానవ సంబంధాలకు ఆమె ఎంతో విలువనిచ్చేవారు. ఒకే దేశానికి చెందిన సుప్రసిద్ధ కవి పాబ్లో నెరుడాతో ఆమెకు సత్సంబంధాలు ఉండేవి. నెరుడా స్వగ్రామం టెంకోలోనే మిస్ట్రాల్ పాఠశాలలో ప్రధానాధ్యాపకురాలిగా పనిచేసేవారు. తొలిదశలోనే నెరుడా కవిత్వంలోని గొప్పదనాన్ని గమనించారు. అప్పటికే మిస్ట్రాల్ సాహిత్యరంగంలో సుప్రసిద్ధురాలు. ప్రకృతిని, బాల్యాన్ని ప్రేమించడం ఆమె వ్యక్తిత్వంలోని రెండు ప్రధానమైన అంశాలుగా కనిపిస్తాయి. బాల్యం జీవితానికే ఊటలాంటిదంటూ, దాన్ని నిర్లక్ష్యం చెయ్యడం అత్యంత ఘోరమైన నేరంగా ఆమె పేర్కొన్న వాక్యాలు సుప్రసిద్ధాలు. కవిత్వం సమాజానికి ఎంతగానో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఆమె సమాధి మీద కూడా శరీరానికి ఆత్మలాగా, ప్రజలకు కళాకారులని రాయించారు.[2]

గౌరవాలు, ప్రాచుర్యం[మార్చు]

  • ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని అందుకున్న తొలి చిలీ దేశస్థురాలిగా ఆమె ప్రసిద్ధి పొందారు. డిసెంబరు 10, 1945న నోబెల్ బహుమతి ఆమెకు పొందారు.[2]
  • 2000 సంవత్సరం నుంచి మిస్ట్రాల్ పేరు మీదుగా పురస్కారాన్ని ఏర్పాటుచేసి కవులకు ప్రదానం చేస్తున్నారు.[2]
  • ఆమె మరణించినప్పుడు చిలీ ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది.[2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 నోబెల్ కవిత్వం:ముకుంద రామారావు:పేజీ.103
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 నోబెల్ కవిత్వం:ముకుంద రామారావు:పేజీ.105
  3. 3.0 3.1 3.2 3.3 నోబెల్ కవిత్వం:ముకుంద రామారావు:పేజీ.104