జపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాయత్రీ మంత్ర జపం చేస్తున్న హిందువు

జపం అనేది మంత్రాన్ని లేదా దైవనామాన్ని పదేపదే ధ్యానించడం. ఇది హిందూ మతం, [1] జైనమతం, [2] సిక్కుమతం, [3] [4] బౌద్ధమతాల్లో ఆచరిస్తారు. [5] ఇతర మతాలలో కూడా ఇలాంటివే ఆచారాలు ఉన్నాయి.

ధ్యాన భంగిమలో కూర్చున్నప్పుడు గాని, ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు గాని, [6] సామూహికంగా పూజలు చేసేటపుడు గానీ జపం చేయవచ్చు. జపమంత్రాన్ని మృదువుగా, అభ్యాసకుడు వినడానికి వీలైనంత బిగ్గరగా జపించవచ్చు లేదా అభ్యాసకుడు మనస్సులోనే నిశ్శబ్దంగా పఠించవచ్చు. [7]

వ్యుత్పత్తి[మార్చు]

జప అనే సంస్కృత పదం జప్- అనే మూలం నుండి ఉద్భవించింది, దీని అర్థం "తక్కువ స్వరంతో పలకడం, అంతర్గతంగా పునరావృతం చేయడం, గొణుగుకోవడం". [8] జనన మరణాలను, పునర్జన్మలను లేకుండా చేయడానికి ని, పాపాల ప్రక్షాళనకు అని దీనిని మరింతగా నిర్వచించవచ్చు. [9] [10]

ఐతరేయ బ్రాహ్మణం (ఋగ్వేదం), శతపథ బ్రాహ్మణం (యజుర్వేదం) వంటి వేద సాహిత్యంలో ఈ పదం కనిపిస్తుంది. [11] ఈ పదానికి అర్థం, వేదాల్లోని పేర్లను ఉచ్చరించడం. [11] ఒక పద్యం లేదా శ్లోకాన్ని పదేపదే పాడటం. కొన్నిసార్లు జపమాల సహాయంతో పఠనాన్ని లెక్కిస్తారు. [11]

జప భావన బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. టిబెటన్ బౌద్ధ సాహిత్యంలో ఇది చాలా సాధారణం. [12]

ఋషి పతంజలి (సా.శ. 400) ప్రకారం, జప అనేది మంత్రాన్ని పదేపదే ఉచ్చరించడం కాదు, కానీ మంత్రార్థాన్ని తర్కించడం. [13] ఈ నిర్వచనం వివిధ వనరులలో కనిపిస్తుంది. [12] [14]

రకాలు[మార్చు]

జపమాల, జప పూసలు, 108 పూసలతో పాటు తలపూసలు ఉంటాయి

పూసలు[మార్చు]

కొన్ని రకాల జపాలలో, జపమాల అనే పూసల దండను ఉపయోగించి జపించిన సంఖ్యను లెక్కిస్తారు. జపమాల కోసం అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తారు. జపమాలలోని పూసల సంఖ్య సాధారణంగా 108 ఉంటుంది. ప్రజలు తమ మెడలో జప పూసలను ధరించడం కూడా సాధారణమే. అయితే కొంతమంది అభ్యాసకులు వాటిని శుభ్రంగా ఉంచడానికి వాటిని సంచిలో ఉంచుతారు.

శబ్ద స్థాయిలు[మార్చు]

జపాన్ని వివిధ స్థాయిలలో శబ్దం చేస్తూ చేయవచ్చు:

  • వైఖరీ జపాన్ని సమీపంలోని వ్యక్తులకు వినబడేంత బిగ్గరగా జపిస్తారు. జపం చేసే ప్రదేశంలో ఇతర శబ్దాలు ఉన్నప్పుడు , [15] లేదా ఏకాగ్రతకు భంగం కలుగుతున్నపుడు, కొత్తగా మొదలుపెట్టేవారికి ఈ పద్ధతి అత్యంత అనుకూలమైనది.
  • ఉపాంశు జపము నిశ్శబ్దంగా, గుసగుసగా చేస్తారు. ఇది వైఖరీ జపం కంటే వంద రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు. ఉపాంశు జప సమయంలో అభ్యాసకుని పెదవులు కదలకుండా ఉంటాయి కాబట్టి చూసేవాళ్ళకి ఏం జపిస్తున్నారో తెలియదు.
  • మానసిక జపాన్ని మనసులోనే పఠిస్తారు. అది ఉపాంశ జపం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా, వైఖరీ జపం కంటే 1,00 000 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు. వైఖరీ జప సాధనలో రాటుదేలిన వారికి తప్ప ఇతరులకు ఈ జప సాధన చేయడం కష్టం లేదా అసాధ్యం అని కూడా చెబుతారు. [16] [15]

లిఖిత జపం[మార్చు]

లిఖిత జపం అనేది ఒక మంత్రాన్ని పదేపదే రాయడం, అదే సమయంలో బిగ్గరగా పఠించడం. మంత్రాన్ని గట్టిగా పఠించడం కంటే ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని అంటారు. లిఖిత జపాన్ని తరచుగా అందుకోసం ప్రత్యేకించిన పుస్తకంలో వ్రాస్తారు. చిన్న మంత్రాల కోసం ఉద్దేశించిన పుస్తకాల్లో చిన్నచిన్న దీర్ఘచతురస్రాకార పెట్టెలుంటాయి. ఈ పెట్టేల్లో మంత్రాన్ని రాస్తారు. రామకోటి అనేది ఇలాంటి జప పద్ధతే. రామకోటి రాసేవారు "శ్రీరామ" అనే పేరును ఈ పెట్టేల్లో రాస్తారు.

లక్ష్యాలు[మార్చు]

జప లక్ష్యాలు, మంత్రం పైన, అభ్యాసకుని మత తత్వశాస్త్రం పైనా ఆధారపడి ఉంటుంది. బౌద్ధ, హిందూ సంప్రదాయాలు రెండింటిలోనూ మంత్రాలను ఆశించేవారు తమ గురువు నుండి దీక్ష పొంది మొదలుపెట్టవచ్చు. పేర్కొన్న లక్ష్యం మోక్షం, నిర్వాణం, భక్తి లేదా కేవలం ప్రార్థన కావచ్చు. చాలా మంది గురువులు, ఇతర ఆధ్యాత్మిక ఉపాధ్యాయులు, ఇతర మత పెద్దలు, ముఖ్యంగా హిందువులు, బౌద్ధులు, ఇవి ఒకే రూపాంతరం చెందిన స్పృహ స్థితికి వేర్వేరు పేర్లను సూచిస్తాయని బోధిస్తారు. అయితే, ఆధ్యాత్మిక అభివృద్ధికి, స్వీయ-సాక్షాత్కారం కోసం ఉద్దేశించబడని మంత్రాల గురించి ఈ వ్యాఖ్య చేయలేదు. [lower-alpha 1]

ఇతర మతాల్లో జపం[మార్చు]

కొన్ని క్యాథలిక్ ప్రార్థనా రూపాలు పునరావృతం అవుతాయి, ఉదాహరణకు రోసరీ లేదా వివిధ చాప్లెట్‌లను ఉపయోగించడం వంటివి జపాన్ని పోలి ఉంటాయి. అయితే అభ్యాసాలు ఒకేలా ఉండవు - ఎందుకంటే వాటి లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. జపానికి సమానమైన, పునరావృతమయ్యే చిన్న ప్రార్థనా పద్ధతులను క్రైస్తవ సంప్రదాయాలలో కూడా అనుసరిస్తారు. ముఖ్యంగా తూర్పు ఆర్థోడాక్స్ చర్చిలో కనిపించే జీసస్ ప్రార్థన ఇలాంటిదే. [17] [18] అంతేకాకుండా, అజప జపం లక్ష్యం "ఎడతెగని ప్రార్థన" అనే క్రైస్తవ లక్ష్యంతో సమానంగా ఉంటుంది. సూఫీల ధిక్ర్ అభ్యాసం జపాన్ని పోలి ఉంటుంది. సిక్కు గ్రంధాల్లోని రెండు ప్రధాన విభాగాలు జప శబ్దంతో మొదలౌతాయి. వీటిని జాప్జీ సాహిబ్, జాప్ సాహిబ్ అని పిలుస్తారు. [19]

ఇవి కూడా చూడండి[మార్చు]

నోట్స్ [మార్చు]

  1. For example, when used for magical or occult purposes.

మూలాలు[మార్చు]

  1. Beck (1995).
  2. Chapple (2015).
  3. Deol (1998).
  4. Kohli (1993).
  5. Dasgupta & Dasgupta (1958).
  6. SSRF (n.d.).
  7. Easwaran (2008).
  8. Apte (1890).
  9. Ashley (2006).
  10. Keshavadas (1990).
  11. 11.0 11.1 11.2 Monier-Williams (2005).
  12. 12.0 12.1 Padoux (2011).
  13. Saraswati (1986).
  14. Raghavan (2011).
  15. 15.0 15.1 BhaktiratnaSadhu (2020).
  16. Saraswati (1981).
  17. Oman & Driskill (2003).
  18. Sjögren (1996).
  19. Singha (2009).
"https://te.wikipedia.org/w/index.php?title=జపం&oldid=3691759" నుండి వెలికితీశారు