పైడిమర్రి వెంకటసుబ్బారావు

వికీపీడియా నుండి
(పైడిమర్రి సుబ్బారావు నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పైడిమర్రి సుబ్బారావు
Paidi-marri-subbarao.png
పైడిమర్రి సుబ్బారావు
జననం జూన్ 10 , 1916
నల్గొండ జిల్లా , అన్నెపర్తి
మరణం 1988 , ఆగస్టు 13
ఇతర పేర్లు పైడిమర్రి సుబ్బారావు
వృత్తి విశాఖపట్నం డిటివొ
ప్రసిద్ధి రచయిత,
నేడు విద్యార్థులు చేస్తున్న "ప్రతిజ్ఞ" రచయిత.
మతం హిందూ
భార్య / భర్త వెంకట రత్నమ్మ

పైడిమర్రి వెంకటసుబ్బారావు నల్లగొండ జిల్లా అన్నెపర్తి కి చెందిన రచయిత, మరియు బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఈయన 1916, జూన్ 10న పైడిమర్రి రాంబాయమ్మ, వెంకవూటామయ్య దంపతులకు నల్లగొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నెపర్తి లో జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం అన్నెపర్తి, నల్లగొండలోనే సాగింది. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో నిష్ణాతులు.

ఉద్యోగం[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రంలోనే ట్రెజరీ విభాగంలో ప్రభుత్వోద్యోగం సంపాదించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఖమ్మం, నిజామాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, నల్లగొండ జిల్లాల్లో పని చేశారు.

ప్రతిజ్ఞ రచన[మార్చు]

ఆయన 1962లో విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్-చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత చైనా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రజల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం నూరిపోయాలని..! ఆ మేరకు ప్రత్యేకంగా కొన్ని దేశభక్తి గేయాలను రాయించి, పాఠశాల విద్యార్థులతో చదివించడం మొదలుపెట్టింది. అప్పటికే పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి ఈ విషయం గుర్తించాడు. మన విద్యార్థుల్లోనూ దేశభక్తిని పెంపొందించడానికి గేయాలుంటే బాగుంటుందని భావించాడు. పలు రచనలు చేసిన అనుభవంతో ఆ ఆలోచనకు రూపమివ్వడం మొదలుపెట్టాడు. ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. విశాఖ సాహితీ మిత్రుడు తెన్నేటి విశ్వనాధం తో చర్చించాడు. ‘వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలము’ అన్న వాక్యాన్ని అదనంగా చేర్చాడు. అంతాబాగానే ఉంది కానీ, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పాఠ్యపుస్తకాల్లో చేర్చడం ఎలా..?

అది కాసు బ్రహ్మానందడ్డి ప్రభుత్వం. అప్పటి విద్యాశాఖ మంత్రి విజయనగరం రాజాగా పేరుగాంచిన పీవీజీ రాజు. ఆయన సాహితీవేత్త కావడం వారికి కలిసొచ్చింది. తేన్నేటి సాయంతో ప్రతిజ్ఞను పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లాడు. దాని విలువను, అవసరాన్ని వివరించి ఓ ప్రతిని అందజేశారు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి జనవరి 26, 1965 నుంచి దేశమంతటా చదువుతున్నారు.[1]

పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు. ఇతర భాషల్లోకి అనువదించి 1963 నుంచి దేశ ప్రతిజ్ఞగా అమలులోకి వచ్చింది.

రచనలు[మార్చు]

పుస్తక సేకరణ, పఠనం, కవితా వ్యాసంగం, వేద అధ్యయనం చేసేవారు. నోట్‌పుస్తకాలపై చాలా రచనలు చేశారు. అందులో అరబ్బీ అనువాదాలు కూడా ఉన్నాయి. జమిందారీ, భూస్వామ్య వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు రాశారు. ఎక్కడ సాహిత్య కార్యక్షికమాలున్నా వెళ్లేవాడు. ప్రతి ఉగాదికి కవి సమ్మేళనంలో పాల్గొనేవారు.

ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) పేరున చిన్న నవల రాశారు. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు, బ్రహ్మచర్యము, గృహస్థ జీవితము, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. సింగపురీ నృకేసరీ శతకం, బాలరామాయణం, వెంక స్థుతి మొదలైన రచనలు సుబ్బారావు చేశారు. అనేక అనువాద రచనలు కూడా చేశారు. గోలకొండ, సుజాత, ఆంధ్రపవూతిక, భారతి, నవజీవన్, ఆనందవాణి పత్రికలలో వీరి రచనలు ప్రచురితమైనాయి. వీరి పద్యాలు గోలకొండ కవుల సంచికలోను, వీరి కథలు ఉషస్సు కథా సంకలనం, తెలంగాణ తొలితరం కథలులో ‘నౌకరి’ కథ వచ్చింది.

1945లోనే ఉషస్సు కథల సంపుటిని వెలువరించారు. 1945-46 లలో నల్లగొండ లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సభలలో ప్రముఖ పాత్ర వహించారు. వీరి పదవీ విరమణ తర్వాత సర్వేలు గురుకుల పాఠశాలలో కొంతకాలం స్వచ్ఛందంగా పనిచేశారు. 1977 నుండి 1988 వరకు నల్లగొండ గాంధీ పార్కులో ఉచిత హోమియో వైద్య సేవలందించారు.

పైడిమర్రి రచనలను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశంతో ఆయన లైబ్రరీని తన కుమారులు నల్లగొండలోని గీత విజ్ఞాన్ ఆంధ్ర కళాశాలకు అందించారు. ప్రస్తుతమది మూతపడింది. ఆ పుస్తకాలను జిల్లా గ్రంథాలయానికి మార్చే ప్రయత్నంలో ఉన్నారు.

కుటుంబం[మార్చు]

ఆయన సతీమణి వెంకట రత్నమ్మ.

మరణం[మార్చు]

ఉద్యోగ విరమణ అనంతరం 1988, ఆగస్టు 13న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

మూలాలు[మార్చు]

  1. సాక్షి ఆదివారం సంచిక ఆగస్టు 10, 2014 11వ పేజీ