వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 13వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Crreddy.jpg

సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి (1880 - 1951) ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు. ఆంధ్రభాషాభిరంజని సంఘంలో చురుకైన పాత్ర పోషించాడు. గైక్వాడ్‌ స్ఫూర్తితో అమెరికాలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడినుంచి తిరిగి వచ్చిన తర్వాత బరోడా కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌గా చేరాడు. 1909లో మైసూరులో విద్యాశాఖలో చేరి 1918 నుంచి 1921 వరకు విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. 1951లో అనారోగ్యంతో ఆయన మరణించాడు. ఇతడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా జీవించారు.

రామలింగారెడ్డి చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో 1880 డిసెంబరు 10న జన్మించాడు. సీఆర్‌రెడ్డి చదువు అతని అయిదో ఏట వీధి బడిలో మొదలయినది. చిన్న వయస్సులోనే భారతాన్ని, అమర బాల రామాయణాన్ని చదివేవాడు. 1890లో ప్రస్తుత పీసీఆర్ పేరుతో ఉన్న చిత్తూరు బోర్డు హైస్కూల్‌లో మొదటిఫారంలో చేరాడు. ప్రతి పరీక్షల్లోనూ ఉన్నత శ్రేణి సాధించేవాడు. ఉన్నతాభ్యాసం కోసం మదరాసు వెళ్ళి క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసాడు. 1899లో నవ్య కావ్యరచన పోటీలో, తన 19వ యేటనే ముసలమ్మ మరణము లఘు కావ్యాన్ని రచించి బహుమతి పొందాడు. 1902లో బీఏ పరీక్షలో చరిత్రలో, తత్వశాస్త్రంలో అత్యధిక మార్కులతో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాలను పొందాడు. అతను ఆంగ్ల, తెలుగు భాషలలో మంచి వక్త. ఎన్నో బహుమతులు అందుకొన్నాడు.

డిగ్రీలో వచ్చిన మంచి మార్కుల ఫలితంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్పుతో ఇంగ్లాండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలలయానికి వెళ్ళాడు. భారత ప్రభుత్వపు విద్యార్థి వేతనంతో కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో, సెయింట్స్ జాన్స్ కళాశాలలో ప్రవేశించి పలు పురస్కారాలు అందుకున్నాడు. 1903లో అతని తెలివి తేటలకు, సామర్థ్యానికి గుర్తింపుగా రైట్ బహుమతి లభించింది. 1905లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యూనియన్ లిబరల్ క్లబ్ కార్యదర్శిగా ఎన్నికై అక్కడ పలు ఉపన్యాసాలతో ఆంగ్లేయుల మన్ననలు ప్రశంసలు అందుకొన్నాడు. భారతీయుడుగా ఇలాంటి అసాధారణ గౌరవం దక్కడం అదే ప్రథమం. ఇతని విశేష విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాగ్ధాటి, హస్య చతురతలకు అక్కడివారు ఆశ్చర్యపడేవారట.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి