సుదీప్త సేన్‌గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుదీప్త సేన్‌గుప్తా
జననం (1946-08-20) 1946 ఆగస్టు 20 (వయసు 77)
కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం
జాతీయతభారతీయురాలు
రంగములుస్ట్రక్చరల్ జియాలజీ, ప్రికాంబ్రియన్ జియాలజీ
వృత్తిసంస్థలుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
పరిశోధనా సలహాదారుడు(లు)సుబీర్ కుమార్ ఘోష్
ఇతర విద్యా సలహాదారులుజానెట్ వాట్సన్

జాన్ రామ్సే

హాన్స్ రాంబెర్గ్
ముఖ్యమైన పురస్కారాలుశాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, 1991

సుదీప్త సేన్‌గుప్తా కలకత్తాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో స్ట్రక్చరల్ జియాలజీలో ప్రొఫెసరు, శిక్షణ పొందిన పర్వతారోహకురాలు. అంటార్కిటికాపై అడుగు పెట్టిన మొదటి భారతీయ మహిళల్లో (అదితి పంత్‌తో పాటు) ఆమె ఒకరు.[1] ఆమె బెంగాలీలో అంటార్కిటికా అనే పుస్తకం, జియోసైన్సెస్‌పై అనేక వ్యాసాలు రాసింది. టెలివిజన్ ఇంటర్వ్యూలకు కూడా ఆమె ప్రసిద్ధి చెందింది.[2] ఆమె స్ట్రక్చరల్ జియాలజీకి చెందిన అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ పత్రికల్లో విస్తృతంగా ప్రచురించింది. సైంటిఫిక్ పరిశోధన కోసం భారత ప్రభుత్వ అత్యున్నత సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, భూమి, వాతావరణం, మహాసముద్రాలు, గ్రహాలపై చేసిన పరిశోధనలకు గాను 1991 లో ఆమెకు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం అందించింది. ఇది భారతదేశం ఇచ్చే అత్యున్నత సైన్స్ అవార్డులలో ఒకటి.

తొలి జీవితం[మార్చు]

కలకత్తాలో జ్యోతి రంజన్ సేన్‌గుప్తా, పుష్పా సేన్‌గుప్తా దంపతులకు జన్మించిన ముగ్గురిలో సేన్‌గుప్తా చిన్న కుమార్తె. ఆమె తండ్రి వాతావరణ శాస్త్రవేత్త. వారి కుటుంబం భారతదేశం, నేపాల్ రెండింటిలోనూ చాలా సమయం గడిపారు.

ఆమె "దుర్గభూమి నుండి వచ్చాం. దుర్గను పూజిస్తాం. ఆమె కైలాష్‌లో నివసించిందని నేను చిన్నతనంలో నమ్మేదాన్ని. ఇప్పుడు, దుర్గ మనలో, స్త్రీలందరిలో నివసిస్తుందని నాకు తెలుసు."

తొలి ఎదుగుదల[మార్చు]

సుదీప్తా సేన్‌గుప్తా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి B.Sc, M.Sc. రెండింటిలోనూ అత్యున్నత గౌరవాలతో పట్టభద్రురాలైంది. ఆమె Ph.D. డాక్టర్ సుబీర్ కుమార్ ఘోష్ పర్యవేక్షణలో 1972లో జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి పొందింది. 1970, 1973 మధ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జియాలజిస్ట్‌గా పనిచేసింది. 1973లో, ఆమె UK నుండి 1851 ఎగ్జిబిషన్ కోసం రాయల్ కమీషన్ వారి ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌ను అందుకుంది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో తదుపరి మూడేళ్లపాటు పోస్ట్-డాక్టోరల్ పరిశోధన చేసింది. 1977లో ఆమె స్వీడన్‌లోని ఉప్ప్సలా విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీలో ఆరునెలలపాటు డోసెంట్‌గా చేసి, ఆ తర్వాత ప్రొఫెసర్ హన్స్ రాంబెర్గ్ పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ జియోడైనమిక్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి విజిటింగ్ సైంటిస్ట్‌గా పరిశోధనలు చేపట్టింది. 1979లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆమె జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ జియాలజిస్ట్‌గా చేరింది. 1982లో జాదవ్‌పూర్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా చేరి ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసింది.[3]

సేన్‌గుప్తా "నా జీవితంలో మొదటి 15 సంవత్సరాలలో, తరగతిలో మహిళలు పెద్దగా ఉండేవారు కాదు - చాలా సంవత్సరాల పాటు ఎవరూ లేరు." క్షేత్ర పర్యటనల సమయంలో మహిళలకు వసతి కల్పించడానికి విశ్వవిద్యాలయం సిద్ధంగా లేదనే వాస్తవం గురించి ఆమె చెప్పింది. 1996 వరకు పరిస్థితులు మెరుగుపడలేదు. "మా కాలంలో, ఇది చాలా భయంకరమైనది. మేము ధర్మశాలలలోను, కొన్నిసార్లు గుడిసెలలోనూ ఉండేవాళ్ళం." అని ఆమె చెప్పింది. కొన్ని విషయాల్లో ఆ రోజులే మెరుగ్గా ఉండేవని కూడా ఆమె చెప్పింది. ఆమె తన పిహెచ్‌డి కోసం ఒంటరిగా చదువుకుంది. "గుంతల రోడ్లు, కమ్యూనికేషన్ లేని మారుమూల ప్రాంతాలకు ప్రయాణించాను, కానీ ఎప్పుడూ భయం కలగలేదు" కానీ ఈ రోజుల్లో "ఫీల్డ్ వర్క్ కోసం ఒంటరిగా అమ్మాయిని పంపడానికి ధైర్యం చేయలేను." అని చెప్పింది.[4][5]

పర్వతారోహణ[మార్చు]

సుదీప్త సేన్‌గుప్తా నిపుణురాలైన పర్వతారోహకురాలు. హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెన్జింగ్ నార్గే ద్వారా అడ్వాన్స్‌డ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ పొందింది. 1953లో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి ఇద్దరు వ్యక్తులలో టెన్జింగ్ నార్గే ఒకడు. ఆమె భారతదేశం, ఐరోపాల్లో అనేక పర్వతారోహణ యాత్రలలో పాల్గొంది. లాహౌల్ ప్రాంతంలో పేరులేని ఎవరూ అధిరోహించని శిఖరం కూడా ఎక్కింది. తరువాత దానికి వాళ్ళు మౌంట్ లాలోనా అని పేరు పెట్టారు.

తన ఫీల్డ్ వర్క్ తనకు చాలా నేర్పిందని సేన్‌గుప్తా చెప్పింది. "ప్రజలు ప్రతిచోటా ఒకేలా ఉంటారు. వారు ప్రాథమికంగా మంచివారు, సహాయకారిగా ఉంటారు" అని ఆమె చెప్పింది, "ఒక భారతీయ అమ్మాయి సుత్తితో తిరగడం వారికి చాలా కొత్తగా అనిపించింది." [6]

అంటార్కిటిక్ యాత్ర, పరిశోధన[మార్చు]

1983లో, సుదీప్త సేన్‌గుప్తా అంటార్కిటికాకు మూడవ భారతీయ యాత్రలో సభ్యురాలిగా ఎంపికైంది. తూర్పు అంటార్కిటికాలోని షిర్మాచెర్ హిల్స్‌లో మార్గదర్శక భౌగోళిక అధ్యయనాలను నిర్వహించింది. సుదీప్త, మెరైన్ బయాలజిస్ట్ అయిన డా. అదితి పంత్ లు అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న భారతదేశపు తొలి మహిళా శాస్త్రవేత్తలు. [7] [8] 1989లో అంటార్కిటికాకు తొమ్మిదవ భారత యాత్రలో సభ్యురాలిగా ఆమె రెండవసారి అంటార్కిటికాను సందర్శించారు. షిర్మాచర్ హిల్స్‌లో ఆమె చేసిన కృషికి మౌలికమైన ప్రాముఖ్యత ఉంది - ఇది ఆ ప్రాంతంలో తదుపరి పరిశోధనలకు ఆధారమైంది. స్ట్రక్చరల్ జియాలజీలో తన పరిశోధనలో భాగంగా సుదీప్త, ప్రయోగశాల ప్రయోగాలు, సైద్ధాంతిక విశ్లేషణలతో భౌగోళిక క్షేత్ర అధ్యయనాలను మిళితం చేసింది. ద్వీపకల్ప భారతదేశం, స్కాటిష్ హైలాండ్స్, స్కాండినేవియన్ కాలెడోనైడ్స్, తూర్పు అంటార్కిటికాలోని ప్రీకాంబ్రియన్ నిర్మాణాలతో సహా విభిన్న భూభాగాలలో నిర్మాణ క్షేత్ర అధ్యయనాలు కూడా చేసింది.


ఆమె అంటార్కిటికాలో తన అనుభవం గురించి చెబుతూ భూగర్భ శాస్త్రంలో ఉన్న పక్షపాత ధోరణులు ఆ భూమికి కూడా విస్తరించాయని చెప్పింది. "అంటార్కిటికా కూడా ఒక మగ కోట, 1956కి ముందు మహిళా శాస్త్రవేత్తలను అక్కడికి అనుమతించలేదు." అని చెప్పింది. అంటార్కిటికాలో బ్యూటీ పార్లర్ లేకుండా ఒక మహిళ వెళ్లదు అని మగవాళ్ళు ఎగతాళి చేయడం ఆమెకు గుర్తుంది. 1982లో ఆమె భారతీయ అంటార్కిటికా యాత్రలో చేరడానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె ఒక మహిళ అయినందున ఆమె దరఖాస్తును తిరస్కరించారు. కానీ తర్వాత 1982, 1989 లలో ఆమే యాత్రలలో వెళ్ళింది.

రెండు యాత్రలలో, అక్కడికి చేరుకోవడానికి ఒక నెల సమయం పట్టింది. అక్కడ దిగాక వాళ్ళు, మంచు తుఫానులలో, సూర్యుడు అస్తమించని సమయంలో పని చేయాల్సి ఉంటుంది. ఆమె అంటార్కిటికాకు వెళ్లిన రోజుల్లో, భారతదేశానికి దక్షిణ గంగోత్రి స్థావరం ఒక్కటే ఉండేది. ఇప్పుడది పూర్తిగా మంచులో మునిగిపోయి, పని చేయడం లేదు. తూర్పు అంటార్కిటికాలోని షిర్మాచెర్ ఒయాసిస్‌లో ఉన్న మైత్రి స్టేషన్ ఇప్పటికీ చురుకైన పరిశోధనా స్థావరంగా ఉంది.[9]

ప్రచురణలుం పురస్కారాలు[మార్చు]

ప్రొఫెసర్ సేన్‌గుప్తా భారతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో అనేక పత్రాలను ప్రచురించింది. ఆమె ప్రఖ్యాత నిర్మాణ భూవిజ్ఞాన శాస్త్రవేత్తల రచనలతో ఒక పుస్తకాన్ని సవరించింది. అంటార్కిటికాలో ఆమె చేసిన యాత్రలపై, తన కృషిపై ఒక పుస్తకాన్ని కూడా రచించింది. ఇది పశ్చిమ బెంగాల్‌లో బెస్ట్ సెల్లర్‌గా మారింది. భారత ప్రభుత్వం సైన్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఆమెకు భట్నాగర్ అవార్డు లభించింది. ఆమె ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలో. ప్రొఫెసర్ సేన్‌గుప్తా భారత ప్రభుత్వం నుండి నేషనల్ మినరల్ అవార్డు, అంటార్కిటికా అవార్డుతో పాటు లేడీ స్టడీ గ్రూప్ వారి వృత్తి, కెరీర్ అవార్డు వంటి అనేక ఇతర పురస్కారాలను కూడా అందుకుంది.

న్యూ ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషన్ సెంటర్‌లో 'విమెన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే ఫోరమ్‌లో ప్రొఫెసర్ సేన్‌గుప్తా భాగమైంది.

మూలాలు[మార్చు]

  1. "Smart Women Scientist who made India proud - Dr. Aditi Pant". ww.itimes.com. 2015-05-18. Retrieved 2016-06-05.
  2. Sengupta, Sudipta. Antarctica. Ananda Publisher, 1989, ISBN 81-7066-091-2
  3. Sengupta, Sudipta. Antarctica. Ananda Publisher, 1989, ISBN 81-7066-091-2
  4. Doney, Anjali (August 20, 2019). "Exclusive: From Physicists to Geologists, Meet 6 Amazing Antarctic Women of India". The Better India.
  5. Aishwarya, Tripathi (November 2, 2019). "Sudipta Sengupta's Journey in Geology to the Ends of the Earth". The Wire.
  6. Aishwarya, Tripathi (November 2, 2019). "Sudipta Sengupta's Journey in Geology to the Ends of the Earth". The Wire.
  7. Error on call to Template:cite paper: Parameter title must be specified
  8. Tiwari, Anju (2008). Story of Antarctica. Goa: National Centre for Antarctic and Ocean Research. ISBN 978-81-906526-0-5.
  9. Doney, Anjali (August 20, 2019). "Exclusive: From Physicists to Geologists, Meet 6 Amazing Antarctic Women of India". The Better India.