Jump to content

అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు
అధికార నామంబిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి
దేశంభారత దేశం
ప్రదేశంతుమ్మిడిహట్టి (తుంబడిహట్టి), తెలంగాణ
స్థితిరూపకల్పన, పేరు, ఉద్దేశాలు మారిపోయి, దాని స్థానంలో వేరే ప్రాజెక్టులు వచ్చాయి
నిర్మాణ వ్యయంరూ. 38,500 కోట్లు

అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణలో ఏడు జిల్లాలకు సాగునీటిని అందించే ప్రధాన ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు. అధికారికంగా దీని పేరు బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి. దీనిద్వారా 16.40 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని తలపెట్టారు.[1]

ప్రాణహిత నదిపై కొమరం భీం జిల్లా, కౌతల మండలం లోని తుమ్మిడిహట్టి (తుంబడిహట్టి) గ్రామం వద్ద ఒక బ్యారేజీ నిర్మించి అక్కడి నుండి 160 టిఎమ్‌సి ల నీటిని, గోదావరిపై ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి 20 టిఎమ్‌సి లనూ వినియోగించడం ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగం. 2008 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు ఇచ్చింది.[2] ఈ ప్రాజెక్టుకు సంబంధించి, ముంపు ప్రాంతాన్ని గుర్తించి, నష్టపరిహారాన్ని నిర్ధారించేందుకు గాను ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు 2012 మే 5 న మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.[3]

అయితే తెలంగాణ రాష్ట్రపు తొలి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో పలు సమస్య లున్నట్లు గుర్తించింది. ప్రాజెక్టు ఎత్తుపై మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరం వాతిలో ప్రధానమైనది. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు రూపకల్పనను ఆమూలాగ్రం మార్చేసింది. ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అని, రెండవభాగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు అనీ పేర్లు పెట్టింది.[4]

ప్రాజెక్టు తొలి రూపకల్పన, ఉద్దేశాలు

[మార్చు]
Wardha river at Pulgaon.jpg
పుల్గావ్ వద్ద వార్ధా నది

రు. 38,500 కోట్ల ఖర్చుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008 డిసెంబరు 17 న అనుమతి ఇచ్చింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాదు జిల్లా తుంబడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ఒక బ్యారేజీ నిర్మిస్తారు. వార్ధా, వైన్‌గంగ నదులు సంగమించి ప్రాణహిత నదిగా రూపొందే స్థానం ఇది. ఇక్కడి నుండి 160 టిఎమ్‌సి ల నీటిని ఎత్తిపోస్తారు. ఈ నీటిని వివిధ దశల్లో పంపింగు చేస్తూ 600 మీటర్ల ఎత్తున్న చేవేళ్ళ వరకూ తీసుకువేళ్తారు. దారిలో వివిధ జిల్లాలకు సాగునీరు అందించడంతో పాటు, దారిలో ఉన్న గ్రామాల తాగునీటి అవసరాల కోసం 10 టిఎమ్‌స్ ల నీటిని కేటాయిస్తారు. మరో 30 టిఎమ్‌స్ లను జంటనగరాల తాగునీటి కోసం కేటాయిస్తారు. 20 టిఎమ్‌స్ ల నీటిని పారిశ్రామిక అవసరాల కోసం కేటాయిస్తారు.

ఈ ప్రాజెక్టు ద్వారా వివిధ జిల్లాల్లో సాగులోకి రాగల భూమి విస్తీర్ణం

పాత జిల్లా సాగు లోకి వచ్చే

ఎకరాలు

ఆదిలాబాదు          1,56,500
కరీంనగర్          1,71,449
నిజామాబాదు          3,04,500
మెదక్          5,19,152
నల్గొండ          2,29,832
రంగారెడ్డి          2,46,704
వరంగల్             11,863
మొత్తం:       16,40,000

జరిగిన పని

[మార్చు]

ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేసే లోపు ప్రాజెక్టులో దాదాపు రూ. 1500 కోట్ల విలువైన పనులు జరిగాయి. వివిధ కాలువల భూసేకరణ కోసం రూ. 900 కోట్లు ఖర్చు చేసారు. తుమ్మిడిహట్టి నుంచి మైలారం వరకు 71 కి.మీ.ల కాలువను తవ్వి, దాని లైనింగ్‌‌‌‌‌‌‌‌ పనులు కూడా దాదాపు పూర్తి చేశారు.[5]

ప్రాజెక్టు రూపకల్పనలో చేసిన మార్పులు

[మార్చు]

బ్యారేజీ ఎత్తు విషయంలో మాహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణన లోకి తీసుకుని ప్రాజెక్టులో మార్పులు చెయ్యాల్సి వచ్చింది. మహారాష్ట్రలో వేలాది ఎకరాల భూమి ముంపుకు గురౌతున్న కారణంగా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి 2016 ఆగస్టు 23 న ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం లోని ప్రధాన భాగాలు కింది విధంగా ఉన్నాయి:[6][7]

  1. ప్రాణహిత పైన కట్టే తుమ్మిడి హట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు కుదిస్తుంది
  2. గోదావరి నదిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తారు.
  3. పెన్‌గంగ నదిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఒక ప్రాజెక్టును నిర్మిస్తాయి.

ఈ ఒప్పందాన్ని అనుసరించి అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింది మార్పులకు లోనై స్వరూపాన్ని కోల్పోయింది:

  1. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు పేరుతో తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మించి, 20 టిఎమ్‌సి ల నీటిని మళ్ళించి, ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు.
  2. కాళేశ్వరం ఎతిపోతల పథకం పేరుతో మేడిగడ్ద వద్ద గోదావరి నదిపై ఒక బ్యారేజీ నిర్మించి, తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో 18,25,700 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందిస్తారు. మరో 18,82,970 ఎకరాల ఆయకట్టుకు నీటి లభ్యతను స్థిరీకరిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అన్నారం, సుందిళ్ళ వద్ద మరో రెండు బ్యారేజీలు, అనేక కాలువలు, సొరంగాలు, ఎత్తిపోతల పథకాలు, జలాశయాలు కూడా నిర్మిస్తారు.[4]

మూలాలు

[మార్చు]
  1. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017.
  2. "అటవీ శాఖ అనుమతి" (PDF). భారత ప్రభుత్వ అటవీశాఖ. Retrieved 2020-07-14.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "I&PR Press Release". ipr.ap.nic.in. Retrieved 2020-07-14. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 "కాళేశ్వరం ప్రాజెక్టు" (PDF). తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ. Retrieved 2020-07-14.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "తుమ్మిడిహట్టి కట్టేదెప్పుడు?.నీళ్లిచ్చేదెన్నడు." వి6తెలుగు. 2019-08-26. Archived from the original on 2020-07-14. Retrieved 2020-07-14.
  6. "మూడు అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ, మహారాష్ట్ర అంగీకారం". తెలంగాణ ప్రభుత్వ పోర్టల్.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-07-15. Retrieved 2023-02-19.