అడవి పిలిచింది
అడవి పిలిచింది | |
కృతికర్త: | జాక్ లండన్ |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | కాల్ ఆఫ్ ది వైల్డ్ |
అనువాదకులు: | ఎ.గాంధీ |
ముద్రణల సంఖ్య: | 4 (2008 నాటికి) |
ముఖచిత్ర కళాకారుడు: | చంద్ర |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు (మూలం:ఆంగ్లం) |
ప్రక్రియ: | నవల |
విభాగం (కళా ప్రక్రియ): | అడ్వంచర్ నవల |
ప్రచురణ: | పీకాక్ క్లాసిక్స్ |
విడుదల: | 2003 |
ఆంగ్ల ప్రచురణ: | 1903 |
పేజీలు: | 77 |
అడవి పిలిచింది పుస్తకం జాక్ లండన్ రచించిన ప్రఖ్యాత ఆంగ్లనవల కాల్ ఆఫ్ ది వైల్డ్‌కి తెలుగు అనువాదం. ఈ పుస్తకాన్ని ఎ.గాంధీ సంక్షిప్తీకరించి అనువదించారు.
రచన నేపథ్యం
[మార్చు]ప్రఖ్యాత అమెరికన్ రచయిత జాక్ లండన్ 1903లో కాల్ ఆఫ్ ది వైల్డ్ నవలను రచించారు. ఈ నవలను అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో ప్రముఖ స్థానం పొందిన గోల్డ్ రష్(బంగారపు వేట/నిధి వేట) నేపథ్యంగా స్వీకరించి రాశారు. 1897లో కాలిఫోర్నియాకు చెందిన జాక్ లండన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను దేశమంతా తిరుగుతూ కష్టపడి పలు వృత్తులు, పనులు చేస్తూండే హోబోగా జీవితాన్ని గడిపారు. అనంతరం కాలిఫోర్నియాకు తిరిగివచ్చి తన 14ఏట విడిచిపెట్టిన ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకున్నారు. బెర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం పాటు కళాశాల విద్య చదివారు. ఆపైన చివరి గొప్ప గోల్డ్ రష్గా పేరొందిన క్లొండికె గోల్డ్ రష్‌లో పాల్గొన్నారు. ఎందరో సాహసికులు బంగారంపై వ్యామోహంతో బంగారాన్ని సంపాదించుకునేందుకు ప్రాణాలకు తెగించి అలస్కా మంచు కొండల్లో చేసిన ప్రయత్నాలను గోల్డ్ రష్ అని పేర్కొంటారు. 1898లో జాక్ లండన్ ఆ గోల్డ్ రష్‌కు శిఖరాయమాన సమయమని చెప్పదగ్గ కాలంలో అక్కడ గడిపారు. ఆపైన తన చిగుళ్ళు చలి మూలంగా చిట్లి, వాచి ఆరోగ్యం దెబ్బతింటూండడం గమనించిన జాక్ లండన్ కాలిఫోర్నియా తిరిగి ప్రయాణమయ్యాడు. తిరుగు ప్రయాణంలో యాకూన్ నదిపైన రాఫ్టింగ్ చేస్తూ తన జట్టుతో మానవ నాగరికత చొరని ఎన్నో అటవీ ప్రాంతాలను సందర్శించారు. అలస్కాలో ఉన్న సమయంలోనే ఆయనకు కాల్ ఆఫ్ ద వైల్డ్ నవల వస్తువు దొరికింది.[1] గోల్డ్ రష్‌లో లండన్ తిరుగాడిన ప్రాంతాలు, చూసిన వ్యక్తులు, పరిశీలించిన ప్రవృత్తులూ ఆ నవలలో ప్రతిబింబించాయి.
బహుళ ప్రజాదరణ పొందిన కాల్ ఆఫ్ ద వైల్డ్ నవలను తెలుగులోకి ప్రకృతి పిలుపు పేరిట ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు అనువదించారు. 160 పేజీలతో, రూ.1.75 వెల కలిగిన ప్రకృతి పిలుపు నవలను దేశి కవితా మండలి ప్రచురించింది. 2003లో ఎ.గాంధి సంక్షిప్తపరిచి అనువదించగా అడవి పిలిచింది పేరిట పీకాక్ క్లాసిక్స్ సంస్థ ప్రచురించింది. ఈ సంక్షిప్త ప్రచురణలో మొత్తం 78 పేజీలు ఉండగా, రూ.30 వెల నిర్ణయించారు.
కథా సంగ్రహం
[మార్చు]పరిమాణంలో పెద్దదీ, బలమైనదీ ఐన సెయింట్ బెర్నాడ్ జాతి కుక్క బక్ నవల ప్రారంభంలో కాలిఫోర్నియాకు చెందిన శాంటా క్లారా లోయలో జడ్జి మిల్లర్ పెంపుడు జంతువుగా హాయైన జీవితం గడుపుతూంటుంది.[2] తోటమాలి అసిస్టెంటు బక్‌ను దొంగిలించి తన జూదం వ్యసనానికి అవసరమయ్యే డబ్బుకోసం అమ్మేస్తాడు. అక్కడ నుంచి నేటి వాషింగ్టన్ రాష్ట్రపు కింగ్ కౌంటీకి చెందిన సీటిల్ నగరానికి సముద్రమార్గంలో తరలిస్తారు. ఎర్ర స్వెట్టర్ మనిషి బక్‌ని బోనులో బంధించి ఆకలితో మాడ్చి, దెబ్బలు కొట్టి తీవ్రంగా హింసిస్తాడు. బోనులోంచి బయటకు తీసుకురాగానే ఎర్ర స్వెట్టర్ వాడిపై దాడిచేద్దామని ప్రయత్నించగా అతను కర్రతో చితకబాదుతాడు. ఆ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ బక్‌కు దుడ్డుకర్ర న్యాయం తెలిసివస్తుంది.
ఫ్రాన్సిస్, ఫెరాల్ట్ అనే ఇద్దరు కెనడా ప్రభుత్వానికి చెందిన ఫ్రెంచ్-కెనడియన్ డిస్పాచర్స్ దాన్ని కొనుక్కుని క్లోండికే ప్రాంతానికి తీసుకువెళ్తారు. అక్కడ దాన్ని స్లెడ్జ్ బండిని నడిపే స్లెడ్జ్ కుక్కగా పనిచేయించుకునేందుకు శిక్షణనిస్తారు. ధ్రువప్రాంతానికి దగ్గరలో ఉండే ఆ చలి ప్రదేశంలో రాత్రుళ్ళు గడపడం, స్లెడ్జ్ బండిలో సక్రమంగా పనిచేయడం వంటివి, బక్ జట్టులోని తోటి కుక్కలను చూసి త్వరగా నేర్చుకుంటుంది. ఆ కుక్కల జట్టును నడిపించే నాయకత్వం కలిగిన కుక్క స్పిట్జి. క్రూరత్వం, తగవులమారితనం కలగలిసిన స్పిట్జితో బక్‌కు సహజ వైరం కలుగుతుంది. కాలక్రమంలో బక్‌తో స్పిట్జికి ఒక దెబ్బలాట జరుగుతుంది. ఆ దెబ్బలాటలో బక్ పైచేయి సాధించి స్పిట్జిని ఓడిస్తుంది. కిందపడ్డ స్పిట్జిపై మొత్తం జట్టుతోపాటు వేర్వేరు జంతువులు కూడా దాడిచేసి చంపేస్తాయి. స్పిట్జి చావు తర్వాత బక్ జట్టుకు నాయకత్వం స్వీకరిస్తుంది.
ఉత్తరాలను అందజేసే సర్వీసులోని స్కాటిష్ జాతికి చెందిన వ్యక్తికి మొత్తం జట్టును అమ్మేస్తారు. కుక్కలు భారీ బరువును లాగుతూ మైనింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్తాయి. ఆ ప్రయాసకరమైన ప్రయాణపు అలుపు తీరకుండానే సుదీర్ఘమైన తిరుగు ప్రయాణమూ చేస్తాయి. ఆ ప్రయాణంలో దారుణమైన శారీరిక శ్రమకు గురికావడంతో కుక్కలన్నీ అలసట, అనారోగ్యాలకు గురవుతాయి. డేవ్ అనే తోటి కుక్క తీరని అనారోగ్యం పాలై, ఆ కారణంగా కాల్చి చంపబడడం కుక్కలకు గొప్ప విషాదం అవుతుంది.
హాల్, చార్లెస్, మర్సిడెజ్(స్త్రీ) అనే ముగ్గురు బక్ తదుపరి యజమానులవుతారు. ఆ ముగ్గురికీ ఉత్తర ప్రాంతపు ఆటవిక ప్రాంతాలు, చలి వాతావరణంలో జీవించేందుకు తగ్గ అనుభవం, త్వరితంగా నేర్చుకునేందుకు చురుకుదనం ఉండవు. స్లెడ్జ్ బండిని అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూంటారు. అవగాహన లోపంతో కుక్కలకు అతిగా తిండి పెట్టి, చివరకు తిండి తక్కువైపోగా వాటిని ఆకలితో మాడ్చేస్తారు. వాళ్ళ ప్రయాణంలో అనుభవశాలియైన జాన్ థార్న్‌టన్‌ను కలుస్తారు. వాళ్ళు కుక్కలను సరిగా చూసుకోలేకపోతున్నారని, అవి బలహీనమైన స్థితిలో ఉన్నాయనీ కనిపెడతాడు. ఆ ముగ్గురూ నదిని దాటే ప్రయత్నం చేయబోగా అతను మంచు కరిగి ఉత్పాతం జరిగే అవకాశాన్ని వివరించి వద్దని హెచ్చరిస్తాడు. అతని మాట పెడచెవిన పెట్టి నదిని దాటేందుకు ముందుకువెళ్తారు. కానీ ప్రమాదాన్ని శంకించి ఉండడం, ఆకలి, నీరసం ముప్పిరిగొని బక్ ముందుకు వెళ్లదు. అనంతరం బక్‌ను హాల్ తీవ్రంగా కొడుతూండగా, థార్న్‌టన్ అదొక విలక్షణమైన కుక్క అని గుర్తిస్తాడు. ఆ ముగ్గురితో విభేదించి థార్న్‌టన్ బక్‌ను విడుదల చేస్తాడు. ఎంతచెప్పినా వినకుండా ముగ్గురూ బక్‌ని వదిలి మిగతా కుక్కలతో నదిని దాటిపోయే ప్రయత్నం చేస్తారు. నదిలోని మంచు అప్పటికే ఋతువు మార్పు వల్ల బలహీనపడి ఉండడంతో దానిపై నుంచి వెళ్లబోయిన ముగ్గురూ, స్లెడ్జ్ బండి, అశ్రద్ధగా ముందుకువెళ్ళిన కుక్కలూ నదిలో మునిగి చనిపోతారు.
థార్న్‌టన్ బక్‌ను జాగ్రత్తగా సాకి దాని ఆరోగ్యాన్ని తిరిగి సరిజేస్తాడు. ఆ క్రమంలో బక్ థార్న్‌టన్‌పై ప్రేమ, విశ్వాసం పెంచుకుంటుంది. థార్న్‌టన్ నదిలో పడినప్పుడు ప్రమాదం నుంచి బక్ రక్షిస్తుంది. బక్‌ను తీసుకుని థార్న్‌టన్ ఆ ప్రాంతమంతా తిరుగుతూండగా ఓసారి బక్‌తో పెద్ద పందెం కాస్తాడు. గోల్డ్ డస్ట్‌లో అర టన్ను బరువున్న స్లెడ్జ్‌ని మంచులోంచి బయటకు లాగి, 100 యార్డుల దూరం లాగి 1600 అమెరికన్ డాలర్ల పందెం బక్ గెలుస్తుంది. ఆ పందెంలో బక్ ప్రత్యేకత చూసిన ఓ రాజు చాలా ఎక్కువ డబ్బుకు కొనుక్కుంటానని అడిగినా బక్‌పై ప్రేమ పెంచుకున్న థార్న్‌టన్ తిరస్కరిస్తాడు. థార్న్‌టన్, అతని స్నేహితులు బంగారాన్ని వెతుకుతూండగా, బక్ తనలోని ప్రాచీన ఆటవిక లక్షణాలు కనుగొని అక్కడి మందలోని తోడేలుతో స్నేహం చేస్తుంది. వేట చేయడం నేర్చుకుని క్రమక్రమంగా అడవి జంతువు అయిపోతున్న ఆ కుక్క తిరిగి వచ్చేసరికి తన ప్రియమైన యజమాని, అతని తోటివాళ్ళూ స్థానికులైన యీహాత్ జాతివారి చేతిలో మరణించి ఉండడం చూస్తుంది. థార్న్‌టన్ మరణానికి ప్రతీకారంగా ఆ తెగవారిని బక్ నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఆపైన నాగరిక ప్రపంచంతో ఉన్న ఆఖరి అనుబంధమైన థోర్న్‌టన్ కూడా గతించడంతో తోడేలుతో పాటు నిర్జనారణ్యంలోకి వెళ్ళిపోతుంది. విపరీతమైన శక్తి, దారుణమైన జిత్తులమారితనం కలగలిసిన బక్ ఆ ప్రాంతంలో ఎదురులేని మృగంలా జీవిస్తుంది. చివరికి ఉత్తరప్రాంతపు జానపదుల గాథల్లోని దెయ్యపు కుక్కలాగా బక్ ప్రతీయేటా థార్న్‌టన్ మరణించిన ప్రాంతానికి తిరిగివస్తూంటుంది.
పాత్రలు
[మార్చు]- బక్ : కథలో ముఖ్యపాత్ర, కథానాయకుడు. పెద్దదీ, బలమైనదీ ఐన సెయింట్ బెర్నాడ్ జాతి కుక్క.
- స్పిట్జ్
- జడ్జి మిల్లర్
- ఎర్ర స్వెటర్ మనిషి
- ఫ్రాన్సిస్
- ఫెరాల్డ్
నవల వస్తువుకు సంబంధించిన చిత్రమాలిక
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Jack London' — Biographical Note". The Call of the Wild, White Fang & To Build a Fire. The Modern Library hundred best novels of the twentieth century 88. Introduction by E. L. Doctorow (reprint ed.). Modern Library. ISBN 978-0-375-75251-3. OCLC 38884558
- ↑ London, Jack (1998). The Call of the Wild, White Fang & To Build a Fire. The Modern Library hundred best novels of the twentieth century 88. Introduction by E. L. Doctorow (reprint ed.). Modern Library. ISBN 978-0-375-75251-3. OCLC 38884558.