అద్దేపల్లి కృష్ణశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అద్దేపల్లి కృష్ణశాస్త్రి (1846 - 1907) ప్రముఖ పండితుడు, పౌరాణికుడు. బాలాత్రిపురసుందరీ మహామంత్రోపాసకుడైన కృష్ణశాస్త్రి కృష్ణా జిల్లా దివిసీమలోని టేకుపల్లిలో శివావధానికి పుత్రునిగా 1846లో జన్మించాడు. ఇతని సోదరులు ఐదుగురూ మహావిద్వాంసులే. ఇతనికి ఆంగ్లవిద్య ఇష్టంలేక విజయనగరం వెళ్ళి, అప్పనభొట్ల గోపాలశాస్త్రి వద్ద చాలాకాలం శుశ్రూష చేసి, సంస్కృత, సాహిత్య, తర్క, వ్యాకరణాలలో అమోఘమైన పాండిత్యాన్ని సంపాదించాడు. గురువు నుండి ఇతనికి మంత్రవిద్య కూడా సంక్రమించింది. పాదుకాంత దీక్ష పొంది, మూడు నెలలలో ప్రస్థానత్రయాన్ని అధ్యనం చేసిన అద్భుత మేధా సంపన్నుడిగా పేరు సంపాదించాడు.

1892వ సంవత్సరంలో అన్నవరంలో సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించినది ఇతడే. “జగన్మోహన మంత్రం" ఉపాసనలో ఇతడు నిష్ణాతుడు. ఈ మంత్ర సంబంధమైన గ్రంథం ఒకటి రచించాడు కూడా.

ఇతడు గోపాలపురం రాజా వారి ఆస్థాన పండితునిగా చాలాకాలం పనిచేశాడు. ఇతడు పురాణ ప్రవచనంలో అందే వేసిన చేయి. ఒకో శ్లోకానికి 108 విధాలుగా అర్థాలు చెప్పగల ప్రఙ్ఞాశాలి.

సంస్కృత భాషలో ఇతడు అనేక గ్రంథాలను రచించాడు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానం రచించాడు. వాల్మీకి రామాయణంలోని ఒక శ్లోకానికి వంద రకాలుగా వ్యాఖ్యానం రచించి, కాశీ పండితులను మెప్పించిన ఘనుడితడు. ఈ గ్రంథానికి “ఏక శ్లోక వ్యాఖ్యానం" అనిపేరు. ఇతడు ఇంకా "అలంకార ముక్తావళి", "తర్కామృత తరంగిణి" అనేగ్రంథాలు రచించాడు.

ఇతడు తన 91వ యేట 1907లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  • సాహిత్యకృష్ణాతరంగిణి - నవులూరి రమేష్‌బాబు