అనితారావు కోట్ల
అనితారావు కోట్ల | |
---|---|
జననం | అనిత మే 23, 1977 హైదరాబాదు, తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాదు, తెలంగాణ |
వృత్తి | నాట్యగురువు |
ప్రసిద్ధి | కూచిపూడి నర్తకి |
భార్య / భర్త | డా. కోట్ల హనుమంతరావు |
తండ్రి | రమాకాంతరావు |
తల్లి | పద్మావతి |
అనితారావు కోట్ల (జ. మే 23, 1977) కూచిపూడి కళాకారిణి, నాట్య గురువు. 20 సంవత్సరాలుగా దాదాపు 5 వేలమందికి నృత్యకళను నేర్పిస్తూ, అనేక నృత్య రూపక ప్రదర్శనలను ప్రదర్శిస్తున్నది.[1]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]అనితారావు 1977, మే 23 రమాకాంతరావు, పద్మావతి దంపతులకు హైదరాబాదు, పాతబస్తీలోని బేలా అనే ప్రాంతంలో జన్మించింది. తండ్రి ఎచ్.ఎం.టి.లో ఉద్యోగం చేసేవాడు, తల్లి గృహిణి. 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు రిఫా-ఎ-ఆమ్ హైస్కూల్, 5, 6 తరగతలు మొఘల్ పురా లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు కోఠిలోని మనోరంజితం అనే పాఠశాలలో చదివింది. 1991లో తెలుగు విశ్వవిద్యాలయంలోని జానపద కళలశాఖలో పిజి డిప్లొమా చదివిన అనిత, 1993-98 మధ్యకాలంలో అదే విశ్వవిద్యాలయంలోని నృత్యశాఖలో బి.ఏ., ఎం.ఏ. పూర్తిచేసి, స్వర్ణపతాకాలు అందుకుంది. 'కూచిపూడి భాగవత ప్రదర్శన పద్ధతి' అనే అంశంపై ఎం.ఫిల్, 2009లో 'కూచిపూడి భాగవతుల వివిధ కళారూపాలు' అనే అంశంపై పిహెచ్.డి. పూర్తిచేసింది.
కుటుంబం - ఉద్యోగం
[మార్చు]1998లో రంగస్థల కళాకారుడు, అధ్యాపకుడైన డా. కోట్ల హనుమంతరావుతో అనితారావు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. యుజిసి నెట్ పాసైన అనిత డిఎస్సీ పరీక్ష రాయడంతో 1998, ఆగస్టు 15న నాంపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నాట్యగురువుగా ఉద్యోగం వచ్చింది. 2009నుండి మహబూబియా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని బాలికలకు నాట్యంలో శిక్షణ ఇస్తున్నది.
కళారంగం
[మార్చు]తండ్రి ప్రోత్సాహంతో చిన్నప్పటినుండి నాట్యం నేర్చుకున్న అనితారావు, శ్రీమతి అనూరాధ, డా. గోపాల్‌రాజ్ భట్, డా. ఉమారామారావు, డా. భాగవతుల సేతురాం, డా. అలేఖ్య పుంజాల వంటి గురువుల వద్ద నృత్యంలో శిక్షణ పొందింది. 1999లో బ్రహ్మ కుమారీస్ సంస్థ కోసం మొట్టమొదటిసారిగా స్వంత నృత్యదర్శకత్వంలో 'తమసోమా జ్యోతిర్గమయ' అనే నృత్యరూపకాన్ని ప్రదర్శించిన అనిత, అదే సంవత్సరంలో దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థను ఏర్పాటుచేసి, ఆ సంస్థ తరపున ఎన్నో నృత్య రూపకాలు ప్రదర్శనలిచ్చింది. తెలంగాణ సంస్కృతిపై 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పత్ర సమర్పణ చేసింది.
నాట్య గురువుగా అనేకమందిని నృత్యకళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. వారంతా అనేక వేదికల్లో ప్రదర్శనలు ఇస్తున్నారు.[2]
ప్రదర్శనలు
[మార్చు]- తమసోమా జ్యోతిర్గమయ (1999)
- కూచిపూడి మహత్వము (2011)
- లోకాస్సమస్తా సుఖినోభవంతు (2013)
- జయజయహే తెలంగాణ (2013)
- బతుకమ్మ (2015)[3]
- గంగిరెద్దు (2017)
- బాబా సాహెబ్ అంబేద్కర్ గారి మహోన్నత చరిత్ర (2017)
నృత్య దర్శకత్వం
[మార్చు]- నాయకురాలు నాగమ్మ (నాటకం, 2016)
- రామప్ప (నాటకం, 2017)
- అంధాయుగ్ (నాటకం, 2017)
- భాగ్యనగర్ (నాటకం, 2018)[4]
- ప్రతాప రుద్రమ (ట్రైలజీ నాటకం)[5][6]
అవార్డులు - పురస్కారాలు
[మార్చు]- బి.ఎ, ఎం.ఏ.లో గోల్డ్‌మెడల్
- నేషనల్ కొరియోగ్రఫీ అవార్డు (2012)[7]
- విశిష్ట సేవా పురస్కారం (2017)
- గ్లోబల్ సంస్థ బెస్ట్ టీచర్ అవార్డు (2016)
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రభూమి, ఆదివారం సంచిక (30 March 2019). "ఆ ప్రతిభ 'అనిత'రసాధ్యం!". డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట. Archived from the original on 23 May 2019. Retrieved 23 May 2019.
- ↑ ఈనాడు, కళారంగం (20 May 2019). "మురిపించిన 'చందన' నృత్యశోభ". Archived from the original on 23 May 2019. Retrieved 23 May 2019.
- ↑ ప్రజాశక్తి, తెలంగాణ (26 July 2016). "భాషా విధానం లేకపోవడం శోచనీయం". Archived from the original on 2016-07-27. Retrieved 23 May 2019.
- ↑ ఈనాడు, మేడ్చల్ (24 April 2019). "కమ్మని ప్రేమకావ్యం.. 'భాగ్యనగర్'". Archived from the original on 23 May 2019. Retrieved 23 May 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (27 December 2019). "ఆకట్టుకున్న ప్రతాపరుద్రమ నాటకం". www.andhrajyothy.com. Archived from the original on 31 December 2020. Retrieved 31 December 2020.
- ↑ ఈనాడు, హైదరాబాదు (31 December 2020). "'ప్రతాప రుద్రమ' అరుదైన ఘనత". www.eenadu.net. Archived from the original on 31 December 2020. Retrieved 31 December 2020.
- ↑ Telangana Today, Hyderabad (28 September 2018). "'Pratapa Rudrama' is first trilogy drama in history of Telugu theatre". Dheeraja Manvi. Archived from the original on 23 May 2019. Retrieved 23 May 2019.